
గత ప్రభుత్వము తీసుకువచ్చిన ధరణి రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఎంత మేరకు నష్టం చేసింది అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు, భూ లావాదేవీల వ్యాపారస్తులకు ఏమేరకు లాభం చేసిందనే సమగ్రమైన వివరాలతో సామాజిక స్పృహ కలిగిన రచయిత, రిటైర్డ్ తహసిల్దార్ వీ బాలరాజు రాసిన పుస్తకమే ‘ధరణి రైతుల గోస’. తెలంగాణ రాష్ట్రంలోని భూమి సమస్యలపై రచయిత 30కి పైగా వ్యాసాలను రాసి ప్రజలను, మేధావులను, కౌలు రైతులను, వ్యవసాయదారులను చైతన్యం దిశగా నడిపించారు. ఈ వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం.
నిజానికి మన దేశంలో సుమారుగా 60 శాతం పై చిలుకు వ్యవసాయరంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ అందరికీ తిండి పెట్టే, ఎంతోమందికి ఉపాధి కలిగించే ఈ రంగాన్ని ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన కులాలైన ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల చేతుల్లోని భూములను పెద్దలు చట్టాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని ఏ విధంగా తన్నుక పోతున్నారో ఈ పుస్తకంలో బాలరాజు సూటిగా, చక్కగా వివరించారు.
ఈ పుస్తక రచయిత మొదటి నుంచి సామాజిక స్పృహతో పౌరహక్కుల సంఘంలో, మానవ హక్కుల వేదిక లాంటి సంఘాలతో కలిసి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముందున్నారు. అలాగే ప్రజా పోరాటల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవడం ఎలాగో ఆయా సమూహాలకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు.
నిజానికి వ్యవసాయ భూముల మీద కొన్ని లిటిగేషన్ లు, కేసులు, సమస్యలు ఉన్నమాట వాస్తవమే. అయితే వీటి పేరు చెప్పి గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వరంగా మారింది అదే సమయంలో అది పేద రైతులకు శాపంగా మారింది. దానికి కారణం భూ సమస్యలన్నింటికీ పరిష్కారంగా తీసుకొచ్చిన ధరణిలోని లోపాలే అనే వాస్తవాన్ని సాక్షాలతో సహా ఈ పుస్తకంలో మన ముందు ఉంచారు పుస్తక రచయిత.
ఒకప్పుడు గ్రామాల్లో భూముల వివరాలు స్పష్టంగా పహాణీల్లో ఉండేవి, అయితే గత కొద్ది సంవత్సరాలుగా భూముల వివరాలు పహాణీల్లో రాయటం లేదు. దానివలన ఎవరెవరి భూములు ఏఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో ఉన్నవి, అలాగే బంజరు భూములు, అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు ఇలా రకరకాల భూముల వివరాలు ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయాయి. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే కొత్త పద్ధతులను అవలంబించవచ్చు. కానీ అవి చిన్న, సన్నకారు రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఇబ్బందికరంగా మారితే భవిష్యత్తులో మనకు తిండి పెట్టే వ్యవసాయ రంగం ప్రమాదంలో పడిపోతుంది. ఈ సమస్య మీదనే రచయిత ఈ పుస్తకంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు.
భూముల లెక్కలను రికార్డు చేసే ముందు భూములను ఇంచు మందం కూడా వదలకుండా కొలవాలి. సమస్యాత్మక భూముల వ్యవహారాలను పరిష్కరించాలి. ముందు ముందు రైతులకు ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకు సమస్యలు ఎదురైతే గ్రామ లేదా మండల స్థాయిలోనే పరిష్కరించుకునే మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలి. అలా కాకుండా గతంలో వికేంద్రీకరణగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను కేంద్రీకరించి జిల్లా స్థాయి లేదా రాష్ట్రస్థాయి అధికారులకు సమస్యలు పరిష్కరించే అధికారం దకలు పరిస్తే రైతులకు అది ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే వారు జిల్లా కేంద్రానికి లేదా రాష్ట్ర రాజధానికి రావాలంటే వ్యవసాయ పనులు వదులుకోవాలి, డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఈ పరిస్థితి వారి ఉత్పాదకతను, వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఈ విషయాలను రచయిత తన అనుభవంలోంచి చెప్పారు.
ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును ఆ వ్యక్తికి చెందిన కులానికో లేక మతానికో అంటగట్టడం అప్రజాస్వామికం. అలాగే ఒక వ్యవస్థలో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేస్తే ఆ తప్పును ఆ ఉద్యోగ వ్యవస్థకు మొత్తం గంపగుత్తగా అంటగట్టడం సంస్కారం అనిపించుకోదు. నిజానికి వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పుకు కారణమైన ఉద్యోగులను శిక్షించడమో లేదా మరోసారి ఆ తప్పు వారు చేయకుండా వారిలో పరివర్తన కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి .
నిజానికి సంస్కరణ అనేది ఒక ఉద్యమం ద్వారానో లేదా ఒక నాయకుని ద్వారానో మాత్రమే సాధ్యం కాదు. అది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతుందంటే ఆఖరి వ్యక్తి సంస్కరింపబడేంత వరకూ కొనసాగుతుంది. కానీ ఈ విషయాలను మరచి మేమే ఈ సమాజాన్ని సంస్కరిస్తున్నామని, మేమే ఉద్ధరిస్తున్నామని పాలకులు అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. ఆ భావనతోనే గతంలో అధికారంలో ఉన్నవారు వారికి చెందిన పత్రికలో ‘ధర్మగంట’ పేరుతో రకరకాల కథనాలు ప్రచురించారు. నిజానికి ఆ పత్రికలోని కథనాలు రోజూ చదువుతుంటే వీఆర్వోలు ఎదురుపడితే వాళ్ళ మీద పడి దాడి చేసే అంతగా ఆ ప్రజల మెదళ్ళలోకి విషాన్ని ఎక్కించారు.
ఈ పుస్తకంలో రచయిత రెవెన్యూ శాఖలోని తప్పులను కూడా ఎత్తిచూపారు. ఉద్యోగులు విషయ పరిజ్ఞానం పెంచుకోవడం, వారి వద్దకు వచ్చిన ప్రజలకు పనిచేసి పెట్టడం, చిత్తశుద్ధితో ఉద్యోగ విధులు నిర్వహించడం ముఖ్యమనే అంశాన్ని కూడా ఈ పుస్తకంలో వివరించారు. సిబ్బంది అవగాహనా రాహిత్యం వల్ల కూడా భూసంస్కరణ చట్టం ప్రాముఖ్యాన్ని కోలిపోయింది. నిజంగా భూసంస్కరణ చట్టం పైన సిబ్బంది అవగాహన పెంచుకుంటే మిగులు భూములు భూమిలేని బలహీన వర్గాలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశం పైన ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
ధరణిలో భూమి విస్తీర్ణం, భూమి స్వభావం వివరాలు రాసే ఆప్షన్ లేకపోవడం వల్ల సుమారుగా 8 లక్షల దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 10,434 గ్రామాల్లో ఉన్న ఏ ఒక్క భూమి లెక్కలు కూడా సరిగా లేవట. అందులో ఉన్న లెక్కల్లో 60 శాతం తప్పుగా నమోదై ఉన్నాయట. ముఖ్యంగా ప్రభుత్వ భూమి లెక్కలు కూడా దొరకడం లేదట. వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి తహసిల్దార్ల అధికారాలు తీసేసిన తరువాత ఇప్పుడు పట్టాలో పేరు తప్పులున్నా, భూమి సరిహద్దుల వివాదాలు ఉన్నా , మరే ఇతర సమస్యలు ఎదురైనా ఏకంగా కలెక్టర్ కు మాత్రమే ఫిర్యాదు చేసుకోవాలి. కానీ సామాన్యులకు ఇది సాధ్యమయ్యే పనికాదు కనుక తహసీల్దారులకు తిరిగి అధికారాలు అప్పగిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని రచయిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఆక్రమణదారు కాలం లేకపోవడం వలన మిగులు భూములను, అసైన్డ్ భూములను చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని ఆధిపత్య వర్గాలు తిరిగి సొంతం చేసుకుంటున్నారు. కనుక ఆక్రమణదారు కాలం ఉండాల్సిందేనని రచయిత తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. జమాబంది చేస్తే ఈ జగడాలు ఉండవు కనుక సిబ్బందికి జమాబంది బాధ్యత అప్పగించి ఆ ప్రక్రియ ఒక సంవత్సరంలో పూర్తిచేసేట్టుగా మార్గదర్శకాలను ప్రభుత్వం తయారు చేయాలని దాని వల్ల భూముల లెక్క తేలటమే కాకుండా ప్రభుత్వ భూమి కూడా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని అలాగే రైతుల భూమి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని రచయిత అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భూమికి పన్ను మాఫీ అయ్యింది అనే ఆనందం రైతులు ఎవరికీ లేదు. పైగా భూమికి దూరమవుతున్న దిగులతో ప్రతిరైతు పన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక భూమిశిస్తు వసూలు చేస్తే రైతుకు ఆ భూమి మీద తనకు హక్కు ఉన్నదనే ధైర్యంతో పాటు ఆ భూమితో తనకు గల అనుబంధానికి ప్రతీకగా భావిస్తాడని రచయిత తన అనుభవాల నేపథ్యం నుండి చెప్తున్నారు.
బీహార్ రాష్ట్రంలో ‘బీహార్ ల్యాండ్ ట్రిబ్యునల్ చట్టం’ ఆ రాష్ట్ర ప్రజల సమస్యలను సులువుగా పరిష్కరిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరమని ఈ పుస్తక రచయిత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. సర్వే సెటిల్మెంట్ 1923 చట్టానికి కొన్ని సవరణలు చేసి ఆర్డినెన్స్ ద్వారా సర్వే పనులు ప్రారంభించి, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులను, రైతుల కోసం పోరాడుతున్న సామాజిక ఉద్యమకారులను అలాగే రెవెన్యూ శాఖలోని నిజాయితీగల విషయపరిజ్ఞానం ఉన్న అధికారులతో ఒక కమిటీ వేసి ‘తెలంగాణ ల్యాండ్ ట్రిబ్యునల్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని రచయిత ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తానంటున్న ‘భూ భారతి’ లో కౌలు రైతులకు భరోసా, భద్రతను ఇస్తూనే వారి హక్కులను కాపాడే విధంగా ఈ పోర్టల్ ను సంస్కరించాలని రచయిత డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెచ్చుకున్న కౌలుదారీ చట్టం, నక్సలైట్ ఉద్యమం మూలంగా సాధించుకున్న 1/70 చట్టాలు రైతుల జీవితాల్లో సంతోషాలను పంపించాల్సింది పోయి సంక్షోభంలోకి నెట్టి వేశాయి. గత యాభై ఏళ్లుగా పాలకులు రెవెన్యూ చట్టాలను నిర్వీర్యం చేయడంతోపాటు వారి అవినీతి కూడా తోడవడంతో ఈ పరిస్థితి దాపురించింది అంటూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టారు. ఇంకా ఈ పుస్తకంలో
భూ సేకరణ చట్టం, 111జీవో, హైడ్రా లపై కూడా వ్యాసాలు ఉన్నాయి. పాఠకులకు ఆయా అంశాలపై అవగాహన కోసం రచయిత ఈ వ్యాసాలు అందించారు.
– ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
(ప్రతులకు: వీ బాలరాజు , ఇం.నెం. 1-5-10, ప్రశాంత్ నగర్, ఓల్డ్ అల్వాల్ , సికింద్రాబాద్ – 500 010. ఫోన్ నెంబర్ : 9440939160.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.