
లోక్సభ స్పీకర్గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఓం ప్రకాష్ బిర్లా 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని ఖండిస్తూ ఒక తీర్మాన పాఠాన్ని చదివి వినిపించారు. జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి తక్షణ నేపథ్యం. గుజరాత్లో కళాశాల క్యాంటీన్ బిల్లుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమాన్ని బీహార్ విద్యార్థి లోకం కొనసాగించింది. చివరకు విద్యార్థులు జాతీయస్థాయి ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా జయప్రకాశ్ నారాయణను కోరే స్థాయికి చేరింది. పార్లమెంటును, అసెంబ్లీలను ముట్టడించాలని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. 1975 జూన్ 15న రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పోలీసు, సైన్యం, ప్రభుత్వాదేశాలను ధిక్కరించాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ జరగడానికి మూడు రోజుల ముందు అలహాబాద్ హైకోర్టు 1971 నాటి ఇందిరాగాంధీ పార్లమెంట్ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జూన్ 24వ తేదీన సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇందిరాగాంధీ పాలనకు దేశవ్యాప్తంగా పెరుగుతోన్న ప్రతిఘటన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ని ఉపయోగించుకొని 1975 జూన్ 25వ తేదీన ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించింది. పౌర హక్కులు, స్వేచ్ఛ రద్దు, దాని కొనసాగింపుగా మొదలైన మానవ హక్కుల హననం 1977లో ఎమర్జెన్సీని ఉపసంహరించుకొని ఎన్నికలు జరిపేంతవరకు 21 నెలలపాటు నిరాఘాటంగా కొనసాగింది.
1978 జనవరి 24వ తేదీన యావత్మల్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన కృత్యాలు, అరాచకాల పట్ల ఇందిరాగాంధీ క్షమాపణలు కోరారు. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఆకృత్యాల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా దేశాన్ని క్షమాపణ కోరారు. వామపక్షాల నుంచి సంఘ్పరివార్ వరకు అనేకమంది నేతలు 1975 నుంచి 77 వరకు కటకటాలు లెక్కించారు. అందులో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. ఈ మధ్యనే జర్నలిస్ట్ నలిన్ వర్మతో కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీ గురించి ఒక వ్యాసం వ్రాశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేసినా ఎలా గౌరవంగా చూశారో వివరించారు.
జూన్ 25వ తేదీన భారత ప్రజాస్వామ్యంలో చీకటి దినంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఎమర్జెన్సీ కాలంలో సంఘ్ పరివార్ రికార్డు కూడా ఎన్నో వివాదాస్పద అంశాలు పరిణామాలతో నిండి ఉన్నది.
స్వాతంత్రోద్యమంలో గౌరవనీయమైన స్థానం కలిగిన జయప్రకాశ్ నారాయణ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ను భాగస్వామి చేసుకోవడానికి వెనకాడ లేదు. ఈ మధ్యనే భారతరత్నగా కీర్తించబడిన ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో కీలకమైన వ్యక్తి నానాజీ దేశముఖ్ ఇందిరా గాంధీ వ్యతిరేక ఉద్యమానికి కీలకమైన సారధిగా బాధ్యతలు చేపట్టారు. మహాత్మా గాంధీ హంతకుడు ఆర్ఎస్ఎస్ పరివారంలో భామన్న కారణంగా అప్పటివరకు ఒక గౌరవనీయమైన సామాజిక సంస్థగా గుర్తింపుకు నోచుకోని ఆర్ఎస్ఎస్కు జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం గొప్ప గుర్తింపును గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కీలకమైన పాత్ర పోషించడం ద్వారా ప్రజల దృష్టిలో అదొక గుర్తింపు కలిగిన గౌరవనీయమైన సంస్థగా నిలిచింది. కానీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు సంస్థలకు చెందిన నాయకులను అరెస్టు చేయడంతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని కూడా ఇందిరా గాంధీ అరెస్టు చేయించింది. దాంతో ఇందిరా గాంధీ ప్రభుత్వంతో ఆర్ఎస్ఎస్ కాళ్ళ బేరానికి వచ్చింది. అనేకమంది ఆర్ఎస్ఎస్ నాయకులు క్షమాభిక్ష కోరిమరి జైల్లో నుంచి విడుదలయ్యారు.
ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రాజకీయ శక్తులలో తామే ప్రధాన స్రవంతికి చెందిన వారమని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ తలమునకలవుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ జర్నలిస్టు ప్రభాస్ జోషి తెల్కా ఒక పత్రికలో రాసిన పరిశోధనాత్మక వ్యాసంలో అనేక విషయాలను ఆధారాలతో సహా ప్రస్తావించారు.
“సంజయ్ గాంధీ ప్రతిపాదించిన 20 సంవత్సరాల కార్యక్రమానికి తాము సంపూర్ణంగా మద్దతిస్తామని అప్పటి ఆర్ఎస్ఎస్ అధినేత బాలసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధీకి రాసిన లేఖలో చెప్పారు. ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం ఇది. ఒక కార్యక్రమం శైలి ఓ పద్ధతి ఆర్ఎస్ఎస్ మాటల్లోను చేతల్లోనూ గమనించవచ్చు. ఎమర్జెన్సీలో కూడా అనేకమంది ఆర్ఎస్ఎస్, జన సంఘ నాయకులు జైళ్ళ నుంచి రావడానికి విడుదలకు కావటానికి క్షమాపణ పత్రాలను సమర్పించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సాగించిన ఉద్యమంలో క్షమాపణ కోరిన తొలి సామాజిక, రాజకీయ శక్తి బీజేపీ, ఆర్ఎస్ఎస్, జన సంఘలే. వాళ్ల నాయకులు మాత్రమే జైళ్ల బయట ఉన్నారు. నామమాత్రంగా జైలు జీవితం గడిపిన వారిలో అటల్ బిహారి వాజ్పేయి(ఎక్కువకాలం ఆసుపత్రిలోనే ఉన్నారు), ఎల్కే అద్వానీ, అరుణ్ జైట్లీ మాత్రమే. ఆర్ఎస్ఎస్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడనే లేదు. మరి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట కీర్తిని సంపాదించడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నం చేస్తుంది?” అంటూ ప్రభాస్ జోషి ప్రశ్నించారు.
తర్వాత కాలంలో దేవరస్ రాసిన లేఖలన్నీ హిందూ సంఘటన పాలక రాజకీయాలనే పుస్తకంగా ప్రచురించబడ్డాయి. నోయిడా కేంద్రంగా ఉండే జాగృతి ప్రకాశన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న టీవీ రాజేశ్వర్ కూడా వెల్లడించారు.
పత్రికలపై నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, మురికివాడల తొలగింపు ఆ కాలపు చీకటి జ్ఞాపకాలు. కానీ గత పదేళ్లలో పౌరమేధావులను, శాంతియుత పోరాటాల్లో పాల్గొనే వారిని, జర్నలిస్టులను అరెస్టు చేయటం చూస్తున్నాము. ప్రధాన స్రవంతి మీడియా పాలకవర్గం ముందు వొంగిపోవటాన్ని లొంగిపోవటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేయడం చూస్తున్నాము. 146 మంది పార్లమెంట్ సభ్యులను బహిష్కరించడం చూస్తున్నాము.
ఈ కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉందో ఆర్ఎస్ఎస్ పదాతి దళాలకు అంతే పాత్ర ఉంది. 1975 నాటి ప్రకటిత ఎమర్జెన్సీతో పోలిస్తే గత పదివేల కాలంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విమర్శించిన నయనతార వర్తమాన పరిస్థితిని అప్రకటిత ఎమర్జెన్సీగా పిలవటాన్ని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి.
నయనతార సెహగల్ మాటల్లో “ప్రస్తుతం మనం అప్రకటిత ఎమర్జెన్సీలో బ్రతుకుతున్నామన్నది సందేహానికి తావులేని విషయం. భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతోన్న అనూహ్యమైన దాడిని చూశాము. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిత భారతదేశమనే భావనలో ఇమడని భారతీయులను పట్టపగలే చంపేస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఈ పీడకలతో పోల్చదగినదేమీ లేదు.”
1975 నాటి ఎమర్జెన్సీ రోజులను మనం గుర్తు చేసుకుంటున్నాము. ప్రస్తుతం మన కళ్ళ ముందు అమలవుతోన్న అప్రకటిత ఎమర్జెన్సీని అధిగమించడానికి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత రామ్ పున్యానీ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం సంస్థకు అధ్యక్షులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.