
రాజస్తాన్లోని పాలి జిల్లాలో సుమేర్పూర్ నియోజకవర్గంలో గ్రామస్తులు రాష్ట్ర మంత్రి జోర్ రాం కుమావత్ అనుయాయులకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశారు. తమ గ్రామానికి తాగు నీరు, కరెంట్ సరఫరా ఆపేసేందుకు బరితెగించారని ఆరోపించారు.
కుమావత్ ఈ మధ్య కాలంలో సుమర్పూర్ నియోజకవర్గం పరిధిలోని భావనా గ్రామ పంచాయితీ పరిధిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించి గ్రామస్తులు మంత్రిని ప్రశ్నించారు. ఆ తర్వాత మంత్రి అనుయాయులు ఈ చర్యలకు పాల్పడినట్టుగా గ్రామస్తులు ఆరోపించారని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కథనం తెలిపింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయటానికి మంత్రి పర్యటించారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, గోపాలన, దేవాదాయ శాఖ మంత్రిని గ్రామస్తులు నిలదీస్తుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రి అనుచరులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. మంత్రికి ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నాయని, మంత్రి సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. దీంతో స్థానికులు మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడకుండానే వెనుదిరిగారు.
“గ్రామస్తులు అక్రమంగా తాగునీరు, కరెంట్ కనెక్షన్లు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, వాటిని తొలగించటానికి ఆదివారం కొందరు వచ్చారు. ఇళ్లకు తీసుకున్న కనెక్షన్లు అక్రమం ఎలా అవుతాయి? అలా మీకు సమాచారం ఉంటే కనెక్షన్లు తొలగించటానికి ముందు నోటీసు ఇవ్వాలి” పత్రికతో మాట్లాడుతూ అడ్వకేట్ కిరణ్ కుమార్ మీనా అన్నారు.
“నిన్న మా సమస్యలపై మంత్రిని నిలదీశాము. ఈ రోజు మమ్ములను ఇబ్బంది పెట్టడానికి మంత్రి అనుచరణ గణం వచ్చింది” అని స్థానికులు అన్నారు.
“నేనో సాధారణ వ్యక్తిని, ఇక్కడ 200 గుడిసెలు వేసుకున్న దళిత, ఆదివాసీ కాలనీ ఉంది. నిన్న మంత్రి ఇక్కడకు వచ్చినపుడు బడి పై కప్పు కారుతోంది సరి చేయిస్తే పిల్లలకు ఉపయోగమని చెప్పాలనుకున్నాము. పక్కా రోడ్లు కూడా లేవు. వీటిగురించి విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనుకున్నాము. కానీ మంత్రి, ఆయన అనుచరులు విజ్ఞప్తి తీసుకోకుండా మమ్ములను నెట్టేశారు. ఆయనకు అర్జెంట్ పనులు ఉన్నాయని వెళ్లి పోయారు” అని మీనా వివరించారు.
ఈ ఘటనపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ఈ వార్తపై జిల్లా కలెక్టర్ లక్ష్మీ నారాయణ స్పందించారు. తాను మంత్రితో మాట్లాడతానని, జిల్లా పాలనా యంత్రాంగంగా తాము చేయాల్సింది, తాము చేస్తామని ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.