
అదానీ కంపెనీతో శ్రీలంక ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దుచేసింది. అదానీ కంపెనీతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునే రాజపక్ష ప్రభుత్వంపై మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. రాజపక్ష ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో పని చేసిన ఉన్నతాధికారే ఈ ఆరోపణలు చేస్తూ బాధ్యతలకు రాజీనామా చేసిన వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పవన విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఒప్పందాలను, మరో రెండు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించటం గమనించాల్సిన విషయం.
రాజపక్ష ప్రభుత్వం అదానీ కంపెనీతో వెయ్యికోట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం కోసం అదానీ రాజపక్ష ప్రభుత్వానికి ముడుపులు చెల్లించిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీలభారం తగ్గిస్తామని వాగ్దానం చేసిన అధికారానికి వచ్చిన ప్రభుత్వం కొనుగోలు ఒప్పందాలు సమీక్షించాలని పట్టుబట్టింది. దీనికి సిద్ధంకాని అదానీ మొత్తంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారని రాయటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మన్నార్, పునేరియన్ ప్రాంతాల్లో 484 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అదానీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది.
ధరలు పున:చర్చించటానికి శ్రీలంకన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కొత్తగా కమిటీని నియమించిన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అదాన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఓ లేఖలో తెలిపింది. ‘‘ఈ విషయంగా 14 నెలల పాటు చర్చలు, సంప్రదింపులు జరిగిన తర్వాత 20 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాము. ఇప్పుడు మళ్లీ చర్చలు అంటే మా కంపెనీ బోర్డు అంగీకరించటం లేదు. ఈ పరిస్థితుల్లో శ్రీలంక ప్రభుత్వం సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూనే మేము ఒప్పందం నుండి వైదొలగుతున్నాము’’ అని ప్రకటించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.