
మోడీ మూడో సారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలన నాటి ఎమర్జెన్సీ గురించిన చర్చను తెర మీదకు తెచ్చి, తానే రాజ్యాంగ సంరక్షణకు కాపలాదారుడినని ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పై నైతికంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజున ఇండియా బ్లాక్ పూర్తిగా ఆధిపత్యం చలాయించింది. ప్రతిపక్షానికి సభలో రక్షణ కావాలని ఇండియా బ్లాక్ సభ్యులు ఉమ్మడి గొంతుక వినిపించారు. రాజ్యాంగాన్ని సభలో చర్చకు పెట్టింది ప్రతిపక్షం. దీనికి భిన్నంగా కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఓమ్ బిర్లా ద్వారా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదింపజేసింది. దానికోసం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి చేయని పని లేదు.
స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓమ్ బిర్లా మొదటి చర్య కూడా ఈ తీర్మానం ప్రతిపాదించడమే. రానున్న కాలంలో ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మచ్చుతునక. రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు పాలక బీజేపీయా లేక ప్రతిపక్ష కాంగ్రెస్ఆ అన్న చర్చ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టిగానే దెబ్బ కొట్టింది. ఈ నష్టం పూడ్చుకుని తిరిగి దేశం ముందు తానే రాజ్యాంగ సంరక్షకుడినని నిరూపించుకునే ప్రయత్నం చేసింది ఎన్డీయే.
బీజేపీ కోరినంత బలంతో అధికారానికి వస్తె రాజ్యాంగాన్ని తుత్తునియలు చేస్తుంది. ప్రత్యేకించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చిన కొద్దిపాటి హక్కులు అవకాశాలు రద్దు చేస్తుందనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం హిందీ ప్రాంతంలో బీజేపీ బాగా నష్ట పోవడానికి కారణం అయ్యింది. ప్రత్యేకించి దళితులు, ఓబీసీల్లో బీజేపీ పలుకుబడి వెనకపట్టు పట్టింది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగంపై జరిగిన దాడి, పర్యవసానాలు మీద బీజేపీ ప్రచార హోరు కొనసాగనున్నది. అందులోభాగమే 50 ఏళ్ల ఎమర్జెన్సీ గురించిన పాలక కూటమి ప్రచారం, సభలు, సమావేశాలు.
కానీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడిన ధీరులుగా సంఘ్‌పరివార్ తమను తాము చూపించుకునే ప్రయత్నంలో నిజాయితీ లేదు. రెండు నాల్కల ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
గత పదేళ్ల బీజేపీ పాలనను అప్రకటిత ఎమర్జెన్సీ అని నిర్ధారించవచ్చు. ప్రజాస్వామిక స్వరాలు బలహీనపడి గుత్తాధికార స్వరాలు బలోపేతం అయిన కాలం ఇది. మతోన్మాద హిందూత్వ విధానాలు రాజ్య ప్రాయోజిత విధానాలుగా మారాయి. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ప్రగతిశీల భావాలకు వేదికలైన విశ్వ విద్యాలయాలు, మురికివాడలు, వీధులపై వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రాయోజిత ముష్కర మూకల దాడులు సాధారణ వ్యవహారంగా మారాయి. ఏ రకమైన అసమ్మతినైనా నులిమి పారేయటమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది.
అప్పటి ఎమర్జెన్సీ రెండేళ్లలో ముగిసి పోయింది. కానీ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ విజయవంతంగా పదకొండో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ కంటే మోడీ అమలు చేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ మరింత కరుడుకట్టింది. దేశవ్యాప్తంగా అమలు జరుగుతోంది. కృూరమైందని చెప్పటానికి వెనకాడనవసరం లేదు.
బీజేపీ, సంఘ్‌పరివార్ అప్పటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకుంటున్నదాంట్లో వాస్తవం లేదు.
బీజేపీ పూర్వ అవతారమైన జనసంఘ్ నేతలు వాజపేయితో సహా ఇందిరాగాంధీ నుంచి క్షమాభిక్ష కోరిన సంగతుల గురించి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న దేవరస్ ఎమర్జెన్సీలో భాగంగా జైల్లో పెట్టిన తమ శ్రేణులను విడుదల చేస్తే ఎమర్జెన్సీలో ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాల అమలు కోసం తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని పదేపదే ప్రాధేయపడ్డారు. ఈ చారిత్రక ఆధారాల ముందు సంఘ్పరిచార్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడామన్న ప్రగల్భాలు వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేయటం తప్ప మరోటి కాదు.
వాజపేయి ఎందుకు, ఎలా క్షమాభిక్ష పొందారు?
ఎమర్జెన్సీ కాలంలో లక్షల సంఖ్య లో వామపక్షాలు, సోషలిస్టులు, నక్సలైట్లు జైళ్ళ పాలయ్యారు. వేలాది మంది రాజ్యపు దమనకాండకు బలయ్యారు. కానీ ఇలా దీర్ఘ కాలం జైళ్ళ పాలైన సంఘ్ పరివార్ నేతలు లేదా రాజ్యపు దమన కాండకు బలైన ఆర్ఎస్ఎస్ నేతలు జనసంఘ్ నేతలు ఎవ్వరూ లేరు.
ఉదాహరణకు వాజపేయి ఉదంతాన్ని పరిశీలిద్దాం. ఎమర్జెన్సీ కాలంలో వాజపేయి భారతీయ జనసంఘ్ నేత. బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్న ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట నేత. కేవలం కొన్ని రోజులు మాత్రమే జైల్లో అన్నారు. తర్వాత పేరోల్ మీద విడుదలై ఎమర్జెన్సీ అమల్లో ఉన్న 20 నెలల పాటు బయటే ఉన్నారు.
ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి వెలుగులోకి తెచ్చారు. ది హిందూ పత్రికలో 2000 జూన్ 25న రాసిన ఎమర్జెన్సీ నుంచి నేర్చుకొని గుణపాఠాలు అన్న వ్యాసంలో పలువురు సంఘ్‌పరివార్ నేతలు స్వయంగా కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు ఇందిరా గాంధీతో తెరవెనక మంతనాలు జరిపిన విషయాన్ని ఆ మంతనాల వివరాలను సుబ్రమణ్యం స్వామి ఈ వ్యాసంలో ప్రస్తావించారు.
జైలులో ఉన్న కొన్ని రోజుల్లోనే వాజపేయి ఇందిరాగాంధీతో అవగాహన కుదుర్చుకున్నారని రాశారు. తనకు పెరోల్ ఇచ్చి విడుదల చేస్తే తాను ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనబోనని రాసి మరీ ఇచ్చారని సుబ్రమణ్య స్వామి ఈ వ్యాసంలో ప్రస్తావించారు. విడుదలైన నాటి నుంచి వాజపేయి ప్రభుత్వం చెప్పిన పనులన్నీ నోరు మెదపకుండా చేసుకుంటూ వెళ్లారని స్వామి రాశారు.
ఆర్ఎస్ఎస్ లొంగిపోయిన తీరు..
1976 చివర్లో ఎమర్జెన్సీని సమర్ధిస్తూ ఓ ప్రకటనపై సంతకాలు చేయాలని ఆర్ఎస్ఎస్ నేతలు నిర్ణయించిన విషయాన్ని కూడా అదే వ్యాసంలో స్వామి ప్రస్తావించారు.
ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధిస్థానం ఎమర్జెన్సీని వ్యతిరేకించకుండా కార్యకలాపాలు చేపట్టే బాధ్యతను మాధవరావు మూలేకి అప్పగించగా ప్రభుత్వంతో రాయబారాలు నడిపే పనిని ఎక్నాథ్ రణడేకి అప్పగించింది.
అదే సమయంలో అమెరికాతో సహా ఇతర దేశాల నుంచి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు సమీకరించే పనిని మాత్రం సుబ్రమణ్యం స్వామికి అప్పగించారు.
1976 నవంబర్ నాటికి అంతర్జాతీయ మద్దతు సమీకరించి పనులు నిలిపివేయాలని మూలే సుబ్రమణ్యం స్వామికి హితవు చెప్పారు. ఎందుకంటే 1977 జనవరి నాటికి ప్రభుత్వంతో ఆర్ఎస్ఎస్ ఒక ఒప్పందానికి వచ్చి, ఎమర్జెన్సీని సమర్ధించే ఒప్పందం మీద సంతకాలు చేయటానికి అంగీకరించేందుకు ఇకపై ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు సమీకరించాల్సిన అవసరం లేదన్నది మూలే అవగాహన.
అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న టీవీ రాజేశ్వర్ రాసిన “భారతదేశం- కీలక సంవత్సరాలు” అన్న పుస్తకంలో ఎమర్జెన్సీ కాలంలో ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి ఎలా లొంగి పోయిందో సవివరంగా రాశారు. అప్పట్లో ఇందిరా గాంధీ జారీ చేసిన 10 సూత్రాల కార్యక్రమాన్ని తయారు చేసిన హెచ్ వై శారద ప్రసాద్ కొడుకు విశ్వేశ్వర ప్రసాద్ ది ప్రింట్లో రాసిన మరో వ్యాసంలో కూడా ఈ విషయాలు వివరించారు.
సర్ సంఘ్ చాలక్ క్షమాపణ లేఖలు..
వీటన్నిటికంటే ముఖ్యమైనవి ఎరవాడ జైలు నుంచి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ దేవరస్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి క్షమాభిక్ష కోరుతూ రాసిన లేఖలు. ఇందిరా గాంధీని ఒప్పించాలని కోరుతూ వినోభా భావేకు కూడా దెవరస్ లేఖలు రాశారు.
ఈ లేఖలు చదివితే ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం చేతిలో పావుగా మారటానికి సిద్దపడి క్షమాభిక్షలు అడిగిన సంఘ్ పరివార్ నేతలు, తర్వాతి కాలంలో తామే ఎమర్జెన్సీని రద్దు చేయించేందుకు ఉద్యమం నడిపామని, త్యాగాలు చేశామని చెప్పుకోవడం వారి కుటిల బేషజాన్ని అరమరికలు లేకుండా ఎత్తి చూపుతుంది.
హిందూ సంఘటన అధికార రాజకీయాలు పేరుతో స్వయంగా డెవరస్ హిందీలో రాసిన పుస్తకానికి ఈ ఖాళీ అనుబంధంగా చేర్చారు. ఈ పుస్తకాన్ని సామాజిక మేధావి పరిశోధకులు యోగేంద్ర యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పాఠకులకు అందుబాటులో ఉంచారు.
దేవేరస్ రాసిన పుస్తకాన్ని “పంచముఖ రాక్షసి- జనతా పార్టీ ఆవిర్భావం గురించిన వాస్తవిక కథనం” అన్నపేరుతో ఇంగ్లీషులో కూడా ప్రచురించారు. ఈ లేఖలను అప్పట్లో భారతీయ లోక్‌దళ్ నాయకుడు బ్రహ్మ దత్ ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. ఈ లేఖలు ప్రతినవ్ అనిల్, క్రిస్టోఫ్ జాఫ్రెలాట్లు సంయుక్తంగా రాసిన భారత దేశపు తొలి నియంతృత్వం అన్న పరిశోధనా గ్రంథంలో కూడా జోడించారు. భారతదేశంలో క్షేత్ర స్థాయి ఉద్యమాలు, సామాజిక రాజకీయ రంగాలపై వాటి ప్రభావాల గురించి క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ అనేక పరిశోధనాత్మక గ్రంధాలు వెలువరించారు.
క్షమాభిక్ష మొదటి లేఖ..
1975 జూన్ 25న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. తర్వాత ఆగస్టు 15న జాతిన్నుద్దేశించి చేసిన ప్రకటనలో ఇతర నియంతలు అందరూ దేశం కోసం నియంత్రుత్వాన్ని అమలు చేయాల్సి వచ్చినట్లే, తాను కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశ భద్రత కోరి ఎమర్జెన్సీ విధించామని, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారంతా దేశ ద్రోహులు అని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులంతా ఆమె ప్రకటనను, నియంతృత్వాన్నీ ఖండించారు.
కానీ ఆగస్టు 22న దేవరస్ రాసిన తొలి లేఖలో ఆగస్టు 15నాడు ఇందిరా గాంధీ చేసిన ఉపన్యాసాన్ని ప్రశంసించారు.
ఇంకా రెండడుగులు ముందుకు వేసి ఇందిరా గాంధీ ఆగస్టు 15న చేసిన ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉందని, సమతూకంతో కూడా ఉన్నదని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ పట్ల ఆమెకున్న పొరపాటు అభిప్రాయాలు దూరం చేయటానికి ఈ లేఖ రాస్తున్నానని కూడా తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ హిందువుల కోసం ప్రత్యేక సంఘాన్ని లేదా సంస్థను నిర్మించటానికి ప్రయత్నం చేస్తున్న మాట నిజమేనని అయితే ఈ సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాదనీ లేఖలో వివరించారు.
తొలి లేఖ చివర్లో “ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి. ఒక వేళ మీరు సమంజసమని భావిస్తే మిమ్ములను ప్రత్యక్షంగా కలుసుకోవడం నా భాగ్యంగా భావిస్తాను” అని కూడా రాశారు.
ఈ విధంగా మొదటి లేఖలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించటాన్ని అంగీకరించడం మాత్రమేకాక చివర్లో ఆర్ఎస్ఎస్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రాధేయపడ్డారే తప్ప ఎమర్జెన్సీని ఎత్తివేయాలని మాట మాత్రంగానైన కోరలేదు.
రెండో లేఖ..
దేవరస్ రాసిన మొదటి లేఖను గాంధీ కనీసం గురించైనా గుర్తించలేదు. ఈలోగా మీడియాను వంగివంగి దండాలు పెట్టాలని ఆదేశిస్తే మనవాళ్ళు సాష్టాంగ దండ ప్రణామానికి సిద్ధపడ్డారు. సుప్రీం కోర్టు ఆమె ఇష్టానుసారం వ్యవహరించడానికి సిద్ధపడింది.
గాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన సుప్రీం కోర్టు ఈ విధంగా అధికార పీఠాల అడుగులకు మడుగులొత్తే వైఖరిని ఖండిస్తూ ప్రజాస్వామికవాదులు ఆయా పరిణామాలన్నీ శాసనబద్దమైన ప్రజాతంత్ర పరిపాలన స్థానంలో ఏకవ్యక్తి ఇష్టానుసారం పాలన సాగించే వైఖరికి నిదర్శనమని, నియంతృత్వానికి ఇది తక్కువేమీ కాదని ఖండించారు.
దేశమంతా ఏలిక చర్యలను ఖండిస్తూ ఉంటే మన గౌరవ సంఘ్‌పరివార్ నేతలు ఏం చేస్తున్నారు ?
దేవరస్ 1975 నవంబర్ 10న రాసిన రెండో లేఖలో “ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మీ ఎన్నిక సరైనదేనని తీర్పు ఇచ్చినందుకు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని రాశారు.
ఆ లేఖ చివరి వరకూ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి గానీ ఎమర్జెన్సీకి గానీ వ్యతిరేకం కాదని నమ్మించెదుకే దేవరస్ శాయశక్తులా ప్రయత్నం చేశారు. లేఖ చివర్లో “లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది” అని ఆశ జూపారు.
అంటే, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు అమలు చేయటానికి వీలుగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నదని బహిరంగంగా చెప్పటం తప్ప మరోటి కాదు.
మూడో లేఖ..
ఈ రెండో లేఖను కూడా ఇందిరా గాంధీ పట్టించుకోలేదు. 1976 ఫిబ్రవరి చివర్లో ఆమె వినోబా భావే ఆశ్రమాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో భావెకి దేవరస్ మూడో లేఖ రాశారు. వినోబా భావే ఆర్ఎస్ఎస్కు మంచి మిత్రుడు. ఇందిరాగాంధీ మీద ఎంతో కొంత ప్రభావం చూపగల వ్యక్తి. ఈ లేఖలో ఆర్ఎస్ఎస్ తరఫున ఇందిరా గాంధీకి ఓ మాట చెప్పి ఒప్పించాలని వేడుకున్నారు. ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తివేసేలా జోక్యం చేసుకోవాలని వినోబాను కోరారు.
నిషేధం ఎత్తివేస్తే “సంఘ్ సేవకులందరూ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం రూపొందించి అమలు చేసే అన్ని కార్యక్రమాల్లోనూ ఇందిరాగాంధీ నాయకత్వంలో చురుకుగా పాల్గొంటారు” అని కూడా వినోబాకు దేవరస్ హామీ ఇచ్చారు.
ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ నగ్న స్వరూపం ఇది. ఓ వైపున గాంధీ ఓ పథకం ప్రకారం పౌరహక్కుల రాజ్యాంగ హక్కులు ధ్వంసం చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే రెండో వైపు ఆర్ఎస్ఎస్, జనసంఘ్ కార్యకర్తలు అందరూ జైలు నుంచి విడుదల కోరుతూ దానికి బదులుగా జీవితాంతం ఇందిరాగాంధీకి ఊడిగం చేయటానికి సిద్ద పడ్డారు. ఇందిరా గాంధీ అమలు చేస్తున్న అణచివేతలో పాలు పంచుకునేందుకు ఉవ్విళ్లురారు.
ఈ ధోరణి పరాకాష్టగా ఉత్తరప్రదేశ్ జనసంఘ్ శాఖ ఎమర్జెన్సీ ప్రథమ వార్షికోత్సవం నాడు 1976 జూన్ 25న ఇందిరాగాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఎక్కడా పాల్గొనమని కూడా శపథం చేసింది. తదనుగుణంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కనీసం 34 మంది రాష్ట్రస్థాయి జనసంఘ్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ అధినేత దేవరస్ కోరిక మేరకు ఆర్ఎస్ఎస్కు ఇందిరాగాంధీకి సయోధ్య కుదిరింది. 1977 జనవరి చివర్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌కు ఊడిగం చేయటానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి రెండు పక్షాలు సిద్ధమయ్యాయి. అయితే, అప్పటికే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేయటంతో ఆర్ఎస్ఎస్ ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయాల్సిన అవసరం రాలేదు.
అంతేకాదు ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఐదు సూత్రాల కార్యక్రమాన్ని ఎంతగానో కొనియాడింది. దీనికి సంబంధించి కూడా తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి. సంజయ్ గాంధీ బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం, తూకారాం గేట్ వద్ద సాగించిన సరమేధాలను ఆర్ఎస్ఎస్ పూర్తిగా వెనకేసుకు వచ్చింది.
ఈ వివరాలు అన్నీ పరిశీలించినప్పుడు బీజేపీకి గానీ ఆర్ఎస్ఎస్కు గానీ ఎమర్జెన్సీను వ్యతిరేకించిన ప్రజాస్వామిక వాదులని చెప్పుకునేందుకు కనీస నైతిక అర్హత కూడా లేదు. ఇందిరాగాంధీ నిరంకుశత్వం ముందు గడ్డిపోచలా వంగిపోయారు. ఆ నిరంకుశత్వాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చివరకు తాము కూడా కార్యరంగంలోకి దిగుతామని ఇందిరాగాంధీకి హామీ ఇచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజాస్వామిక వాదులందరి మీద ప్రభుత్వం చేసే దాడిలో భాగం పంచుకోవాలని ఆశపడ్డారు.
కనీసం దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి తదనంతర పరిణామాలకు కాంగ్రెస్ ఇష్టం ఉన్నా లేకున్నా దేశానికి క్షమాపణలు చెప్పింది.
కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి వెన్ను పోటు పొడిచినందుకు కనీసం క్షమాపణ కూడా కోరలేదు. పైగా సిగ్గులేకుండా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట వారసత్వం మాదే అని చెప్పుకునీ తిరిగుతున్నారు. ఈ మోసపూరిత వ్యవహారాన్ని కప్పి పెట్టేందుకు నేడు కూడా మీడియా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యానికి వంగివంగి మరీ సలాములు చేస్తోంది.
ఈ మోసాన్ని బట్టబయలు చేయటానికి ఈ చారిత్రక సత్యాలను సాధ్యమైనంత ఎక్కువ మందికి చేర్చాలి. అదికూడా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట వారసత్వం మాటున దేశంలో అద్దులేని రీతిలో నిరంకుశత్వం అమలు చేస్తున్న తరుణంలో బీజేపీ- ఆర్ఎస్ఎస్ మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
శివసుందర్ కర్నాటక కేంద్రంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, పత్రికా రచయిత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.