
ఏడు నెలల్లో అత్యధికంగా ఓటుహక్కు పొందిన నాలుగు లక్షలమంది
నాలుగు లక్షల మంది ఢిల్లీ యువత కేవలం ఆర్నెలల్లో ఓటు హక్కు పొందే వయోజనులయ్యారా? అలా ఎలా జరిగింది ? అంటే సరిగ్గా నాలుగు లక్షల మంది 18 ఏళ్ల క్రితం ఒకే తేదీన పుట్టారా ? ఒక వేళ నిజంగా అలా పుట్టినా వారంతా ఎటువంటి ఈతిబాధలకు లోనుకాకుండా బాలారిష్టాలను కరోనా కష్టాలను తట్టుకుని బిజెపి కి ఓటు వేయటానికి తెర మీదకు వచ్చారా ?
కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి వెనక ఉన్న కారణాలు, పరిస్థితుల గురించి పలు కోణాల్లో విశ్లేషణ జరుగుతోంది. వీటిలో కొన్ని కాంగ్రెస్‌ను తప్పు పట్టేవిగా ఉంటే మరికొన్ని ఆమ్ ఆద్మీ పార్టీని తప్పు పట్టేవిగానూ, ఇంకొన్ని మధ్యతరగతిని వేలెత్తి చూపేవిగానూ ఉన్నాయి. ఒకటి అరా మాత్రం ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికల నిర్వహణ క్రమాన్ని ఓ పద్ధతి ప్రకారం తనకు అనుకూలంగా మల్చుకుంటున్న బిజెపి సామర్ధ్యం, ఎన్నికల సంఘం లొంగుబాటు గురించిన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కౌటింగ్ కొనసాగుతూ ఉండగానే ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు ప్రేమ్ శంకర్ ఝా ఓటర్ల జాబితా ఖరారు చేయటంలో జరుగుతున్న మార్పులపై విశ్లేషణ చేశారు. కౌంటింగ్ పూర్తి అయి తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఓటర్ల జాబితాకు సంబంధించిన అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.
ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటుంది. 2020 నుండీ ఢిల్లీ రాష్ట్రం పరిధిలో నాలుగు లక్షలమంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. తెలంగాణలో కూడా గత ఐదేళ్లలో 2025 జనవరి నాటికి ఐదు లక్షల మంది మాత్రమే కొత్తగా చేరారు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో షుమారు ఆరులక్షలమంది కొత్తగా ఓటు హక్కు పొందారు. పోలిక ఇక్కడితో సరిపోతే బాగానే ఉంటుంది. కానీ లోక్‌సభ ఎన్నికలకూ మొన్న ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అంటే కేవలం ఏడు నెలల్లో మరో నాలుగు లక్షలమంది కొత్తగా ఓటు హక్కు పొందారు. అంటే సాధారణ పరిస్థితికి భిన్నంగా ఢిల్లీ లో ఈ ఐదేళ్లల్లో ఎనిమిది లక్షలమంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇది అంతుచిక్కని ప్రశ్న. విశ్లేషణకు అందని వివరం.
ఈ ఎన్నికల్లో బిజెపికి మొత్తంగా పోలైన ఓట్లు 4323110 కాగా ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన ఓట్లు 4133898. అంటే రెండు పార్టీల మధ్య ఉన్న తేడా 189212 ఓట్లు. ఈ ఏడు నెలల్లో కొత్తగా చేరి ఓట్లు నాలుగు లక్షలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో కొత్త ఓటర్ల సంఖ్య నమోదు కాలేదు.
ఈ నాలుగు లక్షల ఓట్లు ఎవరివి? ఎలా చేరాయి? ఈ ఎన్నికల్లో ఎవరికి పోలయ్యాయి అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఆమ్ ఆద్మీ రాజకీయ పలుకుబడిని, నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
2014 నుండీ పోలింగ్ మేనేజ్మెంట్లో బిజెపి అనుసరిస్తున్న వ్యూహం తెలిసిందే. ఏ ఎన్నికలకాఎన్నికలనే యుద్ధంగా చూస్తోంది. ఒక ఎన్నికల్లో గెలిచాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాము కదా అన్న ఏమరుపాటు ఆ పార్టీలో లేనేలేదు. పంచాయితీ ఎన్నికల మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకూ బిజెపి ఎన్నికల యంత్రం పని చేసే వేగానికి దేశంలో ఏ పార్టీతట్టుకుని ఎదురు నిలిచే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే బిజెపి ఎన్నికల యంత్రాంగం కేవలం ఎన్నికల సమయంలో ప్రచారాన్ని, ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ను మేనేజ్ చేయటానికి పరిమితం కావటం లేదు అనేది తరచుగా మనం గుర్తించని వాస్తవం. ఓటర్ల జాబితాను కూడా పర్యవేక్షిస్తోందని ఢిల్లీ ఎన్నికల అనుభవం, గత ఏడాది చివరల్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అనుభవం తెలియచేస్తోంది. ఇంకా గమ్మత్తైన విషయం ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పాల్సిన విషయం ఏమిటంటే మహారాష్ట్ర లో మొత్తం వయోజన జనాభా కంటే ఓట్ల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉంది అన్న ప్రశ్న.
కొన్ని నియోజకవర్గాల ఉదాహరణలు పరిశీలిస్తే ఈ కొత్త ఓటర్ల బెడద తీవ్రంగానే కాదు. అత్యంత చాకచక్యంగానూ, వ్యూహాత్మకంగానూ ఉన్నదని అర్థమవుతుంది.
కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 39757 తగ్గింది. అంటే 2020లో ఓటు చేసిన వారిలో నాల్గోవంతు ఈ సారి ఈ నియోజకవర్గంలో ఓటు వేయటానికి అనర్హులుగా మారారు. ముండక నియోజకవర్గంలో 2020 నుండీ 2024 మధ్య కేవలం 14230 మంది కొత్త ఓటర్లు నమోదు అయితే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత 2025 జనవరి నాటికి అదనంగా 17549 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. బాద్లీ నియోజకవర్గంలో నాలుగేళ్లల్లో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 5684. కానీ లోక్‌సభ ఎన్నికలుకు అసెంబ్లీ ఎన్నికలకూ ఉన్న మధ్యకాలంలో ఏకాఎకిన 13145 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అదేసమయంలో నంగలోయి నియోజకవర్గంలో 2020 ` 2024 మధ్య కాలంలో 13992 ఓట్లు రద్దయ్యాయి. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా 16413 మంది ఓటర్ల జాబితాలోకి ఎక్కారు. బురారీ నియోజకవర్గంలో ఏకంగా 65290 మంది కొత్త ఓటర్లు నమోదు అయితే వికాసపురి నియోజకవర్గంలో 61745 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.
మరికొన్ని వివరాలు సేకరించి ఈ కథనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఈ సారి ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపులు, చేరికలు పెద్ద మోతాదులో జరిగాయన్న విషయం రూఢీ అవుతుంది.
నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే మోతాదులో అంటే మొత్తం ఓటర్లలో ఐదు శాతం మంది కొత్త ఓటర్లు నమోదు అయితే ఢిల్లీలో జరిగిన కొత్త ఓటర్ల నమోదుకార్యక్రమం కూడా సజావుగానే జరిగిందని భావించాలి. కానీ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లుగా కనీసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్త ఓటర్ల నమోదు ఈ స్థాయిలో లేదు. ఇది మొత్తం ఎన్నికల క్రమాన్ని, ఎన్నికల సంఘం పాత్రను, పారదర్శకతనూ ప్రశ్నార్ధకం చేయటమే కాక అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన కళ్ల ముందే ఈ స్థాయిలో ఓటర్ల జాబితా తారుమారవుతుంటే ఏమి చేస్తోందన్నది దేశం సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న మరో ప్రశ్న.
కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.