
Dr. Kolahalam Ram Kishore, 9849328496
భారత ఉపరాష్ట్రపతి- రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ 2025 జూలై 21న తన పదవికి రాజీనామా చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టంగా తన రాజీనామా లేఖలో ప్రకటించారు. అయినప్పటికీ ఈ ఆకస్మిక నిర్ణయం దేశ, విదేశీ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకులు, విపక్ష నాయకులు, సామాజిక మాధ్యమాలలో ఈ రాజీనామా వెనుక బీజేపీ అగ్రనేతల రాజకీయ ఒత్తిళ్లు లేదా పార్టీ అంతర్గత విభేదాలు కారణమయి ఉండవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్ఝును జిల్లాలోని కితానా గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ ధన్‌ఖడ్ జన్మించారు. చిత్తోడ్ఘడ్లోని సైనిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్ఎల్బీ) పట్టా పొందారు.
వృత్తిరీత్యా న్యాయవాదిగా, ధన్‌ఖడ్ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 1979లో సేవలందించారు. 1990లో సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. ఆయన సుప్రీంకోర్ట్లోనూ కొంతకాలం పనిచేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో సభ్యుడిగా వ్యవహరించారు. ధన్‌ఖడ్ రాసిన పుస్తకాల గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ ఆయన న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు ఆయన మేధో సంపత్తిని ప్రతిబింబిస్తాయి.
రాజకీయ జీవితం..
విభిన్న రాజకీయ పార్టీల అనుబంధంతో ధన్‌ఖడ్ రాజకీయ జీవితం సాగింది. 1989- 1991 మధ్య ఝున్ఝును నియోజకవర్గంలో జనతాదళ్ తరఫున 9వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1993- 1998 మధ్య రాజస్తాన్ శాసనసభలో కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. 2019- 2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆయన సేవలు అందించారు. అయితే, ఈ కాలంలో మమతా బెనర్జీ సర్కారుతో తలెత్తిన తీవ్ర విభేదాలు ఆయనను వివాదంలో నిలిపాయి. 2022 జులై 16న బీజేపీ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఆగస్టు 11న ఆయన 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
రాజీనామాపై వివాదం..
దేశ రాజకీయాల్లో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా కలకలం రేపింది. ఆయన తన రాజీనామా లేఖలో అనారోగ్య కారణాలను పేర్కొన్నప్పటికీ, ఈ నిర్ణయం ఆకస్మికంగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దేశీయ మీడియాలో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ “ఈ రాజీనామాకు లోతైన కారణాలు ఉండవచ్చు” అని సందేహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమంపై ధన్‌ఖడ్ నిర్భయంగా మాట్లాడిన నేపథ్యాన్ని గుర్తు చేశారు. శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్, “అనారోగ్య కారణాలనంటే నమ్మేందుకు సిద్ధంగా లేము. ఆయన పార్లమెంటులో చురుకుగా పాల్గొన్నారు” అని అన్నారు.
ప్రియాంక చతుర్వేది “ధన్‌ఖడ్ అకస్మిక రాజీనామా నేపథ్యంలో దేశ ప్రజల మనసులో విభిన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయం మీద విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ రవి కిషన్ విమర్శించారు. విదేశీ మీడియా ఈ రాజీనామాపై స్పష్టమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. కానీ, భారత రాజకీయాలలో అనిశ్చితి పెరిగిందని కొన్ని నివేదికలు సూచించాయి.
రాజకీయ విశ్లేషకులు ఈ రాజీనామా వెనుక బీజేపీ అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు లేదా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య జరిగిన ఇటీవలి సమావేశాలతో సంబంధం ఉండచ్చని ఊహిస్తున్నారు. ఈ సమావేశాలలో కీలక బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ లేకపోవడం కూడా ఓ సందేహాస్పద చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహాగానాలు ధన్‌ఖడ్ రాజీనామాను రాజకీయ వ్యూహంతో ముడిపెడుతున్నాయి. అయితే ఈ విషయంలో స్పష్టత లేని కారణంగా చర్చ అంతటా కొనసాగుతోంది.
ధన్‌ఖడ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ధన్‌ఖడ్ రాజకీయ జీవితంలో సూటిగా, నిర్మొహమాటంగా, వ్యంగ్యంగా, పరుషంగా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో మమతా బెనర్జీ సర్కారుతో చీటికీ మాటిమాటికీ విభేదాలు పెట్టుకొనేవారు.
ముఖ్యమంత్రి నిర్ణయాలలో అనవసర జోక్యం చేసుకొనేవారు. గవర్నర్‌గా హుందాగా రాజ్యాంగ విధులకు పరిమితం కాకుండా, యాక్టీవ్ పొలిటీషియన్‌గా, ఫక్తు కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా పనిచేశారని అనేక విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మీడియాలో అనేక వార్తకథనాలు కూడా వచ్చాయి.
“కేంద్రం ప్రభుత్వం కావాలనే మమతా బెనర్జీని కట్టడి చేయడానికి రాజకీయం చేస్తోంది”అనే విపక్షాల విమర్శలకు ఆయన చర్యలు దారితీశాయి. రాజ్యసభ ఛైర్మన్‌గా, ఆయన వ్యవహారశైలిపై కూడా విపక్షాలు అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా, బీజేపీకి బాహాటంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ పక్షపాతి అని విపక్షాలు ఆరోపించాయి.
జయాబచ్చన్‌తో జరిగిన వివాదం మీడియాలో రచ్చకెక్కింది. మహిళలపట్ల వ్యంగ్య వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 2025 జులై 20న ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ట్రైనీల సమావేశంలో, “భారత్ ఏం చేయాలో ఏ శక్తి నిర్ణయించదు” అని ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు, భారత్-పాక్ కాల్పుల విరమణ వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వంపై సూచనగా చర్చించబడ్డాయి.
అలాగే, రాష్ట్రపతిని న్యాయస్థానాలు ఆదేశించలేవని, న్యాయమూర్తులకు అవినీతి ఆరోపణల నుంచి రక్షణపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఆయన రాజ్యసభ చైర్మన్‌గా పక్షపాత వైఖరిపై అవిశ్వాస తీర్మానం వరకూ వెళ్లింది.
ధన్‌ఖడ్ వ్యక్తిత్వవిశ్లేషణ..
ధన్‌ఖడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నంత కాలం బీజేపీ రాజకీయ ఎజెండానే భుజాన మోశారు. అందువల్లనే విపక్షాల నుంచి “అధికారిక పార్టీ విధేయుడు” అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన రైతు కుటుంబంలో జన్మించి, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థాయికి ఎదగడం ఆయన కఠిన శ్రమ, సమర్థతను తెలియజేస్తుంది. ఆరోగ్య సమస్యల కారణంగా(2025 మార్చిలో గుండె సంబంధిత చికిత్స) ఆయన రాజీనామా చేసినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణాలను అన్వేషిస్తున్నారు.
చివరిగా, ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం భారత రాజకీయాలలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఆయన న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఉపరాష్ట్రపతిగా చేసిన సేవలు గుర్తుండిపోతాయి. ఈ రాజీనామా వెనుక అనారోగ్య కారణాలు లేదా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా, దీని ప్రభావం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కొనసాగుతుంది. రాజ్యాంగం ప్రకారం, 60 రోజుల్లో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇది ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు దారితీసే అవకాశం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.