
ఫొటోగ్రాఫ్: అహ్మద్ హసబల్లా
1.
చిన్నారులు, ముసలీ ముతకా
భేద భావన లేకుండా
నా దేశంలోని రక్తమంతా పీల్చేస్తున్నా
ఇంకా దాని సామ్రాజ్య కాంక్షా దాహం తీరట్లేదు
రక్త హీనత ఒక అంటురోగమైంది నేడు
దేశమంతా అదే వ్యాధితో విలపిస్తున్నది
అందరూ రక్తతర్పణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా
తీసుకునేందుకే ఎవరూ మిగిలేట్టు కానొస్తలేదు
నా దేశ సరిహద్దుల ఆవలి
ద్వేషాగ్నికి ఇప్పటికే
నా అస్తిత్వ శవాలన్నీ
శలభాలుగా మాడి మసి అయినా
దానికి ఇంకా ఆ పసిపిల్లల నుసి కసి తీరట్లేదా?
2.
డైనోసార్ల అంతం కోసం 17 కోట్ల ఏళ్లు
ఎదురు చూసిన ప్రపంచం ఫక్కున నవ్వింది
అన్నేళ్లెందుకని!
అందుకే,
నేటి ఇదే నాగరిక ప్రపంచం
ఓపెన్ కాస్ట్ గనులను ఆదర్శంగా తీసుకుని
షార్ట్ కట్లో మా పురాతన దేశాన్ని
బొందలగడ్డగా అలంకరింప జేస్తున్నది
ఇంకొన్ని నెలలే మిగిలి ఉన్నాయ్
మేమంతా చరిత్రలో మాత్రం నిలిచి పోయేందుకే కాదు;
మాస్ట్ హెడ్‌ను కూడా మింగేసేంతటి
బ్యానర్ హెడ్లైన్లు
మా గురించినవే రానున్నాయ్ కదా
రెండో వార్షికోత్సవం ముగిసేలోగా
మా జాతి అంతర్ధానమయ్యే దినం దాపురించేందుకు!
3.
ఎవరన్నారు..?
చరిత్ర పునరావృతమవుతుంది
“ముందు విషాదంగా;
తరువాత ప్రహసనంగా!” అని?
మార్చుకోండి ఇప్పుడు
రెండోసారి కూడా విషాదంగానే
అయితే, ఆ నాటి బాధితులు
నేడు దోషుల పాత్రలు రక్తి కట్టించి,
వారికిది ఒక ప్రహసనంగా మార్చుకుంటున్నారు
మిగతా ప్రపంచమంతా
‘ఛీ’ర్ లీడర్లుగా మారి,
ప్రతి గేమ్‌లోనూ ఒక్కరే గెలిచే
ఈ ఫుట్ బాల్‌ను, బుల్ ఫైట్‌ను,
రెజ్లింగ్‌ను వినోదిస్తున్నారు
మీరూ ఇందులో భాగమవుతున్నారు కదా..!
4.
మీరు మీ దేశాల్లో సృష్టించుకునేది కృత్రిమ వర్షాలు మాత్రమే!
మరి మా దేశంలో వాళ్ళు సృష్టించిన
కృత్రిమ క్షామాలు కృత్రిమ కాటకాలు
కృత్రిమ ప్రళయాలు కృత్రిమ విలయాలు
అయినా అన్నీ సహజంగానే మీకనిపిస్తాయి
పడుకోండి ఇక హాయిగా
ఇప్పటికి సెలవు
రేపు మళ్లీ ఇవే వార్తలు
ఇవే అలవరసలపై!!
మేముంటే..
(గాజా ప్రజల రక్తహీనత గురించి ది వైర్ తెలుగు ప్రచురించిన కథనం ప్రేరణతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.