
హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి సాగుతోన్న పరోక్ష చర్చలు మరోసారి ప్రతిష్టంభనకు గురయ్యాయి. రోజురోజుకు గాజాలో మానవతా పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. అయినప్పటికీ, కీలక డిమాండ్లకు సంబంధించి హమాస్- ఇజ్రాయిల్ తమ నిబంధనలపై మంకుపట్టుతో ఉన్నాయి.
న్యూఢిల్లీ: హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి సాగుతోన్న పరోక్ష చర్చలు మరోసారి ప్రతిష్టంభనకు గురయ్యాయి. గాజాలో మానవతా పరిస్థితి వేగంగా క్షీణిస్తుంది. అయినప్పటికీ, ప్రధాన డిమాండ్లకు సంబంధించి ఇరుపక్షాలు తమ నిబంధనలపై మంకుపట్టుతో ఉన్నాయి.
నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్- హమాస్ మధ్య మధ్యవర్తిత్వం లక్ష్యంగా గత వారం చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 60 రోజుల కాల్పుల విరమణ, బందీలను విడుదల చేసే విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. తుది దశకు చేరకుండానే ఈ చర్చలు విఫలమయ్యాయి.
మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్ట్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇందులో రెండు దేశాల పరిష్కారానికి మద్దతు ఇస్తూ, అటువైపుగా దిశానిర్దేశం చేశాయి.
ఈ దేశాలు ప్రతిపాదించిన దాంట్లో హమాస్ తన ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించాలనే డిమాండ్ కూడా ఉంది. దీనిని హమాస్ తీవ్రంగా తిరస్కరించింది.
శనివారం(ఆగస్టు 2) విడుదల చేసిన ఒక ప్రకటనలో, సార్వభౌమ పాలస్తీనా రాజ్యం స్థాపించబడే వరకు తాము ఆయుధాలను విడిచిపెట్టబోమని హమాస్ పునరుద్ఘాటించింది.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, ప్రాథమిక రాజకీయ పరిష్కారం లేకుండా “సాయుధ ప్రతిఘటన” హక్కును వదులుకోలేమని హమాస్ తేల్చిచెప్పింది.
గమనించాల్సిందేంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి కానీ మరే ఒప్పందానికైనా హమాస్ తమ ఆయుధాలు వదులుకోవాలనేది, ఇజ్రాయెల్ షరతులలో ప్రధాన షరతుగా పరిగణిస్తుంది.
ఇటీవల, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా రాజ్యం అనే ఆలోచనను “ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు”గా అభివర్ణించారు. పాలస్తీనా భూభాగాలపై సైనిక నియంత్రణ ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉండాలని నొక్కి చెప్పారు.
యుద్ధ విధ్వంసానికి ప్రతిస్పందనగా పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించడానికి బ్రిటన్, కెనడా వంటి దేశాలు చేసిన ప్రయత్నాలను కూడా ఆయన ఖండించారు. అటువంటి చర్యలను “హమాస్‌కు బహుమతులు”గా అభివర్ణించారు.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత వివాదం ముదిరింది. ఈ దాడిలో ఇజ్రాయిల్‌వైపు దాదాపు 1,200 మంది మరణించారు. 251 మందిని హమాస్ బందీలుగా చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైనిక ప్రతిస్పందన గాజాలో ఎక్కువ భాగాన్ని బంజరు భూమిగా మార్చింది. పాలస్తీనా అధికారుల ప్రకారం 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ దాడులలో మరణించారు.

గాజాలో కరువు..
ఈ వారం ఐక్యరాజ్యసమితి, సహాయ సంస్థల ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్(ఐపీసీ) ప్యానెల్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో గాజాలోని పరిస్థితిని తెలియజేస్తూ మానవతా సంక్షోభం తీవ్రత ఎలా ఉందో పేర్కొన్నది.
“గాజా స్ట్రిప్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది” అని ఐపీసీ ఒక హెచ్చరికను ప్రకటించింది. అంతేకాకుండా మరింత “మానవ సంక్షోభా”న్ని ఆపడానికి కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.
యుద్ధం నేపథ్యంలో తన పిల్లలు “దాదాపు సగం బరువు తగ్గారని” సెంట్రల్ గాజాలోని మాఘాజీకి చెందిన 38 ఏళ్ల జమీల్ ముఘారి ది గార్డియన్‌కు తెలియజేశారు.
“నా ఐదేళ్ల కూతురు ఇప్పుడు కేవలం 11 కిలోల బరువు ఉంది. నా కొడుకు మొహమ్మద్ ఒక అస్థిపంజరంలా మారాడు” అని తను అన్నారు.
“నా బరువు గతంలో 85 కిలోలు ఉండేది, ఇప్పుడు అది 55 కిలోలకు తగ్గింది”అని చెప్పుకొచ్చారు.

ఆహారం కోసం వెతుకుతుండగా అలసట వల్ల తాను స్పృహ కోల్పోయానని ముఘారి చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులు ఏడుసార్లు నిరాశ్రయులయ్యారు. అప్పుడప్పుడు పప్పుధాన్యాలు తింటూ, నీటిని తాగుతూ వాళ్లు కాలం వెళ్లదీస్తున్నారు.
“సూప్ కిచెన్ల నుంచి మాకు ఎటువంటి ఆహార సహాయం అందదు. తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల అవి కొన్ని శిబిరాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి” అని తను చెప్పారు.
సహాయం రూపంలో మృత్యువు..
ఈ ప్రాంతంలో ఆహార పంపిణీ అస్తవ్యస్తంగా, ప్రమాదకరంగానే ఉంది. నాలుగు ఆహార పంపిణీ కేంద్రాలను నిర్వహిస్తున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే తెరిచి ఉంటుంది. దీని వల్ల భారీ జనసమూహం ఏర్పడుతుంది.
గాజాలోకి ప్రవేశించే సహాయ ట్రక్కులను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది చంపబడుతున్నారు.
ది గార్డియన్‌తో 58 ఏళ్ల వితంతువు మన్సురా ఫడ్ల్ అల్-హెలు మాట్లాడుతూ, తాను చాలా బలహీనంగా ఉన్నానని, ఆహారం పంపిణీ చేసే కేంద్రానికి వెళ్లడానికి కూడా తనకు ఓపిక లేదని తెలియజేశారు. ప్రాణాలతో తిరిగి రాడేమోననే భయంతో తన కొడుకును ఆహార కేంద్రాలకు పంపడం లేదని చెప్పారు.
“నా ఒక్క కొడుకు మాత్రమే ఇక్కడ ఉన్నాడు. సైన్యం భయం వల్ల సహాయ ట్రక్కుల దగ్గరికి వెళ్లకుండా నేను ఎప్పుడూ తనను ఆపుతుంటాను” అని ఆమె తెలియజేశారు.
తన చిన్న కుమార్తె పోషకాహార లోపంతో బాధపడుతుందని ఏడుగురు పిల్లల తండ్రి అబూ అల్ అబెద్ అన్నారు. దీంతో ఆమె పక్కటెముకలు బయటకు పొడుచుకు వచ్చాయని తెలియజేశారు.
అంతేకాకుండా, ఆహారం తినకపోవడం వల్ల తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని, అలసటగా ఉంటుందని ఆయన చెప్పారు. తమ పిల్లల పట్ల తను నిస్సహాయుడిగా భావిస్తున్నానని వాపోయారు.
ప్రపంచ స్పందనపై తనకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు.
ఆయన ప్రకారం, “గాజాలో జంతువుల హక్కులను కాపాడమని మేము వారిని అడిగి ఉంటే, వారు వెంటనే స్పందించేవారు. కానీ పాలస్తీనా ప్రజల హక్కుల విషయానికి వస్తే ఎవరూ మమ్మలను గుర్తించరు. లేదా మా బాధను అర్థం చేసుకోరు.”
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.