ట్విట్టర్లో నిరంతరం కొనసాగుతున్న జాతి దురహంకారపూరిత మెసేజులు అమెరికాలోని శ్వేతజాతి ఆధిపత్యాన్ని కాంక్షించే శక్తుల ఉనికినీ, వారి చర్యలపట్ల సాధారణ ప్రజల్లో అంగీకార ధోరణినీ వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ : అమెరికాలో హెచ్ 1 బి వీసా విధానాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన 2024 డిసెంబర్ చివరి వారంలో ట్రంప్ మద్దతు దారులైన తీవ్ర మితవాదులు సామాజిక మాధ్యమాల వేదికగా ఉవ్వెత్తున ప్రచారం సాగిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ఈ ప్రచారం ‘‘పాలనా వ్యవస్థలో కీలక పాత్రధారులుగా ఉన్న వారి సహాయ సహకారాలతో పథకం ప్రకారం సాగుతున్న దాడి’’.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ అనే ఒక స్వతంత్ర పరిశోధనా బృందం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భారతీయులకు వ్యతిరేకంగా సాగుతున్న మూకుమ్మడి పోస్టులను విశ్లేషిస్తూ గత గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. ఈ అధ్యయనం గత డిసెంబర్ 22 నుంచి ఈ నెల3 వ తేదీ మధ్య పోస్టయిన మొత్తం 128 పోస్టులను పరిశీలించింది.
జనవరి 3వ తేదీ నాటికి ఈ విద్వేష పోస్టులను 138.54 మిలియన్ల మంది చూడగా, 36 పోస్టుల్లో ఒక్కొక్క దాన్ని పదిలక్షల మంది చూశారు. ఈ పోస్టులు 85 అకౌంట్ల నుంచి పెట్టినవిగా, వాటిలో 64 – నాలుగింట మూడు వంతులు-అనేక సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించడానికి చిహ్నంగా ఉన్న బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జిలున్న అకౌంట్లుగా గుర్తించారు.(అంటే ఈ ప్రచారం చేస్తున్న వారిని గుర్తించటం అంత కష్టమైన పనేమీ కాదు. పాలకులు కావాలనుకుంటే వారిని గుర్తించి వారి ఖాతాలను డీ యాక్టివేట్ చేయవచ్చు. లేదా సదరు పోస్టులను వీక్షకులు చూడకుండా అదుపు చేయవచ్చు. ఇంకా ప్రమాదకరం అనుకుంటే వారిపై కేసులు కూడా నమోదు చేయవచ్చు).
‘‘వీటిలో వివాదాస్పదమైనవి, సున్నితమైనవి, పక్షపాత ధోరణితో కూడినవి, విద్వేష పూరితమైనవి ఎక్కువగా వచ్చాయి. ఎక్స్ కంపెనీ అనుసరిస్తున్న వ్యాపార శైలి కూడా ఈ తరహా పోస్టులకూ, ప్రచారానికీ ఊతమిచ్చేదిగా ఉంది’’ అని ఆ నివేదిక రచయితలు అభిప్రాయపడ్డారు.
ఎక్స్ ప్రకటిత విధానాలకు భిన్నంగా ఉన్నప్పటికీ కొనసాగుతున్న పోస్టులు
విద్వేష పూరిత నిర్వహణపై ‘ఎక్స్’ విధానాల ఉల్లంఘనగా ఆ పోస్టులు ఉన్నాయని ఆ నివేదిక గుర్తించింది. ఆ విధానాలు ‘‘ఒక భద్రతగల సమూహానికి భయాన్ని కలిగించడం, భయాన్ని వ్యాపింపచేయడం’’ను నిషేధించాయి. తిట్లు, దూషణలు, అమానుషమైన భాషను ఉపయోగించడం వంటివి కూడా ఆ నిషేధిత జాబితాలో ఉన్నాయి.
అయినప్పటికీ విద్వేషపూరితమైన 125 పోస్టులూ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎనిమిదింటిని సున్నితమైనవిగా స్వయంగా ఎక్స్ ప్రకటించింది (అంటే వీక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్న పోస్టులకు అలాంటి శీర్షిక పెడతారు. మరోరకంగా చెప్పాలంటే పొగతాగటం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టలపై ముద్రించినట్టన్నమాట). మరో పోస్టు ఈ నిబంధనలను పూర్తిగా అతిక్రమించడం వల్ల వీక్షికులకు పాక్షికంగా కనిపిస్తోంది. ఎనభై అయిదు పోస్టులను విశ్లేషించాక, వాటిలో ఒకదాన్ని ఎక్స్ నుండి తొలగించారు.
రానున్న ట్రంప్ ప్రభుత్వంలో కృత్రిమ మేధో విభాగానికి సలహాదారుగా శ్రీరాం కృష్ణను నియమించడంతో అమెరికన్ భారతీయులే ధ్యేయంగా ట్రంప్ కు మద్దతు దారుడైన లౌరా లూమర్ ఈ విద్వేష ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారానికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మారింది.
ప్రతి కార్మికుడిలో నైపుణ్యాన్ని పెంచడంలో అమెరికా సంస్కృతి విఫలమైందని అమెరికా అధ్యక్షపదవికి గత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ రామస్వామి విమర్శించడంతో ఈ విద్వేషపూరిత పోస్టుల తీవ్రత పుంజుకున్నది.
ట్రంప్ తో జత కట్టిన ‘ఎక్స్’ యజమాని ఎలన్ మస్క్ హెచ్ 1 బి వీసా కార్యక్రమానికి మద్దతుగా ఆన్ లైన్ లో జరిగిన చిన్న వివాదంలో జోక్యం చేసుకున్నాడు. నిజానికి ఈహెచ్ 1 బి కార్యక్రమం ద్వారానే ఆయన అమెరికా వచ్చానని కూడా ఆ చర్చలో మస్క్ వెల్లడించారు.
విద్వేష పోస్టులు అనేక రోజులు కొనసాగడానికి ఇది దోహదం చేసిందని వర్ణిస్తూ, ‘‘ఆందోళనకర స్థాయిలో భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషం పెచ్చరిల్లుతోంద’’ని నివేదిక వ్యాఖ్యానించింది.
‘‘మస్క్, ట్రంప్ లు హెచ్ 1 బి వీసాకు మద్దతుగా ఉన్నామని చెప్పటంతో విద్వేషం, జాత్యాహంకారం మరింత పెచ్చరిల్లింది. అది తీవ్రమవడమే కాకుండా మరింత విస్తరిస్తోంది. ఇదంతా ‘అప్రయత్నంగా’ జరిగిందని ముద్ర వేయడం చాలా తేలిక. కానీ ఆ ఒకేరకమైన బృందాల నుండి ఒకే తరహా పోస్టులు, ఒకే లక్ష్యంతో పదేపదే పునరావృతం కావటం అంటే నిర్దిష్ట లక్ష్యం కోసం వ్యవస్థలోని కీలకపాత్ర ధారులు ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృతంగానే ఈ ప్రచారాన్ని సాగిస్తున్నారని నిర్ధారించవచ్చ’’ని ఆ నివేదిక పేర్కొంది.
‘చట్టపరమైన లేదా మంచి పద్ధతుల్లో వలస వచ్చిన వారికి, చట్టవ్యతిరేకంగా, దొంగ దారిలో వలస వచ్చిన వారికి మధ్య ఉన్న తేడాలను చర్చించే పేరుతో ఎక్స్ వేదికగా మొదలైన ఈ చర్చ అనతికాలంలోనే ఈ గీతలు చెరిపేసుకుని స్థూలంగా భారతీయులకు వ్యతిరేకమైన చర్చగా మారింద’ని ఈ విశ్లేషణ ఎత్తి చూపింది.
మొత్తం 128 విద్వేష పూరితమైన పోస్టుల్లో, ఒక పోస్టును కోటి నలభై లక్షలమంది చూశారు. ఇది లియోనార్డైస్ ఫన్ ఈ అకౌంట్ నుంచి పోస్ట్ అయ్యింది. ఆ వీడియోలో ఒక శ్వేతజాతీయుడు రోడ్ల మీద తినుబండారాలు అమ్ముకునే భారతీయుడి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ‘‘ఈ చెత్త కుప్ప ఏడాందా ఇక్కడే ఉంటుందని’’ వ్యాఖ్యానిస్తాడు.
క్యాలిస్ట్రోల్ అనే మరో ఖాతా నుండి వచ్చిన మరొక పోస్ట్ ను కోటీ 23 లక్షల మంది చూశారు. ‘‘భారతీయ ఫ్యాక్టరీల్లో కార్మికులు తెలివి తక్కువ వారు, సరైన నైపుణ్యం లేని వారు’’ అని జపాన్ కు చెందిన వ్యక్తి ఈ వీడియోలో చెప్పడం గమనార్హం.
భారతీయులకు వ్యతిరేకంగా మూసపోయబడుతున్న ప్రచారం
విదేశీయల స్థానంలో శ్వేత జాతీయ కార్మికులను (స్థానిక అమెరికన్లను) నియమించుకోవాలంటూ 47 పోస్టులు పెట్టారు. దీనికి తోడు 35 పోస్టుల్లో భారతీయులు అశుభ్రతగా, అసహ్యంగా ఉంటారని, బారతీయులు బహిరంగ మలవిసర్జన పైన, ఆవు మూత్రం, ఆవు పేడ వాడడం పైన మరో 25 పోస్టులున్నాయి.
పశ్చిమ దేశాల పౌరులను చూస్తే, ముఖ్యంగా అమెరికన్లను చూస్తే భారతీయులు ఆత్మన్యూనతా భావంతో ఉంటారన్నది కొన్ని పోస్టుల సారాంశం. శ్వేత జాతీయులతో పోల్చుకోవడమే కాదు, ఇతర వలస జాతులతో పోల్చుకున్నప్పటికే భారతీయులు తక్కువ తెలివిగల వాళ్ళని మరికొన్ని పోస్టుల్లో వాదనలు. పశ్చిమ దేశాల నాగరికత ఆధిక్యతను చూపించడానికి రాతితో నిర్మించిన క్రైస్తవ మందిరాల నిర్మాణాల ఫొటోలను, భారత దేశంలోని మురికి వాడల ఫొటోలను పోలుస్తూ పోస్టు చేశారు.
‘‘సంప్రదాయ భావనలున్న శ్వేతజాతీయ ఉద్యమం చరిత్రలో ప్రజ్ఞా పాటవాల(ఐక్యూ) జాబితాకు పెద్ద చరిత్ర ఉంది. ప్రజ్ఞా పాటవాలు వివిధ జాతుల్లో వివిధ స్థాయిల్లో ఉంటాయనుకోవడం జాత్యహంకార, ఆధిపత్య భావనలే కాకుండా, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని సామాజిక మార్పులకు అన్వయింపచేసి ప్రచారం సాగుతోంది. ఇది వారిలో బాగా పాతుకుపోయింది. ప్రజ్ఞా పాటవాల విషయంలో శ్వేతజాతీయులు ప్రపంచంలోని అన్ని జాతులకంటే పై మెట్టున ఉంటారన్నది ఈ జాత్యహంకారుల ప్రఘాడ విశ్వాసం.’’ అని నివేదిక విశ్లేషించింది.
ఈ దాడులు ఎక్కడి వరకు వెళ్ళాయంటే, హిందువులైన భారతీయులు, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులతో పాటు భారతీయ మూలాలున్న ఇతర మతస్తులను కూడా లక్ష్యం గా చేసుకుని ఈ దుష్ప్రచారం సాగుతోంది. క్రమంగా ఈ ప్రచారం హిందువులైన భారతీయలతో పాటు సిక్కులపై కూడా ఎక్కు పెట్టబడుతోంది.
ది వైర్ స్టాఫ్
అనువాదం : రాఘవ