న్యూ ఢిల్లీ : భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలెక్టోరల్ అసిస్టెన్స్ (ఐడియా) సంస్థ కు అధ్యక్షులు గా ఎంపిక కావడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది.
భారత దేశం లో ఎన్నికలను జయప్రదం గా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం శక్తి సామర్ధ్యాలకు ఇది నిదర్శనం అని కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటించింది. కానీ ఐడియా సంస్థ పత్రాలు ప్రకటనలు గమనిస్తే ఇదంతా ముందుగానే నిర్ణయించిన విధి విధానాల ప్రకారమే జరిగిందనీ ప్రత్యేకంగా భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ లో చూపించిన సామర్ధ్యాలకు ఏమీ సంబంధం లేదని తెలుస్తోంది.
ఎన్నికల సంఘం వాదన
డిసెంబరు 3వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఓ పత్రిక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భారత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గ్యాణేష్ కుమార్ 2026 వ సంవత్సరానికి గాను ఐడియా సభ్య దేశాల కౌన్సిల్ కు అధ్యక్షుని గా నియమించ బడ్డారు అన్నది ఆ ప్రకటన సారాంశం.
ప్రధాన ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన మరో వీడియో ప్రకటన లో కుమార్ ” భారత దేశం లో ఎన్నికలు స్వేచ్ఛ గా పారదర్శకం గా జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ప్రపంచం గుర్తించింది. ఫలితం గా ముప్పై ఏళ్ల సంస్థ చరిత్ర లో తొలిసారి 37 సభ్య దేశాలు ఉన్న ఈ సంస్థ తమకు నాయకత్వం వహించాల్సింది గా భారత్ ను ఆహ్వానించాయి. ” అని ప్రకటించారు. ఇది భారత ఓటర్లు ఎంతో గర్వించ దగ్గ విషయం అని కూడా అయన అన్నారు.
వాస్తవం ఏమిటి?
కానీ సామర్ధ్యానికి ప్రతిఫలం గా దక్కిన ఆహ్వానం అన్న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వ్యాఖ్యలను పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ విడుదల చేసిన పోస్ట్ ను కొందరు పరిశీలకులు ఎక్స్ లో పోస్ట్ చేసి వివరం కోరగా అదేమీ ప్రత్యేక పరిస్థితిల్లోనో లేక సామర్ధ్య ప్రతిఫలం గా నో దక్కిన పోస్ట్ కాదనీ ఇటువంటి అంతర్జాతీయ వేదికల్లో ఎపుడు ఏ దేశం అధ్యక్షా స్థానం వహించాలన్నది ముందుగానే నిర్ణయం అవుతుంది అని తెలిసింది. ఏ ఎన్ ఐ వార్తా సంస్థ విడుదల చేసిన గ్యాణేష్ కుమార్ ప్రకటన లోనే ఐడియా అధికారిక వెబ్సైట్ ను ఉటంకిస్తూ పెట్టిన పోస్ట్ లో ఈ సంస్థ కు అధ్యక్ష బాధ్యతలు ఒక దేశం తర్వాత మరో దేశానికి ఇలా అన్ని సభ్య దేశాలకూ దక్కుతాయని వివరణ తో కూడా సమాచారం పోస్ట్ అయ్యింది.
ఐడియా వ్యవస్థాపక నియమాల ప్రకారమే ప్రతి ఏడాది మొత్తం సంస్థ కు అదేవిధం గా ప్రాంతీయ విభాగాలకు ఒక్కో దేశం అధ్యక్షత వహించే ఏర్పాటు ఉన్నది. 2025 లో ఈ వేదిక కు స్విట్జర్లాండ్ అధ్యక్షత వహించ గా 2026 లో భారత దేశం ఈ స్థానాన్ని అలంకరించటం అన్నది ఎపుడో కొన్ని ఏళ్ల క్రితమే నిర్ణయం అయ్యింది.
ఈ సంస్థ కు భారత దేశం అధ్యక్షత వహించటం వ్యవస్థాగత నిబంధనల్లో భాగమే తప్ప కేంద్ర ఎన్నికల సంఘం పనితనం ఫలితం కాదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వ్యవస్థాగత నిబంధనల కారణం గా వచ్చిన అవకాశాన్ని తమ ప్రతిభా పాటవాలు కారణం గా దక్కిన ప్రతిష్ట గా చెప్పుకోవటం ఈ ప్రయత్నం లో కనిపిస్తోంది.
జి 20 నేపధ్యం
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ప్రకటన గతం లో కేంద్ర ప్రభుత్వం 20 దేశాల కూటమి కి అధ్యక్షత వహించినపుడు అదేదో మోడీ ప్రభుత్వ ప్రతిష్ట కు కలికి తురాయి లాగా చెప్పుకుని దేశీయం గా ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించిన తీరు ను పునరావృతం చేస్తోంది.
భారతదేశం 20 దేశాల కూటమికి అధ్యక్షత వహించినపుడు ఈ ధోరణి మొదలైంది. గతం లో ఈ బాధ్యతల్లో కి వచ్చిన దేశాలన్నీ దాన్ని దౌత్యపరమైన కర్త్యవ్యం లో భాగం గా చూశాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ సందర్భాన్ని రాజకీయ ప్రచార వేదిక గా మార్చుకున్నది. 20 దేశాల కూటమి కి అధ్యక్షత వహించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు తానూ విశ్వగురువు గా ప్రచారం చేసుకోవటానికి ఉపయోదించుకున్నట్టే ఐడియా అధ్యక్ష హోదా ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోహించుకోవటానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భం గా ప్రపంచ ప్రజాస్వామిక వ్యవస్థ కు తామే ఆది పురుషులం అని చెప్పుకోవడానికి కసరత్తు ప్రారంభించారు.
ఈ వైఖరి రాజ్యాంగ వ్యవస్థల స్వయం ప్రతిపత్తి విస్మరించి రాజకీయ నాయకత్వపు లక్ష్యాల్లో భాగం అవ్వటం తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించినట్లే లోపాలను కప్పి పెట్టి కొద్దిపాటి విజయాలను కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడానికి సిద్ద పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య కాలం లో కేంద్ర ఎన్నికల సంఘం పని తీరుపై వస్తున్నా విమర్శలను అధిహమించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ సందర్భాన్ని అవకాశం గా తీసుకుంటున్నారు.
దేశం లో ఉన్న వాస్తవం ఏమిటి ?
కేంద్ర ఎన్నికల సంఘం ప్రపంచ వ్యాప్త కీర్తి కోసం తహతలాడుతూ ఉంటె దేశం లో జరుగుతున్న పరిణామాల పట్ల ఎన్నికల సంఘం మాజీ కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల లో ఫ్రంట్ లైన్ పత్రిక లో రాసిన ఓ వ్యాసం లో ఓటర్ల పట్ల ఎన్నికల సంఘం వ్యవహరించే తీరు లో వచ్చిన మార్పుల గురించి వ్యాఖ్యానించారు.
బీహార్ లో మొదలై దేశవ్యాప్తం గా అమలు జరుగుతన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గురించి లావాసా ప్రస్థావించారు. ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు ద్వారా ఓటర్లే తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని లావాసా వ్యాఖ్యానించారు. బీహార్ కసరత్తు ఓటర్లను వెలివేసి కసరత్తు అని వ్యాఖ్యానిస్తూ లావాసా ఎన్నికల సంఘం చేపట్టిన కసరత్తు లో అంతర్లీనం గా పౌరసత్వాన్ని ఖరారు చేసే అంశం కూడా దాగి ఉందని అన్నారు. ఇటువంటి చర్యలు తో ఎన్నికల సంఘం దొడ్డి దారిన జాతీయ పౌరసత్వ జాబితాను రూపొందిస్తోంది అన్న విమర్శలకు అవకాశం ఇచ్చేవి గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఎంత మందిని ఏయే కారణాలతో ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారో అన్న విషయం లో పారదర్శకత లోపించటం తో ఇటువంటి ఆరోపణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తోంది అని లావాసా అభిప్రాయపడ్డారు.
బీహార్ లో అమలు జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పై సుప్రీం కోర్టు తుది నిర్ణయం ప్రకటించాక పోయినా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనే ఎన్నికల సంఘం పట్టుదలతో ఉన్నది అని అయన రాశారు.
ఈ పరిణామాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న విశ్వగురువు స్థానం అర్ధ సత్యాలు పై ఆధారపడి ఉన్నది అని స్పష్టం అవుతోంది. 2026 లో ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పే హడావుడి లో ఉంటె దేశీయంగా మాత్రం తన భాద్యతలు అమలు చేసే విషయం లో సందేహాల మేఘాలు కమ్ముకుంటున్నాయి.
పవన్ కోరాడ
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
