
‘ఇప్పుడే సొంతగా అధికారంలోకి వచ్చే సత్తా తన పార్టీకి లేదు’ అని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ వ్యాఖ్యల మీద అనేక విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. సత్తా లేనప్పుడు రాజకియాలెందుకనీ, పవన్ కళ్యాణ్ చేతులెత్తేశాడని వివిధ మీడియా వేదికల మీద చర్చలు జరిగాయి. కానీ లోతుగా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్‌కి తన వ్యాఖ్యల మీద ఒక స్పష్టత, దృక్పథం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండు బలమైన పార్టీలతో సతమతమౌతూ మూడో పార్టీకి ఏమాత్రం చోటు ఇవ్వని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గమనాన్ని పరిశీలిస్తే అది అర్ధం అవుతుంది. కుర్చీ వైపు చూడటమే మూడో పార్టీకి పెద్ద సాహసమైన రాష్ట్రంలో జీరో నుంచి పవర్ షేరింగ్ స్థాయికి ఎదిగిన జనసేనకి సత్తా లేదంటే ఎవరూ నమ్మరు. మరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు?
పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యల్ని చేసింది చేతులెత్తేసి కాదు, తన చేతుల్ని బలోపేతం చేసుకోవటం కోసమేనని చెప్పాలి. తన పరిమితులని అధిగమించే పనిలో భాగమే ఆ వ్యాఖ్యల సారాంశంగా చూడాలి. తన భాగస్వామ్య పక్షాల్లోనూ, కేడర్‌లోనూ టెన్షన్స్‌ని తగ్గించి, కూటమి ప్రభుత్వానికి ఆటంకాలు తొలిగించే క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యల్ని చేసినట్టు కనిపిస్తుంది. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య టెన్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది వేరే చర్చ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2009- 2014 మధ్య కాలాన్ని అనిశ్చిత ఐదు సంవత్సరాలుగా పేర్కొనవచ్చు. ఈ ఐదు సంవత్సరాల్లోనే కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం, వైసీపీ జననం, జనసేన ఆవిర్భావం, రాష్ట్ర విభజన, కొత్తగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు వంటి పలు సంచలనాత్మక పరిణామాలు జరిగాయి. వర్తమాన రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో అంత తక్కువ కాలంలో అన్ని దీర్ఘ కాల ప్రభావం కలిగిన పరిణామాలు జరగటం ఓ చరిత్రే. 2014 ఎన్నికల నాటికి అనిశ్చితి కొంత తొలిగినా అప్పులు, అవమానాలు, అనుమానాలు, ఆందోళనలతోనే ఆంధ్రప్రదేశ్ కొత్త అడుగులు ప్రారంభించింది.
ఈ క్లిష్ట సందర్భంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించటం, టిడిపి- బిజెపితో జతకట్టడం జరిగిపోయాయి. కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుకు కూడా పోటీ చెయ్యలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యక పోవటం రాజకీయ అపరిపక్వత అని వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజానికి ఇక్కడే పవన్ కళ్యాణ్ రాజకీయ చతురత కనిపిస్తుంది. ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండానే పోటీ చేసిన వారి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ పేరు తెచ్చుకోవటం జరిగింది. ఆ ఎన్నికల్లో ఎన్డిఏ కేవలం 5 లక్షల ఓట్లతో బయట పడిన సంగతి గమనార్హం. పవన్ కళ్యాణ్‌తో పొత్తు లేకపోతె వైసిపి చేతిలో ఎన్డీఏ తీవ్రంగా ఓడిపోయి ఉండేదని మేధావులు ఆ ఎన్నికలని విశ్లేషించారు.
తరువాత 2019 ఎన్నికల్లో జనసేన బియస్పీ, వామ పక్షాలతో కలిసి పోటీ చేసి ఒక సీటు గెలిచింది. వైసిపి 151 సీట్లోతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిడిపి 23 సీట్లకి పరిమితమైంది. పవన్ కళ్యాణ్ గత రెండు అనుభవాలతో 2024 ఎన్నికలకి వెళ్లినట్టు కనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న టిడిపికి ఆయన అండ ఆక్సిజన్‌లా పని చేసిందని అందరికి తెలిసిందే. అందుకే నలభై ఏళ్ల తెలుగు దేశాన్ని 2024 ఎన్నికల్లో జనసేన గెలిపించిందని పిఠాపురం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తిగా అనిపించదు. జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ప్రకటించినప్పుడే కూటమి సక్సెస్స్ దాదాపు ఖరారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఆయా పార్టీల శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిన సందర్భంగా కూడా దాన్ని పలువురు గుర్తించారు. బిజెపికి ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ పట్టుపట్టి ఆ పార్టీని పొత్తుకి ఒప్పించటం కూటమికి ఎలక్షనీరింగ్‌లో తిరుగులేని ఆధిక్యతని తెచ్చిపెట్టిందనటంలో సందేహం లేదు. నిజానికి ఆ పొత్తే వైసిపికి శరాఘాతం అయ్యిందని గమనించాలి. ఈ విధంగా చూసినపుడు 2014లోనూ 2024లోనూ ఎన్డీఏకి పవన్ కల్యాణ్ ఆక్సిజన్ గా పని చేశారన్న చర్చలో వాస్తవం లేకపోలేదు. చంద్రబాబు అరెస్టుతో నీరసపడి ఇతర పార్టీల వైపు చూస్తున్న కొందరు టిడిపి నాయకులు పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఆ ప్రయత్నాలు విరమించు కోవటం విస్మరించలేని వాస్తవం. అప్పటి వరకు ప్రజాక్షేత్రంలో ఆధిక్యతని ప్రదర్శించిన వైసిపి దూకుడుకి ఈ పొత్తు బ్రేక్ వేసిందని చెప్పటం అతిశయోక్తి కాదు. 2024 ఎన్నికల్లో కూటమిలో పవన్ కళ్యాణ్ లేకపోతె జగన్‌కి నల్లేరు మీద నడక అయ్యుండేదని మేధావులు విశ్లేషించటం మరచి పోకూడదు. ఆ పరిస్థితిని తారుమారు చేసింది పవన్ కళ్యాణే అని నేషనల్ మీడియాలో కూడా అంచనా వేయటం గుర్తు తెచ్చుకోవాలి.
అయితే, గత కొంత కాలంగా ఎన్డీఏ కూటమిలో టిడిపి, జనసేన కార్యకర్తలు ఎవరికి వారు తమ బలాబలాల్ని అతిగా ఊహించుకొంటూ ఘర్షణలకు దిగుతున్నారు. ఇవి చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం లేక పోలేదు. గతంలో ఇలాంటి ఘర్షణలు పొత్తుల్ని పతనం చేసిన చరిత్ర తెలిసిందే. బీహార్ దీనికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రమాదాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పసిగట్టినట్టున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తమతమ కార్యకర్తల్ని అదుపు చేసుకోవటానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాన్ సొంతగా నిలబడే శక్తి సాధించే వరకు పొత్తు అవసరమని తనవారికి తెలియజెప్పాల్సి వుంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలు తను జనసేనని నిలబెట్టుకున్నాడో, కూటమి కట్టి అధికారంలో భాగం పంచుకోవటానికి ఎంత కష్టపడ్డాడో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన కార్యకర్తలకి గుర్తు చేస్తు ఉండవచ్చు.
నేటి రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ మనుగడకైనా, విస్తరణకైనా అధికారంలో వుండటం ఎంత అవసరమో తెలిసిందే. అది జనసేనకు కూడా మినహాయింపు కాదు. ఊహల్లో తేలిపోతున్న తన కేడర్ని నియంత్రించి, అధికారాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పటానికే పవన్ కళ్యాణ్ తన‘సొంత సత్తా’ గురించిన వ్యాఖ్యలు చేసినట్టు భావించాలి. సత్తా లేనప్పుడు రాజకియాలెందుకు అనే విమర్శ సహజమే. కానీ కొత్తగా రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్న సామాజికవర్గాలకి, పార్టీలకి దీన్ని వర్తింప చేయకూడదు. ఇలాంటి కొత్త పార్టీలకి శక్తి అమాంతంగా ఒకేసారి రాదు. నెమ్మదిగా, క్రమక్రమం అవి శక్తిని పుంజుకుంటాయి. కొన్నిసార్లు దానికి కొన్ని దశాబ్దాలు కూడా పట్టవచ్చు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సొంతగా అధికారంలోకి రావటానికి సత్తా చాలక పోవచ్చు. కానీ కొందరిని ఓడించటానికి, కొందరితో గెలుపుని పంచుకోవటానికి సరిపోతుందని రాష్ట్రంలో ఇప్పటికే నిరూపితమైందని గుర్తించాలి. జనసేన సొంతగా నిలదొక్కుకునే వరకు ఈ పరిస్థితి కొనసాగ వచ్చు.
పరిమితమైన శక్తితో అధికారంలోకి రావటానికి కావాల్సిన పొలిటికల్ క్రాఫ్ట్ మీద, వ్యూహాల మీద పవన్ కళ్యాణ్‌లో ఒక స్పష్టమైన అవగాహన కనిపిస్తుంది. సమకాలీన పరిస్థితుల్లో వేగంగా వ్యూహాలు మార్చు కోగలిగే పద్ధతి ఆయన రాజకీయాల్లో ప్రస్పుటంగా కనబడుతుంది. ఆ క్రమంలోనే 2014 ఎన్నికల్లో తాను పొత్తులో వుంటే గెలుస్తారని నిరూపణ చేసినట్టు గుర్తించాలి. 2019లో తను పొత్తులో లేకపోతె గెలవటం కష్టమని చూపించినట్టుగా భావించాలి. 2024 ఎన్నికల ద్వారా మూడో స్థానమే ఊహకందని అసెంబ్లీలో తన పార్టీని రెండో స్థానానికి చేర్చినట్టుగా అర్ధం చేసుకోవాలి. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడదు. ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు భావించాల్సి వుంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే పవన్ కల్యాణ్ కు రాజ్యాధికారం పట్ల ఉన్న అవగాహన. పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా నయా సబాల్ట్రాన్ తరగతుల ఆకాంక్షలకు ప్రతినిధి. సమాజంలో ఊర్ధ్వ చలనం లో ఉన్న అణగారిన తరగతులకు, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ వామపక్షాలు, బీఎస్పీ ల తో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు ఇవ్వదు అని అర్థం అయ్యాక 2024 ఎన్నికల నాటికి తన లక్ష్య సాధనకు అవసరం అయిన వ్యూహాలు ఎంచుకున్నారు. ఫలితం రాష్ట్రం లో ఎన్డీఏ కూటమి అధికారం. అందులో చంద్ర బాబు కూడా కాదనలేని స్తాయిలో జనసేన పలుకుబడి. ఈ వాస్తవాన్ని విస్మరించి ఏ విశ్లేషణ చేసినా అది సత్యదూరమే అవుతుంది.
జనసేన ఎదుగుదల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ తరహా రాజకీయాలకి తెరలేచింది. సంకీర్ణ రాజకీయాలు మొదలైయ్యాయి. శాశ్వత ప్రయోజనాలే తప్ప- శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కనబడని నేటి రాజకీయాల్లో పెద్ద పార్టీలకి రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ, జనసేన లాంటి మధ్యస్థాయి పార్టీల పాత్ర మాత్రం అత్యంత కీలకంగా మారబోతుందని అనుభవాలు సూచిస్తున్నాయి. అలాంటి పార్టీ మద్దతు ఎవరికి వుంటే వారే అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో చూశాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ దశకి చేరినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు పార్టీలు తప్ప ఇంకెవరికి చోటు లేదనే అభిప్రాయం క్రమంగా చెరిగిపోతుంది. ఇప్పుడు జనసేన ఎటు మొగ్గితే అటే గెలుపు అనే పరిస్థితి కొంత కాలం ఉండేలా అనిపిస్తుంది.
ఇదంతా విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ తనకి సత్తా లేదన్నది ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికలకి వెళ్ళటం గురించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటం గురించి మాత్రమె అని గుర్తించాలి. తన భవిష్యత్తు రాజకీయం గురించి కాదని అర్ధం చేసుకోవాలి. నాయకుడు అతిగా అంచనా వేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే వున్నది వున్నట్టు గ్రహించగలుగుతాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ దిశలోనే విశ్లేషించుకుని అడుగులు వేస్తున్నట్టు అర్ధమవుతుంది. సంకీర్ణ రాజకీయాల్లో కొత్త ప్రయోగాలకు తెర తీస్తున్న పవన్ కళ్యాణ్ విభిన్న పరిస్థితుల్లో ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడో ఊహించలేం. కానీ దీర్ఘ కాలం అధికారంలో భాగస్వామిగా వుండే విధంగానే అయన వ్యూహాలు ఉంటాయని మాత్రం నిర్ధారించుకోవచ్చు.
రాష్ట్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారిన పవన్ కళ్యాణ్ మద్దతు కోసం భవిష్యత్తులో టిడిపి, వైసిపి పోటీ పడినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదనే అంచనాలు నిజమైనా కావచ్చు. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు నిలువరించుకునే క్రమంలో జనసేన కీలకం అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆ రెండు పార్టీలు జనసేనకి ఏ మోతాదులో అధికారాన్ని పంచుతాయనే అంశం భవిష్యత్తులో పొత్తులని నిర్ణయించటంలో కీలకం కావచ్చు. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ అధికార భాగస్వామ్యం ఇస్తే వారితో ఆ పార్టీ వెళ్ళటం సహజం. ఒకోసారి పొత్తులు చిన్న పార్టీలకి సీఎం పదవిని కూడా కట్టబెట్ట వచ్చు. యూపీలో బియస్పీకి తక్కువ సీట్లు వచ్చినా ఆ పార్టీ మూడు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టింది. అందుకే మధ్య స్థాయి పార్టీలు సాధారణంగా ఇతర రాజకీయ పార్టీలతో పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు దూరం పెంచుకుంటూ, మరి కొన్ని సార్లు అదే దూరాన్ని తగ్గించుకుంటూ ఫ్లెక్సిబుల్‌గా వుండి తమ అవకాశాలని మెరుగుపరుచుకుంటాయి.
యూపీలో బియస్పీ, బీహార్‌లో లోక్ జనశక్తి , మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీలని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లోక్ జనశక్తి పార్టీ నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ ఈ పద్ధతిలోనే దాదాపు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాల్లో భాగస్వామ్యం తీసుకున్నాడు. ఆచరణాత్మక వ్యూహాలు అమలు చేసుకుంటే సంకీర్ణ రాజకీయాలు చిన్న, మధ్య స్థాయి రాజకీయ పార్టీల అవకాశాలు పెంచి ప్రజాస్వామ్యాన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్ళే అవకాశం వుందని చెప్పవచ్చు. ఈ రాజకీయ చదరంగంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పావుల్ని ఎలా కదుపుతాడో అనే అంశం ఆసక్తి కరంగా మారింది.
ప్రొఫెసర్ శ్రీపతి రాముడు
హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.