
ప్రజలతో మమేకమైతేనే పార్టీల,ఉపాధ్యాయ సంఘాల అస్తిత్వం కొనసాగుతుందండానికి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలే నిదర్శనం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రభావం ఈసారి అధికంగా కనిపించింది. పార్టీలకతీతంగా ఓటర్లను ఆకర్షించడానికి విచ్చలవిడిగా మద్యం,డబ్బులు పంచిపెట్టారు.గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలను పరిశీలించిన విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఎన్నికలను వ్యాపారీకరణ,కార్పొరేటీకరణ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. సామాన్యులు ఎన్నికల్లో గెలవడం కలగానే మిగులనుంది.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రభావంతో పాటు కుల,వర్గ సామాజిక ప్రభావాలు అధికంగా పనిచేశాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు కూడా మద్యం,డబ్బు పంపిణీ చేయడం కొసమెరుపు. సమాజానికి దిక్సూచిగా ఉంటూ దిశా నిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు ఈ విధంగా ప్రవర్తించడంతో సభ్య సమాజం మొక్కున వేలేసుకుని చూస్తుంది.
నాడు వామపక్ష ఉద్యమాలకి పట్టుకొమ్మలుగా ఉన్న ఉత్తర తెలంగాణలో నేడు యువకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు, మేధావి వర్గం ప్రగతిశీల వామపక్ష భావజాలానికి దూరమై హిందూత్వ సిద్ధాంతానికి దగ్గరవుతున్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది.
దేశవ్యాప్తంగా బిజెపి తన ప్రాభవాన్ని పెంచుకుంటూ వస్తుంది.తెలంగాణలోని యువకులు చైతన్యపూరిత భావజాలానికి దూరమై నిరాశని నిస్పృహల్లో ఉన్న సంధి కాలంలో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధం సంఘాలు బిజెపి, అఖిల భారత విద్యార్థి పరిషత్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, సరస్వతి శిశు మందిర్, భారతీయ మజ్దూర్ యూనియన్, స్వదేశీ జాగరణ మంచ్ వంటి 21 అనుబంధ సంఘాలు రాష్ట్రంలో వాటి కార్యక్రమాలను గ్రామ గ్రామాన చేస్తూ కాషాయ భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తూ ప్రజలతో మమేకం కావడం ప్రారంభంచింది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల తీర్పు ఈసారి విభిన్నంగా కనిపిస్తుంది.ఒకచోట
సంఘాల అభ్యర్థులను కాదని రాజకీయ పార్టీ అభ్యర్థికి,మరొకచోట ఉపాధ్యాయ సంఘ అభ్యర్థికి ఓటు వేసి ఉపాధ్యాయ ,అధ్యాపకులు గెలిపించుకున్నారు.సమాజంలో ఏ మార్పు అయినా ముందుగా మేధావి వర్గం,బుద్ధి జీవుల నుండే ఆరంభమై,తర్వాత పౌర సమాజం ప్రజలను చైతన్య పరుస్తుంది.
గత దశాబ్ద కాలంలో విద్యారంగం గాడి తప్పడానికి ఉద్యోగ,ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు కారణమయ్యాయి.ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిటి గుదిబండగా మారి అనేక కుటుంబాలని చిన్న భిన్నం చేసిన జీవో 317 కు వ్యతిరేకంగా పోరాడిన బిజెపికి ప్రతిఫలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు,యువకులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పునిచ్చారు.ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బిజెపి పై ఆ పార్టీ ఎమ్మెల్సీలపై ఉంది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటు పడుతూ,ఉద్యోగ, ఉపాధ్యాయ,నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత బిజెపి పైన ఉంది.గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇటు పల్లెల్లో,అటు పట్టణాల్లో బిజెపి ప్రాభవం పెరిగింది.
టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలుచుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణపై బిజెపి పట్టు సాధించిందని చెప్పవచ్చు. ఉత్తర తెలంగాణలో దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిన మాట నిజం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఎధిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకులు సందిగ్ధంలో పడిపోయారు.బిఆర్ఎస్ ఓట్లు చీలిపోయి అభ్యర్థుల గెలుపు ఓటమిలను ప్రభావితం చేశాయి.
గతంలో ఎమ్మెల్సీలుగా గెలిచి వారి పదవీకాలం పూర్తి చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉన్న వారికి వచ్చిన ఓట్లను పరిశీలిస్తే వారి పనితీరు మనకు అర్థం అవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరుద్యోగుల పక్షాన వారు ఏ స్థాయిలో పోరాటాలు చేశారో వారికి వచ్చిన ఓట్ల శాతమే నిదర్శనం.
ఉపాధ్యాయులు డబ్బులకు అమ్ముడు పోయారు అనే మాటకు బదులుగా ఉపాధ్యాయుల తరపున మేము పోరాడుతామని ఉపాధ్యాయ,అధ్యాపక వర్గాల్లో గట్టి నమ్మకం కలిగించడంలో ఉపాధ్యాయ సంఘాలు విపలంమయ్యాయని
ఉపాధ్యాయ సంఘం నాయకులు అశోక్ గారు చెప్పిన మాటాలు అక్షర సత్యాలు.ఉపాధ్యాయ సంఘాలు పాలకపక్షాలకు వంత పాడుతూ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడకుండా నాయకుల స్వప్రయోజనాలె లక్ష్యంగా ముందుకు సాగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఉపాధ్యాయులు స్పష్టమైన తీర్పునిచ్చారు.ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు నాయకుల స్వప్రయోజనాలుకై, వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీల సిద్ధాంతాలకై పాటుపడకుండా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు,ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించగలిగితే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలుగా చుక్కా రామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి నికార్స్ అయినా మేధావులను మరోసారి చూడగలుగుతాం. వీరిరువురు పార్టీలకతీతంగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలం వినిపించి, ప్రజల పక్షాన నిలిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలకు అవుతున్న ఇప్పటివరకు పెండింగ్ బిల్లులకు మోక్షం లేదు,ఉద్యోగులకు హెల్త్ కార్డుల అమలు అంతంత మాత్రమే, పి ఆర్ సి, డి ఎ ల ఊసే లేదు.ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన బకాయిలకై కోర్టు లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కేవలం కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే బకాయిలు చెల్లించడం జరిగింది. మిగతా వారికి సంవత్సరాలు గడిచిన వారి అవసరాలకు డబ్బులు అందడం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయులు వారి అవసరార్థం జిపిఎఫ్ నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటే సంవత్సరాలు గడిచిన ఆ డబ్బులు ప్రభుత్వం నుండి రావడం లేదు.బిల్లులు
ఈ కుబేర్ లోనే పెండింగ్ లో ఉన్నాయి. కేజీబీవీ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగనే లేదు.ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉపాధ్యాయ సంఘాలు విఫలమయ్యాయని సగటు ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు.ఉపాధ్యాయ సంఘాలపై క్రమేణా నమ్మకం సన్నగిల్లి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులను కాదని రాజకీయ పార్టీల అభ్యర్థులవైపు ఉపాధ్యాయులు మొగ్గు చూపారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసిన కూడా యువకులు అసంతృప్తితో ఉన్నారని అర్థం అవుతుంది.ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఫలితాలు గుర్తు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కులగనన నిర్ణయం తీసుకొని సమాచారం సేకరించాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో కొంత చైతన్యం వచ్చింది. అది టీచర్ ఎమ్మెల్సీ అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా బీసీ అభ్యర్థులకు ఓట్ల శాతం పెరగడం గమనార్హం. బడుగు బలహీన వర్గాలు సంఘటితమైతే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవి. బీసీలను సంఘటితం చేయాల్సిన బాధ్యత బీసీ సంఘాలపై బీసీ మేధావి వర్గంపై ఉంది.
స్థూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును మెరుగుపరుచుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేయాలని, నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని పథకాలు రూపొందించాలని ఉద్యోగాల కల్పన జరగాలని,ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఉపాధ్యాయల పక్షాన పోరాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలని,బహుజన వర్గాలు సంఘటితమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, రాష్ట్రంలో ప్రగతిశీల భావవ్యాప్తికై వామపక్ష విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు మరింతగా శ్రమించాలని,ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ ప్రజల పక్షాన పోరాడితే బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నప్పటికీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తే బిఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని సూచిస్తున్నాయి.
✍️పాకాల శంకర్ గౌడ్
9848377734.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.