
ఎపిసోడ్ 17: విజ్ఞానశాస్త్ర ప్రపంచంలో నూతనోధ్యాయానికి దారితీసిన మైత్రి
క్రిస్టోఫర్ క్లేవిస్, గెలీలియో గలిలియ్ మధ్య ఏర్పడ్డ స్నేహం 16వ, 17వ శతాబ్దాలలో విజ్ఞానశాస్త్రం-ఖగోళశాస్త్ర పరిశోధనలలో కీలకమైన పాత్ర పోషించింది. వీరి మైత్రి, శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలపై గణనీయమైన ప్రభావం చూపింది. సఫల మైత్రి వీరిది. వీరి మైత్రి వల్ల వారికి వ్యక్తిగత జీవితాలలో గొప్ప మేలు జరగటమే కాదు, విజ్ఞానశాస్త్ర పురోగతిలో కీలకమైన మైలురాయి లాంటి ఎన్నో విశేషాలు సాధ్యమవటానికి కారణమైనది.
రోమ్‌లోని కొలెజియో రొమానోలో క్రిస్టోఫర్ క్లేవిస్(1538–1612) బోధకుడిగా పనిచేశారు. ఆయన గ్రెగోరియన్ క్యాలెండర్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. దాని గురించి విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఆనాటి యూరోపియన్ శాస్త్రీయ సమాజంలో గౌరవనీయ వ్యక్తిగా గుర్తింపు పొందారు. గెలీలియో గలిలియ్ (1564–1642), ఇటాలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఆధునిక శాస్త్రీయ విధానం(Modern Scientific Models) పితామహుడిగా పరిగణించబడ్డారు.
వీరిద్దరి మధ్య స్నేహం 1580లలో గెలీలియో విజ్ఞానశాస్త్ర పరిశోధనల ప్రారంభ దశలో ప్రారంభమైంది. అప్పటికి గెలీలియో టీనేజర్. ఒక యువ శాస్త్రవేత్తగా, క్లేవిస్ను ఆయన గణిత శాస్త్ర కృషి, ఖగోళ శాస్త్ర నైపుణ్యం కారణంగా గౌరవించేవారు. వీరి అనుబంధం ప్రధానంగా లేఖల ద్వారా, కొన్ని సందర్భాలలో వ్యక్తిగత సమావేశాల ద్వారా కొనసాగింది. క్లేవిస్, గెలిలియో శాస్త్రీయ విధానాలకు, ఆలోచనలకు మద్దతు ఇచ్చారు. అతని పరిశోధనలను శాస్త్రీయ సమాజంలో గుర్తింపు పొందేలా చేయడంలో సహాయపడ్డారు.
స్నేహం- మైత్రిగా మారిన విధానం..
గురు- శిష్య సంబంధం: క్లేవిస్, గెలీలియో కంటే వయసులో పెద్దవారు. అప్పటికే సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పొందినవారు. గణితశాస్త్రాన్ని విశ్వవిద్యాలయాలలో ఒక సబ్జెక్టుగా మార్చటంలో ఆయన పాత్ర వల్ల గెలీలియోకు ఆయన పట్ల గౌరవం కలిగింది. తరువాత యువకుడైన గలీలియో శాస్త్రీయ ఆలోచనలను విధానాలను ప్రభావితం చేశారు.
గెలీలియో తన గణిత శాస్త్ర, ఖగోళ శాస్త్ర అధ్యయనాలలో క్లేవిస్ రచనలను రిఫరెన్స్‌గా వాడారు. క్లేవిస్ వ్రాసిన గణిత శాస్త్రం పుస్తకాలు, ముఖ్యంగా అతని Euclid’s Elements వ్యాఖ్యానం, గెలీలియో గణిత శాస్త్ర పాటవానికి బలమైన పునాది వేశాయి.
లేఖల ద్వారా సంభాషణ: వీరిద్దరూ 1588 నుంచి 1612 వరకు లేఖల ద్వారా సంప్రదించుకున్నారు. ఈ లేఖలలో ఖగోళ శాస్త్ర సిద్ధాంతాలు, గణితశాస్త్రం, ఖగోళ పరిశీలనల గురించి చర్చించారు. ఈ లేఖలు గెలీలియో ఆలోచనలను మెరుగుపరచడంలో, క్లేవిస్కు కొత్త యువతరం శాస్త్రవేత్తల శాస్త్రీయ ఆలోచనా విధానాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడ్డాయి. వారి ఆవిష్కరణలను పరిచయం చేయడంలో సహాయపడ్డాయి. ఈ విధంగా ఒకరి వల్ల మరొకరు లాభం పొందారు.
గెలీలియో టెలిస్కోప్ పరిశీలనలకు ఊతం: 1610లో గెలీలియో తాను తయారు చేసిన టెలిస్కోప్ ద్వారా బృహస్పతి (గురుగ్రహం – Jupiter) ఉపగ్రహాలను కనుగొన్నప్పుడు, క్లేవిస్ ఈ ఆవిష్కరణలను పరిశీలించి, వాటిని ధృవీకరించారు. గెలీలియో Sidereus Nuncius(1610)లో వివరించిన ఈ ఆవిష్కరణలు కోపర్నికస్ సిద్ధాంతానికి మరిన్ని ఋజువులు అందించాయి. క్లేవిస్తో గెలీలియోకు ఉన్న మైత్రి, ఆయన ఇచ్చిన మద్దతు ఈ పరిశోధనలు శాస్త్రీయ సమాజ ఆమోదం పొందటంలో కీలకపాత్ర పోషించాయి.
వారి పరిశోధనలపై స్నేహం ప్రభావం..
గెలీలియో పరిశోధనలకు గుర్తింపు: క్లేవిస్, జెస్యూ(Jesuit) సంస్థలో ప్రభావవంతమైన వ్యక్తిగా, ఉన్నత స్థానంలో ఉండటం వల్ల, ఆ స్థాయి వ్యక్తి గెలీలియో టెలిస్కోపిక్ పరిశీలనలను ధృవీకరించడం ద్వారా అతని పరిశోధనలకు విశ్వసనీయత రావటానికి కారణమయ్యారు. దీనివల్ల గెలీలియో పరిశోధనలు కోపర్నికస్ సిద్ధాంతానికి బలమైన ఋజువులు ఇచ్చింది. కోపర్నికస్ సిద్ధాంతాలు క్రమంగా శాస్త్రీయ సమాజంలో ఆమోదం పొందటంలో ఉపయోగపడింది.
కానీ ఇక్కడే వీరి మైత్రికి విషమపరీక్ష ఎదురైంది. జెస్యూ సంస్థతో అనుబంధం కారణంగా క్లేవిస్ స్వయంగా కోపర్నికన్ సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్థించలేదు. ఆయన పైకి భూకేంద్ర సిద్ధంతాన్నే సమర్థించారు.
క్లేవిస్ ఆలోచనలపై ప్రభావం: గెలీలియో టెలిస్కోపిక్ ఆవిష్కరణలు, ముఖ్యంగా చంద్రుడిపై కనిపించే కొండలు, బృహస్పతి ఉపగ్రహాలు, క్లేవిస్ను సాంప్రదాయ ఆరిస్టాటిలియన్ ఖగోళ శాస్త్రంపై పునరాలోచన చేయటానికి ప్రేరేపించాయి. ఆయన తన తరువాతి రచనలలో ఈ కొత్త ఆవిష్కరణలను గుర్తించారు. ఇది ఖగోళ శాస్త్రంలో కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచింది.
శాస్త్రీయ సంఘంలో సహకారం: వీరి స్నేహం శాస్త్రీయ సంఘంలో సహకారానికి ఒక ఉదాహరణగా నిలిచింది. క్లేవిస్ గణిత శాస్త్ర జ్ఞానం, గెలీలియో ప్రయోగాత్మక విధానం కలిసి ఆధునిక శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి దోహదపడ్డాయి.
ఎదుర్కొన్న సవాళ్ళు..
అయితే, వీరి స్నేహం కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంది. క్లేవిస్, జెస్యూ సంస్థలో భాగంగా, చర్చి సాంప్రదాయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. ఇది కొన్నిసార్లు గెలీలియో విప్లవాత్మక ఆలోచనలతో సంఘర్షణకు దారితీసింది. ఉదాహరణకు, కోపర్నికస్ సిద్ధాంతాన్ని క్లేవిస్ పూర్తిగా స్వీకరించలేదు. అయినప్పటికీ ఆయన గెలీలియో పరిశీలనలు, పరిశోధనలను గౌరవించారు.
చివరగా..
క్వేవిస్, గెలీలియో మధ్య స్నేహం వారి విజ్ఞానశాస్త్ర పరిశోధనలను బలపరచడంలో, ఆధునిక ఖగోళ శాస్త్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది. క్లేవిస్ గణిత శాస్త్ర నైపుణ్యం, సంస్థాగత మద్దతు గెలీలియో ఆవిష్కరణలను విస్తృత శాస్త్రీయ సమాజంలో గుర్తింపు పొందేలా చేశాయి. అదే సమయంలో గెలీలియో టెలిస్కోపిక్ పరిశీలనలు క్లేవిస్ ఆలోచనలను సవాలు చేసి, ఖగోళ శాస్త్రంలో కొత్త దృక్పథాలను పరిచయం చేశాయి. ఈ సహకారం ఆధునిక శాస్త్రీయ విప్లవానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
కెప్లర్, టైకో బ్రాహే మైత్రి మాదిరిగా..
వ్యక్తిగత స్నేహాలు, వైరుధ్యాలను దాటుకుని ఆ కాలంలో వారు చేసిన కృషి సామాన్యమైనది కాదు. కోపర్నికస్ నుంచి క్లేవిస్ వరకూ ఎందరో మహా శాస్త్రవేత్తలు ఎన్నో ఆలోచనలు, ఆవిష్కరణలు మనకు అందించారు.
ఈవిధంగా ఒక అధ్యాయం ముగిసింది.
టాలమీ శాస్త్ర పరిశోధనలో లోపాలను బహిర్గతం చేసి నికోలాస్ కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించిన దగ్గర నుంచి టైకో బ్రాహే నాలుగు దశాబ్దాలు ప్రతిదినం సేకరించి, సమీకరించిన సమాచారం సహాయంతో జొహానెస్ కెప్లర్ గ్రహాల గురించి, వాటి కక్ష్యల గురించి చేసిన పరిశోధనలు, శాస్త్రీయ దృక్పథంలో కూడా లోపభూయిష్టమైన ఆలోచనలు ఏ విధంగా జొరబడతాయో, వాటిని ఎలా అధిగమించాలో చెప్పిన ఫ్రాన్సిస్ బేకన్ మహాశయుని కృషి మీదుగా మనం విలియమ్ గిల్బర్ట్, సైమన్ స్టీవీన్, క్రిస్ఫర్ క్లేవిస్, చివరగా యువ గెలీలియో శాస్త్ర పరిశోధనల వరకూ ఆనాటి సమాజ రూపురేఖలు చూచాయగా తెలుసుకుంటూ శాస్త్రవేత్తల జీవితాలను, వారి పరిశోధనలను, ఉదాహరణలతో సహా తెలుసుకున్నాం.
ఇక్కడి నుంచీ ఆధునిక విజ్ఞానశాస్త్రం కొత్తపుంతలు తొక్కుతుంది.
గెలీలియో అసలైన పరిశోధనల సారం, ఆయన కృషితో నూతన అధ్యాయం మొదలు పెడదాం!
సశేషం…
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.