
ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఉన్న పరిపాలనను రెండు రకాలుగా పరిశోధకులు విభజించారు. అవి రెవెన్యూ పరిపాలన, అభివృద్ధి పాలన. రెవెన్యూ పరిపాలనకు సంబంధించి ప్రత్యేక చట్టాలు, యంత్రాంగం, ఉద్దేశ్యాలు ఒక రకంగా ఉంటాయి. అభివృద్ధి పాలనకు సంబంధించి మరో రకంగా ఉంటాయి. జిల్లా స్థాయిలో రెవెన్యూ పరిపాలనకు కలెక్టర్ అధికారిగా ఉంటారు. కలెక్టర్ కార్యాలయం ఒక సంస్థగా ఉంటుంది. అభివృద్ధి పాలనకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే రెవెన్యూ పాలనకు అఖిల భారతస్థాయిలో పోటీ పరీక్షలలో నెగ్గిన వ్యక్తి అధికారిగా ఉంటారు. అభివృద్ధి పాలనకు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికకాబడిన ప్రజాప్రతినిధి స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధమైన నాయకుడిగా కొనసాగుతారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలకు ఎన్నికైన నాయకులు పాలన బాధ్యతలను నిర్వహిస్తారు. వీరు ఈ పదవిలో ఉంటూ రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు బదలాయించిన అధికారాలు, బాధ్యతలను నిర్వహించాలి. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘పంచాయితీరాజ్’ సంస్కరణల పేరు మీద, అధికారులు ఈ సంస్థలకు, రెవెన్యూ సంస్థలకు సమాంతరంగా పోటీ సంస్థలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అంతేకానీ వాటిని ‘ప్రజల సంస్థలు’గా తీర్చిదిద్దాలి అనే ఆశయం వైపుగా ప్రయత్నం జరగడం లేదు.
రాజ్యాంగ సవరణ
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1990వ దశకం వరకు పంచాయితీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు రాజ్యాంగంలోని నాల్గవ భాగంలోని ఆదేశిక సూత్రాలలో అంతర్భాగం. దీంతో సమర్ధవంతంగా పనిచేయడానికి అనేక సమస్యలు ఎదురైయ్యేవి. ఉదాహరణకు 1947 నుంచి 1992- 93వరకు కొన్ని గ్రామాలలోని సర్పంచుల పదవి ఒక కుటుంబానికి చెందిన వారి చేతిలో దశాబ్ధాలపాటు ఉండడం. ఐదు సంవత్సరాలకొకసారి క్రమంగా ఎన్నికలు జరగకపోవడంతో గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం గంగలో కలుస్తున్న సందర్భంలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడం లాంటి కారణాల వల్ల 73, 74వ రాజ్యాంగ సవరణ చేయడం అనివార్యమైంది.
73వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల మహిళలు, దళితులు, ఆదివాసులు, క్రింది కులాలకు రాజ్యాంగ సంస్థలైన పంచాయితీ, మున్సిపాలీటి వంటి వాటిలోకి ప్రవేశించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ అధ్యయనం ప్రకారం ‘దశాబ్దాల పాటు స్థానిక పెత్తనం పోయి, నూతన సామాజిక వర్గాలు స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడడం ఒక చారిత్రక విజయం’ అని తెలుస్తోంది. అయితే ఈ నూతన సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, దళితులు, ఆదివాసులు పెద్దగా చదువుకోలేదని దీంతో వారికి స్థానిక సంస్థలకు సంబంధించిన నియమ నిబంధనలు, పరిపాలనా తెలియడం లేదని, సర్పంచ్పతి పద్ధతి ఆచరణలో ఉందని తేల్చి చెప్పారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ..
2006 కేంద్రపంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ జాతీయశక్తి సామర్థ్యాల పెంపు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లుగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది.
హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ సంస్థ, రాష్ట్రాలలోని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నాయి. కేవలం రిజరేర్వషన్ల శిక్షణ ద్వారానే స్థానిక సంస్థలు బలపడడం లేదని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం(యుఎన్‌డిపి) ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. దీంతో కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ ‘బదలాయింపు సూచికను ఢిల్లీని భారత ప్రభుత్వ పాలనా సంస్థ, గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని గ్రామీణ నిర్వహణ సంస్థ (ఐఆర్ఎమ్ఏ) బదలాయింపు సూచిక ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలల్లో నిధులు(ఫండ్స్), విధులు(ఫంక్షన్స్), సిబ్బంది(ఫంక్షనరీస్) అనే 3ఎఫ్‌ల ఆధారంగా అధ్యయనం చేస్తున్నాయి.
బదలాయింపు సూచికలు
ఈ అధ్యయనంలో తేలిన విషయమేమిటంటే స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత దేశంలో అనేక రాష్ట్రాలల్లో పని చేస్తున్న ఈ సంస్థలను మూడు రకాలుగా విభజించారు. అంతేకాకుండా వీటి శక్తిసామార్ధ్యల గురించి కూడా ప్రస్తావించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి కాంగ్రెస్- బిజెపియేతర రాష్ట్రాలలో సంస్థలు బలంగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటకలాంటి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పాలిస్తున్న ప్రాంతీయ, జాతీయ పార్టీల రాష్ట్రాలు మూడవ స్థానలో ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారాన్ని బదలాయింపు సూచికలు తెలియజేస్తున్నాయి.
బదలాయింపు సూచికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ సంస్థలు మూడవ స్థానంలో ఉన్నాయి. మూడవ స్థానంలో ఉండడానికి కారణం 1990వ దశకం నుండి రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన నాయకులు స్థానిక సంస్థలకు ప్రత్యామ్నాయ సంస్థలను సృష్టించడం, అధికారాలు బదలాయించకపోవడం, జిల్లా పరిషత్తుకు ప్రత్యామ్నాయంగా గ్రామీణాభివృద్ధి సంస్థను తయారు చేయడం వల్ల ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేటి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి.
‘పంచాయితీరాజ్ సంస్థల’పైన సదస్సు
2019- 2024 వరకు అధికారంలో కొనసాగిన వైసిపి పాలనలో వాలంటీర్ల, సచివాలయ ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించి ‘గ్రామసభ’లో ప్రజల భాగస్వామ్యం లేకుండ చేయడం వల్ల ఆ పార్టీని గ్రామీణ ప్రాంతాలలో కూడ ఎన్నికలల్లో ఓడించారు. ఇటువంటి పరిస్థితులల్లోనే 2023 ఆగస్టు 5న జనసేన పార్టీ రాష్ట్రస్థాయిలో ‘పంచాయితీరాజ్ సంస్థల’పైన సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ ప్రభుత్వ అధికారులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలను క్రోడీకరించి ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని, స్థానిక సంస్థలలో ఖర్చుపెట్టడాన్ని ఏకగ్రీవ ఎన్నికలను నిషేధిస్తామని ప్రకటించారు.
ఈ సదస్సు వల్ల రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రతినిధులలోను, గ్రామీణ ప్రాంత ప్రజలల్లో జనసేన మీద నమ్మకం రావడం వల్ల ఒక ఊపు వచ్చి మైత్రి పార్టీలైన టిడిపి, బిజెపి, జనసేన విజయాన్ని సాధించాయి. ఎన్డీయే అధికారంలోకి రాగానే జనసేన పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రిగా, పంచాయితీరాజ్ గ్రామిణాభివృద్ధి మంత్వ్రిశాఖను చేపట్టడడం వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మంచి రోజులు వస్తాయని ఆశించారు. పవన్‌కళ్యాణ్ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టన నాటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థలకు చేసే కార్యక్రమాలను బట్టి రెండు విషయాలు అర్థమౌతున్నాయి.
ఒకటి, కేంద్రప్రయోజిత కార్యక్రమాలను స్థానిక అంశాలలో జోడించడం. ఉదాహరణకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యనవనాలకు అనుసంధానించారు. వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కరువు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో, కూలీలు వలస వెళ్లే సమయంలో కనీస వేతనాన్ని ఇస్తూ అమలు చేయాలి. అయితే దీన్ని ఉద్యానవనాలకు, వ్యవసాయరంగానికి వర్తించడం. రెండు పంచాయితీ రాజ్ శాఖలో పనిచేసే సిబ్బందిని ఆ శాఖలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దకుండ, రెవెన్యూశాఖలో పనిచేసే సిబ్బందిలో పోటీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం. రెవెన్యూశాఖలో పనిచేసే సిబ్బందికి ఆ శాఖలో ‘జీతంతోపాటు గీతం’ కూడ ఎక్కువగా ఉంటుంది. అని దేశవ్యాప్తంగా చెప్పుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాలల్లో ఏ రైతును అడిగినా తమ పొలాల కొలతలకు అవసరమైన సర్టిఫికేట్ల జారీకి సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి నుండి పై స్థాయి వరకు ఎంత లంచం ఇస్తున్నారని అడిగితే స్పష్టంగా అధారాలతో చెప్తారు.
పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అధిక హోదా, ఆదాయ వనరులున్న రెవెన్యూ సిబ్బందితో పోటీ పడే శాఖ కాదు. పంచాయితీరాజ్ శాఖ అభివృద్ధి, సంక్షేమంపైన పనిచేసే వ్యవస్థ. పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్న లక్షకుపైగా సిబ్బంది ఎన్నికైన ప్రజాప్రతినిధుల నియంత్రణను ఎట్టి పరిస్థితిలోను ఒప్పుకోరు. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సంవత్సర పని నివేదికను రాస్తారు. అలాగే మండల స్థాయిలో మండలాధ్యక్షులు ఆ స్థాయి అధికారులపై నివేదిక, గ్రామ పంచాయితీ స్థాయిలో సర్పంచ్ నివేదిక రాస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీరాజ్ సంస్థలలో పనిచేసే సిబ్బంది ఇందుకు ఏమాత్రం ఒప్పుకోరు. పంచాయితీరాజ్ సంస్థలపైన పెత్తనం మాత్రం ప్రభుత్వ అధికారుల చేతులలో ఉండాలనే ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనబడుతుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రస్థాయిలో ఉన్న పంచాయితీరాజ్ అధికారులు స్పందిస్తున్నారు. కానీ అధికారాలు, నిధులు, సిబ్బంది స్థానిక సంస్థలకు బదలాయించి వాటిని బలోపేతం చేయాలనే ప్రయత్నం జరగడం లేదు. అంతేకాకుండ ఒక పక్క అధికారులు తమకు రావలసిన పరిహారాలను కోరుకుంటున్నారు గానీ, వీరిలో ఎంతమంది గ్రామీణప్రాంతాలలో నివాసం ఉంటున్నారు? అంటే పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలలో పనిచేసే ఉద్యోగులు కూడా గ్రామాలలో ఉండడం లేదు. అందువల్ల వీరికి గ్రామాలంటే పర్యాటక క్షేత్రాలేగాని పని చేసే చోట నివాస స్థలాలు కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల దృక్పథం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజల దృక్పథం నుంచి మరి ముఖ్యంగా గ్రామీణవాసుల, రాజ్యాంగ స్ఫూర్తితో జరగడం లేదన్నది స్పష్టం అవుతుంది.
– ఇ వెంకటేశు
(హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.