
జూన్ నెల నుంచి విజయవాడ కర్నూలు మధ్య పౌర విమాన సేవలు ప్రారంభం కానున్నాయని ఒక వార్త చూశాను. ఈరోజు ఉదయాన్నే వార్త చదివిన తర్వాత నాతోపాటు ఉన్న మిత్రులతో సంభాషిస్తున్నపుడు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న విమానాల ప్రయాణమే ఆర్థికంగా లాభసాటిగా లేనప్పుడు విజయవాడ నుంచి కర్నూలుకు వెళ్లే విమానాలు ఏమాత్రం లాభసాటిగా ఉంటాయనే ప్రశ్న వచ్చింది. గతంలో కూడా 2014- 2019 ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి శతవిధాల జరిగిన ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. గతంలో విజయవాడ నుంచి వెళ్లే ఒకటి రెండు అంతర్జాతీయ విమానాలు కూడా తమ సేవలను నిలిపివేశాయి. ఇదిలా ఉండగా రాష్ట్రం విభజించబడిన తర్వాత తొలిసారి అధికారానికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా వేల ఎకరాల భూములను సేకరించింది. ఏ ఏ అనుమతులు ఏ స్థాయిలో సంపాదించిందో ఆ ప్రభుత్వానికే ఎరుక. మొత్తం మీద భోగాపురం విమానాశ్రయం పేరుతో జరిగిన భూసేకరణ యధావిధిగా వందల వేల ఎకరాలను వ్యవసాయేతర భూములుగా మార్చింది. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పౌరవిమానయాన శాఖ బాధ్యతలు స్వీకరించి ఎలాగైనా భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నది. మరోవైపు దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రంగా ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి 200 కిలోమీటర్లకు ఒక విమానాశ్రయం నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఏ దేశంలో అయినా పెరుగుతున్న ఆర్థిక సామర్థ్యం, వాణిజ్య లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల ప్రయాణాపు అవసరాలు, అవకాశాలు వంటివి ఆ దేశంలో రవాణా రంగాన్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పై సందర్భాలు చూస్తే ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా కేవలం పెట్టుబడిదారులకు లాభాల కోసమే భారీ ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందని చెప్పవచ్చు.ఈ సందర్భంగా ఓ విషయాన్ని పాఠకులకు గుర్తు చేయాలి.
కొన్నేళ్ల క్రితం హర్యానాలో ముఖ్యమైన పట్టణం హిసార్లో కొత్తగా విమానాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు పట్టణమంతా ఆనందోత్సాహాలతో కోలాహలంగా మారింది. దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులకు కావలసిన వస్తువులు ఏర్పాటు చేసే విధంగా రూపొందించిన విమానాశ్రయం నిరంతరం రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొట్టాయి. పోయిన సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మోడీ కొత్తగా నిర్మించిన హిసార్ విమానాశ్రయంలో దిగారు. భారతదేశంలో ఆధునికరణమే పరుగులు తీస్తుందంటానికి హిసార్ అభివృద్ధి ఉదాహరణ అని ప్రశంసించారు. తర్వాత ఎయిర్ ఇండియాకు చెందిన హిసార్- ఢిల్లీ మధ్య విమాన సేవలు ప్రారంభించింది. రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్ళటానికి ప్రయాణీకులు ఎంత కాలం విమానాలకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారన్నదే ప్రశ్న.
ప్రారంభోత్సవం జరిగి కొన్ని ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ విమానాశ్రయంలో రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విమానాశ్రయం దాదాపు ఖాళీగా ఉంది. విమానాలు తిరగాల్సిన రన్వేలో కుక్కలు తిరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సైనిక విమానాలు, రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళే చార్టెడ్ విమానాలు మినహా 2021 నుంచి పెద్దగా పౌరవిమాన సేవలు మొదలు కాలేదు. ఈ పెట్టుబడులు పెట్టిన వారికి వేల లక్షల కోట్ల రూపాయలు, విలువైన రాయితీలు, రకరకాల రూపాలలో చట్టబద్ధంగానే అందుతున్నాయి.
గతంలో ఏదైనా పారిశ్రామిక సంస్థకు కేంద్ర ప్రభుత్వం తాయిలాలు, రాయితీలు ఇవ్వాలంటే పెద్ద ఎత్తున అవినీతి ముడుపులు చేతులు మారేవి. అటువంటి ముడుపులు చేతులు మారిన పారిశ్రామిక సంస్థలకు పెట్టుబడిదారులకు దక్కే రాయితీలకు చట్టబద్ధత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వేల లక్షల కోట్ల రూపాయల విలువైన రాయితీలను పారిశ్రామిక సంస్థలకు అందజేయడం కోసమే చట్టాలు రూపొందుతున్నాయి.అవి విద్యుత్ సేవలో రాయితీ కావచ్చు.భూముల కేటాయింపుల రాయితీలు కావచ్చు. ప్రత్యక్ష పన్నుల విషయంలో రాయితీలు కావచ్చు. ఎంత విలువైన రాయితీలు పొందిన తర్వాత కూడా ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్న లేదా కల్పిస్తున్న సదుపాయాలు సాధారణ ప్రజల వినియోగంలోకి వస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న. హిసార్ విమానాశ్రయం అనుభవాన్ని పరిశీలిస్తే రాయితీల ముడుపులు ఏ దారిన పోతున్నాయో తెలియదు కానీ ప్రజలకు మాత్రం పెద్దగా సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. లేదా ఆ స్థాయిలో ముడుపులు పెట్టి రాయతీలు సంపాదించుకొని నిర్మించిన మౌలిక వసతులను వినియోగించుకునే ఆర్థిక స్థాయి సాధారణ ప్రజలకు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎవరి కోసం సిద్ధం చేస్తున్నట్లు?
దేశంలో లక్షల కోట్ల రూపాయలతో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాయి. నాలుగు- ఐదు సంవత్సరాల క్రితం చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి నేటి భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు చాలా విషయాలలో పోలికలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. చైనా ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచటానికి కావలసిన పద్ధతుల్లో తన వ్యయ ప్రాధాన్యాతలను మార్చుకున్నది. మరి భారత పాలక వర్గం ఈ పని చేయగలుగుతుందా?
ఈ పరిస్థితి కేవలం విజయవాడ విమానాశ్రయానికి కొత్తగా సేవలందించనున్న కర్నూలుకు లేదా నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న భోగాపురం విమానాశ్రయానికి లేదా హిసార్ విమానాశ్రయానికో పరిమితమైన సమస్య కాదు. మౌలిక వస్తుల కల్పనా రంగం- దీన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. గత పదేళ్లలో దేశంలో ఈ సోకాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ అనేక విమానాశ్రయాలలో గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు ఏ ఒక్క పౌరుడు ప్రయాణించలేదు. దీంతో ఊరికే నిర్మించిన ఈ విమానాశ్రయాలన్నీ భూత్బంగ్లాలుగా మారుతున్నాయి. రోజుకు కనీసం 5 విమానాలు వచ్చి వాలుతాయన్న దాంట్లో 3 విమానాలు కూడా రావడంలేదు.
ఈ నేపథ్యంలో విధాన విశ్లేషకులు, నిపుణులు ప్రపంచంలో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగిందని వాదిస్తున్న వారు ఆలోచనలో పడుతున్నారు. భారతదేశాన్ని ఆర్థిక ఆగ్రరాజ్యంగా రూపొందించే క్రమంలో పరిమితంగా ఉన్న విలువైన వనరులను వృధాగా ఖర్చుపెట్టామా? ఈ క్రమంలో ప్రయోగ పనులకు కావలసిన నిధులను కేటాయించలేకపోయామా? అన్నది ఇప్పుడు ఆర్థిక విధానాల రూపకర్తల ముందున్న ప్రశ్న.
ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలు ఆక్సిజన్ అందక కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు లక్ష ముప్ఫై వేల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ సంపాదన దీనికి తాజా ఉదాహరణ. అనేక కారణాలు రీత్యా భారతీయ స్టాక్ మార్కెట్లలో పడిపోయిన షేర్ల ధరలు పుంజుకుంటున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం మందగమనం వీడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ సగటున ఆరు శాతం వృద్ధిరేటు సాధిస్తే గొప్పే అన్న అంచనాలు వినబడుతున్నాయి.
దీనికి తోడు వివిధ రాష్ట్రాలలో అధికారానికి రావడానికి ప్రజల ముందు అందమైన అభివృద్ధి చిత్రపటాన్ని ప్రతిపాదించే క్రమంలో ఆయా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా రాష్ట్రాభివృద్ధి అవసరాలతో నిమిత్తం లేకుండా భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒకవేళ అధికారానికి వస్తే ఆ భారీ ప్రాజెక్టులను పూర్తిచేసే క్రమంలో జరుగుతున్న లోపాలు ధన దాహం వెరసి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కాళేశ్వరం బాటపడుతున్నాయి.
మిగిలిన రంగాలు ఎలా ఉన్నా కనీసం పౌరవిమాన సేవ రంగంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ అంచనాలతో ప్రజల కొనుగోలు శక్తితో నిమిత్తం లేకుండా కేవలం ఓటర్లను ప్రలోభ పరచుకోవడానికి పథకాలు, ప్రణాళికలు, నిర్మాణాలు సాగుతున్నాయి. భారతదేశంలో వైమానికరంగా నిర్మాణాలు, ప్రాధాన్యతలును దగ్గరగా పరిశీలిస్తున్న మార్టిన్ కన్సల్టింగ్ సంస్థ అధినేత మార్క్ మార్టిన్ లేవనెత్తుతున్న ప్రశ్న మరింత కీలకమైనది. ఎటువంటి పారిశ్రామిక వాడలు మధ్యతరగతి జనాభా లేని ప్రదేశాలలో విమానాశ్రయాల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించడం అంటే ఈ నిర్మాణాల ద్వారా ఎవరో కొందరికి నిర్దిష్ట ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో మాత్రమే సాగుతుందా అన్నది మార్టిన్ వేస్తున్న ప్రశ్న.
మెట్రో రైలు నిర్మాణం కూడా ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభపెట్టే తంతుగానే మారింది. ఢిల్లీ, కలకత్తా మెట్రో రైలు మినహా మిగతా నగరాలలో నడుస్తున్న అన్ని మెట్రో రైల్లు ఆశించిన ప్రయాణికుల రద్దీలో మూడో వంతు కూడా ఉండటం లేదు. కొన్ని కొన్ని ప్రాజెక్టులు వాటి అవసరానికంటే కొంత 5- 10 ఏళ్ల ముందుగానే నిర్మిస్తున్నారంటూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక నివేదికలో విమర్శించారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ ఆర్థిక సహకారంతో నిర్మించబూనుకున్న బుల్లెట్ ట్రైన్ దీనికి ఒక ఉదాహరణ. 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేయాలన్నది మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం 2047 నాటికి సాధించబోయే సంపన్న దేశ హోదాకు తగ్గట్టుగా పౌర విమానయాన సేవలు అందుకునే స్థాయిలో సాధారణ ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అన్నది ప్రభుత్వాల వాదన. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన ప్రత్యక్ష పరోక్ష పన్నులు వృధాగానో లేదా ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలు లేకుండానూ ఖర్చు చేస్తున్నాయా అన్నది దేశం ముందున్న ప్రశ్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.