
– 9 వేల కోట్ల బాండ్ల జారీకి ఏపీఎండీసీ రెడీ..!
– అమరావతి బాండ్ల నుంచి ఏమైనా నేర్చుకున్నారా?
‘ఆంధ్రప్రదేశ్‌కు ఏకంగా 10 లక్షల కోట్లు అప్పుంది. పథకాల అమలు సరే ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణా ఖర్చులకు వెతుక్కోవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.’ ఇది ఎవరో చెబుతున్న మాటలు కాదు, వైసీపీ ప్రభుత్వ నిర్వాకమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అందుకే నిధుల సేకరణకు అనేకానేక మార్గాలను అన్వేషిస్తున్నారు. దొరికిన కాడికి అప్పులు చేయాల్సివస్తోంది. నిధుల సేకరణలో భాగంగా ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ఏపీఎండీసీ 9 వేల కోట్ల విలువైన బాండ్ల జారీకి సన్నాహాలు చేస్తోంది. అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఏపీఎండీసీ తరఫున పలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 9వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు మార్కెట్లో విడుదల చేసేందుకు డ్రాఫ్ట్ సిద్ధం చేశారు. తాజాగా ఏపీ మంత్రివర్గంలో దీనిపై చర్చించి క్యాబినెట్ ఆమోదముద్ర కూడా వేశారు. ఏపీఎండీసీ ప్రాజెక్టుల విస్తరణ ఏమోగాని, ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వానికి బాండ్ల ద్వారా వచ్చే నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, ఏపీఎండీసీ బాండ్ల విడుదల ప్రతిపాదనను విపక్షంతో సహా పలువురు విమర్శిస్తున్నారు. బాండ్లపై ఎంత వడ్డీ చెల్లిస్తారన్నది ఇంకా ఖరారు చేయకపోయినా, 2018లో అప్పటి కూటమి ప్రభుత్వమే జారీ చేసిన రాజధాని అమరావతి బాండ్లను, వాటికి చెల్లించిన వడ్డీని గుర్తు చేసుకుంటున్నారు. వడ్డీల అధిక చెల్లింపులతో అప్పులు పెంచి ప్రజలపై మరింత భారం పెంచుతున్నారన్న వాదన బలపడుతోంది. డైరెక్ట్‌గా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వచ్చే అవకాశాలు లేకపోవడం వల్లే బాండ్ల రూపంలో నిధుల సేకరణ చేస్తున్నారు.
అమరావతి బాండ్ల మాటేమిటి? ప్రభుత్వానికి గుణపాఠమా?
చంద్రబాబు ప్రభుత్వం 2018లో సీఆర్డీఏ ద్వారా 2000 కోట్లకు అమరావతి బాండ్లను జారీ చేసింది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అంటే ఈ బాండ్లపై వడ్డీ, అసలును సీఆర్డీఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఉంది. ఈ బాండ్లపై నిరంతరం వడ్డీ చెల్లించేందుకు ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఈ వడ్డీలను డెట్‌సర్వీసు రిజర్వు ఎకౌంట్, బాండ్ల సర్వీసింగ్ ఎకౌంట్ ద్వారా చెల్లించాలి. ఆరు నెలల మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. ఈ నిధుల చెల్లింపుల కోసం డీఎస్‌ఆర్‌ఏలో 300 కోట్లు, బీఎస్ఏలో 225 కోట్లు ఉండాలి.
అయితే, అనుకున్నదొక్కటి అయింది మరొకటిలా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. అసలే అమరావతిని పట్టించుకోని జగన్ ప్రభుత్వంపై అమరావతి బాండ్ల భారం పడింది. అధిక వడ్డీరేట్లతో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన బాండ్ల ప్రక్రియను విపక్షంలో ఉండగానే వ్యతిరేకించిన, వైసీపీ తాము చెప్పిందే జరిగిందని బాండ్ల వడ్డీ చెల్లింపు ప్రభుత్వానికి గుదిబండగా మారిందని మరోమారు నొక్కిచెప్పింది. ఈ వడ్డీ చెల్లింపులకు తరచు ఇబ్బందులు ఎదురవడం, రాష్ట్రం ఆ నిధులు అందుబాటులో ఉంచకపోవడంతో అమరావతి బాండ్ల రేటింగును రేటింగు సంస్థలూ తగ్గించుకుంటూ వచ్చాయి. అక్యూట్ సంస్థ ఏకంగా సీ రేటింగుకు తగ్గించింది. అంటే ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లే. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం పరిస్థితులను సరిదిద్దలేదు. అమరావతి బాండ్ల రేటింగును తగ్గించిన క్రిసిల్ ఏ ప్లస్ నుంచి ఏ మైనస్కుతీసుకొచ్చింది. దాంతో అప్పట్లో మార్కెట్లో అలజడి మొదలైంది. 2023 డిసెంబరు 31 నాటికి ఈ బాండ్లపై వడ్డీయే 211 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అసలు కూడా కలిపితే 372 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలని ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకరు ప్రభుత్వానికి తుది నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదా విభజన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది. ఈ బాండ్లకు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోయింది.
అమరావతి బాండ్ల వడ్డీ రేటు పైనా అప్పట్లో వివాదం..
ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రిత్వశాఖ 2018 ఆగస్టు 9న జీవో 266 జారీచేసింది. దీని ద్వారా 10.32 శాతం వడ్డీ రేటుతో రూ. 2,000 కోట్ల సేకరణ కోసం అమరావతి బాండ్లు జారీ చేయటానికి అనుమతిచ్చింది. ఈ మొత్తం అప్పుకు, దానిపై వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది .ఈ బాండ్ల కాలవ్యవధి పదేళ్లు. వీటికి ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ ఏ ప్లస్ రేటింగ్ ఇవ్వగా బ్రిక్‌వర్క్, ఆయుక్ట్ సంస్థలు ఏఏ రేటింగ్ ఇచ్చాయి. ఈ బాండ్లకు మర్చంట్ బ్యాంకర్‌గా మెస్సర్స్ ఎ.కె.క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను నియమించారు.
ఆ సంస్థకు ఫీజుగా 0.85 శాతం, దానిపై జీఎస్టీ చెల్లించటానికి అంగీకరించారు. అమరావతి బాండ్ల మీద మొదటి ఐదేళ్లు మారటోరియం ఉంటుంది. ఈ కాలంలో మూడు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. ఆ తర్వాత ఐదేళ్లలో మూడు నెలలకు ఒకసారి వడ్డీతో కలిపి అసలు కూడా తిరిగి చెల్లిస్తూ వస్తారు. అంటే బాండ్ల ద్వారా సేకరించిన రూ. 2,000 కోట్ల అప్పుకు.. పదేళ్లలో వడ్డీ రూ.1,573.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సీఆర్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక మధ్యవర్తి సంస్థకు ఫీజు కింద సుమారు రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ప్రభుత్వ గ్యారెంటీతో 10.32 శాతం వడ్డీకి బాండ్ల రూపంలో రుణాలు తీసుకోవటం అనూహ్యమైన విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడే గగ్గోలు పెట్టింది. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి బాండ్లు అభాసు పాలయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అమరావతి అప్పులపై దృష్టి పెట్టింది. నాలుగు వేల ఎకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీరుస్తామని, ప్రజలపై భారం వేసేదిలేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎండీసీ పేరున 9 వేల కోట్ల విలువచేసే బాండ్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వడ్డీ ఎంతన్నది ఇంకా నిర్ణయించకున్నా, అమరావతి బాండ్ల వివాదాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎన్నికల ముందే ఏపీఎండీసీ ద్వారా బాండ్లు విడుదల చేసి 7వేల కోట్లు సేకరించాలని జగన్ ప్రభుత్వం అడుగులు వేసినట్టుగా వార్తలు వచ్చాయి. అదీకాకుండా ఎండీసీలో వాటాల అమ్మకం ద్వారా రూ.14,000 కోట్ల అప్పు తేవాలని జగన్ ప్రభుత్వం రహస్యంగా పావులు కదిపిందని వార్తలు హల్చల్ చేశాయి. అవిఏవీ సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఏపీఎండీసీ బాండ్ల జారీకి అనుమతి ఇచ్చింది.
అప్పుల భారంతో వున్న రాష్ట్రంలో ప్రజలపై మరింత భారం పడకుండా చూసుకోవాలి. కేవలం అప్పులు చేయడంకాదు, సంపద సృష్టించడంపై దృష్టి పెట్టామని చంద్రబాబు ప్రభుత్వం పదేపదే ప్రకటించడం కొంత ఊరటనిస్తోంది. ఇప్పటికే 10 లక్షల కోట్లు దాటిన అప్పుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.2 లక్షల భారం పడనుందని కూటమి నేతలే చెబుతున్నారు. కార్పొరేషన్ల ద్వారా కుప్పలు తెప్పలుగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందని పేర్కొంటున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వ అప్పుల పాఠం అప్పజెప్పడం కాదు, భవిష్యత్‌లో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్, ఇతర బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి గత ప్రభుత్వం సమీకరించింది
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.