
బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి, న్యాయవాది ఆర్తి సాథే నియామకంపై వివాదం తలెత్తింది.
దీనిని న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై దాడిగా ప్రతిపక్ష పార్టీలు అభివర్ణించాయి. అంతేకాకుండా, ఆమె నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ: బాంబే హైకోర్టులో న్యాయవాది ఆర్తి సాథే నియామకంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారిక ప్రతినిధిగా సాథే ఉన్నారు.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, జూలై 28న జరిగిన సమావేశంలో ఆర్తి సాథేను న్యాయమూర్తిగా నియమించడానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
ప్రతిపక్ష పార్టీలు ఈ నియామకాన్ని న్యాయవ్యవస్థ నిష్పాక్షికత, పారదర్శకతకు విరుద్ధమని అభివర్ణించాయి. సాథేను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
“అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు ఇచ్చే వ్యక్తిని నేరుగా న్యాయమూర్తిని చేయడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ” అని ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం)ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి రోహిత్ పవార్ అన్నారు.
“రాజకీయంగా సంబంధం ఉన్న వ్యక్తులను నేరుగా నియమించడం, కేవలం న్యాయమూర్తి కావడానికి అర్హత సాధించడం అంటే, న్యాయవ్యవస్థను రాజకీయ రంగంగా మార్చినట్లే కదా?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
ఇటువంటి నియామకాలు భారత న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పవార్ పేర్కొన్నారు.
పునః పరిశీలన..
“రాజకీయ ప్రతినిధిని న్యాయమూర్తిగా నియమించడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడం కాదా? ఇది రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నం కాదా? హైకోర్టు న్యాయమూర్తికి రాజకీయ నేపథ్యం ఉండి, అధికార పార్టీలో పదవిలో ఉన్నప్పుడు, అతని నిర్ణయాలు పక్షపాతం లేకుండా ఉంటాయని ఎవరు హామీ ఇస్తారు” అని ఆయన అడిగారు.
సాథే నియామకాన్ని పునఃపరిశీలించాలని పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీజీ కోల్సే- పాటిల్ బుధవారం(ఆగస్టు 6) మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు కొలీజియం బీజేపీ నుంచి ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి కఠినమైన వైఖరి తీసుకోవాలని, బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడికి లొంగకూడదని నేను కోరుతున్నాను” అని ఈ చర్యను విమర్శిస్తూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే ముందు ఆర్తి సాథే పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారని మహారాష్ట్ర బీజేపీ మీడియా సెల్ చీఫ్ నవనాథ్ బంగ్ స్పష్టం చేశారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, “ఆర్తి సాథే జనవరి 2024 వరకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు. తరువాత ఆమె “వ్యక్తిగత- వృత్తిపరమైన కారణాలను” పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ముంబైలోని బీజేపీ లీగల్ సెల్ హెడ్ పదవికి కూడా రాజీనామా చేశారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.