
ట్రంప్ సుంకాల విధానానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు ప్రకటనను విడుదల చేశాయి. దీని తర్వాత అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై అదనంగా 10% సుంకాలు విధిస్తానని బెదిరించారు. ఇండియా బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశం. అంతేకాకుండా, ఇటీవల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఏకపక్ష సుంకాలు, నాన్-టారిఫ్ చర్యల పెంపుపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిని “చట్టవిరుద్ధం- ఇష్టానుసార చర్య” అని అభివర్ణించిన కొన్ని రోజుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్‌ను తీవ్రంగా విమర్శించారు. ఐదు వ్యవస్థాపక బ్రిక్స్ సభ్యులలో ఒకటైన భారతదేశం ఇప్పుడు అదనంగా 10 శాతం సుంకానికి లోనవుతుందని అన్నారు.
మంగళవారం(జూలై 8) ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ , “ఒకవేళ వారు(భారతదేశం) బ్రిక్స్‌లో ఉంటే, 10 శాతం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే, బ్రిక్స్‌ను మనకు వ్యతిరేకంగా నిలబెట్టడానికి, మన డాలర్‌ను బలహీనపరచడానికి, దానిని ప్రమాణం నుంచి తొలగించడానికి ఏర్పాటుచేయబడింది. ఒకవేళ వాళ్లు అలాంటి ఆట ఆడాలనుకుంటే, నేను కూడా నా ఆట ఆడగలను. బ్రిక్స్‌లో ఉన్న, ఎవరికైనా 10 శాతం పన్ను విధించబడుతుంది. భారతదేశం కూడా చెల్లించాల్సి ఉంటుంది” అని అన్నారు.
జూలై 6న బ్రిక్స్ జారీ చేసిన సంయుక్త ప్రకటన తర్వాత ట్రంప్ భారతదేశానికి హెచ్చరిక జారీ చేశారు. దీంట్లో భారతదేశం సహా బిక్స్ర్ సభ్య దేశాలు సుంకాలను విమర్శించాయి. రియోడీ జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు.
ఆ ప్రకటనలో అమెరికా పేరు నేరుగా ప్రస్తావించలేదు. కానీ “సుంకాలు- సుంకాలు లేని చర్యలను ఇష్టానుసారం పెంచడం” ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తుందని, సరఫరా గొలుసులను దెబ్బతీస్తుందని అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని సృష్టిస్తుందని తెలియజేయబడింది.
భారతదేశం, బ్రిక్స్ చేసిన ప్రకటనలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, “డాలర్‌ను సవాలు చేయాలనుకునే దేశాలు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని అన్నారు.
“వాళ్ళలో ఎవరూ ఆ ధర చెల్లించడానికి సిద్ధంగా లేరని నేను అనుకుంటున్నాను” చెప్పుకొచ్చారు.
భారత్‌తో ఒప్పందానికి దగ్గరగా..
“బ్రిక్స్ ప్రభావం దాదాపుగా ముగిసిందని నేను ఒక సంవత్సరం క్రితమే చెప్పాను. కానీ కొన్ని దేశాలు ఇప్పటికీ నిజాన్ని గ్రహించలేకపోతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం బ్రిక్స్ తీవ్రమైన ముప్పు కాదు, కానీ వారి ఉద్దేశ్యం డాలర్‌ను తొలగించడం, తద్వారా దాని స్థానంలో వేరే దేశం ప్రమాణంగా మారడం. కానీ మేము మా ప్రమాణాన్ని కోల్పోనివ్వము” అని ట్రంప్ పేర్కొన్నారు.
“అమెరికన్ వ్యతిరేక విధానాల”కు మద్దతు ఇచ్చే బ్రిక్స్ ఏ దేశమైనా అదనంగా 10 శాతం సుంకానికి లోనవుతుందని ట్రంప్ గతంలో కూడా అన్నారు.
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, భారతదేశంపై సుంకాలు విధించడానికి సంబంధించిన ట్రంప్ ప్రకటన వచ్చింది. అమెరికా “భారతదేశంతో ఒప్పందానికి చాలా దగ్గరగా ఉంది” అని కూడా ట్రంప్ విలేకరులతో అన్నారు.
“మేము యునైటెడ్ కింగ్డమ్తో ఒక ఒప్పందం చేసుకున్నాము. చైనాతో ఒక ఒప్పందానికి వచ్చాము. ఇంకా భారతదేశంతో కూడా ఒక ఒప్పందం చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాము” అని ఆయన అన్నారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.