
నూతన పరిపాలనా విధానం పేరుతో ఢిల్లీని చుట్టుముట్టిన రాజకీయ తుఫాను అదే ఢిల్లీలో సద్దుమణిగింది. అంతం కాలేదు. రాజకీయాల్లో ఆరంభాలే తప్ప అంతాలు ఉండవు. ఢిల్లీలో ఇప్పుడు అధికారానికి వచ్చిన బిజెపి కూడా 1993 తర్వాత ఎన్నో పరాజయాలు చూసింది.
ఆమ్ ఆద్మీ ఓటమి పట్ల బిజెపి నాయకులు, కార్యకర్తలు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అది సహజం. బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా సంబరాలు చేసుకోకపోయినా ఆప్ ఓటమి పట్ల సంతోషంగానే ఉండి ఉంటుంది. కాంగ్రెస్, ఆప్‌లు తాము బిజెపికి ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. గతం నుండి ఆప్‌ను ఓడించాలనుకునే వారికి కూడా ఇది మొదటి విజయం.
అయితే ఢిల్లీలో బిజెపికి ఈ గెలుపు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. బిజెపికి ఉన్న సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. 2008లో కాంగ్రెస్ ఓట్ల శాతం 40కి పైగానే ఉన్నందన్న విషయం గుర్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు పది శాతం కూడా దాటడం లేదు. అదేవిధంగా బిజెపికి వెనక గట్టిగా నిలిచిన 33 శాతం మంది ఓటర్లు ఉన్నా సీట్లు దక్కలేదు.
గత ఎన్నికలు నేర్పే పాఠాలు
2015 నుండి మొన్నటి ఎన్నికల వరకూ బిజెపికి పోలైన ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఓటమి ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి వలన కలిగిన ఓటమేనా? గెలుపు ఓటముల్లో ప్రభుత్వం పాత్ర ఎటూ ఉండనే ఉంటుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన అసంతృప్తితో పాటు ఆమ్ ఆద్మీ ఓటమికి దారితీసిన ఇతర కారణాలను కూడా మనం పరిశీలించాలి. ఈ విషయాన్నే మరింత లోతుగా చర్చిద్దాం.
27 ఏళ్ల తర్వాత బిజెపి ఢిల్లీలో అధికారపీఠం దక్కించుకుంటోంది. ఆ పార్టీకి ఇది ఓ భారీ విజయమే అని చెప్పవచ్చు. 2014లో దేశమంతా మోడీగాలికి ఊగిపోయినా ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆ ఊపుతాపులకు బెదరలేదు. కేజ్రీవాల్‌ను ఎన్నుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మెరుగైన విజయాలే సాధించినా 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ ప్రజలు తిరిగి కేజీవ్రాల్నే వరించారు.
ఢిల్లీలో బిజెపిని ఆమ్ ఆద్మీ ఓడించిన స్థాయిలోనే ఆమ్ ఆద్మీని 2025లో బిజెపి ఓడించిందా అన్నది ఇంకా ప్రశ్నగా మిగిలి ఉంది.
2015 ఎన్నికల కంటే 2020 ఎన్నికలనాటికి బిజెపి కి ఏడు శాతం ఓట్లు పెరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 10 శాతం తగ్గాయి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే 2024 ఎన్నికల్లో మోడీ బలహీనపడిన తర్వాత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచింది.
2013 తర్వాత తొలిసారి ఢిల్లీలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు యుపిఎ సమయంలో కూడా కేంద్రంలో యుపిఎ అధికారంలో ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి అన్ని తరగతులకు చెందిన సీట్లలో గెలిచింది. 2013 ఎన్నికల్లో బిజెపికి 33 శాతం ఓట్లు వచ్చాయి. 2015లో ఓట్ల శాతం కాస్తంత తగ్గినా నికరంగా మూడోవంతు ఢిల్లీ ప్రజలు బిజెపి వెంట నిలిచారు. 2020 నాటికి 38 శాతం ఓట్లను బిజెపి దక్కించుకుంది.
స్వయంగా కేజ్రీవాల్ తన సీట్లో ఓడిపోయారు. అప్పట్లో ఇదే సీటు నుండి షీలాదీక్షిత్‌ను ఓడించి రికార్డు సృష్టించారు. బిజెపి తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేష్ వర్మ కేజ్రీవాల్‌ను ఓడించారు. ఈ సీట్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 4500 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ వల్లనే కేజ్రీవాల్ ఓడిపోయాడని చెప్పటం సరైందికాదు.
మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ వంటి వారు కూడా ఓడిపోయారు. వీళ్లని ఓడించడానికి బిజెపి అనేక సార్లు ప్రయత్నించి విఫలమైన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ సారి ఎట్టకేలకు విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆతిషి గెలిచింది కానీ ఇప్పుడు ఆ గెలుపుకు విలువలేదు.
ఈ ఓటమిని ఆమ్ ఆద్మీ ముందుగానే ఊహించింది. జైలు నుండి విడుదలకాగానే పార్టీ ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగారు. ఎంత చేసినా చివరకు సొంత సీట్లోనే ఓడియారు కేజ్రీవాల్. పార్టీని గెలిపించుకోలేకపోయారు.
ప్రజల్లో ఉన్న అసంతృప్తి – ఉన్నఫళంగా పెరిగిన ఓట్ల మధ్య సంబంధం ఏమిటి?
ముఖ్యమంత్రి పదవి నుండి కేజ్రీవాల్ తప్పుకోవటం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నకు ఇపుడు ఆ పార్టీ సమాధానాలు వెతుక్కోవాలి. ఆతిషి ఢిల్లీ వాసులతో ఎందుకు అనుబంధం పెంచుకోలేకపోయింది, అతిషి కాక మరొకరెవరైనా అయితే పరిస్థితులు మెరుగ్గా ఉండేవారా అన్న ప్రశ్నలకు కూడా పార్టీ సమాధానం వెతుక్కోవాలి. మూడో విషయం 20మంది అభ్యర్ధులను మార్చటం అంటేనే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించటానికి నిదర్శనం.
ఎన్నికల సమయంలో బిజెపి కూడా అభ్యర్ధులను మారుస్తుంది. కానీ అలా చేయటం దానికి గెలుపునందిస్తోంది. కానీ అదేపని ఆప్ చేస్తే ఫలితం రాలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ అసంతృప్తి ఎంఎల్యేల మీద కాదు. ప్రభుత్వం మీద. దాని పనితనం మీద.
ఇది బిజెపి గెలుపుకంటే కూడా కేజ్రీవాల్ ఓటమి అని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. జనం తీవ్రమైన అసంతృప్తి, ఆందోళనలతో ఆప్‌ను ఓడిరచారన్నారు.
ఎన్నికలు జరిగినప్పుడు గెలుపోటముల గురించిన చర్చలు సహజమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బిజెపి గెలుపు గురించి కాదు. ఆప్ ఎలా ఓడిపోయిందన్న విషయాన్ని, దాని లోతుపాతులను, ఈ మొత్తం క్రమంలో ఎన్నికల సంఘం పాత్రనూ అర్థం చేసుకోవాలి.
ఈ విషయాలన్నీ గోడీమీడియా చర్చల్లో కనిపించవు. అసలేమీ జరగలేదన్న ధోరణితో కేవలం గెలుపు ఓటములు, సంఖ్యలు, అంకెలకే చర్చ పరిమితం అవుతుంది.
ఓటర్ల జాబితా గురించి ఆప్ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. 2020 నుండీ 2024 జనవరి మధ్యకాలంలో కేవలం నాలుగు లక్షల కొత్త ఓటర్లు నమోదైతే 2024 జూలై నుండి 2025 జనవరి మధ్య కాలంలో కేవలం ఏడు నెలల్లో మరో నాలుగు లక్షలమంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఈ వివరాల గురించిన కథనాన్ని ది వైర్ తెలుగు ప్రచురించింది. (ఇక్కడ చూడవచ్చు). ముఖ్యమంత్రి పోటీ చేసిన న్యూఢిల్లీ సీటులో నాలుగేళ్లలో 27 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోవటం గురించిన వివరాలు కూడా వివిధ పత్రికల్లో వస్తున్నాయి. ఈ తొలగింపు సంఖ్య గెలుపు ఓటముల మధ్య ఉన్న వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉంది.
మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేవలం ఐదు నెలల్లో 40 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారనీ, ఇంతమోతాదులో ఓటర్లు నమోదుకావాలంటే గతంలో ఏళ్లు పట్టేదని రాహుల్ గాంధీ ఫిబ్రవరి 7న జరిగిన విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు.
ఈ ప్రశ్నలన్నింటికీ ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఇప్పుడు రాజకీయ సిద్ధాంతం గురించి చర్చించుకుందాం. గత పన్నేండేళ్లుగా ఢిల్లీలో బిజెపికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీపార్టీ సైద్ధాంతిక పోరాటం చేసిందా? ముఖ్యమంత్రి మొదలు అనేకమంది సీనియర్ నాయకులు జైలుకెళ్లిన మాట వాస్తవమే. ఆప్‌కు ప్రభుత్వం నడపటం అంత తేలికేమీ కాదు ఎంతోమంది పార్టీనాయకత్వంపై కేసులు బనాయించారు. కొందరు భయానికి పార్టీ వీడి బిజెపిలో చేరారు కూడా.
ఇప్పుడు ఆప్ చీలిపోతుందంటున్నారు. అదేమంత పెద్ద విషయం కాదు. గెలిచినప్పుడు కూడా ఆప్ ముక్కలవుతూనేఉంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ వంటి వారిని ఆప్ నాయకత్వం పార్టీ నుండి బహిష్కరించింది.
ఆప్ సైద్ధాంతిక గందరగగోళం – ఆరెస్సెస్
ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ విశాల ప్రజానీకం మెదళ్లలో నెలకొన్న సందేహాలు మాత్రం పరిష్కారం కాలేదు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థే ఆమ్ ఆద్మీ పార్టీ అని ఎక్కువమంది భావిస్తున్నారు. దేశంలో, దేశ రాజకీయాల్లో కొత్త కెరటం కావాలి, రావాలి అనుకున్నవాళ్లు కూడా మొదట్లో ఈ అంశం గురించి పెద్దగా ఆలోచించలేదు. 2014 తర్వాత ఆరెస్సెస్ – ఆప్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. ప్రత్యేకించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ఆరెస్సెస్‌పై దాడి ఎక్కు పెట్టిన నాటి నుండీ ఈ పరిణామం తీవ్రమైంది. అప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే ఆరెస్సెస్‌ను సమర్థించే నాయకత్వం ఉన్నారన్న ఆరోపణలు ఉండేవి.
కానీ రాహుల్ గాంధీ బహిరంగంగానే ఆరెస్సెస్‌పై సైద్ధాంతిక దాడి ఎక్కుపెట్టారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడి కేవలం రాజకీపరమైనదేకాదనీ, సైద్ధాంతికమైనది కూడా అని రాహుల్ గాంధీ గుర్తించిన తర్వాతనే ఆరెస్సెస్ పట్ల కాంగ్రెస్ వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది.
గతంలో ఇంత బాహాటంగా ఆరెస్సెస్‌ను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్నది లేదు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే ఆరెస్సెస్ అతి పెద్ద సంస్థగా విస్తరించింది. ఆరెస్సెస్ తరహా నిర్మాణ వ్యవస్థ కానీ, నాయకత్వం కానీ తమ పార్టీలో లేదని రాహుల్‌కు బాగా తెలుసు. తాను గట్టిగా పట్టుబడితే కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందని కూడా తెలుసు ఎందుకంటే కాంగ్రెస్‌లో సగం మంది ఏదో ఒక రూపంలో మనువాదాన్ని సమర్థిస్తున్న వారే అన్న వాస్తవం రాహుల్‌కు తెలుసు.
అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కేవలం బిజెపినే కాదు. ఆరెస్సెస్‌ను కూడా లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆరెస్సెస్ వ్యతిరేక పోరాటంలో రాహుల్ నెగ్గుతారా లేదా అన్నది వేరే సమస్య. కానీ యుద్ధభేరీ మోగించారు. కనీసం తన ఉపన్యాసాల్లోనైనా ఆరెస్సెస్‌ను పేరుపెట్టి బహిరంగంగానే ప్రస్తావిస్తున్నారు.
కానీ మరోవైపున కేజ్రీవాల్ కొన్ని సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ ఆరెస్సెస్ పై పోరాటం చేస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం, ఎదుగుదల వెనక ఆరెస్సెస్ పాత్ర గురించిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. ప్రత్యేకించి అన్నా హజారే ఉద్యమం వెనక ఆరెస్సెస్ పాత్ర ఏమిటన్నది కీలకమైన ప్రశ్న.
చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రశ్న ముందుకు వచ్చినా చాలామంది మర్చిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. ఈ ప్రశ్నపై జరుగుతున్న చర్చలో ఆప్ పార్టీ జోక్యం చేసుకోలేదు. ఆప్ పునాది చీలిపోవడానికి ఈ ప్రశ్న కూడా ఒక కారణం.
కోవిడ్ సమయంలో తబ్లీగి జమాత్ గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. కోవిడ్ రోగుల్లో తబ్లీగీలు ఎంతమంది ఉన్నారన్న ప్రశ్నపై జరిగిన చర్చ మరోటి. ఈ చర్చను స్వయంగా కేజ్రీవాల్ మళ్లీ ప్రారంభించారు. తబ్లీగి జమాత్ కేంద్రమైన మర్కజ్ జంగ్‌పురాలో ఉంది. జంగ్‌పురా నుండి పోటీ చేసిన సిసోడియా ఈ సారి ఓడిపోయారు.
ఈశాన్య ఢిల్లీ అల్లర్ల పట్ల ఆప్ మౌనం నష్టం కలిగించిందా?
ఇదే కాదు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర, దాని స్పందనల స్వభావం గురించి కూడా అనేక సందేహాలున్నాయి. అక్రమంగా అరెస్టయిన వారి గురించి ఆప్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ నోరెత్తలేదు. బిజెపిపై పోరాటంలో కాంగ్రెస్ కంటే ఆప్ మెరుగని భావించిన అనేకమంది ఇటువంటి పోకడలు, వైఖరులు చూసిన తర్వాత పార్టీకి దూరమయ్యారు. దేశంలో రాజకీయాలు గత పదేళ్లలో చాలా మారిపోయాయి.
లోక్‌పాల్ గురించిన ప్రస్తావన తీసుకురావడమే మానేసింది ఆప్. పదేళ్లపాటు బిజెపిని ఎదుర్కొంటూ, బిజెపి దాడులను ఎదుర్కొంటూ గడిపారు కానీ బిజెపికి బీ టీమ్ అన్న విమర్శలకు మాత్రం సమాధానాలు దొరకలేదు. కనీసం ఇప్పటికైనా యుపిఎ హాయంలో దేశవ్యాప్తంగా సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ, దాని వెనకా ఆరెస్సెస్ పాత్ర ఏమిటి, వివేకానంద ఫౌండేషన్పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలకు ఆ పార్టీ సమాధానాలు చెప్పాలి. సంఘ్ పరివారం గురించి ఆప్ అవగాహన ఏమిటి, రానున్న భవిష్యత్తులో సంఘపరివారం గురించి ఎటువంటి వైఖరి తీసుకోనుందో వివరించాలి.
ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి, రాజ్యాంగబద్ధమైన అధికారాలను లాగేసుకోవడాన్ని ప్రశ్నించిన అనేకమంది ఈ ప్రశ్నలు కూడా లేవనెత్తడం చూశాను. రాయటంచూశాను. ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం పొంచి ఉంది.
అటువంటి వాళ్లు కూడా ఆప్‌ను విశ్వసించటం లేదు. ఇప్పుడు ఆప్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేదా నిశ్శబ్దంగా రాజకీయ రంగం నుండి నిష్రమిస్తున్నారు. వీళ్లల్లో ఎవరూ బిజెపికి అనుకూలంగా కానీ కాంగ్రెస్‌కు అనుకూలంగా కానీ మాట్లాడటం లేదు. ఆప్ విషయంలో మాత్రం నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో ఆప్ పార్టీకి వచ్చిన మద్దతు ఈ ఎన్నికల్లో రాలేదు. అడ్డు అదుపు లేకుండా బిజెపి ఆప్ పై దాడి చేసింది. ఆప్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. ఆప్ కకావికలమైంది. కానీ బతికి బట్టకట్టింది.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఢిల్లీలో ఆప్ ఓ సైద్ధాంతిక పునాదిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇన్ని దాడులు జరిగితే పార్టీ ఈ పాటికి దుంపనాశనమై ఉండాలి. కానీ పార్టీ మనుగడ సాగిస్తూనే ఉంది. అధికారం కోల్పోయింది కానీ ప్రధానప్రతిపక్షం స్థానం దక్కించుకుంది.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఢిల్లీ ఓటర్లు అందరూ బిజెపి ఓటర్లూ లేక హిందూ ఓటర్లు మాత్రమే అని ఆప్ భావిస్తోందా అన్నదే ప్రశ్న.
దేశంలోని మెజారిటీ ఓటర్లు హిందువులే అనటంలో సందేహం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బిజెపికి ఓటువేసే వాళ్లంతా మనువాదాన్ని ఆరాధించి అమలు చేసే వాళ్లే అనుకుంటుందా ఆప్ అన్నది ప్రశ్న. ఆప్‌కు ఓటు వేసిన వారిలో అనేకులు బిజెపిని ఓడించాలనుకుంటున్నారన్న విషయాన్ని ఆప్ గుర్తించిందా లేదా అన్నది ప్రశ్న. ఒకరు ఉదయం బిజెపికి మద్దతు పలికి మద్యాహ్నం ఆప్‌కు మద్దతు పలుకుతారు అనుకున్నారు కేజ్రీవాల్. కానీ బిజెపికి ఈ ఫార్ములా నచ్చలేదు.
బిజెపి వ్యూహంలో పావుగా మారిన కేజ్రీవాల్
రాజకీయపోరాటంలో ఆప్‌కు ఊపిరి సలుపుకునే అవకాశం ఇవ్వలేదు బిజెపి. ఈ పోరాట క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బిజెపి దారి బట్టింది. బిజెపి చేసినట్లే చేయటానికి ప్రయత్నించింది. కేజ్రీవాల్ మాటతీరు మారింది. కార్యక్రమాలరూటు మారింది. తీర్థయాత్రలు చేపట్టారు. పూజలు, పురస్కారాలు, పునస్కారాలు మొదలు పెట్టారు. ఆంజనేయుడిని పార్టీ అధికారిక దేవుడిగా మార్చారు. ప్రతి నెలా మొదటి మంగళవారం నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో సుందరకాండ ప్రవచనం, హనుమాన్ చాలీసా పఠనం చేయిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వయంగా కేజ్రీవాల్ వాగ్ధానం చేశారు. ఇందులో ఏ మేరకు ఆచరణలోకి వచ్చిందో తెలీదు. బాబ్రీ మసీదు కూల్చివేసిన స్తలంలో నిర్మించిన రామాలయం ప్రారంభం రోజు ఢిల్లీలో అన్నిచోట్లా సుందరకాండ ప్రవచనం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలానే చేశారు కేజ్రీవాల్.
ఢిల్లీ ఓటర్లను ఆమ్ ఆద్మీ ఇంతవరకే అర్థం చేసుకున్నట్లుంది. అతి పెద్ద మార్కెటింగ్ మేనేజర్‌గా ఉన్న మోడీ ముందుకు తెచ్చిన విషయాలనే కొత్త సీసాలో పాత సారాలాగా రంగు మార్చి జనం ముందుకు తేవటం మొదలు పెట్టారు కేజ్రీవాల్. దాంతో ఢిల్లీ ఓటర్లకు బిజెపి, ఆప్‌లకు మధ్య తేడా ఏమిటో అర్థం కాని అయోమయానికి చేరారు. 2014 నుండీ కాంగ్రెస్ కూడా ఇలాగే వ్యవహరించింది. రాహుల్ గాంధీ కూడా కేదార్నాథ్ పర్యటించారు. లోక్‌సభలో శివుడి ఫోటో ప్రదర్శించారు. అభయముద్ర గురించి మాట్లాడారు. 2014లో గుళ్లూ గోపురాలూ తిరిగిన రాహుల్‌కూ ఇప్పుడు రాజ్యాంగం చేతబట్టుకుని తిరుగుతున్న రాహుల్‌కూ చాలా తేడా ఉంది.
క్రమంగా కేజ్రీవాల్‌ను ముగ్గులోకి లాగిన బిజెపి ఎన్నికల ప్రచారం సమయానికి ఆయన బలవంతపు హిందువుగా మారాడని విమర్శించటం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకున్నారు. మంచుకప్పబడిన రోడ్డులో ప్రయాణంలో ఎంత ఆహ్లాదం ఉంటుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కేజ్రీవాల్ ఈ పొగమంచులో ప్రయాణం బాగుందనుకున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతవరకూ సమాధనాలివ్వలేదు. బహుశా కొన్ని గందరగోళాలు జనంలో అలానే ఉండాలని కోరుకుంటాయేమో రాజకీయ పార్టీలు.
బహుశా తమ పార్టీ నేతలు ఖైదీలు కావటం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కేంద్రం లాగేసుకున్న నేపథ్యంలో తాము బిజెపికి బీ టీం కాదని జనం నమ్ముతారని ఆమ్ ఆద్మీ నేతలు భావించి ఉండొచ్చు. ఆగస్టు 2022లో ప్రతిపక్ష నేతలందరూ జైలుకెళ్లారు. సిసోడియా ఇంటిమీద దర్యాప్తు బృందాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆర్జెడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ ‘‘ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐల దాడుల గురించి ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ సంస్థలు తమ స్వభావాన్ని, గౌరవాన్ని కోల్పోయాయి. కళ్లకు గంతలు కట్టిన గుర్రాల్లా మారాయి. ఆ గంతలు కట్టిందెవరో మనకు తెలుసు. ఎందుకు కట్టారో, వాటి పర్యవసానాలేమిటో మనకు తెలుసు. ఇతర ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తే బాగుంటుంది.ఈ రోజు వాళ్లంతా మీకోసం మాట్లాడుతున్నారు. వాళ్లు కూడా ఇదే పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు మీరు మౌనంగా ఉంటున్నారు’’ అని గుర్తు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలి. ఇదీ ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న సందేశం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని గమనించినందుకే మనోజ్రఝా ఈ ప్రకటన ఇచ్చి ఉంటారు. ఇప్పటికైనా మనోజ్ ఝా హెచ్చరికను ఆమ్ ఆద్మీ పార్టీ అర్థం చేసుకుంటుందా లేదా అన్నది వారే చెప్పాలి.
ఇండియా కూటమి – కాంగ్రెస్‌తో ఆప్ ఘర్షణలు
రాహుల్‌గాంధీ కూడా తన నిబద్దతను చాటుకున్నాడు. కేజ్రీవాల్ అన్నా హజారేతో కలిసి రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక (అవినీతి వ్యతిరేక) ఉద్యమాన్ని ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా అదే రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించాయి.ఆ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ఆ సభలో వేదిక మీద రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఒకటి కేజ్రీవాల్ కోసం వేసింది, రెండోది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోసం వేసింది. ఆ సమయానికి ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయటంపై రాహుల్‌గాంధీ బాహాటంగానే మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ కేజ్రీవాల్ కూడా ఇదేవిధంగా వ్యవహరించారా? ఈ విషయాన్ని చర్చింటానికి మరో లోతైన వ్యాసం అవసరం.
అన్ని పార్టీలకున్నట్లే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా రాజకీయంగా విస్తరించే హక్కు, రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకునే హక్కు తప్పకుండా ఉన్నాయి. ఈ ప్రయత్నంలో ఎవరు లబ్ది పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అన్నది ప్రజలు, రాజకీయ పరిశీలకులు చూస్తారు. ఇండియా కూటమి చీలిపోతుందన్న విమర్శలు వచ్చాయి. ఈ కూటమిలో రెండు ప్రధానపార్టీలు తమతమ ప్రయోజనాల కోసం కొట్లాడుకుంటున్నపుడు ఐక్యత సాధ్యమా అన్నది ప్రశ్న. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ను ఓడించిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని బలపరిచింది. ఆ తర్వాత ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో రెండు పార్టీలు పరస్పరం ఎన్నికల్లో తలపడ్డాయి. ఇద్దరికీ నష్టం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బలహీనపర్చటానికే ఆమ్ ఆద్మీ పోటీ చేస్తోందన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ ప్రజల్లోనూ నెలకొన్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్‌లు కలిసే పోటీ చేశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కేజ్రీవాల్ మొత్తం 70 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. అంటే పొత్తుకు సిద్ధం కాదని చెప్పటమే కదా.
క్రియాశీల రాజకీయాల పేరుతో కొన్ని సార్లు నాయకులు సైద్ధాంతిక లక్ష్యాలను పక్కకు నెడతారు. ఇది అన్ని పార్టీల్లో ఉన్న లక్షణమే. కానీ కేజ్రీవాల్ ఢిల్లీలో తనకంటూ ఓ ప్రత్యేక లేదా విలక్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధిచేసుకుని ఉండి ఉంటే అది వేరే సంగతి. రాజనీతి విద్వాంసులు ఈ ప్రశ్నకు నాకన్నా మెరుగైన సమాధానాన్ని ఇవ్వగలరు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను సరిగ్గానే అర్థం చేసుకున్నారా అన్న ప్రశ్నకు మాత్రమే పరిమితం కాదల్చుకున్నాను. ఒకవేళ ఆయన సరిగ్గానే అర్థం చేసుకుంటే ఫలితాలు భిన్నంగా ఉండేవా? ఖచ్చితంగా చెప్పలేము.
ఢిల్లీలో బిజెపికి బలమైన పునాదులున్నాయన్నది వాస్తవం. అయినా షీలాదీక్షిత్‌ను మూడు సార్లు ఓడించలేకపోయింది. బిజెపి పునాది అంత విస్తృతమైనదైనతే షీలాదీక్షిత్‌ను ఎందుకు ఓడించలేకపోయింది? (బలమైన పునాదికి, విస్తృతమైన పునాదికి మధ్య తేడా ఉంది.) 2015లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు ఓడించలేకపోయింది బిజెపి? కొత్తగా పుట్టిన పార్టీ బిజెపిని పక్కకునెట్టి అధికారానికి వచ్చింది కదా. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జైలు నుండి విడుదలైనప్పుడు కేజ్రీవాల్ మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ల గురించి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఆత్మరక్షణలో పడింది. అప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి బిజెపిని ఆత్మరక్షణలోకి నెట్టగలిగిన కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంతే సమయస్పూర్తితో వ్యవహరించలేకపోయారు.
కేజ్రీవాల్ పొరపాట్లతో లబ్ది పొందిన బిజెపి
ఈసారి కేజ్రీవాల్ చాలా తప్పులు చేశారు. యమునా నదిని విషతుల్యం చేయటం వంటి అర్థం పర్థం లేని ప్రకటనలను బిజెపి తన ప్రచారానికి వాడుకున్నది. బిజెపి ఇతరులపట్ల వాడినట్లే కేజ్రీవాల్ కూడా బిజెపి గురించి మాట్లాడారు. బిజెపి గూండాల పార్టీ అనీ, తప్పుల కుప్ప అనీ, ఇంకా రెచ్చిపోయి మాట్లాడారు. దీనికి భిన్నంగా బిజెపి ఎనిమిదో వేతన సంఘం, మహిళల ఖాతాల్లోకి రెండున్నర వేలు వంటి విషయాలు చర్చకు పెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరినీ ప్రకటించకపోయినా గెలిచింది.
ఓ నూతన రాజకీయ ప్రయోగానికి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆప్ కు ఈ కొత్త రాజకీయ ప్రయోగానికి పదేళ్ల గడువు ఇచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ నగరంలో పారిశుధ్యం మెరుగపడలేదు. ఈ సమస్యలను కేజ్రీవాల్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయారు. ఢిల్లీపగ్గాలు ముఖ్యమంత్రి చేతుల్లోలేవు. లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌నూ పని చేయకుండా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పలు అవాంతరాలు సృష్టించింది. రాష్ట్రంలో సాధారణ పరిపాలనకూడా సాగకుండా మోకాలడ్డింది బిజెపి. దానికోసం తన శక్తియుక్తులన్నీ ప్రయోగించింది.
ఢిల్లీ శివార్లలో ఉన్న షాదరా నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. ఓ ప్రాంతీయ పార్టీ నేత షాదరా లాంటి నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బురారీలో ప్రచారం చేయటానికి బీహార్ నుండి జనతాదళ్ (యునైటెడ్) ముఖ్యనేతలంతా వచ్చి వాలారు. ఇంతచేసినా బురారిలో ఆమ్ ఆద్మీ అభ్యర్ధి గెలిచారనుకోండి. అయినా ఇంత మంది ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది? ప్రతిసారీ తన వ్యూహం ఎత్తుగడలతో బిజెపిని ఖంగుతినిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి ఎందుకు బిజెపి వ్యూహం ముందు చతికిల బడింది? పార్టీ ఆత్మపరిశీలన చేసుకుని కారణాలు గుర్తించాలి.
కేజ్రీవాల్‌కున్న ఏకైక సంపద నైతికత, నిజాయితీ. జైలుకెళ్లినందుకు ఆయన ప్రతిష్ట దెబ్బతిన్నదానికంటే శీష్‌మహల్ అన్న ప్రచారం వలన బాగా దెబ్బతిన్నది. ముఖ్యమంత్రుల నివాసాలు ఇలానే ఉంటాయేమో ఎవరికి తెలుసు? ఢిల్లీలో కొందరు కేంద్ర మంత్రుల నివాసాలు ఇంతకన్నా ఘనంగానే ఉంటాయి. కానీ ఈ విషయాన్ని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వాడుకోవటంలో బిజెపి విజయం సాధించింది. సాదా సీదా రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ అన్న అభిప్రాయం నుండి ఆయన నీతి నిజాయితీలపై ఎంతో కొంత ప్రజల్లో అపనమ్మకం కలిగించటంలో బిజెపి విజయం సాధించింది. పార్లమెంటరీ ఉపన్యాసాల్లో సైతం ప్రధాని మోడీ శీశ్ మహల్ గురించి మాట్లాడుతున్నారు.
ఢిల్లీలో బిజెపి గెలుపు రాజకీయంగా ప్రాధాన్యత కలిగినదే. ఆమ్ ఆద్మీ ఓటమి వలన తమకు మార్గం తేలికవుతుందని కాంగ్రెస్ భావించకూడదు. భారత రాజకీయాల్లో ఉన్న ప్రస్తుత దశ ఒకటో రెండో ఎన్నికల ఫలితాల కారణంగా మారదు. తన ఓటమికి కాంగ్రెస్ కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ అర్థం చేసుకోవాలి. అదే సమయంలో కాంగ్రెస్ ఏమిచేసి ఉండాల్సిందోకూడా ఆమ్ ఆద్మీ పార్టీ వివరించాలి. కాంగ్రెస్ పోటీ చేసిన చోట్ల ఆమ్ ఆద్మీ కూడా పోటీ చేయాలా? ఆమ్ ఆద్మీ ప్రధాన నేతలు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారో కుడిఎడంగా అన్ని ఓట్లు కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కాయి. అదేసమయంలో హర్యానా, గుజరాత్ లేదా ఇతర చోట్ల కాంగ్రెస్ ఓటమి కూడా ఇదేరీతిలో ఉంది. ఈ లెక్కలతో గెలుపు ఓటములు నిర్ణయించవచ్చు. కానీ వాస్తవం ఈ లెక్కల పరిధికి మించి ఉంది.
కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి చివరకు బిజెపి తీర్థం పుచ్చుకున్న నాయకుల గురించి, వారి రాజకీయాల గురించీ ఎలా అర్థం చేసుకోవాలి? ‘‘ ఈ రాజకీయ మేధావులంతా ఏది రాజకీయం, ఏది సిద్దాంతం, ఏది సైద్ధాంతిక పోరాటం, సమస్యలేమిటి, రాజ్యాంగం ఏమిటి అని చర్చించుకోనీయండి. మా పనిమాత్రం ఒక్కటే. పరిస్థితులు బాగాలేనప్పుడు పార్టీ ఫిరాయించటం, ఈరోజు ఓ పార్టీ టిక్కెట్ మీద గెలిస్తే రేపు మరోపార్టీ టిక్కెట్ మీద గెలవడమే మాపని’’ అని చెప్తారేమో… చూడాలి.
– రవిష్ కుమార్
రచయిత సీనియర్ జర్నలిస్టు. రవీష్ కుమార్ అఫిషియల్ పేరుతో యూ ట్యూబ్ చానెల్ నడుపుతున్నారు. జర్నలిజం లో ఆయన సేవలకు గాను పలు అవార్డుల అందుకున్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.