2014లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ విభజన ఫలితంగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త దశకు నాంది పలికింది. 2014లో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన మొదటి ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి భిన్నంగా రాజకీయ మరియు అభివృద్ధి పథంలో నిర్ణయాత్మక మార్పుకు పునాదులు వేశాయి. ఇది పార్టీ నిర్మాణం, ఎన్నికల ఎజెండా మరియు పోటీలో కనిపిస్తుంది. తెలంగాణలో లాగానే కాంగ్రెస్ (ఐ) గణనీయంగా క్షీణించింది. ఆంధ్రప్రదేశ్ లో దాని స్థానాన్ని వైఎస్సార్సిపి కైవశం చేసుకుంది. తాను ఏర్పాటు చేసిన కొత్త రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనం అవటం వైచిత్రి. రాష్ట్ర విభజన పట్ల రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర విరుద్ధమైన రీతిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన పూర్తిస్థాయి రాజధాని నగరాన్ని కోల్పోయిందని, నూతన రాజధాని ఏర్పాటులో పార్లమెంట్లో యుపిఎ ప్రభుత్వం ప్రకటన తర్వాత కూడా అనవసరమైన, క్రూరమైన జాప్యం జరిగిందని ప్రజలు భావించారు.
ఆ విధంగా ఒక దశాబ్దం పాటు రాష్ట్రాన్ని పాలించిన బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, ఆంధ్రా ప్రాంతంలోని కష్టాలకు మరియు ముఖ్యంగా అభివృద్ధి చెందిన రాజధాని నగరాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ కారణమని భావించడంతో ఆ పార్టీ విశ్వసనీయతను, ప్రజాదరణను కోల్పోయింది.
2014 ఎన్నికల ముందునాటి రాజకీయ దృశ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రధాన శక్తులుగా ఆవిర్భవించాయి. జనసేన చిన్న ఆటగాడి పాత్రను పోషించింది. పార్టీల ప్రజా పునాది, నాయకత్వ సరళి మరియు సమీకరణ వ్యూహాల పరంగా ఆంధ్రప్రదేశ్ లో స్పష్టమైన సామాజిక విభజన ఏర్పడిరది. ప్రస్తుతం ఉన్న రాజకీయ సంస్కృతి మరియు పార్టీల పొందికలో ప్రాంతీయ పార్టీలకు ఒక అధినేత, అతని కుటుంబం ఒక నిర్దిష్ట ఆధిపత్య కులం వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ విధంగా టిడిపికి ఆధిపత్య కమ్మ సామాజికవర్గం, వైఎస్సార్సీపీ కి ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గం సామాజిక పునాదిగా ఉన్నాయి. జన సేన విషయానికొస్తే, నాయకుడు కాపు అయినప్పటికీ, కాపు కులంలో అంతర్గత వైవిధ్యం ఉండటం వలన ఆ కులం మద్దతు పాక్షికంగానే ఉంది. నిజానికి కాపు కులానికి కమ్మ, రెడ్డి కులాలతో పోల్చినప్పుడు ఒక ఆధిపత్య కులానికి ఉండవలసిన లక్షణాలు ఇంకా పూర్తిగా సమకూరలేదు. ఉదాహరణకు కాపులకు గణనీయమైన సామాజిక, ఆర్థిక పెట్టుబడులు, మీడియా మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్, చర్చలు జరిపి సామాజిక కూటములను ఏర్పాటు చేసి, నిర్వహించడం వంటి సామర్థ్యాలు ఇంకా సమకూరలేదు. ఈ పరిస్థితి కాపు కులాన్ని ఎన్నికల రంగంలో ఆధిపత్య రాజకీయ శక్తిగా ఎదగడానికి అడ్డంకిగా ఉంది.
వైఎస్సార్సీపీ ఆవిర్భవించిన తీరు, ఎదుగుదల మరియు పటిష్టత ప్రత్యేకంగా అధ్యయనం చేయదగిన అంశం. ప్రముఖ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి తానే వారసుడిని కావాలనే వాదనతో ముందుకు వచ్చాడు. భారతదేశ రాజకీయ పార్టీలలో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలోగల ఈ ధోరణి ఆధిపత్య పితృస్వామ్య రాజకీయ సంస్కృతి లక్షణం. కాంగ్రెస్ హైకమాండ్ జగన్‌కు ఈ హక్కు/ప్రత్యేకతను నిరాకరించడం ప్రజలకు అన్యాయంగాను, బాధాకరంగాను అనిపించింది. ఈ నేపథ్యంలో జగన్ దానిని సవాలుగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా ఓదార్పు యాత్ర పేరుతో పాదయాత్రలు చేపట్టారు. 2004లో అధికారంలోకి రావడం సులభతరం చేసిన వైఎస్ఆర్ పాదయాత్రను గుర్తు చేస్తూ జగన్ కొత్త రాష్ట్రంలో పాదయాత్రలు కొనసాగించి ప్రజలకు చేరువయ్యాడు. కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంపై నిరంతర విమర్శలు చేస్తూ, ప్రత్యామ్నాయంగా ‘రాజన్న రాజ్యం’ అవసరాన్ని ఎత్తిచూపాడు. 2019 లో వైఎస్సార్సీపీ ఎన్నికల విజయం ఈ యువ నాయకుడి పట్టుదలకు మరియు అతని తండ్రి వారసత్వానికి ప్రజామోదంగా చూడవచ్చు.
పై నేపధ్యంలో ఏపీ రాజకీయ దృశ్యం టీడీపీ మరియు వైఎస్సార్సీపీ ఆధిపత్యంలో ఉంది. ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
2014 ఎన్నికల్లో టీడీపి-బీజేపీ కూటమి 47.1 శాతం ఓట్లతో 102 అసెంబ్లీ సీట్లతో విజయం సాధించింది. వైఎస్సార్సీపీ 44.6 శాతం ఓట్లతో 67 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2.94 శాతానికి దిగజారింది. బహుశా కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 49.9 శాతం ఓట్లతో 151 స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కులాధారిత వైరుధ్యం ఘనీభవించింది. కేవలం 40 శాతం ఓట్లతో 23 స్థానాలకు టీడీపీ దిగజారింది.
ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం అనే అంశం రాజకీయ పార్టీల ఎజెండాలో ప్రధానాశంగా ఉంది. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. సైబరాబాద్‌గా పిలువబడే రాజధానిలోని కొత్త భాగంలో ప్రారంభించబడిన ఐటి మరియు అనుబంధ సేవలకు గమ్యస్థానంగా ఐటి కేంద్రంగా బెంగళూరు తర్వాత స్థానం సంపాదించటానికి కారణం చంద్రబాబు నాయుడు చొరవేనని గుర్తించబడింది. అభివృద్ధి చిహ్నంగా, వృద్ధికి అనుకూల గురువుగా నాయుడి ఇమేజ్ రూపొందటంలో మీడియా, హైటెక్ పరిశ్రమ కీలక పాత్ర పోషించాయి. దీెనికి టెక్ దిగ్గజాల, బహుళ-పార్శ్వ ఏజెన్సీల మద్దతు ఉంది. ఔత్సాహిక మధ్యతరగతి దీనిని విశ్వసించింది. ఇది రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధానిని నిర్మించడానికి అవసరమైన సామర్థ్యంగా గుర్తించబడింది.
అమరావతిని ఆధునిక రాజధాని నగరంగా నిర్మించడం కోసం భూ యజమానులను ‘‘అభివృద్ధిలో భాగస్వాములుగా’’ పరిగణిస్తూ నిర్దిష్ట ‘ల్యాండ్ పూలింగ్’ పథకాన్ని రూపొందించారు. రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రతిఘటనతో భూసేకరణ ప్రక్రియ ఆలస్యం కావటంతో పాటు ఆశించిన కేంద్రం ఆర్థిక సహకారం అంత తేలికగా రాకపోవడంతో రాజధాని అభివృద్ధికి ఆటంకం ఏర్పడిరది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతగానో కోరుకున్న ప్రత్యేక హోదాను ఇవ్వకపోవటంతో, టిడిపి ఎన్‌డిఎ కూటమికి దూరమైంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. వైఎస్సార్సీపీ చేతిలో ఓటమి పాలైంది.
అమరావతిని రాజధానిగా చేయాలనే ఆలోచనను వైఎస్ఆర్సిపి విరమించుకోవాలని ప్రయత్నించినప్పుడు, మొదట్లో తమ భూములను ఇవ్వడానికి వెనుకాడిన రైతులు ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. ఫలితంగా తీవ్ర అణచివేతను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి, కొత్త రాజధాని కోసం భూసేకరణ చేసినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారంగా పరిహారం చెల్లించేందుకు 2024 ఎన్నికలలో టిడిపికి మద్దతుగా ఈ రైతులు ర్యాలీ చేశారు.
ఎలక్టోరల్ పాపులిజం మరియు సంక్షేమ విధానాలు
2014లో ఏపీ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైఎస్సార్సీపీ రెండూ చాలా విస్తృతమైన ప్రజాకర్షక సంక్షేమ పథకాలు అమలు చేశాయి. 1980ల మధ్యలో తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌టి రామారావు హయాంలో రూ. 2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, వ్యవసాయ రంగానికి సబ్సిడీతో విద్యుత్ సరఫరా, పేదలకు గృహనిర్మాణ పథకం మొదలైన ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టటం జరిగింది. 1995లో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, అభివృద్ధి వెనకబాటుకు ఎన్టీఆర్ బ్రాండ్ పాపులిజం కారణమని సంక్షేమ వ్యయాలను భారీగా తగ్గించేందుకు స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్ర స్థాయి సరళీకరణ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ, అనుబంధ గ్రామీణ రంగాలకు ప్రభుత్వం సంస్థాగత, బడ్జెట్ మద్దతును తగ్గించి, ఐటి మరియు పట్టణ అనుకూల విధానాలను అవలంబించిన పర్యవసానంగా రైతుల, చేనేత కార్మికుల ఆకలి చావులకు, ఆత్మహత్యలకు దారితీసింది. చంద్రబాబు నాయుడి పాలన ఎన్నికల ఓటమికి దారితీసినప్పటికీ, హైదరాబాద్ నగరం అనూహ్యంగా అభివృద్ధి కావటం, దేశంలోనే ఒక ప్రధాన ఐటి కారిడార్‌గా వృద్ధి చెందటానికి ఉత్ప్రేరకంగా పనిచేసిందనే భావన స్థిరపడింది.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచడం, ముఖ్యంగా కొత్త రాజధానిని అభివృద్ధి చేయడం వంటి సవాలును ఎదుర్కోగల నమ్మకమైన నాయకుడిగా నాయుడు పునరుజ్జీవనానికి ఈ వాస్తవం ఉపయోగపడింది. బహుశా గత అనుభవం నుండి నేర్చుకుని, జనాభాలోని విస్తారమైన వర్గాలపై నయా-ఉదారవాద విధాన చట్రం యొక్క తీవ్రమైన పరిణామాలను కూడా గ్రహించి కొత్త పాత్రలో నాయుడు తన పూర్వపు స్వభావాన్ని మార్చుకుని ప్రజా అనుకూల సంక్షేమ చర్యలను అమలు చేయడానికి ప్రయత్నించాడు.
ఆ విధంగా ఆంధ్రపదేశ్ లో టిడిపి ప్రభుత్వం తన సామాజిక మద్దతును, ప్రజాకర్షణను నిలబెట్టుకోవడానికి ప్రజాకర్షక విధాన పాలనను అనుసరించటాన్ని చూడవచ్చు. తదనంతర విధానాలు, పథకాలకు ఎక్కువగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కనిపించే పాలన వ్యక్తిగతీకరణకు చిహ్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎన్టీఆర్ పాలనకు ప్రతీకగా మారిన సబ్సిడీ బియ్యం పథకం, వృద్ధులు మరియు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) కోసం పసుపు కుంకుమ పథకం, యువతకు నిరుద్యోగ భృతి మరియు చంద్రన్న బీమా యోజన వంటి అనేక కొత్త వాటిని కొనసాగించింది. తెలంగాణలో కళ్యాణలక్ష్మి / షాదీముబారక్ పథకం మాదిరిగానే చంద్రన్న పెళ్లికానుక పథకం కింద నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆసరా కల్పించారు. ఆంధ్రపదేశ్, తెలంగాణలలో ప్రజల అసంతృప్తితో తీవ్రమైన ఎన్నికల పరిణామాలుంటాయనే భయంతో భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి వైదొలగడానికి లేదా పలుచన చేయడానికి సాహసించలేని బలీయమైన సంక్షేమ పాలనకు తెరదీయటాన్ని చూడవచ్చు.
అయినప్పటికీ, ‘‘రాజన్న రాజ్యం’’ వాగ్దానంతో పాటు సుదీర్ఘమైన మరియు విరామంలేని యాత్రతో, ఎక్కువ ప్యాకేజీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తానని చేసిన వాగ్దానం ప్రజాదరణ పొందటంతో 2019 ఎన్నికలలో జగన్ చేతిలో టీడీపీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. టీడీపీ పాలనలో అవినీతి, స్థానిక ఎమ్మెల్యే కేంద్రంగా వివిధ స్థాయిల్లో వనరుల గుత్తాధిపత్యం, కులాలపై ఆధిపత్యం చెలరేగడం వంటి అంశాల్లో టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆర్థిక మరియు సామాజిక పునాదిని కూల్చివేయడం ద్వారా టీడీపీని బలహీనపరచడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నించింది. ఇది అమరావతి చుట్టూ జరిగిన ఘటనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి కమ్మల ఆర్థిక శక్తి కేంద్రంగా, ఒక ప్రతీకాత్మక వనరుగా ఉందని వైఎస్ఆర్సిపి విమర్శించింది. ఈ విధంగా అమరావతిని ఉద్దేశపూర్వకంగా అనిశ్చితి స్థితిలో ఉంచారు. ప్రణాళికాబద్ధమైన అనిశ్చితి, పనులు నిలిపివేయడం, శత్రుత్వం, మెగా రాజధాని నగర ఆలోచనను ఖండిరచడం వంటి చర్యలకు జగన్ ప్రభుత్వం పాల్పడిరది. అందుకు ప్రత్యామ్నాయంగా మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తీసుకురావడం జరిగింది.
రాజన్న రాజ్యం అని పిలవబడే మరో అంశం ప్రజాకర్షక-సంక్షేమ విధాన పాలనను కొనసాగించడం. సరళంగా చెప్పాలంటే, దీని పరిధి మరియు వ్యయం అన్ని పరిమితులను దాటిపోయింది. ఈ పెరిగిన సంక్షేమ వ్యయం ప్రాంతీయ అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రజా సేవలు మరియు రహదారుల స్థితి దయనీయంగా మారింది. అభివృద్ధిపై రాజీ పడటం, మానవ నైపుణ్యాలను, వనరులను విస్మరించడం, అంతులేని అవినీతి రాష్ట్ర వినాశనానికి దారితీస్తుందని తేలింది.
2024 ఎన్నికలు: టీడీపీ పునరాగమనం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కేంద్రీకృత, అధికార-వ్యక్తిగత, పితృస్వామ్య పాలనకు వ్యతిరేకంగా అభివృద్ధి సమస్యలు, విధాన రూపకల్పన లేదా పాలనకు సంబంధించిన విధానం మరియు కార్యనిర్వాహక విధానంలో పూర్తిగా పైనుంచి క్రిందికి నడిచే పాలనకు వ్యతిరేకంగా ఇది తెలంగాణా మాదిరిగానే ప్రజాదరణ పొందిన తీర్పుగా పరిగణించబడుతుంది.
పైన వివరించిన కారణాల పర్యవసానంగా సంస్థాగత క్షీణత, శాంతిభద్రతల విషయంలో రాజీపడటం జరిగింది. అలాగే అవినీతికి పాల్పడకుండా ఉండాలనే నియమం విస్మరించడం జరిగింది. అన్ని విషయాలపై జగన్ వ్యక్తిగత నియంత్రణ, విధేయత ఉండేలా చూశాడనటానికి మరో ఉదాహరణగా తన పథకాలను ప్రజలకు చేర్చేందుకోసం ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ వ్యవస్థను చెప్పుకోవచ్చు. ఈ వాలంటీర్ల కు ఇచ్చిన అలవెన్సులను రాష్ట్ర ఖజానా నుండి చెల్లించారు. అయితే ఈ వాలంటీర్లు అధికారిక చట్టపరమైన-సంస్థాగత పరిధిని దాటి పనిచేశారు. రాజకీయ, పౌర సమాజంపై నిఘా ఉంచడం, ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం, నిర్వహించడం, ప్రభుత్వ అనుకూల పాత్రను పోషించడం వంటి పనులను ఈ వాలంటీర్లు చేశారు. వీరి ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూశారు.
ఈ కాలంలో వ్యక్తిగతమైన ప్రజాకర్షక పాలనా శైలి పర్యవసానంగా కనిపించేది ఏమిటంటే, పార్టీ కేడర్‌లోని అన్ని స్థాయిలలో రాజకీయ భాష, ప్రవర్తన నీచమైన స్థాయికి దిగజారాయి. చారిత్రకంగా దక్షిణ భారతదేశం గొప్ప రాజకీయ చతురత, సామాజిక విమర్శ, బలమైన వాదనలకు ప్రసిద్ధి చెందినప్పటికీ (బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం రోజుల నుండి) అది ఇటీవలి కాలంలో అనూహ్యంగా అధ్వాన్న స్థాయికి చేరుకుంది. అత్యంత నీచ స్థాయి బూతుల సంస్క్రతి ఫలితంగా ప్రైవేట్, పబ్లిక్ జీవితాల మధ్య ఉండవలసిన భేదం నేడు తుడిచిపెట్టుకుపోయింది. ప్రజా జీవితంలో ఈ రాజకీయ నైతిక పతనాన్ని తీవ్రంగా పరిగణించకుండా జగన్ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతికూల ఎన్నికల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించలేము.
ప్రజాస్వామ్య పాలనకు మద్దతుగా ఉదారవాద సిద్ధాంతం శక్తివంతమైన పౌర సమాజ విమర్శ అవసరాన్ని నొక్కి చెబుతుంది. పౌరుల హక్కులు, చట్టాల అమలు, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అనివార్యతలు. దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల ఈ రెండూ కొరవడినాయి. ఆంధ్రప్రదేశ్ లో హేతువాద, వామపక్ష, సంఘ సంస్కరణ, దళిత ఉద్యమాల సుదీర్ఘ సామాజిక, చారిత్రక సంప్రదాయం ఉన్నప్పటికీ, తెలంగాణలో సుదీర్ఘమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల పౌర సమాజానికి ఉండాల్సినంత స్థాయిలో చైతన్యం లేకపోవడం ఓ ప్రధాన సమస్య. ఒక ముఖ్యమైన కోణంలో ఈ రాష్ట్రాల్లో జనాదరణ పొందిన పాపులిస్టు పథకాలను ప్రజలు విస్మరించి ఎన్నికల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునివ్వటం సమిష్టి పౌరసమాజ స్పందనగా భావించాలి. దీనిని కేవలం రాజకీయపార్టీల ఎన్నికల రాజకీయంగా అర్థం చేసుకోలేము.
ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చడంలో పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. ఇది కర్నాటక రాష్ట్రంలో పాలన మార్పును ప్రభావితం చేసిన ‘ఒద్దెలు కర్ణాటక’ ప్రయోగం స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పౌర ప్రమేయం విస్తృతి రాష్ట్ర సరిహద్దులకు ఆవలకు విస్తరించింది. టీడీపీకి ప్రధాన పునాదిగా ప్రపంచవ్యాప్తంగావున్న యావత్ కమ్మ సామాజిక వర్గం సమీకృతమై, ఇదే ‘‘చివరి అవకాశం’’ అని భావించి, పాలనతో విసిగిపోయిన సామాజిక శక్తులతో సమన్వయం చేస్తూ వివిధ రూపాలలలోగల తన శక్తి, యుక్తులను ప్రభావవంతంగా ఉపయోగించింది.
ప్రవాస భారతీయులు, తెలుగు ప్రవాసులు సుదూర ప్రాంతాల నుండి వారి స్వంత ఖర్చులతో వారి స్వంత ప్రాంతాలకు వెళ్లి బస చేసి పాలక పార్టీ పాలన, అభివ్రుద్ధిలో జరిగిన అవకతవకలను ఎత్తిచూపుతూ ప్రచారం చేశారు. ఇలా వచ్చిన, వచ్చి ప్రచారం చేసిన వారి సామాజిక స్వరూపాన్ని గమనించటం ఉపయోగకరంగా ఉంటుంది: వారు ఉన్నత విద్యావంతులు. విదేశాలలో, హైదరాబాదులో ఉన్నత స్థానాలలోవుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఉందనే భావనకలవారు. సామాజికంగా అందరూ కాకపోయినా వీరు ప్రధానంగా కమ్మ, ఇతర ఎదుగుతున్న కులాలకు చెందినవారు. వాస్తవంగా వీరు నయా సంపన్నులు. రాష్ట్రంలో జరుగుతున్నది రాష్ట్ర హితంగా లేదని వారు భావించారు. చంద్రబాబు నాయుడి మాత్రమే రాష్ట్రాన్ని గట్టెక్కించగలడని, ఆయన విజయాన్ని సుసాధ్యం చేయడమే తమ కర్తవ్యంగా వారు కార్యోన్ముఖులయ్యారు. ఆ విధంగా అహంకారపూరితమైన వైఎస్సార్సీపీ గెలుచుకున్న శాసన సభ్యుల సంఖ్య కేవలం 11 స్థానాలకు పతనం అయింది.
టీడీపీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు అనేకం. అవి అత్యంత సంక్లిష్టమైనవి. వీటిలో మునుపటి పాలన వారసత్వంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం అత్యంత ముఖ్యమైనది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో రాజకీయంగా వ్యూహాత్మక భాగస్వామిగావున్న టిడిపి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. సంఖ్యాపరంగా బీజేపీ తర్వాతి స్థానంలో ఉన్న టీడీపీ బిజేపీ నేత్రుత్వంలోని బలహీనమైన కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఇవ్వటం ద్వారా ప్రత్యేక హోదాను పొందలేకపోయినా, మెరుగైన ప్యాకేజీలన అందుకుంటుంది. ఇది గత పాలనలోని కేవలం జనాకర్షక లక్షణానికి భిన్నంగా అభివృద్దికి అనుకూలం అనే ఇమేజ్ను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిస్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించటం ఇందులో ప్రధానాంశం.
సవాళ్లు
అభివృద్ధి, సంక్షేమ సవాళ్ల మధ్య సమతౌల్యం సాధించటమే టీడీపీ ప్రభుత్వం ముందున్న అత్యంత క్లిష్టమైన పని. తిరిగి గెలవాలంటే ప్రజా ప్రయోజనాలను, ఆధిపత్య వర్గాల వర్గ డిమాండ్లను పరిష్కరించడం మొదటిది, ప్రజల జీవితాలను, జీవనోపాధిని నాశనం చేస్తున్న నయా-ఉదారవాద పెట్టుబడి యెక్క ఆదిమ సంచయం సమస్యను అధిగమించి, ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేయడం రెండవది. ఎన్‌డిఎ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా చేరడం ద్వారా టిడిపి బలహీనంగా ఉన్న బిజెపితో బేరమాడి ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా నిధులను పొందాలని చూస్తుందనటంలో సందేహం లేదు.
ఆర్థిక సామాజిక అభివ్రృద్ధిలలో సమతౌల్యం ఉండాలని, సహేతుకంగాను, న్యాయబద్దంగాను పాలన సాగించాలనే అంశాలు ప్రజామోదంలో అంతర్లీనంగా ఉన్నాయనే విషయాన్ని టిడిపి విస్మరించజాలదు. నయావుదారవాద శకంలో వామపక్షాలు క్షీణించిన స్థితిలో ప్రజల ప్రతిస్పందనలు, నిరసనలు, చలనాలు తక్కువ స్థాయిలో, స్థానికంగా, అస్థిత్వాల ఆధారంగా, సమస్యల కేంద్రంగా ఉంటాయి. ప్రజల అసంతృప్తి, కోపం ఎన్నికల క్షేత్రం కేంద్రంగా వ్యక్తమౌతుంది. ఇది పాలక పార్టీలను మార్చటానికి దారితీస్తుంది. రాజకీయ పార్టీలు తీవ్ర ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కోనవసరం లేకుండా ఉండాలంటే ఆవిర్భవిస్తున్న ఈ వాస్తవికత నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. వివిధ స్థాయిల్లో ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించటం ద్వారానే ఇది సాధ్యం. అందుకోసం ప్రాంతీయ పార్టీలు నిజాయితీగా తమను తాము అంతర్గతంగా ప్రజాస్వామ్యీకరించుకోవలసి ఉంటుంది.
రచయిత : కర్లి శ్రీనివాసులు, Senior Fellow, ICSSR, New Delhi, Professor (Retd), Osmania University, Hyderabad
(అనువాదం: చూపు కాత్యాయని)