![photo-collage.png (2)](https://thewiretelugu.in/wp-content/uploads/2025/02/photo-collage.png-2-1024x1024.png)
దేశ పార్లమెంట్లో గురజాడ అప్పారావు గారు దశాబ్దాల క్రితం రాసిన తన రచనలోని కొన్ని వాక్యాలు ఈరోజు ప్రతిధ్వనించాయి.
“దేశమును ప్రేమించుమన్నా”
గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది.
ఈ సందర్భంగా గురుజాడ వారి ఈ కవితను ఒకసారి చదువుకుందాం.
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
ఇది గురుజాడ అప్పారావు దేశమును ప్రేమించుమన్నా తన రచనలోని కొంత భాగం. ఈ రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తొలుత గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకోవటంతో పాటు ఈ పోయెమ్ లోని ”
దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచమన్నా
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్” అని గురజాడ అన్నారంటూ ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు .పార్లమెంటులో గురజాడ అప్పారావు గారి మాటలు వినిపించటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. చాలామంది తమ ప్రసంగాల్లో ప్రముఖుల మాటల్ని కోట్ చేస్తుంటారు. తాము చెప్పబోయే విషయానికి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవడం కోసం ఇదో ప్రక్రియగా చెప్పుకోవచ్చు.
” మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్” ఈ ఐదు వాక్యాలు కూడా గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా కవితలోనివే .ఇవి కూడా ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గుర్తు చేసుంటే బాగుంటుందేమో. అంతేకాదు
” చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్” ఈ ఐదు వాక్యాలను కూడా గుర్తు చేసి ఉంటే ఇంకా బాగుండేది. దేశ సంపద పంపకములో తారతమ్యాలు చూపితే చూపవచ్చు, దానివల్ల ఆర్థిక వ్యత్యాసాలు ఉంటే ఉండవచ్చు, కానీ సమాజం మతం పేరుతో వేరు కాకుండా ఉంటే మంచిది. ఈరోజు బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఎవరి మెప్పుకోసం కేటాంపులు చేశారు, ఒక ప్రాంతాన్ని విస్మరించి మరో ప్రాంతానికి ఎందుకు ఎక్కువ వరాల జల్లు కురిపించారు అన్నది కూడా ఒక రాజకీయ కోణమే. గురజాడ స్ఫూర్తితో బడ్జెట్ ప్రసంగం చేయటం గొప్పగానే అనిపించింది కానీ గురజాడ స్ఫూర్తితో పాలన కూడా ఉంటే బాగుంటుందని నాకనిపిస్తోంది. ఈ పోయం మొత్తంలో గురజాడ దేశాన్ని ప్రేమించడం గురించి ,జల్దుకొని కళలెల్ల నేర్చుకుని దేశ సరుకులు నింపాలన్న దగ్గర నుంచి, మతం గురించి అన్ని విషయాలను గొప్పగా వివరించారు.కవి కాలం కంటే ఎంతో ముందుంటారనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది.1910 లో తను రాసిన వాక్యాలు 2025 లో దేశ పార్లమెంట్ లో విన్పిస్తాయని గురజాడ ఊహించి ఉండకపోవచ్చు , కానీ తాను రాసింది ఊహకందిన నాలుగు వాక్యాలు కాదు వాస్తవాన్ని కదా అందుకే జనం గుండెల్లో నిలిచాయి. పాలకుల శాసనం కాదు కాలగర్భంలో కలవడాకి అది కవి శాసనం …
ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టండి మేడం గురజాడ స్ఫూర్తితో…..
పి.వి.రావు
సీనియర్ జర్నలిస్ట్