
మేడమ్! నాకు పెళ్ళై ఏడు నెలలు అవుతోంది. ఇప్పటి దాకా మా మధ్య సెక్స్ జరగలేదు. ఆయనకు అంగస్తంభన సరిగా లేదు. ఇంట్లో విడాకులు తీస్కోమంటున్నారు. ఆయనను ‘డాక్టరు వద్దకు వెళ్లా’మంటే రారు. మధ్యలో నేను నలిగి పోతున్నాను. మా ఇంట్లో విడాకుల ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఏం చేయమంటారు. నా జీవితం నాశనం అయినట్లేనా? ‘పెళ్ళికి ముందు బాగానే ఉంది’ అంటారు. మరి, పెళ్ళి తర్వాతే ఇట్లా ఎందుకు అవుతోంది. నన్నేం చేయమంటారు?
నిరాశకు గురికావద్దు. పెళ్ళికి ముందు మంచి అంగస్తంభన ఉండి తర్వాత ఫెయిల్ అవుతుందంటే బహుశ అది తీవ్రమైన ఫర్ఫార్మెన్స్ ఆందోళన వల్ల అయి ఉండచ్చు. కొంతమందికి తమ లైంగిక సామర్థ్యం మీద అనుమానాలుంటాయి. సక్సెసు అవుతానో, ఫెయిల్ అవుతానేమో అనే భయాలుంటాయి. ఖచ్చితంగా ఫెయిల్ అవుతానన్న ముందస్తు నెగెటివ్ ఆలోచనల వల్ల దేహానికి, మనసుకు మధ్య బ్లాక్ ఏర్పడి అంగస్తంభనకు కావాల్సిన రసాయనిక, నాడీ సంబంధ సెక్స్ హార్మోన్ సంబంధ కారకాల విడుదల ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరిగి అంగస్తంభన పూర్తిస్థాయిలో కాదు. ఒకసారి ఇలా ఫెయిల్ అయితే మళ్ళీ అలానే జరిగి తీరుతుందన్న బలమైన అభిప్రాయం మళ్ళీ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. దీన్నే ‘సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్’ అంటారు. దీనికి మానసిక కారణాలే అధికం. దీనికి ‘సైకోసెక్సువల్ థెరపీ’ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, అంగస్తంభన లోపాలకు ఆర్గానిక్ కారణాలు అంటే శరీరంలో వ్యాధులేమైనా కారణమేమో కూడా వెతకాలి. డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు, స్పైనల్ కార్డ్ సమస్యలు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు, హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ సమస్య, వెరికోసిల్, అథిరోస్లీరోసిస్ లాంటివి కారణాలా? డయాగ్నోస్ చేసి చికిత్స ఇవ్వాలి. ముందు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. అతను మీకెంత ముఖ్యమో చెప్పండి. మీరు విడాకులు కోరుకోవట్లేదని, అతనికున్న సమస్యను పరిష్కరించడంలో తోడుంటానని చెప్పండి. మీ అత్తమామలతో కూడా మాట్లాడి అతన్ని ఒప్పించి సెక్సాలజిస్ట్ వద్దకు తీస్కెళ్ళండి. అయినా, అతను మొండికేస్తే మీ తల్లిదండ్రులు చెప్పినట్టు చేయండి.
నా వయసు 30. పెళ్లయి ఐదేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నా భార్య మూడ్ రావడటం లేదని అంటుంది. తను చాలా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడూ మూడీగా ఉంటుంది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోదు. ఏం చేయాలో అర్థం కావటంలేదు.
నీ భార్య మానసిక స్థితిని ఫ్రిజిడిటీ అంటారు. అంటే శృంగారంపై అనాసక్తిని కలిగి ఉండటం. దీనికి చాలా కారణాలుంటాయి. సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆమెకేదైనా నొప్పి అనిపించడం, పొత్తి కడుపులో నొప్పి, అంతర్ బాహ్య జనంనాంగాలకు ఏమైనా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల, సెక్స్ తర్వాత నొప్పి వంటివి కలుగుతున్నాయేమో చూడాలి. ఇవన్నీ శారీరక కారణాలు, ఇవి తగ్గడానికి గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఇక రెండోది, శృంగారంలో ఆమెకు ఇష్టం రాకుండా ఉండేలా మీ ప్రవర్తన ఉందేమో చూసుకోండి. అంటే ఆమెతో ప్రేమగా లేక పోవడం, మానసికంగా, శారీరకంగా మీరు ఆమెను వేధించటం, ఆమెను అవమానించటం వంటి పనులు చేస్తున్నారేమో సరిచేసుకోండి. అత్తింటిలో తన ఇబ్బందులను పట్టించుకోని భర్త వల్ల కూడా స్త్రీలు అతని స్పర్శకు స్పందించరు. దీనివల్ల మనిషి పట్ల ప్రేమ పోయి, అనాసక్తి, మనో శారీరక స్పందనలు లేని స్థితికి చేరుకుంటారు. కాబట్టి ప్రేమ చాలా ముఖ్యం. భర్త ఇచ్చే గౌరవం, ప్రేమతో కూడిన స్పర్శకే స్త్రీలు స్పందిస్తారు. మీలో ఇలాంటి లోపాలు ఉంటే పోగొట్టుకుని, మీ భార్యకు దగ్గర కండి. అలాగే కలయిక ముందు 20-30 నిమిషాలు ఫోర్ ప్లే చేయండి. ఆమెకు ఒకసారి భావప్రాప్తి వచ్చాకే సంయోగంలో పాల్గొనండి. అన్నిటికంటే ముందు ఆమెకు అనాసక్తి ఎందుకు వచ్చిందో కనుక్కోండి. ఆ కారణాలకు తగినట్టుగా పరిస్థితులను మార్చండి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే సెక్సాలజిస్టుకు చూపించండి. ఫ్రిజిడిటీకి పై కారణాలే కాకుండా గర్భధారణ, పిల్లల పెంపకం, ఇంటిపని ఎక్కువగా ఉండటం, మళ్లీ గర్భం వస్తుందేమోనన్న భయాలు కూడా కారణాలు కావచ్చు, గమనించండి.
Dr. Bharathi MS
Sexual Health Counsellor, Marital and psychotherapist
Family counsellor
Gvs Research Centre for Sexual & Mental
Health
Email id: bharathi27964@gmail.com,
Mobile-8688519225
Timings -11 am to 2 pm /5 pm -8 pm