![IMG-20250201-WA0007](https://thewiretelugu.in/wp-content/uploads/2025/02/IMG-20250201-WA0007-1024x576.jpg)
‘‘చటర్జీపురం’’ అనేది ఒక గదబ ఆదివాసీ గ్రామం, ఇది అనకాపల్లి జిల్లాలో ఉంది. ఊరు పేరు విన్న, చదివిన తర్వాత ఏదో చిన్న తేడా అనిపిస్తుంది. వివరంగా తెలుసుకుంటే మాత్రం చటర్జీపురం ఊరిపేరు ఆదివాసీల కృతజ్ఞతకు ఓ ప్రతీక అని అర్థమవుతుంది. అయితే, ప్రస్తుతం ఆ ఊరిలో ఉండే ఆదివాసులు భూసంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారి సమస్యలు మాత్రం పరిష్కరించబడడం లేదు. తహశీల్దార్ తమకు అన్యాయం చేశాడని, తమ పేరు మీద ఉన్న భూమిని వేరే వారి పేరు మీదికి మార్చాడని ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో చటర్జీపురం ఆదివాసి గ్రామం ఉంది. జిల్లాల విభజనకు, ఎన్టీఆర్ తెచ్చిన మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం నర్సీపట్టణం తాలూకాలో ఉండేది. నర్సీపట్టణం అనేది తాలూకానే కాకుండా ఒక రెవిన్యూ డివిజన్ కేంద్రం కూడా. అయితే, చటర్జీపరం గ్రామంలో నివసించే ఆదివాసీలు గదబ తెగకు చెందినవారు. వీరిని ‘‘ఆదిమ తెగల’’( పీవీటీజీ)కు చెందిన వారిగ ప్రభుత్వం గుర్తించింది. ఈ గదబ తెగలో మొత్తం రెండు ఉప తెగలు ఉన్నాయి. ఒక తెగవారిని ‘‘పరిం గదబలు’’, రెండవ వారిని ‘‘చెంచు గదబలు’’అని అంటారు. విచిత్రంగా రెండు తెగలకు వేరువేరుగా లిపి లేని భాషలు ఉన్నాయి. ఈ రెండు భాషలలో కొన్ని పదాలు కలుస్తాయి కానీ ఒకరి భాష మరొకరికి అర్థం కాదు. అడవి, వ్యవసాయం, కూలి పనులపై ఆధారపడి గదబ తెగ ఆదివాసుల జీవనం కొనసాగుతుంది.
పేరు మార్చుకున్న వీరపురాజు పేట..
గ్రామపేరు నేపథ్యంలోకి వెళ్తే, చటర్జీపురంలోని మొదటి పదం బెంగాలుకు చెందినది. ఆ ఊరి అసలు పేరు వీరపురాజుపేట. అదికాస్తా కాలంతో పాటు చటర్జీపురంగా మారింది. ఈ మార్పు వెనుక ఓ చరిత్ర ఉంది. అదేంటంటే, ఈ ప్రాంతంలో గతంలో సబ్ కలెక్టర్‌గా చటర్జీ అనే ఐఏఎస్ అధికారి పని చేశారు.
1977-78 మధ్య కాలంలో వీరపురాజుపేట గ్రామాన్ని సబ్ కలెక్టర్ చటర్జీ సందర్శించారు. గ్రామంలోని ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న పోరంబోకు స్థలంలో లేఅవుట్ వేయించారు. అంతేకాకుండా తన హోదాను ఉపయోగించి గ్రామంలో బెంగుళూరు పెంకుల ఇళ్లులను(ఇందిరమ్మ ఇళ్లు) మంజూరు చేయించారు. గ్రామ సమస్యలను పరిష్కరించారు. అలా ఒక ఐఏఎస్ అధికారి ఆదివాసీల జీవితాలలో ఒక చిరు వెలుగును నింపాడు. గ్రామాభివృద్ధికి, తమ సమస్యలను పరిష్కారం చేసి సహాయం చేసినందుకుగాను కృతజ్ఞతగా తమ గ్రామం పేరును వీరపురాజుపేట నుండి ‘‘చటర్జీపురం’’గా ఆదివాసీలు మార్చుకున్నారు. అయితే, గత వైపీపీ పాలనలో అధికారుల విధానపర నిర్ణయం వల్ల చటర్జీపురం ఆదివాసీలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయం జరగడం లేదు.
భూమిని సాగు చేసిన మొదటి తరం..
దున్నుకోవడానికి కొంత నేల, నిత్యవసరాలతో పాటు సాగుకి నీరు ఉంటే చాలు ఆదివాసీలు వ్యవసాయం మొదలు పెడతారు. కానీ పాలన వ్యవహారాలు, రాజ్యాంగం, చట్టాలులాంటి వాటిపై వీరికి అవగాహన లేదు. దీంతో కొన్నిసార్లు ఆదివాసీలు చిక్కుల్లో పడతుంటారు.
అయితే, గతంలో ఆరు గదబ ఆదివాసీ కుటుంబాల పెద్దలు తమకు అందుబాటులోని ఎగుడు దిగుడు భూమిని కండలు కరగించి సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. దానికి మూడు వైపుల ‘‘పిల్లి గెడ్డ’’ అనే పేరుతో ఒక సహజ నీటి కాలవ కూడా ఉండడంతో దాని సహాయంతో పంటలను పండించారు. కొందరైతే అక్కడే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ భూమిని ఎందుకు సాగు చేస్తున్నారని వారిని ఎవరు అడగలేదు.
భూమిని సాగు చేస్తే సరిపోదని, అలా తాము సాగు చేస్తున్నట్లు రికార్డులో కూడా నమోదు కావాలని సాగుదారులైన ఆదివాసీలకు తెలియదు. ఆ గ్రామ పరిపాలన అధికారి (వీఆర్ఓ) చేస్తాడని తెలియదు. వారికి ఇదంతా తెలిసి వచ్చేసరికి ఏళ్లు గడచిపోయాయి. ఈ విషయం తెలిసిన తర్వాత తమ పేర్లను సాగు రిజిస్టర్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదివాసీలు కోరారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రెండు సంవత్సరాలపాటు ప్రయత్నం చేశారు. అది కాస్తా ఫలించి ఆదివాసీ కుటుంబాలు సాగుభూమి 2016లో వెబ్లెండ్ రికార్డులో నమోదయ్యింది. ఈ- సేవలో చలాన చెల్లించి సాగు రైతులు నఖల్లను తీసుకున్నారు. ఆ భూమి మీద తమకు అధికారం ఉన్నట్టుగా, తాము సాగు చేస్తున్నట్టుగా ఆదివాసీలకు పాసుపుస్తకం వచ్చింది.
వెబ్ లెండ్ మాయా..
భూమి రికార్డును ‘‘హక్కుల రికార్డు’’ అని కూడా అంటారు. ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం (ఆర్ఓఆర్ చట్టం)దాని నియమాల ప్రకారం భూయాజమాన్య నమోదు జరగాలి. కానీ అలా జరగదు. భూమి మార్కెట్ విలువ ప్రకారం ఎవరైనా ‘నజరాన’ చెల్లిస్తే రికార్డు మారిపోతుంది. వెబ్లెండ్ రికార్డు వచ్చిన తరువాత మూడవ కంటికి తెలియకుండా తక్కువ కాలంలో రికార్డును మార్చివేసే వెసులుబాటు వచ్చేసింది.
తమ గ్రామానికి బయట చటర్జీపురం ఆదివాసీల ఊహకు కూడా అందని పరిణామాలు జరిగిపోతూవచ్చాయి. భూమి మీద వ్యవసాయం చేసి పంట అమ్ముకోని ‘‘లాభం’’ గడించడం ఇక తగ్గింది. భూమిని ‘కొనడం- అమ్మడం’ అనే రియల్ ఎస్టేట్, సట్టా వ్యాపారం తెర మీదకువచ్చింది. ఎంతకైనా తెగించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వారికి తమ సేవలు అందించే పోలీసు, రెవిన్యూ అధికారులు ఒక మాఫియాగా తయారు కావడం మొదలయ్యింది. చటర్జీపురం గ్రామ ఆదివాసీలలాంటి వారు ఈ మాఫియాకు ఒక ‘‘సాఫ్ట్ టార్గెట్’’గా ఏర్పడ్డారు.
ఈ కొత్త ప్రమాదపు సూచనలు చటర్జీపురం గ్రామవాసులకు అందాయి. ఎప్పుడైనా తమ పేర్లను వెబ్లెండ్ అడంగల్ నుండి తీసేస్తారనే వార్తల భయం వారికి పట్టుకుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న రికార్డులతో నర్సీపట్టణం సివిల్ కోర్టులో భూమి బ్రోకర్స్‌పై కేసు దాఖలు చేశారు. ఆ పత్రాలను 2022 ఆగస్టు 1న రోలుగుంట మండల తహశీల్దార్‌కు అందజేశారు. తమకు న్యాయం జరుగుతుందని అనుకున్న ఆదివాసుల ఊహలు తలకిందులయ్యాయి. 2022 నవంబర్ 22న అప్పటి తహశీల్దార్ వెంకటేశ్వరావు ఆదివాసీల పేర్లను సాగుదారుల కాలం నుండి తీసేశారు. తూర్పగోదావరి జిల్లా బిక్కవోలువాసి పేరు మీద అడంగల్‌లో పేరు నమోదు అవ్వడంతో ఆదివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. తమకు తహశీల్దార్ వెంకటేశ్వరులు అన్యాయం చేశారని, తమ పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరుకు మార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నర్సీపట్టణం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీఓ)కు బాధిత ఆదివాసీలు అప్పీల్ వేయాలి. అయితే గత ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. దీంట్లో భాగంగా ఆర్డీఓకు ఉన్న మొదటి అప్పీల్ అధికారాలను డీఆర్ఓ(జిల్లా రెవిన్యూ అధికారి)కు బదిలి చేసింది. కేవలం చటర్జీపురం బాధితుల విషయంలోనే కాకుండా రాష్ట్రంలో ఎవరికైనా తహశీల్దార్లు తెలిసి కానీ తెలియ కానీ అన్యాయం చేస్తే ఈ చట్టపరమైన మార్పు వల్ల అప్పీల్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, రివిజన్ అప్పీల్‌కు కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఆదివాసీలలాంటి వారికి ఎంతోకొంత తెలిసిన డివిజన్ కేంద్రం నుండి పద్మవ్యూహంలాంటి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇప్పటికైనా ఆ తప్పును సవరించాలి..
ఏ ప్రభుత్వంలోనైన ఐఏఎస్ అధికారులు విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తారు. గత ప్రభుత్వంలో రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరి, భూమి శిస్తు కమిషనర్లు సబ్ కలెక్టర్లుగా ఆర్ఓఆర్ మొదటి అప్పిల్స్, జాయింట్ కలెక్టర్లుగా రివిజన్ అప్పిల్స్ విన్నారు. ఆర్డీఓ నుండి డీఆర్ఓకు(ఆర్ఓఆర్) అప్పీల్ అధికారాలను బదిలి చేసే సమయంలో చటర్జీపురం వంటి పేదవారిని గురించి కూడా ప్రభుత్వ, ఐఏఎస్ అధికారులు ఆలోచించాల్సింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అయినా జరిగిన తప్పును సరి చేయాలని చటర్జీపురం బాధిత ఆదివాసీలు, అలాంటి పేదసాగుదార్లు కోరుతున్నారు.
– పీఎస్ అజయ్ కుమార్