ఔట్సోర్సింగ్ ఉద్యోగిని చేసి
సఫాయి కార్మికుని కాళ్లు కడిగి
నెత్తిన నీళ్లు చల్లుకుంటారు
ఉత్పత్తులను పెంచి
చెత్త బండిని ఇంటింటికి తిప్పి
ప్లాస్టిక్ నిషేధించబడిందని ప్రకటిస్తారు
నదీ తీరాల్లో ఫ్యాక్టరీలు కట్టి
జీవధార కలుషితం అయ్యాక
పవిత్ర పుణ్య స్థానాలు చేస్తారు
వాడవాడలా మద్యం దుకాణాలు తెరిచి
పోలీసులతో పైపులు ఊదించి
జరిమానాలు విధిస్తారు
పేదరికాన్ని పెంచే చట్టాలు చేసి
చిన్న పిల్లల్ని పనిలో పెట్టొద్దని
లేబర్ ఆఫీసర్ యజమానిని శిక్షిస్తాడు
సామాన్యులు న్యాయం కావాలని
న్యాయస్థానాలను ఆశ్రయిస్తే
వాయిదా మీద వాయిదాలు వేస్తారు
రాజకీయ మాన్యుల వ్యాజ్యాలు
సత్వరమే తీర్పులు వెలువరిస్తారు
రక్తం అంతా ఒక్కటే అని
మానవులంతా సమానమే అని
కులాల అంతరాలను పాటిస్తారు
కాంక్షరహిత ధ్యాన యోగులు
కుటుంబం లేని బ్రహ్మచారులు
ప్రజాక్షేమం కోరి
నాయకులై పరిపాలిస్తారు
ఔషధీ నదుల్ని మురికి కూపాలు చేశాక
గాలిని కాలుష్యంతో నింపాక
వస్తువులతో ఇల్లును దుకాణంగా మార్చాక
గాంధీ గారి కళ్ళద్దాల నుంచి
స్వచ్ఛభారత్ కలగంటారు
– జూకంటి జగన్నాథం
