
న్యూ ఢిల్లీ: ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, ది వైర్ సంపాదక బృందం, విలేకరులు, విశ్లేషకులు, ది వైర్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసే కరన్ థాపర్లపై అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, దేశద్రోహం చట్టం కింద చర్యలు తీసుకోబూనటం పత్రికారంగం నోరు నొక్కే చర్యలే తప్ప మరోటి కాదని ప్రధాన పత్రికలన్నీ ధ్వజమెత్తాయి. అస్సాం ప్రభుత్వ చర్యలను పలు పత్రికలు తమ సంపాదకీయ వ్యాఖ్యానాలలో తీవ్రంగా విమర్శించాయి.
“బల ప్రయోగం చేస్తున్న రాజ్యం” అన్న శీర్షికన ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన సంపాదకీయంలో, అస్సాంలో జర్నలిస్టులపై హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయటం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే కాకుండా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించే చర్యగా అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలు భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను, చట్టబద్ధమైన పాలన విషయాలు తెలుసుకునేందుకు పౌరులకు ఉన్న హక్కులను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంపాదకీయంలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ది వైర్ బృందానికి, వరదరాజన్‌కు రెండోసారి అస్సాం ప్రభుత్వం సమన్లు పంపటం గురించి సవివరంగా ప్రస్తావించింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన సంపాదకీయంలో, “ఆపరేషన్ సిందూర్ గురించి ది వైర్లో వచ్చిన వ్యాసాలు, విశ్లేషణలపై అస్సాం పోలీసులు ది వైర్ వార్తా సంస్థ సిబ్బందికి, వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్‌కు దేశద్రోహం చట్టం కింద సమన్లు జారీ చేశారు. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయంలో భాగంగా ఉన్న సైనిక విభాగం అధికారి ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం యుద్ధ విమానాలను కోల్పోవడం గురించి, భారత ప్రభుత్వం అనుసరించిన ఎత్తుగడలు వ్యూహం గురించి ప్రస్థావించారు. దీనికి సంబంధించిన వ్యాసాలు, విశ్లేషణలు ది వైర్లో విస్తృతంగా వచ్చాయి. ఈ వ్యాసాల ఆధారంగానే “ది వైర్ విశ్లేషణలు భారతదేశపు సార్వ భౌమాధికారం, ఐక్యత సమగ్రతలకు భంగం కలిగిస్తున్నాయ” అంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 12వ తేదీ సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ది వైర్ బృందం, వరదరాజన్లపై ఎటువంటి ప్రతికూల మోసపూరిత చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. అయినా సరే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మరొక జిల్లాలో మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసింద” అని వివరించింది.
ఈ పత్రిక తన సంపాదకీయంలో విలేకరులు రాసే వార్తలు, చేసే విశ్లేషణలపై రాజ్యాంగ యంత్రాంగం దేశద్రోహం కేసులు నమోదు చేయటం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కూడాని అభిప్రాయపడింది.
సంపాదకీయంలో 1962 నాటి కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావిస్తూ, ఎంత తీవ్రంగా విమర్శించినా, ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం కాదని, సదరు విమర్శ జనాన్ని రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు పాల్పడేలా ప్రేరేపించినప్పుడు మాత్రమే దాన్ని దేశద్రోహంగా పరిగణించాలన్న సుప్రీంకోర్ట్ ఆదేశించిన సంగతిని గుర్తు చేసింది.
2022లో దేశద్రోహం సెక్షన్లను రద్దు చేయాలని స్వయంగా ప్రభుత్వమే కోరిన విషయాన్ని కూడా సంపాదకియం ప్రస్తావించింది.
“2023లో కొత్త న్యాయ సంహిత చట్టాలను ఆమోదించినప్పుడు దేశద్రోహం ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లను నామమాత్రపు మార్పులతో కొనసాగించారు. పూర్వపు పీనల్ కోడ్‌లో రాజద్రోహమని ఉంటే, న్యాయ సంహితలలో మాత్రం దేశద్రోహమని ప్రస్తావించారు. కానీ ఈ చట్టాన్ని హద్దు పద్దు లేకుండా ఉల్లంఘించే అవకాశాలు మాత్రం యధాతథంగానే ఉన్నాయి” అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం ఆందోళన వ్యక్తం చేసింది.
2020 మేలో రిపబ్లిక్ టీవీ యాంకర్ అర్ణబ్ గోస్వామికి ఊరట కలిగిస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. అందులో “ఒక విలేకరి తన విద్వక్ ధర్మంలో భాగంగా చేసే పనులపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయటం, పలు న్యాయస్థానాలకు తిరిగేలా చేయటం, ఒకే ఆరోపణలపై వేర్వేరు చోట్ల కేసులు బనాయించడం వంటి చర్యలు స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు తప్ప మరోటి కాదు. ఈ రకంగా వ్యవహరించడం దేశంలో ప్రభుత్వ పరిపాలన గురించి ప్రజలు తెలుసుకునే హక్కును పాత్రికేయుల స్వేచ్ఛను ధ్వంసం చేయటమే” అని వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకీయం ఉటంకించింది.
నూతన నేర చట్టాలలోని దేశద్రోహం గురించిన సెక్షన్లపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున, అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించాలని కోరుతూ తన సంపాదకీయాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ముగించింది.
గొంతు నులమటం..
కలకత్తా నుండి వెలువడే ది టెలిగ్రాఫ్ పత్రిక తన సంపాద కీయంలో “దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత కూడా ది వైర్ సంపాదకులకు వ్యతిరేకంగా, భారతీయ న్యాయ సంహితలోని 152 సెక్షన్‌ను అనుసరించి అస్సాం పోలీసులు కేసు నమోదు చేయడం అంటే, పత్రికా స్వేచ్ఛ గొంతు నులమడమే”నని వ్యాఖ్యానించింది.
“ఏ దేశంలోనైతే విలేఖర్లు రాసే వార్తలు, చేసే విమర్శలు, దేశద్రోహం చట్టం కింద నేరంగా పరిగణించబడతాయో ఆదేశంలో పత్రిక స్వాతంత్రం గురించి తీవ్రమైన ఆందోళన చెందాల్సి ఉంటుంది” అంటూ ది టెలిగ్రామ్ తన సంపాదకీయాన్ని ప్రారంభించింది.
“రెండోసారి సమన్లు జారీ చేయటం చూస్తే రచయితలు, విలేకరులు, ప్రభుత్వ చర్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసే కార్యకర్తలకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుతున్న తీరుకు స్పష్టమైన ఉదాహరణ. అంతేగాక మొదటి దశ సమన్లు జారీ చేసినప్పుడు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయటానికి సిద్ధంగా లేదన్న విషయం కూడా తాజా పరిణామం రుజువుచేస్తుంద”ని విశ్లేషించింది.
ది టెలిగ్రాఫ్ తన సంపాదకీయంలో ” ఆయా సందర్భాలను బట్టి ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను విమర్శించే స్వేచ్ఛ పత్రికా రంగానికి ఉంటుంది. అటువంటి పత్రిక రంగాన్ని కూడా లక్ష్యంగా చేసుకొని ఇటువంటి దాడులు చేయడం అంటే, దేశంలో ఏమాత్రం అసమ్మతి స్వరాలు వినిపించకుండా గొంతు నులమటమే” అని అభిప్రాయపడింది.
ది టెలిగ్రాఫ్ తన సంపాదకీయంలో ” పాత్రికేయులు అందరూ తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును కలిగి ఉన్నారు. సుప్రీంకోర్ట్ పాత్రికేయ రంగాన్ని కూడా రక్షణ కల్పించడం అవసరం” అని అభిప్రాయపడింది. అదే సమయంలో ఒక ప్రజాస్వామిక దేశంలో పాత్రికేయరంగాన్ని నడిపించడానికి సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థల నుంచి రక్షణ కోరాల్సి రావటం పరిస్థితి దౌర్భాల్యాన్ని సూచిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
భవిష్యత్తు గురించి టెలిగ్రాఫ్ సంపాదకీయం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, “ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలోని సానుకూల విలువలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తారు. పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు. చట్టాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా జర్నలిస్టుల నోరు మూయించే ప్రయత్నం చేయటమంటే, పాత్రికేయ రంగానికి ఉండే స్వయంప్రతిపత్తిని తొలగించడమే అవుతుంది. దాంతోపాటు చట్టాలకు రాజ్యాంగానికి ఉన్న అధికారాలను ధిక్కరించడమే అవుతుంది” అని హెచ్చరించింది.
దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేయాలి..
1735 నాటి అలెగ్జాండర్ పోప్ రాసిన కవిత ఎపిస్టల్ టు డాక్టర్ అర్బర్ట్నోట్ను ఉదహరిస్తూ ఎకనమిక్ టైమ్స్ తన సంపాదకీయ వ్యాఖ్యను ” చక్రం విసిరితే సీతాకోక చిలుక రెక్కలు తెగిపోతాయా” అనే వాక్యంతో మొదలు పెడుతుంది. దీంతో నిరంతరం అనుమానించే కళ్ళలో పడకుండా ఉండటమే మేలు అని వ్యాఖ్యానించింది.
అస్సాం ప్రభుత్వం జర్నలిస్టులను ఎలాగైనా అదుపులో పెట్టుకునేందుకు పడుతున్న పాట్ల గురించి వ్యాఖ్యానిస్తూ ఎకనమిక్ టైమ్స్ “చిన్నపాటి పొరపాట్లకు కూడా అడ్డు అదుపూ లేని స్థాయిలో అధికారాన్ని ఉపయోగించడం గురించిన ప్రశ్నలను లేవనెత్తుతున్న సందర్భం ఇది. దేశద్రోహానికి పాల్పడ్డారని అనుమానంతో కొంతమంది పాత్రికేయులను అదుపులోకి తీసుకోవడానికి, పదేపదే చేస్తున్న ప్రయత్నాలు ఒక తప్పుడు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయటానికి సంబంధించిన పెద్ద ఉదాహరణ. ది వైర్లో పని చేస్తున్న పలువురు పాత్రికేయులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం దాన్ని అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడం చట్ట వ్యతిరేక చర్య. ఎందుకంటే ఏ ఎఫ్ఐఆర్నైనా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. ఆరోపితులకు తప్పనిసరిగా కాపీలు అందజేయాలని చట్టం చెప్తోంది” అని స్పష్టం చేసింది.
అస్సాం పోలీసుల ప్రయత్నాల పూర్వాపరాలు వెలికి తెచ్చే ప్రయత్నంలో ఎకనమిక్ టైమ్స్ ” ఇదంతా ఏమిటంటే, ఇండోనేషియా భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన రక్షణ శాఖ అధికారి ఒక సెమినార్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, వార్తా సంస్థ తప్పుడు వార్తలు ప్రసారం చేసిందనే ఆరోపణలకు సంబంధించిన వ్యవహారమే. ఒకవేళ వార్త కథనంలో కొద్దిపాటి పొరపాట్లు ఉన్నా, జకార్తలోని భారత రాయబార కార్యాలయం వ్యాఖ్యలను కూడా జోడించి వార్తలు ప్రచురించిన తర్వాత అటువంటి వార్త ఏ విధంగా దేశంలో వేర్పాటు వాదాన్ని, సాయుధ తిరుగుబాటులను, ప్రత్యేక ఉద్యమాలను, విచ్ఛినకర కార్యకలాపాలను, లేదా ప్రజలలో వేర్పాటు ధోరణులను రెచ్చగొడుతుంది! ఈ వార్త ఏ విధంగా సార్వభౌమత్వాన్నికి, దేశ ఐక్యతకు, సమగ్రతకు ఎలా ముప్పు వాటిల్ల చేస్తుంది?పోలీసు రాజ్యం పరిధికి వెలుపల ఉన్న వారికి ఎవరికీ ఇది అర్థం కాని విషయం” అని వ్యాఖ్యానించింది.
ఈ రెండవ ఎఫ్ఐఆర్ కాపీలు అందజేయడానికి సిద్ధం కాకపోవడం, ఆ కాపీలు బహిరంగ పరచడానికి సిద్ధం కాకపోవడం ఒకటి చాలు ఈ దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయడానికి అని ఎకనమిక్ టైమ్స్ పేర్కొన్నది. “ఈ ప్రమాదం కేవలం అస్సాంలాంటి బీజేపీ పాలక రాష్ట్రాలకే పరిమితం కాలేదు. బీజేపీ ఇతర రాష్ట్రాలలో సైతం, రాజును మించిన రాజభక్తులు రాజు అనుగ్రహం కోసం తాపత్రయపడే క్రమంలో ఇటువంటి ప్రమాదాలు పొంచుకొస్తున్నాయి” అంటూ ఎకనమిక్ టైమ్స్ సంపాదకీయం గుర్తు చేసింది.
దేశద్రోహం గురించి మరోసారి: భగ్నమవుతున్న పత్రిక స్వేచ్ఛ..
ఇది ది హిందూ సంపాదకీయానికి ఇచ్చిన శీర్షిక. పదునైన ప్రారంభపు వాక్యాలలో ది హిందూ సంపాదకీయం “ప్రచురణకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం, సరైన దర్యాప్తు కావలసిన సాక్ష్యాధారాల సమీకరణ పరిశీలన లేకుండా విలేకరులను విచారణకు హాజరుకావాలని ఆదేశించడం వంటివన్నీ కక్షపూరిత రాజకీయ నేతలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పోలీసులకు ప్రవర్తన నియమావళిగా మారాయి. ఇటువంటి నేతలు విమర్శను సహించలేరు” అంటూ స్పష్టం చేసింది.
ఇదే కోవకి చెందిన పలు కేసులను ది హిందూ సంపాదకీయం ప్రస్తావిస్తూ “ది వైర్ కేసు మరింత ఆందోళనకరమైన సమస్యలను ముందుకు తెస్తుంది. జారీ చేసిన సమన్లలో ఎఫ్ఐఆర్ తేదీ గాని, ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు గానీ, ఎఫ్ఐఆర్ కాపీని గాని జత చేయకపోవడం ఈ ఆందోళనకరమైన సమస్యలు. భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం, ఇవన్నీ అనివార్యంగా అమలు జరగవలసిన విషయాలు. పైగా ఎఫ్ఐఆర్ను రహస్యంగా ఉంచటం, కేసు నమోదుకు సంబంధించిన కారణాలను ప్రస్తావించకపోవడం పోలీసుల రెచ్చగొట్టే వైఖరికి నిదర్శనం” అని వ్యాఖ్యానించింది.
ది హిందూ సంపాదకీయంలో సెక్షన్ 152 గురించి వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, విమర్శకులు సింగారించుకున్న వలసవాదపు చట్టం తెచ్చిపెట్టే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ 2022లోని ఈ చట్టాన్ని ఉపసంహరించాలంటూ సుప్రీంకోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేసింది.
దేశద్రోహం కేసులలో ఉపయోగించిన పరిభాషలోని లోపాలను ప్రస్తావిస్తూ హిందూ సంపాదకీయం “దేశద్రోహం చట్టానికి సంబంధించిన పూర్వపు నిబంధనల కంటే సెక్షన్ 152లోని వివరణలు మరింత విస్తృతమైన స్వభావాన్ని కలిగినవి ప్రమాదకరమైనవి. ఇందులో ఉపయోగించిన ‘ తెలిసి ‘ అన్న పదం ఉంటే చాలు సదరు వ్యక్తికి నష్టం కలిగించాలన్న ఎటువంటి దురుద్దేశాలు లేకపోయినా అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయవచ్చు. కానీ ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 124ఏ ప్రకారం, కేవలం తిరుగుబాటు ధోరణిని రెచ్చగొట్టాలన్న స్పష్టమైన ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఒక చర్య దేశద్రోహం అవుతుంది. సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత అంటే పదాల చుట్టూ ప్రయోగించిన భాష శాంతి భద్రతల యంత్రాంగానికి అంతులేని కోరలు అమర్చిపెడుతుంది. ప్రభుత్వ విధానాలపై చేసే అర్థవంతమైన విమర్శలు కూడా ఐక్యతకు విఘాతాన్ని కలిగించే చర్యలుగా వ్యాఖ్యానించడానికి అవకాశం కల్పిస్తున్నారు. దేశద్రోహం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేకుండా, పౌరులకు కావలసినన్ని రక్షణలు కల్పించకుండా ఉంటే భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 152 కేవలం వ్యక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినంత మాత్రాన, ప్రభుత్వాల కూసాలు విరిగిపోతాయని భావించి కేసులు నమోదు చేసే విధంగా దుర్వినియోగం చేయడానికి వీలు కల్పిస్తుంది” అని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ చట్టాన్ని ప్రభుత్వ కారణాలపై విశ్లేషణలు విమర్శలు చేసే జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉపయోగించబోనుకోవటం పత్రిక స్వాతంత్రానికి తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే చర్య అని ది హిందూ ఆందోళన వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, వాటిని ధిక్కరించి వ్యవహరించడానికి సిద్ధమవుతోన్న అస్సాం పోలీసుల వైఖరి చూస్తే స్పష్టమైన మార్గదర్శకాలు, న్యాయవ్యవస్థ పర్యవేక్షణ లేకపోతే సాధారణ అసంతృప్తిని, భిన్నాభిప్రాయాలు కూడా గొంతు దాటి బయటకు రానీయకుండా సెక్షన్ 152ను కింద తొక్కి పెట్టే ప్రమాదం ఉన్నదని హిందూ సంపాదకీయం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చట్టాలకు ప్రజాస్వామిక సమాజంలో స్థానం లేదు. ఉండకూడదు. ఈ పరిస్థితుల్లో ఈ సెక్షన్‌ను రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా గుర్తించి, రద్దు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం సుప్రీంకోర్టు మీదనే ఉన్నదని ది హిందూ అభిప్రాయపడింది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.