
తాజాగా ముగిసిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయాన్ని సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలపడిరది. వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఫలితాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. పలు కోణాల్లో విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన విశ్లేషణల్లో ఓ ముఖ్యమైన కోణాన్ని పరిశీలించలేదనిపిస్తోంది.
ఈ కొత్త కోణంలో చూసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకలోనే నేటి ఫలితాలు ఒదిగి ఉన్నాయనిపిస్తోంది. ఈ వ్యాఖ్యను అర్థం చేసుకోవడానికి సమీప రాజకీయ చరిత్రను తడమాల్సి ఉంటుంది.
హిందూ మహాసభ – ఆరెస్సెస్
హిందువుల ప్రయోజనాలు కాపాడే దిశగా బ్రిటిష్ పాలకులపై ఒత్తిడి చేసే లక్ష్యంతో పండిట్ మదన్మోహన్ మాలవీయ 1915లో హిందూ మహాసభను ప్రారంభించారు.(బహుశా అందుకేనేమో మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారానికి వచ్చిన తర్వాత మాలవీయకు భారత రత్న పురస్కారం ప్రకటించింది) పేరుకే ప్రత్యేక సంస్థగా ఉన్నా అది కూడా కాంగ్రెస్‌లో అంతర్భాగంగానే కొనసాగింది.
కాలక్రమంలో హిందూమహాసభ పనితీరు పట్ల అసంతృప్తి చెందిన కొందరు నాయకులు కెబి హెగ్డేవార్ నాయకత్వంలో హిందూమహాసభ నుండి చీలిపోయి ‘‘హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం హిందు విలువలతో కూడిన సైన్యానికి శిక్షణ ఇచ్చే, హిందూత్వ సిద్ధాంతాన్ని బలోపేతం చేసే’’ లక్ష్యంతో కొత్త సంస్థ నెలకొల్పారు. భారతీయ సంస్కృతిని, నాగరికతా విలువలను పరిరక్షించటం కూడా ఈ సంస్థ లక్ష్యాలుగా ఉన్నాయి.
వినాయక దామోదర సావర్కార్ 1923లో నాగపూర్‌లో హిందూత్వ అన్న కరపత్రాన్ని ప్రచురించారు. ఆ కరపత్రం చదివి, 1925లో రత్నగిరిలో ఆయన్ను కలిసిన తర్వాత హెగ్దేవార్ బాగా ప్రభావితులయ్యారు. ఈ బృందమే 1925 సెప్టెంబరు 7న రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ ను ప్రారంభించింది.
అనేక సంఘాల్లో, ప్రాంతాల్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కృషినే ఇప్పుడు సామాజిక సాంసృతిక రంగాల్లో కృషి అని సామాజిక పరిశోధకులు అంటున్నారు.శాఖల రూపంలో ఆరెస్సెస్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విస్తరించింది. నిరంతరం తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకుంటూ పోయిన ఆరెస్సెస్ తన కార్యకలాపాలు మరింత వేగంగా శక్తివంతంగా విస్తరించటానికి తమకు కూడా ఓ రాజకీయ విభాగం అవసరం అని భావించింది. ఆ మేరకు 1951 అక్టోబరు 21న భారతీయ జనసంఘ్ పేరుతో ఓ రాజకీయ పార్టీ తెరమీదకు వచ్చింది. శ్యాం ప్రసాద్ ముఖర్జీ, బలరాజ్ మథోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక నేతలు.
భారతీయ జనసంఘ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. పరిమిత స్థానాల్లోనైనా గెలుస్తూ వచ్చింది. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఏర్పడిన రాజకీయ వాతావరణంలో జనసంఘ్ మరికొన్ని పార్టీలతో కలిసి జనతా పార్టీగా అవతారమెత్తిన పార్టీ లో 1977 ఎన్నికల్లో విలీనం అయ్యింది. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ అనూహ్య విజయం సాధించింది. మూడేళ్లు అధికారం చలాయించిన తర్వాత 1980లో జనతా పార్టీ రద్దయ్యింది.
తెరమరుగైన జనసంఘ్ – తెర ముందుకొచ్చిన బిజెపి
అప్పటికి ఆరెస్సెస్ నాయకత్వం జనసంఘ్ తన రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లలేకపోతోంది అన్న అంచనాకు వచ్చింది. నూతన రాజకీయ పార్టీ అవసరమని భావించింది. ఆ విధంగా జనసంఘ్ ను చరిత్రపుటలకు పరిమితం చేసి 1980లో భారతీయ జనతా పార్టీకి పురుడు పోసింది ఆరెస్సెస్.
బిజెపి తెరమీదకు వచ్చిన తర్వాత 1984 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. కేవలం రెండే సీట్లు నెగ్గింది. బాబరీ మసీదు కూల్చివేత, రామమందిర ఉద్యమం నేపథ్యంలో బిజెపి తన పలుకుబడిని విస్తరించుకుంటూ పోయింది. తర్వాత వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 13 రోజులకంటే ఎక్కువగా బతికి బట్టకట్టలేదు. ఆ తర్వాత పార్టీ అనుసరించిన విధానాలు, చట్టసభల్లోనూ బయటా పెరిగిన దాని బలం, బలగాలు, దాని పర్యవసానాలు మనకళ్లముందున్న చరిత్రే.
ఎన్నికల్లో ఎన్ని ఢక్కాముక్కీలు తిన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హోదా, గుర్తింపును, పలుకుబడిని తగ్గించటం ఎవరికీ సాధ్యం కాలేదు. బిజెపి కూడా ఆ లక్ష్యాన్ని ఛేదించలేదని ఆరెస్సెస్ గుర్తించింది.
2010-11 ప్రాంతంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు, కొన్ని స్వఛ్చంద సంస్థలు విజిల్ బ్లోయర్ బిల్లు పార్లమెంట్ ఆమోదించాలన్న డిమాండ్‌పై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. విజిల్ బ్లోయర్ బిల్లు అంటే అవినీతికి సంబంధించిన సమాచారాలు ఇచ్చేవారికి రక్షణ కల్పించాలన్న బిల్లు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు నమూనా బిల్లు రూపొందించి ఉద్యమనాయకత్వం ఆమోదానికి పెట్టారు. ఈ చిన్న బృందమే తర్వాత అవినీతికి వ్యతిరేకంగా భారత్ (ఇండియా ఎగనెస్ట్ కరప్షన్) పేరుతో జన లోక్‌పాల్ ఉద్యమంగా తెరమీదకు వచ్చింది.
ఈ వేదిక ద్వారా కాంగ్రెస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని ఆరెస్సెస్ పసికట్టింది. ఆరెస్సెస్‌కు ఉన్న రకరకాల రంగాలు, సంఘాలు, సంస్థలను ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ ఉద్యమంలోకి దించింది. ఈ ఉద్యమం దేశవ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారటానికి కావల్సిన అన్నిరకాల వనరులను సమీకరించింది. సమకూర్చింది. క్రమంగా ఈ ఉద్యమాన్ని తన ముద్ర పడకుండానే హైజాక్ చేసింది. తర్వాత ఈ ఉద్యమమే 2012లో అక్టోబరు 2 నాడు ఆమ్ ఆద్మీ పార్టీగా అవతారమెత్తింది.స్థూలంగా ఆరెస్సెస్ శ్రేణుల మద్దతుతో తెరమీదకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తన గురి మొదటిగా బిజెపిపై ఎక్కుపెట్టింది. అప్పటికే బిజెపి దేశవ్యాప్తంగా శక్తివంతమైన రాజకీయ పార్టీగా స్థిరపడింది.
ఆరెస్సెస్ అవగాహనలతో మేళవించే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ దృక్ఫధాలు
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారానికి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు స్థూలంగా ఆయా సమస్యలపై ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్ఫధంలో ఒదిగిపోయేవిగా ఉన్నాయి. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు నోరుమెదపక పోవటం, గుళ్లు గోపురాలు తిరగటం, ఎన్నికలకు ముందు ఆశీర్వాదం కావాలంటూ ఆరెస్సెస్ అధినేతకు లేఖ రాయటం వంటివి కొన్ని ఉదాహరణలు. తర్వాత జరిగిన పరిణామాలు పున:ప్రస్తావించాల్సిన అవసరంలేదు. (దీనికి సంబంధించిన మరింత లోతైన విశ్లేషణను ఇక్కడ చదవవచ్చు)
ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందన్న నమ్మకం కలిగింది ఆరెస్సెస్‌కు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇక ఆరెస్సెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీతో పని లేదు. అందుకే ఆప్ ను నట్టేట ముంచాలని నిర్ణయించుకున్నది. ఈ నిర్ణయం కొనసాగింపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.
ఇక్కడ ప్రస్తావిస్తున్న విశ్లేషణ గత వంద సంవత్సరాల రాజకీయ చరిత్రకు సంబంధించిన ప్రత్యామ్నాయ అవగాహన. దీన్ని అందరూ ప్రామాణికంగా భావించటం అంత తేలికకాదు. అందుకే మరికొన్ని వివరాలు పాఠకుల దృష్టికి తీసుకొస్తున్నాను.
ఇది ఆమ్ ఆద్మీ పాలనపై సమీక్ష కాదు. వివిధ రంగాల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తెచ్చిన మార్పులను మదింపు వేయటం కాదు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిన లెఫ్టినెంట్ గవర్నర్లు కలిగించిన ఆటంకాలు, సృష్టించిన అవరోధాలు గురించి అంచనాలేకపోలేదు. ఈ వ్యాఖ్యానంపై సందేహాలున్న వారికి ఓ చిన్న వివరణ. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే మూడు సార్లూ ఎందుకు చతికిలబడింది? (దీనికి సంబంధించిన మరో కథనాన్ని ఇక్కడ చదవవచ్చు)
ఈ విశ్లేషణ సారాంశాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు :
- తన విస్తృత లక్ష్యాలు సాధించటానికి రాజకీయ పార్టీలు పెట్టడం ఆరెస్సెస్ వ్యూహంలో ఓ భాగం. ఇప్పటికే అలాంటి రెండు పార్టీలు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. పార్టీలు పెట్టలేని చోట ఉన్న పార్టీల వెనక తన శ్రేణులను మొహరించి ప్రధాన శతృవుని దెబ్బకొట్టడం ఎత్తుగడగా పాటిస్తూ వచ్చింది.
- తన లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లటంలో సదరు పార్టీలు ఆశించినంత స్థాయిలో పని చేయలేనప్పుడు వాటిని రద్దు చేసుకోవడానికి ఆరెస్సెస్ వెనకాడలేదు. కనీసం ఓ పార్టీని అలా రద్దు చేసుకున్న చరిత్ర మనకు తెలుసు.
- ఈ అనుభవాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ అకస్మాత్తుగా తెరమీదకు రావటం, అఖండ విజయాలు సాధించటం, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయటం వంటి పరిణామాల వెనక ఆరెస్సెస్ హస్తం లేదని నమ్మలేము.
జగదీప్ ఎస్ చొక్కర్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.