
ఎన్నడూ లేనంత బడ్జెట్.. 3లక్షల కోట్లు దాటిన బడ్జెట్.. ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఎన్నికల హామీలను దృష్టిలో పెట్టుకొనే, సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. విద్య, మానవ వనరులు, పంచాయితీ రాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా హామీలను అమలు చేయటం లేదనే విమర్శల దూసుకువస్తున్న సమయంలో సూపర్ సిక్స్ లో రెండు ప్రధాన పథకాలకు నిధులను బడ్జెట్ లో కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకోగా, మరి కేటాయించని ఇతర హామీల మాటేమిటన్న ప్రశ్న తెరమీదికొచ్చింది. సూపర్ బడ్జెట్ అంటూ చెబుతూ సూపర్ సిక్స్ లన్నీ అమలు చేయకపోవడం, నిధులు కేటాయించలేక పోవడం విపక్ష వైసీపీకి విమర్శనాస్త్రాన్ని అవకాశంగా ఇచ్చింది. సూపర్ సిక్స్ లో మూడు ప్రధాన హామీలను బడ్జెట్ లో ప్రస్తావనే చేయలేకపోయారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వంలో ఆర్దిక పరిస్థితిని వివరిస్తూ తిరిగి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టటంతో పాటుగా ఆర్థికంగా బలోపేతం చేసేలా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ చంద్రబాబు మార్క్ బడ్జెట్ ను సభ ముందుకు తెచ్చారు. 2025-26 కాలానికి రూ. 3 లక్షల 22వేల 359 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆర్ధిక మంత్రి చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్ లో రెవిన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్లు కాగా మూల ధనం వ్యయం అంచనా 40,635 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవిన్యూ లోటు 33,185 కోట్లుగా అంచనా వేసిన ప్రభుత్వం.. ద్రవ్య లోటు 79,926 కోట్లుగా పేర్కొంది. సాధారణ బడ్జెట్ తో పాటుగా రూ 48 వేల కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు, బిసి వెల్ఫేర్‌కు రూ. 23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కు 18,848కోట్లు కేటాయించారు. కాగా జలవనరుల అభివృద్ది శాఖకు రూ. 18,020 కోట్లు, మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలప్మెంట్ కు రూ. 13,862 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు ప్రతిపాదించారు. ఇక.. వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రూ. 10,619 కోట్లు, రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు ప్రతిపాదించారు.
హామీల అమలు కోసం…
ఈ సారి ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. అదే విధంగా మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. కీలక హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పోలవరం కోసం రూ.6,705 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2800 కోట్లు, తల్లికి వందనం అమలు కోసం రూ.9,407 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.
కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు,
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు ప్రతిపాదించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు కేటాయించగా గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు ప్రతిపాదించారు. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో వ్యూహాత్మకంగా సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు చేసినట్లు స్పష్టమవుతోంది. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఏకంగా 47,456 కోట్లను కేటాయించింది. అదే విధంగా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.
డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ ఆధ్వర్యంలో వున్న శాఖలకు భారీగా కేటాయింపులు జరిగాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అయిదు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన గ్రామీణాభివృద్ధి – పంచాయితీ రాజ్ కోసం బడ్జెట్ లో రూ 18,847 కోట్లు ప్రతిపాదించారు. పవన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల్లో వస్తున్న మార్పులను కేశవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న విద్యా శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. విద్యా శాఖకు రూ 31,805 కోట్లు ప్రతిపాదించారు. ఉన్నత విద్య కోసం రూ 2,506 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో స్పష్టం చేసారు. విద్యా శాఖ పరిధిలోనే తల్లికి వందనం అమలు కోసం రూ 9.407 కోట్ల ను బడ్జెట్ కేటాయింపులు చేసారు.
తల్లికి వందనంలో ట్విస్ట్..
ప్రభుత్వం సూపర్ సిక్స్ లో హమీ ఇచ్చిన తల్లికి వందనం పథకం కోసం ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం రూ 9,407 కోట్లను ప్రతిపాదించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికి రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాదాపుగా రూ 11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు. మే నెలలో ఈ పథకం కింద నిధులు జమ చేయనుంది. అంచనాలకు అనుగుణంగా కాకుండా ఇందు కోసం ఈ బడ్జెట్ లో రూ 9,407 కోట్లు ప్రతిపాదన చేయడంతో అందరికీ ఎలా ఇస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది. మార్గదర్శకాలు ఎలావుంటాయి. తరువాత లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందా కేటాయించిన నిధులను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సివుంది.
మరో పథకం అన్నదాత సుఖీభవ అమలు కోసం బడ్జెట్ లో రూ 6300 కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి ఈ పథకం అమలు కానుంది. కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించి, ప్రభుత్వం హామీ ఇచ్చిన 20 వేలలో మిగిలిన రూ 14 వేలను మూడు సార్లుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అన్నదాత సుఖీభవ మూడు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం రూ.27,518 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఈ కేటాయింపులు జరిగాయి. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు.
ఇక రాష్ట్రానికి అప్పు పుట్టదా?
భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పులపై జరుగుతున్న చర్చలకు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరమని పయ్యావుల తన ప్రసంగంలో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందన్నారు. ఆయా శాఖల్లో లెక్కలను కొలిక్కి తీసుకొచ్చేందుకు చాలా సమయమే పట్టిందని తెలిపారు. ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తీసుకువచ్చారని, రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ తెలిపిందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందని స్పష్టం చేశారు.
దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆర్థికమంత్రి తేల్చిచెప్పేశారు. ఈ పరిస్థితిల్లో బడ్జెట్ విషయంలో సీఎం చంద్రబాబు మాటలే తమకు మార్గదర్శకంగా నిలిచాయంటూ ఆర్ధికమంత్రి చెప్పుకొచ్చారు. అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా అన్న సీఎం చంద్రబాబు మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందించినట్లు పయ్యావుల చెప్పుకొచ్చారు.
ప్రస్తావనకు నోచుకోని ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి
మహిళల కోసం సూపర్ సిక్స్ లో ఇచ్చిన మూడు హామీలను బడ్జెట్ లో ప్రస్తావించలేదు.మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దాని అమలుకు కమిటీ వేసి మరీ లెక్క కట్టారు. కానీ బడ్జెట్ లో ఉచిత బస్సు ప్రస్థావన రాలేదు.
సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతీ మహిళకు నెలకు రూ 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం అమలు గురించి ఎక్కడా బడ్జెట్లో ప్రస్థావించలేదు. మరో పథకం నిరుద్యోగ భృతి హామీ గురించి కూడా బడ్జెట్ లో తీసుకురాలేదు. ఉద్యోగం వచ్చేంత వరకు ‘నిరుద్యోగ భృతి’ కింద నెలకు రూ 3 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇందు కోసం అధికారులు సుమారు నెలకు రూ 2100 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ బడ్జెట్ లో ఈ నిర్ణయం అమలు దిశగా ఎలాంటి నిర్ణయం లేదు.
పెదవి విరిచిన విపక్షం
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్దాయి బడ్డెట్ పై వైసీపీ మండిపడింది. బడ్జెట్ కేవలం అంకెల గారడీలా ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా, అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ ను ఆత్మస్తుతి- పరనిందతో ముగించారని ఆరోపించింది. గత ప్రభుత్వాన్ని దూషించడం, సీఎం చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికే ఈ బడ్జెట్ తెచ్చినట్లు ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. చట్టసభల్లో సభ్యుడుగా సుదీర్ఘ అనుభవం ఉందని, ఎప్పుడూ ఇలా పొగడ్తలతో బడ్జెట్ ను ముంచేయడం చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీలపై మాత్రం కేటాయింపులు లేవన్నారు.
మొత్తంమీద హామీల అమలు, సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెబుతుంటే, విపక్షం మాత్రం పెదవి విరుస్తోంది.
బాలకృష్ణ ఎం , సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.