
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాలు, దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి బదులు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వలస కార్మికులు పౌరులు కారా అన్నది ఈ మౌలికమైన ప్రశ్న.
ఓటర్ల జాబితా సవరణ కసరత్తులో ఇప్పటివరకు 65 లక్షల మంది ఓటర్లు జాబితాలో స్థానం సంపాదించుకోలేకపోయారు. అందులో 55 శాతం మంది శాశ్వతంగా తమ నివాసం మార్చుకున్నారనీ లేదా జాడ తెలియలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరో 34 శాతం మంది చనిపోయారని మిగిలిన 10.8 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదు అయినందున తొలగించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ వివరాల ప్రకారం, బీహార్ నుండి పురుషుల కంటే మహిళలే ఎక్కువమంది బతుకుదెరువు వెతుక్కుంటూ శాశ్వతంగా వలస వెళ్లారని అర్థమవుతోంది. అందులో కూడా 40 ఏళ్ల లోపు వయసున్న యువతులు ఎక్కువ మంది ఉండటం మొత్తంగా ఈ కసరత్తు పట్ల సరికొత్త సందేహాలకు కారణం అవుతోంది.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓట్ల తొలగింపు బాధితుల్లో పురుషుల కంటే మహిళలు ఏడు లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. ది హిందూ నిర్వహించిన అధ్యయనంలో ఎంపిక చేసిన తొమ్మిది నియోజక వర్గాల్లో 4,73,216 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో సగటున ముప్ఫై శాతం మంది ఓటర్లు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో సగటున నాలుగోవంతు ఓటర్లు చనిపోయారు.
ఎన్నికల సంఘం పని తీరుపై సవాళ్లు..
ది హిందూ పరిశీలనలో మరో కీలక అంశం వెల్లడయ్యింది. రాష్ట్రంలోని మహిళల నిరక్షరాస్యత మోతాదుకు, తొలగించబడిన ఓటర్ల జాబితాలో మహిళల మోతాదుకు సమాంతరంగా ఉంది. నిరక్షరాస్యులైన మహిళలు ఓటర్ల నమోదు పత్రం నింపి బూత్ స్థాయి ఎన్నికల అధికారికి అందచేయలేక పోవడంతో ఈ కసరత్తులో ఎక్కువమంది మహిళలు ఉండటానికి కారణంగా కనిపిస్తోంది.
మరో ముఖ్యమైన కారణం పెళ్లి. సహజంగానే పెళ్ళి చేసుకున్న మహిళలు పుట్టిన ఊరు వదిలి మెట్టిన ఊరికి వెళ్తారు. సాధారణంగా నామ మాత్రం విద్యార్హతలు కలిగి రోజువారీ కూలీ నాలిపై ఆధారపడే కుటుంబాలలో జరిగే పెళ్ళిళ్ళు దూర ప్రాంతాలకు ఇవ్వరు. ఇరుగు పొరుగు గ్రామాల్లోనే ఇచ్చి పుచ్చుకుంటూ అంటారు. అటువంటిది ఇంత పెద్ద సంఖ్యలో ఒక్కో నియోజక వర్గంలో మహిళలు పెళ్లి చేసుకొని ఊరు మారడం. అది కూడా జాడ తెలీని చోట్లకు వెళ్లారని సాకుతో లక్షలాది మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం వెనక ఎన్నికల సంఘం అవగాహన ఏమిటో అంతుబట్టనిదిగా ఉంది.
కానీ ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం ఇచ్చిన ఆదేశాల్లో, పెళ్లిళ్ల వలన ఓటర్ల స్థానభ్రంశం కూడా సమగ్ర సవరణను ప్రేరేపించిన అంశమని ప్రస్తావించకపోవడం గమనార్హం. స్వల్పకాల వలసల గురించి మాత్రం ప్రస్తావించింది. కానీ శాశ్వతంగా వలస వెళ్లిన వారు కానీ తాత్కాలికంగా వలస వెళ్లిన వారు కానీ ఆయా నివాస ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రం ఎన్నికల సంఘం ధ్రువీకరించలేకపోతోంది.
ఈ కసరత్తు మరో వివాదానికి తెరతీస్తోంది. ముందే చెప్పుకున్నట్లు శాశ్వతంగా వలస వెళ్లినవారు, తెలీని ఓటర్లు 65 లక్షల్లో 55 శాతం అంటే సుమారు 37 లక్షల మంది వరకూ ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాంటప్పుడు గత పార్లమెంటు ఎన్నికల్లో కానీ లేదా అంతకు ముందు 2005 తర్వాత జరిగిన ఎన్నికల్లో కానీ పోస్టల్ బాలెట్లు ఈ మోతాదులో పోల్ అయ్యాయా లేదా అన్నది ఎన్నికల సంఘం పరిశీలించాల్సిన అంశం. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్లు ఆ స్థాయిలో లేకపోయినా ఆయా నియోజక వర్గాల్లో పోలింగ్ యథాతథ స్థాయిలో జరగటం అంటే, అన్ని ఓట్లు దొంగ ఓట్లుగా పడ్డాయని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తంగానే ఎన్నికల సంఘం పని తీరును ఎన్నికల ప్రక్రియ వాస్తవికతను ప్రశ్నార్థకం చేస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.