
రిలయన్స్ గ్రూపు సంస్థలకు సంబంధించిన రూ 3,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీచేసింది. దర్యాప్తులో ఎస్ బ్యాంకు నుంచి తీసుకున్న ఋణాలను దురుపయోగం, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలో అవినీతి ఆరోపణలు కూడా ఈ దర్యాప్తులో భాగంగా ఉన్నాయి. సెబీ ఇంతకు ముందే ఈ విషయంలో జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: ముంబాయిలోని అనిల్ అంబానీకి సంబంధించిన 35 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులను నిర్వహించింది. సరిగా ఇది జరిగిన వారం తర్వాత, రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూపు సంస్థలకు సంబంధించిన 3,000 కోట్ల రూపాయిల బ్యాంకు రుణ మోసానికి సంబంధించిన మనీల్యాండరింగ్ విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ పారిశ్రామికవేత్తకు సమన్లు జారీ చేసింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, 2017- 2019 మధ్య ఎస్ బ్యాంకు ద్వారా రిలయన్స్ గ్రూపు సంస్థలకు ఇచ్చిన దాదాపు 3,000 కోట్ల రూపాయల రుణాలను చట్టవిరుద్ధంగా దారి మళ్లించారనే ఆరోపణల మీద ఈడీ విచారణ చేస్తుంది. దీంతో పాటు ఋణం కోసం ఏదైనా ముడుపులు చేతులు మారాయా, ఎస్ బ్యాంక్ ప్రమోటరులతో పాటు బ్యాంక్ అధికారులకు లంచం ఇచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
కేంద్ర ఏజెన్సీల దర్యాప్తులో రిలయన్స్ గ్రూపు సంస్థలకు ఎస్ బ్యాంకు ద్వారా పొందిన ఋణాల విషయంలో తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగు చూశాయి. అందులో బ్యాక్డెటెట్ క్రెడిట్ అప్రువల్ మెమోరెండమ్, ఎటువంటి విచరాణ, సరైన తనిఖీ లేదా క్రెడిట్ విశ్లేషణ లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇవ్వడం, బ్యాంక్ క్రెడిట్ విధానాన్ని ఉల్లంఘించడం ఇందులో భాగంగా ఉంది.
అంతేకాకుండా, రిలయన్స్ మ్యుచుల్ ఫండ్ ఒక వివాదాస్పదమైన పద్ధతులలో ఎస్ బ్యాంకు ఏటీ1 బాండ్లో దాదాపు 2,850 కోట్ల రూపాయిల పెట్టుబడి పెట్టిందని కేంద్ర ఎజెన్సీ ఆరోపించింది.
“ఈ బాండ్లను చివరికి రద్దు చేసి, అందులో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది ప్రజల డబ్బు- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులది” అని దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చినట్టు వార్తా కథనాలు వచ్చాయి.
మనీల్యాండరింగ్కు సంబంధించిన ఈ వివరాలు సీబీఐ దాఖలు చేసిన కనీసం రెండు ఎఫ్ఐఆర్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెబీ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ(ఎన్ఎఫ్ఆర్ఐ), బ్యాంకు ఆఫ్ బరోడాలు ఈడీకి ఇచ్చిన వివరాల ద్వారా వెలుగు చూశాయి.
గత సంవత్సరం సెబీ, అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలు- అందులో ఆర్ఎచ్ఎఫ్ఎల్కు చెందిన మాజీ కీలక అధికారులు కూడా భాగస్వామిగా ఉన్నారు. కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో వీరిని సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఐదేళ్ల పాటు నిషేధించారు. ఆర్థికమోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల రూపాయిల జరిమానాను కూడా విధించింది. ఈ పరిణామాలు ఆర్ఎచ్ఎఫ్ఎల్ వాటాదారులతో పాటు ద్రవ్యమార్కెట్లోని ఇతర పాత్రధారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. అనిల్ అంబానీ ఇంకా ఇతర 24 సంస్థల మీద విధించిన మొత్తం జరిమానా 625 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.