
న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎండబెట్టడంలో నిర్మొహమాటంగా వ్యవహరించే ప్రముఖ న్యాయవాది, మాజీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దవే తాజాగా సంచలన ప్రకటన చేశారు. తను న్యాయవాద వృత్తి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే తన నిర్ణయానికి ప్రత్యేకమైన కారణాలు లేవని ప్రకటనలో పేర్కొన్నారు.
బార్ అండ్ బెంచ్ అనే వార్త సంస్థ కథనం ప్రకారం, “48 సంవత్సరాల పాటు న్యాయవాదిగా విలువైన కాలం గడిపాను. 75వ జన్మదినోత్సవాన్ని ఈ మధ్యనే బంధు మిత్రుల మధ్య ఘనంగా జరుపుకున్నాను. న్యాయవాదవృత్తి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాన”ని వాట్సాప్‌లో జారీ చేసిన ఒక ప్రకటనలో దవే తెలియజేశారు.
“ఈ నిర్ణయానికి ప్రేరేపించిన ఘటనలేమీ లేవు. నాకిప్పుడు 70 ఏళ్లు, ఎంత ముఖ్యమైన కేసు ఉన్నా ఇకపై నేను కోర్టుకు హాజరు కాను. శేషజీవితాన్ని మనుమళ్ళతో గడపాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
తన అభిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ, మిగిలిన సమయాన్ని కుటుంబానికి కేటాయించి, సమాజహిత కార్యక్రమాలలో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
“నా సొంత జిల్లా బరోడాలోని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ వ్యవసాయం, నివాస సదుపాయాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నాను” అని దేవ్ తెలిపినట్లు బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
ఇంతకాలం తనకు సహకరించిన, తోడుగా నిలబడిన సహచరులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
“మరి ముఖ్యంగా, నా కెరియర్లో అన్ని సందర్భాలలోనూ నా సామర్థ్యంపై అచంచల విశ్వాసంతో నన్ను ముందుకు నడిపించిన క్లైంట్లకు రుణపడి ఉంటాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి క్లైంట్కు ఎంత కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఈ వృత్తిలో నేను సంతోషంగా గడిపాను. న్యాయం కోసం తహతలాడుతున్న వారికి న్యాయాన్ని అందించడంలో నా వంతు ప్రయత్నం చేశాను” దవే ప్రకటించినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు దవే వరుసగా మూడుసార్లు అధ్యక్షుడిగా సేవలందించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చట్ట వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను నిలువురించడంలో సుప్రీంకోర్టు ఘోరంగా విఫలమైందని దుష్యంత్ దవే 2024లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను కూడా లైవ్‌లా వార్తా సంస్థ ప్రస్తావించింది. అదే ఇంటర్వ్యూలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ అత్యంత బలహీనమైన క్షణాలు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా లైవ్‌లా గుర్తు చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.