
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసిన నిబంధనల ముసాయిదా పట్ల తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉన్నత విద్యారంగం రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశమని, ఈ అంశంపై చట్టాలు చేయటం, పర్యవేక్షణ వంటి అధికారాలు కేంద్రానికి ఎంతమేర ఉంటాయో రాష్ట్రాలకూ ఆ మేర ఉంటాయని ఆయన గుర్తు చేశారు. అటువంటి అంశంపై యుజిసి ఏకపక్షంగా నిబంధనలు రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేయటం రాష్ట్రాల హక్కులను కుదించటమేనని విమర్శించారు.
తిరువనంతపురంలో జరిగిన ఉన్నత విద్యపై జాతీయ సదస్సులో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యావ్యవస్థను ఢిల్లీ నుండే రిమోట్ కంట్రోల్ ద్వారా అజమాయిషీ చేయాలనుకోవటం అసాధ్యం’అని ఆయన అన్నారు.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి రావల్సిన అనుమతులు, ర్యాంకులు పొందాలంటే విశ్వవిద్యాలయం కనీసం మూడు వేలమంది విద్యార్ధులను చేర్చుకోవాలన్న నిబంధనను భట్టి విక్రమార్క తప్పు పట్టారు. అణగారిన విద్యార్ధులకు సేవలందించే తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ నిబంధన వలన నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలు ప్రధానంగా ప్రైవేటు కార్పొరేట్ రంగంలోని విద్యాసంస్థలకు మేలు చేకూర్చేందుకు రూపొందించినవేనని భట్టి విక్రమార్క విమర్శించారు.
‘మూడు వేల మంది విద్యార్ధులు ఉంటేనే యూజిసి నిధులు, ర్యాంకులు ఇతరత్రా ప్రయోజనాలు ఉంటాయన్న షరతును అమలు చేస్తే తెలంగాణ లాంటి వెనకబడిన రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనీ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థలు నిధుల కొరతను, ప్రమాణాల కొరతనూ ఎదుర్కునే ప్రమాదం తలెత్తుత్తుంది’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
‘విద్య జ్ఞానార్జనకు తలుపులు తెరవాలే కానీ మూయకూడదు’ ఆని అన్నారు.
2025లో విడుదల చేసిన ముసాయిదా యూజిసి నిబంధనల ప్రకారం త్రిసభ్య కమిటీ ద్వారా వైస్ ఛాన్సలర్లును నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నుండి గవర్నర్లు, లేదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల చేతుల్లోకి బదిలీ అవుతుంది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ల్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య నెలకొన్న వైరుధ్యాల రీత్యా ఇటువంటి నిబంధనలు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయటానికి మరో కొరడాను చేతికి అందించినట్లే అవుతుంది. మొత్తం విశ్వవిద్యాలయాల యాజమాన్యం, పర్యవేక్షణలు రాష్ట్ర పరిధి నుండి కేంద్రం పరిధిలోకి కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉంటుంది. ‘పరిస్థితులు ఇలానే కొనసాగితే రాష్ట్రాలు కేవలం భవన ప్రారంభోత్సవాలకు, రిబ్బన్లు కత్తిరించటానికి మాత్రమే పరిమితం కావల్సి ఉంటుంది’ అన్నారు భట్టి విక్రమార్క.
యుజిసి నిబంధలన నేపథ్యంలో తలెత్తనున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు చొరవ తీసుకుని వేదికను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వాన్ని భట్టి అభినందించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు మరో సమావేశం నిర్వహిద్దామని, ఆ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తుందని భట్టి ప్రకటించారు. ‘రాష్ట్రాలు జాతీయాభివృద్ధికి ప్రాణవాయువు వంటివి’ కనుక అన్ని మెజారిటీ రాష్ట్రాలు ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తే తదనుగుణంగా కేంద్రం తన వైఖరి మార్చుకోక తప్పదని ఆయన గుర్తు చేశారు.
యుజిసి ముసాయిదా నిబంధనల పట్ల కేరళతో సహా ఇతర రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకూ, అభ్యంతరాలకూ భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఈ నిబంధనలు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించినవని, అందువల్లనే ఈ నిబంధనలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ స్పష్టం చేశారు.
‘వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని ఈ నిబంధనలు గవర్నర్లకు కట్టబెడుతున్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే తప్ప మరోటి కాదు. ఇలాంటి వారి చేతుల్లో నియామకపు బాధ్యతలు పెడితే రాజకీయ జోక్యం పెరుగుతుందే తప్ప తగ్గదు. అటువంటి పరిస్థితులు విద్యారంగ ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని పినరయి విజయన్ అన్నారు.
పినరయి తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ ‘ఇదొక్కటే సందర్భం కాదు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే నిర్ణయాలు పదేపదే చేస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించే నిధులు క్రమేణా తగ్గుతూ ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతోంది’ అని గుర్తు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నియంతృత్వ చర్య అనీ, రాజ్యాంగ విరుద్ధమైనదనీ, సమాఖ్యతత్వం మీద దాడి అని విమర్శించారు
.
యూజిసి ముసాయిదా నిబంధనలపై జనవరిలో స్పందిస్తూ ట్విటర్లో ‘వైస్ ఛాన్సలర్ నియామకాలపై గవర్నర్లకు పెత్తనం అప్పగించటంతో పాటు బోధనానుభవం లేనివారినికూడా ఈ క్రమంలో భాగస్వాములను చేయాలన్న నిర్ణయం రాష్ట్రాల హక్కులపైనా, సమాఖ్యతత్వంపైనా దాడి. ఇటువంటి నియంతృత్వ చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్వాధికారాలనూ తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాల హక్కులూ, అధికారాలను కాలరాయాలని చూస్తోంది. విద్యారంగం ప్రజలెన్నుకున్న వారి పర్యవేక్షణలో ఉండాలే తప్ప కేంద్రం నియమించే తొత్తుల చేతుల్లో కాదు.’ అని ఘాటుగా విమర్శించారు.
2025 ఫిబ్రవరి 5న బెంగుళూరులో జరిగిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రుల సదస్సులో బిజెపియేతర రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో కర్ణాటకతో పాటు కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ల నుండి విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. 2020 నూతన విద్యావిధానం ప్రకారం విద్యా సంస్థలు గ్రేడింగ్‌లు నిర్ణయించటాన్ని, యుజిసి నిబంధనలనూ వ్యతిరేకిస్తూ 15 పాయింట్లతో కూడిన తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.