
బహుభాషా వేదిక !!
చారిత్రక నగరమైన హైదరాబాద్ భిన్న భాషలకు, భిన్న సంస్కృతులకు నిలయం. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల ప్రజలే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌ను నివాసంగా మార్చుకొని, జీవిస్తున్నారు. తమ వంతుగా ప్రేమకు ప్రతిరూపమైన హైదరాబాద్ నగర అభివృద్ధికి కారణమవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.
కేవలం హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడానికే కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా కొందరు హైదరాబాద్ బాట పడుతుంటారు. అందులో భాగంగానే సిటీ కాలేజ్ లాంటి చారిత్రక నేపథ్యమున్న విద్యాలయాలలో చదవడానికి విద్యార్థులు ఉత్సుకతను చూపిస్తారు. దీంతో వివిధ రాష్ట్రాల, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో సిటీ కాలేజ్ కళకళలాడుతుంది. భిన్న భాషల, విభిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులకు నిలయంగా చారిత్రాత్మకమైన సిటీ కాలేజ్ మనకు కనిపిస్తుంది.
విజ్ఞాన వెలుగులు..
హైదరాబాద్‌లోని నయాపూల్ వద్ద మూసీ నది ఒడ్డున గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంది. వివిధ భాషలను మాట్లాడే విద్యార్థులతో కళకళలాడే సిటీ కాలేజ్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఈ కాలేజ్‌లో ఎందరో ప్రముఖులు చదువుకున్నారు. కవులు, కళాకారులను, నేతలను ఈ కాలేజ్ దేశానికి అందించింది. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి, విప్లవ ఉర్దూ కవి మఖ్దూం మోహియిద్దీన్ కూడా ఈ కాలేజీలోనే చదువుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకానొక సందర్భంలో ఈ కళాశాలను సందర్శించినట్టుగా చరిత్ర చెప్తోంది.
ఈ కళాశాలలో చదువుకున్న వారు వివిధ పదవులను పొంది ప్రజాసేవ చేశారు. ముందు ఓ సాధారణ పాఠశాలగా మొదలై ఆ తర్వాత కళాశాలగా మారిన ‘హైదరాబాద్ గవర్నమెంట్ సిటీ కాలేజ్’ చరిత్రలోనే కాదు, వర్తమానంలోనూ తన ప్రభావాన్ని చూపిస్తుంది. నిఖార్సయిన భారతీయతకు ప్రతిబింబంగా ఉంది. భారతీయత నిర్వచనంలో అంతర్భాగమైన బహుభాషలతో తనదైన ముద్రను వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా మూసీ నది ఒడ్డున ఠీవిగా నిలబడి విజ్ఞాన వెలుగులను విరజిమ్ముతోంది.
1865లో పాఠశాలగా పునాది..
సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి సిటీ కాలేజ్‌కు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1865వ సంవత్సరంలో పునాది పడింది. చాలామంది జీవితాలలో వెలుగులు నింపిన సిటీ కాలేజ్ మొదట ఓ సాధారణ పాఠశాలగా ఉండేది. హైదరాబాద్ అసఫ్ జాహీ వంశానికి చెందిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ మదర్సా దార్-ఉల్-ఉలూమ్ పేరుతో ఈ పాఠశాలను స్థాపించారు. నిజాం కాలంలో చాలామంది సంపన్న ముస్లిం కుటుంబాల పిల్లల చదువులకు ఈ పాఠశాల కేంద్రంగా ఉంది.
అయితే, మొదట ఇస్లామిక్ విద్యకు పరిమితమైన పాఠశాల తర్వాత తన రూపురేఖలను మార్చుకొని నూతన విద్యావిధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా విజ్ఞానశాస్త్ర సంబంధిత విద్యను ప్రజలకు అందించింది. ఎటువంటి భేదం లేకుండా అన్నీ వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో చదువుకున్నారు. ఈ ఘనత హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి, ఆనాటి ప్రపంచ నగరాలలో హైదరాబాద్‌ను ప్రత్యేక స్థానంలో ఉంచిన దార్శనికుడు, కవి ఏడవ ఆసఫ్ జాహీ నిజాం ఉస్మాన్ అలీఖాన్‌కు దక్కుతుంది. దార్- ఉల్- ఉలూమ్ పాఠశాలను సిటీ హైస్కూల్‌గా ఆయన మార్చారు. విద్యను అందిరికి చేరువచేశారు. నిజాం పాలకులలో తర్వాత తరాలు క్రమంగా లౌకికత్వాన్ని ఆరాధించారని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ.
కాలానుగుణంగా, 1921లో పాఠశాల ప్రస్తుతం ఉన్నటువంటి భవనంగా మారింది. అప్పుడు 30 మంది విద్యార్థులతో ఎఫ్ఏ ఇంటర్మీడియట్ విభాగాలలో ఉర్దూ మాధ్యమంగా బోధన మొదలైంది. 1929లో పాఠశాలను కళాశాలగా మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి తెస్తూ సిటీ కాలేజ్‌గా దీనికి పేరు పెట్టారు. న్యాక్ ద్వారా మంచి గ్రేడింగ్‌ను పొందిన సిటీ కాలేజ్‌లో ప్రస్తుతం డిగ్రీ, పిజి కోర్స్‌లను బోధిస్తున్నారు. కాలక్రమంలో పిజి వరకు చేరిన సిటీ కాలేజ్‌కు 2017- 18 విద్యాసంవత్సరం నుంచి 2025- 26 వరకు స్వయంప్రతిపత్తి హోదాను యూజిసి నుంచి లభించింది. 1921 అక్టోబరు 5న నిర్మించబడ్డ కాలేజ్ 2021నాటికి వందేళ్ళను పూర్తి చేసుకుంది.
పచ్చటి వృక్షంలా సిటీకాలేజ్..
సిటీ కాలేజ్ రాచరికాన్ని, ప్రజాస్వామ్యాన్ని సమాజంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను చూసింది. ఉన్నత చరిత్ర కలిగిన హైదరాబాద్ సిటీ కాలేజ్‌లో హైదరాబాద్ నగరవాసులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చదువుతున్నారు. వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడే విద్యార్థులకు ఒక పచ్చటి వృక్షంలా సిటీ కాలేజ్ మారింది.
వేరు వేరు ప్రాంతీయ భాషలకు చెందిన విద్యార్థులను ఇంగ్లీష్ భాష కలుపుతోంది. విద్యార్థులు పరస్పరం సహకరించుకోవడానికి, బోధన చేసే ఉపాధ్యాయులకు మధ్య ఇంగ్లీష్ భాష కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఆకర్షణీయమైన వాతావరణం విద్యార్థులకు కొత్తదనాన్ని అందిస్తూ, వారి మధ్య సామరస్యతకు కారణం అవుతుంది.
కాలేజ్‌లో చదివే విద్యార్థులు క్యాంపస్‌లో ఇతర భాషలను నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇటువంటి వాతావరణంలో వారికి ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. దీంతో తమ తోటి విద్యార్థులతో వారి భాషలో మాట్లాడుతూ కొత్త భాషను నేర్చుకుంటుంటారు. క్యాంపస్ వాతావారణం బాగుందని, చదువుతో పాటు ఒక కొత్త భాష నేర్చుకోవడానికి తమకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 17 ప్రాంతియ భాషలను మాట్లాడే విద్యార్థులు సిటీ కాలేజ్‌లో చదువుతున్నారు. బంజారా, బెంగాలి, భోజ్‌పురి, బిహారీ, కన్నడ, మైథిలి, మరాఠి, ఒడియా, గోండి, మార్వాడి, మధుర, మళయాళం, కోయ, ఉర్దూ, పంజాబిలాంటి ప్రాంతీయ భాషలను విద్యార్థులు మాట్లాడుతుంటారు. అయితే, క్యాంపస్‌లో ఎక్కువగా తెలుగు, హిందీ భాషలు మాట్లాడే విద్యార్థులు ఉన్నారు. విభిన్న వర్గాలకు చెందిన విద్యార్థులతో సిటీ కాలేజ్ ‘గంగా గోదావరి తెహజీబ్’కు ఓ మంచి ప్రతీకగా నిలుస్తోంది.
బహుభాషా వేదిక !!
– సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.