
చెన్నైలో కారల్ మార్క్స్ విగ్రహం ఏర్పాటుతో పాటు మధురైలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేత పికె మూకయ్య తేవర్ మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం నాడు అసెంబ్లీలో వెల్లడించారు.
ద్రవిడియన్ ప్రభుత్వ నమూనా ప్రపంచ ప్రఖ్యాత మేధావి కారల్ మార్క్స్‌ను ఈ విధంగా సత్కరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కార్మికులంతా ఏకం కావాలని మార్క్స్ ఎపుడో పిలుపునిచ్చిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు.
చాలా మంది చరిత్రను నిర్మించినా కారల్ మార్క్స్ ఒక్కడు మాత్రమే చరిత్ర గతిని మార్చాడని స్టాలిన్ అన్నారు. మార్క్స్ కృషి ప్రపంచంలో అనేక దేశాలను విప్లవాల బాట పట్టించిందని, ప్రపంచం నేడు అనుభవిస్తున్న ఎన్నో విషయాలు వసతులు సౌకర్యాలు మార్క్స్ మేధో సంపత్తికి కృతజ్ఞత తెలుపుకోవాలని ఆయన అన్నారు. అందరికీ అన్నీ సమకూరాలన్న మార్క్స్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఏటా మార్చి 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అందులోభాగంగానే ఈ సంవత్సరం బడ్జెట్‌ను సాంప్రదాయకంగా ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టకుండా మార్చి 14 న ప్రవేశ పెట్టారు. మార్చి 14 కారల్ మార్క్స్ వర్ధంతి.
వందేళ్ల క్రితం దేశంలో కార్మికోద్యమానికి పునాదులు వేసిన చెన్నైలో మార్క్స్ విగ్రహం ఏర్పాటు సముచిత నివాళి అని స్టాలిన్ అన్నారు. అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ నేత మూకయ్య తేవర్ మెమోరియల్ కూడా మధురైలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించరాదని మూకయ్య పోరాడిన విషయాలను స్టాలిన్ గుర్తు చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.