
తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆగస్టు 19, 20, 21 తేదీలలో జరిగింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శాస్త్రీయత మీద ప్రసంగించారు. సైన్సు ప్రాధాన్యతను– గొప్పతనాన్ని తెలియజేశారు.
1963లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ను స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌గా మారింది. విద్యార్థులలో, ప్రజలలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించే ముఖ్య లక్ష్యాన్ని ఈ అకాడమీ కలిగి ఉంది.
దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాకముందే, మూడు సైన్సు అకాడమీలు స్థాపించబడ్డాయి, వీటి లక్ష్యం కూడా ఇదే. 1930లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా(అలహాబాద్), 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగుళూరులో సీవీ రామన్ చేత స్థాపించారు. 1935లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీలో స్థాపించారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కూడా స్వాతంత్రం రాక ముందే ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విజ్ఞాన్ ప్రసార్ కూడా ఈ లక్ష్యంతోనే పనిచేస్తోంది. 1988లో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ఏర్పాటైంది.
శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలన్న రాజ్యాంగం..
ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఆర్టికల్ 51ఏ(హెచ్)ను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పటికీ, స్కూల్ స్థాయి నుంచి కాలేజీ, యూనివర్సిటీ స్థాయి దాకా , పరిశోధనా సంస్థలలో కూడా మూఢనమ్మకాలు ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నాయి. వ్యక్తిగత నమ్మకాలు వ్యవస్థీకృతమవడం చూస్తూ ఉన్నాము. బాగా చదువుకున్న వాళ్లలో కూడా సైన్స్‌కు సంబంధించిన ఫాల్సిఫయేబిలిటీ, రిప్రొడ్యూసెబిలిటీ లక్షణాల గురించి తెలియదు. ఎవిడెన్స్‌తో వెరిఫికేషన్ చేసుకోవడం, క్రిటికల్‌గా ఆలోచించడం తెలియదు.
కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన ఒక అధ్యాపకుడు, గోల్డ్ మెడలిస్ట్ భార్యతో కలిసి డంబెళ్ళతో కూతుళ్లను చంపిన సంఘటన తెలిసిందే. ఇప్పటికీ శిశు బలులు, జంతు బలులు, బ్లాక్ మ్యాజిక్ సంఘటనలు తరచుగా వార్తల ద్వారా తెలుస్తునే ఉన్నాయి. గాడ్ మెన్ల మోసాలు సర్వ సాధారణమే.
శాస్త్రీయ వైఖరిని పెంపొందించడంలో విద్యాలయాల పాత్ర ప్రముఖమైనది. కానీ ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా సర్టిఫికెట్లను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారిపోయాయి. విశ్వవిద్యాలయాల్లో నకిలీ జర్నల్స్, ప్లేజియరిజం వంటి సమస్యలు వరదలా పెరిగాయి. ఇంకా, టీచర్ ట్రైనింగ్ సంస్థలు అత్యంత నిరాధరణకు గురయ్యాయి. ప్రభుత్వాలు విద్యకు తగినంత బడ్జెట్ కేటాయించడంలో విఫలమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం ఉచ్ఛస్థితికి చేరి, పరిశీలనల ద్వారా, ప్రయోగాల ద్వారా ప్రశ్నలను రేకెత్తిస్తూ, అన్వేషణ పద్ధతిలో సాగవలసిన సైన్స్ విద్య కేవలం సూత్రాలు– సిద్ధాంతాల వల్లె వేయడానికి, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల సమాధానాలకు పరిమితమైంది.
విద్యార్థుల్లో అవగాహన లేమి..!
తెలుగు విద్యార్థులు ఐఐటీ, ఐఏఎస్ పరీక్షల్లో బాగా రాణిస్తున్నారని పొంగిపోతుంటాము. కానీ సైన్స్ అధ్యయనం ద్వారా రావాల్సిన మౌలికమైన విలువల రాహిత్యం వల్ల అనర్థాలను గుర్తించడం లేదు.
ఐఐటీ ముంబై 2017లో ఇచ్చిన రిపోర్ట్, జేఈఈలో మంచి ర్యాంకులొచ్చిన 60 శాతం పిల్లలకు సరైన కాన్సెప్ట్స్ ఉండడం లేదని తెలిపింది. 2019లో ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ విద్యార్థులకు స్వతంత్ర ఆలోచన శక్తి ఉండడం లేదని వాపోయారు. ఐఐటీ హైదరాబాద్ 2021లో చేసిన సర్వే మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 40 శాతానికి కనీస ప్రయోగ నైపుణ్యాలు ఉండడం లేదని తెలిపింది. విద్యార్థుల చదువు మానివేతలు(డ్రాప్అవుట్లు) పెరిగినట్లు ఐఐటీ కౌన్సిల్ డేటా వెల్లడించింది.
విద్యార్థులతో చేసిన ఇంటర్వ్యూలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. కాలేజీకి రాకముందు అర్థవంతమైన ప్రయోగాలు (authentic experiments) చేసిన అనుభవాలు ఉండడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే అభిప్రాయాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నాయి.
పరీక్షలలో మంచి ఫలితాలను కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఓపెన్-ఎండెడ్ సమస్యల పరిష్కారం, డీబగ్గింగ్, సిస్టమ్స్ థింకింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఇవి విద్యార్థులపై మోపే వ్యక్తిగత నిందలు కావు; వ్యవస్థ ఎలా మారిందో తెలిపే సంకేతాలు.
తర్కం కంటే సమాధానాలే విలువైనవని భావించే బోధన పద్ధతులు, ఉన్నత విద్యకు, ఆవిష్కరణల అవసరాలకు సరిపోని అభ్యాసకులను తయారు చేస్తాయి.
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అకాడమీల పాత్ర చాలా ఉంది. యూకేలో రాయల్ సొసైటీ, అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జర్మనీలో లియోపోల్డినా, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఉపాధ్యాయులకు నిరంతర వృత్తి అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. భారతదేశ అకాడెమీలు(ఐఎన్ఎస్ఏ, ఐఏఎస్)పరిశోధన సమగ్రత,నాణ్యతలపై దృష్టి సారిస్తూ ప్రెడేటరీ పబ్లిషింగ్‌పై హెచ్చరికలు జారీ చేశాయి. ఈ సంస్థలు కేవలం ఉపన్యాసాలు నిర్వహించవు. పాఠ్యాంశాలు, మూల్యాంకనం, ఉపాధ్యాయుల శిక్షణ, పరిశోధనా సంస్కృతిలలో సరైన విధానాల కోసం పని చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా గత శతాబ్ది ఆరవ దశకం నుండే చాలా కృషి జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ఆర్ ల్యాబ్స్(ఇప్పటి ఐఐసీటీ)లు సైన్స్ పాపులరైజేషన్లో చాలా కృషి చేశాయి. ముఖ్యంగా పుష్ప మిత్ర భార్గవ(సీసీఎంబీ ఫౌండర్ డైరెక్టర్), సతీష్ ధావన్‌లాంటి వారితో కలిసి జాతీయ స్థాయిలో సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌ను, హైదరాబాద్‌లో సొసైటీ ఫర్ కమ్యూనికేటింగ్ సైన్స్ స్థాపించి చాలా కార్యక్రమాలని నిర్వహించారు.
పుట్టగొడుగుల్లా సోషల్ మీడియా వీరులు..
రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51ఏ(హెచ్)ను చేర్చడంలో కూడా డీడీ కోశాంబిలతో పాటు పీఎం భార్గవ పాత్ర ఉందని చెబుతారు. ఆ రకంగా శాస్త్రీయ వైఖరి ప్రాముఖ్యతను గుర్తించడంలో, దానిని వ్యాప్తి చేసే పనిలో హైదరాబాద్ నిర్వహించిన పాత్ర గొప్పదే, కానీ అదే హైదరాబాద్ ఇప్పుడు కేవలం పరీక్షల కేంద్రంగా, రోట్ మెమోరీని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలకు, కోచింగ్ ఫ్యా క్టరీలకు నెలవయింది. ఫేక్ జర్నల్స్ పబ్లిషింగ్కు హబ్‌గా పేరు తెచ్చుకుంది.
ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలలో ప్రయోజనాత్మక పరిశోధనలు చాలా అరుదు అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలలో ప్రయోగశాలలు ఉండడం, ప్రయోగాలు చేయడం ఆశ్చర్యకరమైన విషయాలు అయ్యాయి. ఎవిడెన్స్ బేస్డ్ రేషనాలిటీ లోపం ప్రతి సామాజిక కార్యక్రమంలో కనబడుతూనే ఉంటుంది. క్రిటికల్ థింకింగ్, ప్రశ్నించడం కనబడదు.
మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్‌తో వాట్సాప్ వీరులు ఎక్కువయ్యారు. ప్రజాస్వామ్యం అంటే ఓట్లు, ఎలక్షన్లు మాత్రమే అనుకునే ధోరణి పెరిగింది. సామాజిక సమస్యల తీవ్రత రోజురోజుకు తీవ్రమవుతోంది.
మన దేశంలో సైంటిఫిక్ కమ్యూనిటీకి కూడా సైన్స్ పట్ల సరైన దృక్పథం లేదన్న విషయాన్ని పీఎం భార్గవ తన ‘ఎంజిల్స్, డెవిల్ అండ్ సైన్స్’ పుస్తకంలో ప్రస్తావిస్తారు. తను 1963లో స్థాపించిన సొసైటి ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ సంస్థలో శాస్త్రవేత్తలు చేరడానికి క్రింది డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ సంతకం చేయాలని కోరారు.
“మానవ యత్నం ద్వారా మాత్రమే జ్ఞాన సముపార్జన జరుగుతుందని, అతీంద్రియ శక్తులను ఆశ్రయించకుండా అన్ని సమస్యలను మనిషి నైతిక, మేధో సంపదలతోనే ఎదుర్కోవాలని విశ్వసిస్తాను” అనేది డిక్లరేషన్. ఆశ్చర్యకరంగా, ఈ డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి అప్పటి సైంటిఫిక్ కమ్యూనిటీ సిద్ధపడలేదు. ఇప్పటికీ ఈ పరిస్థితులు మెరుగుపడ్డాయా అంటే, అనుమానమే.
ప్రపంచ వ్యాప్తంగా అహేతుక, అవిజ్ఞాన ధోరణులు వ్యవస్థీకృత రాజకీయ ప్రాజెక్టులుగా ఉన్నాయి. విద్య , మార్కెట్లకు, మెట్రిక్స్లకు కుదించబడుతున్నది. ప్రజాస్వామ్య సామర్థ్యం క్షీణిస్తున్నది. ప్రపంచ యుద్ధాలు, గ్యాస్ చాంబర్ హత్యాకాండల స్మృతులు ప్రణాళికాబద్ధ మరుపుకు గురవుతున్నాయి.
దిగుమతి చేయబడిన అజ్ఞానం సంక్షోభాలను కలిగిస్తూనే ఉంది. మానవ హక్కులను హరిస్తూనే ఉంది. ప్రజా జీవితంలో ఆధారాల ప్రాతిపదికతో తర్కం అరుదుగా మారింది. విమర్శనాత్మక ఆలోచన, ప్రశ్నించడం నేరాలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఉత్పత్తికాబడిన సమ్మతి(manufactured consent)పెరుగుతోంది.
విద్య, మార్కెట్లు , మెట్రిక్స్కి కుదించబడింది; చారిత్రక స్మృతి మసకబారుతోంది. మానవ హక్కులకు భంగంగా దిగుమతి చేసుకున్న అజ్ఞానం పరిణమించింది.
మార్పు వైపుగా టీఏఎస్ కీలక పాత్రను పోషించాలి..
ఈ పరిస్థితులను తిప్పికొట్టడానికి తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ తన కార్యకలాపాలను ఎండొమెంట్ లెక్చర్లకు, సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విస్తృతం చేసుకోవలసిన అవసరం ఉంది. విద్య నమూనా మార్పును నడిపే కీలక పాత్రను టీఏఎస్ పోషించాలి. అందుకు పరోక్షంగా కాకుండా చురుకుగా వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలి. పాఠశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు బోధన అభ్యసన సమయంలో 25– 40 శాతం నిజమైన ప్రయోగశాల, క్షేత్ర పరిశోధనల కోసం కేటాయించాలని, తర్కాన్ని, అన్వేషణను పెంపొందించే ఓపెన్- ఎండ్ సమస్యల ద్వారా ప్రాయోగిక విద్యను ప్రోత్సహించాలని, మూల్యాంకన వ్యవస్థలను పున్నర్వ్యవస్థీకరించాలని పట్టుదలగా కోరాలి.
ఇటువంటి సంస్కరణల సాకారానికి ఎస్సీఈఆర్టీ, స్కూల్ బోర్డులు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పైలట్ కార్యక్రమాలను టీఏఎస్ నడిపించగలగాలి. బోధనను వృత్తిపరంగా తీర్చిదిద్దడానికి, టీఏఎస్ సంవత్సరం పొడవునా, సమగ్రంగా ఉండే సైన్స్ టీచర్ల ఫెలోషిప్‌ను ప్రారంభించి, దాని చేరువను జిల్లా స్థాయికి విస్తరించాలి.
విద్యపై ఖర్చును దశలవారీగా పెంచాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి, ప్రయోగశాల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనివ్వాలని, ఉపరితల నిర్మాణాల కంటే మౌలిక నమూనా మార్పుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాలి.
తరగతి గదుల్లో కృత్రిమ మేధ ఒక ఆలోచనా భాగస్వామిగా ఉండగలిగిన పరిస్థితులపై అధ్యయనాలు చేపట్టాలి. తరగతి గదికి బయట, ప్రజల్లో శాస్త్రీయ మనస్తత్వాన్ని బలోపేతం చేయడానికి టీఏఎస్ చురుకుగా పాల్గొనాలి.
సూడోసైన్స్, డేటా లిటరసీపై క్రమం తప్పకుండా టౌన్‌హాల్స్ నిర్వహించి, సాధారణ ప్రజలు పాల్గొనే విధంగా ప్రయోగాలను అందించాలి. శాస్త్ర విజ్ఞానాన్ని, పరిశోధనల ఫలితాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా అనువదించేందుకు సైన్స్ కమ్యూనికేషన్ బూట్క్యాంప్లను నిర్వహించాలి. ఈ పనులను ఐచ్ఛికమైనవి అనుకోకుండా అత్యవసరమైనవని భావించాలి.
ఐన్‌స్టీన్ అన్నట్లు, ’విద్య అంటే ఫ్యాక్ట్స్ నేర్చుకోవడం కాదు. మెదళ్ళకు ఆలోచించే శిక్షణనివ్వడం’. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, తరగతి గదులు విషయాలను వల్లె వేసే వారిని తయారుచేసేవిగా కాకుండా ఆలోచించే వారిని తయారుచేసేవిగా ఉండేటట్లు, అనుకరించేవారిని కాకుండా ఆవిష్కర్తలను తయారుచేసేవిగా ఉండేటట్లు తమ వంతు కృషి చేయాలి.
(వ్యాసకర్త ఎడమ శ్రీనివాసరెడ్డి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల(ఏ)లో రసాయనశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందిస్తున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.