బ్రిటిష్ ప్రభుత్వానికి, నిజాం నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా మహాయోధుడు పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ పోరాడాడు. బ్రిటిష్- నిజాం సైన్యాల మీద తిరగబడి ధిక్కార స్వరాన్ని వినిపించి ఆనాటి ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు. అటువంటి మహాయోధుడు పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ అమరుడైన రోజు .. ఈరోజు..
ఆధునిక ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటిష్ పాలకులను ఎదుర్కోవటం మృత్యువును వాటేసుకోవడమని స్వదేశీ యోధులకు స్పష్టంగా తెలిసు. అయినా, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పరాయి పాలకులను తరిమి కొట్టేందుకు ఆనాడు నడుం కట్టిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నివాసి.
తుర్రెబాజ్ ఖాన్ నేపథ్యం..
తుర్రెబాజ్ తండ్రి పఠాన్ రుస్తుం ఖాన్. బ్రిటీష్ సైన్యంలో సైన్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలం నాయకుడు. ఆంగ్లేయులకు హితుడుగా మారిన నిజాం నవాబు అభీష్టానికి వ్యతిరేకంగా బ్రిటీష్ పాలకుల నుండి మాతృదేశాన్ని విముక్తి చేయమన్న మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ ఉద్బోధ మేరకు తుర్రెబాజ్ ఖాన్ పోరుబాట ఎంచుకున్నారు. మౌల్వీ అల్లావుద్ధీన్ సహకారంతో చరిత్రాత్మక మక్కా మసీదు నుండి బయలుదేరి, బ్రిటీష్ ఆధిపత్యానికి చిహ్నమైన హైదరాబాద్ రెసిడెన్సీ మీద సుమారు ఐదు వందల మంది సాహసికులతో 1857 జూలై 17న తుర్రెబాజ్ ఖాన్ సాహసోపేతమైన దాడి చేశారు. ఆ పోరాటంలో పలువురు సహచరులను కోల్పోయి గాయపడిన ఆయన బ్రిటీష్- నిజాం బలగాలకు 1857 జూలై 22న పట్టుబడగా ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విధించి, ఆయన యావదాస్తిని స్వాధీనం చేసుకుంది. ఆంగ్లేయాధికారుల సలహామేరకు విధించిన ఆ శిక్ష అమలు జరిగేలోగా అంతా మారిపోయింది.
పట్టితెచ్చిన వారికి నజరానా..
పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. ఆగ్రహించిన ప్రభుత్వం తుర్రెబాజ్ ఖాన్ను సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టితెచ్చిన వారికి అయిదు వేల రూపాయల నగదు నజరానాను 1859 జనవరి 19న ప్రకటించింది. పాలకులు ప్రకటించిన నజరానాకు ఆశపడిన కుర్బాన్ అలీ అనే నమ్మకద్రోహి అందించిన సమాచారంతో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామం విూద 1859 జనవరి 24న నిజాం, బ్రిటిష్ సైన్యాలు విరుచుకు పడ్డాయి. ఆ సైన్యాలను సాహసోపేతంగా ఎదుర్కొంటూ తుర్రెబాజ్ ఖాన్ శత్రువు సైనికుల తుపాకి గుండ్లకు బలయ్యారు. ఆ యోధుని పార్థివ శరీరాన్ని హైదరాబాదు నగరానికి తరలించి అంత్యక్రియలు ఏవీ జరపకుండా బలమైన ఇనుప గొలుసులతో కట్టేసి ప్రస్తుత సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ ఉన్న చోట ఒక గుంజకు బహిరంగంగా వేలాడదీశారు. ప్రజలలో తిరుగుబాటు ఆలోచనలు ఏమాత్రం మళ్ళీ పొడ చూపకుండా వారిలో భయోత్పాతం కల్గించేందుకు ఆంగ్లేయులు ఇటువంటి అత్యంత పాశవిక చర్యలకు పాల్పడ్డారు. చివరకు మాతృభూమి విముక్తి పోరాటం విజయవంతం కావడంతో భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రపుటలలో గౌరవప్రదమైన స్థానం పొందిన పఠాన్ తుర్రెబాజ్ ఖాన్ ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారు.
(సయ్యద్ నశీర్ అహమ్మద్ 2022 లో వెలువరించిన “చరితార్ధులు -2 / The Immortals -2” ఆల్బమ్ నుండి.
సయ్యద్ నశీర్ అహమ్మద్