
స్వభాష అభిమాన ఉద్యమం యాంటీ హిందీతో తమిళనాడు భగ్గుమంటోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పెద్ద వారే నడుస్తోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానం తప్పనిసరంటూ హిందీని కూడా తమిళనాట అమలు చేయాల్సిందేనని కేంద్రప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఆ పట్టుదలే రచ్చకు కారణమైంది. మరోమారు హిందీ వ్యతిరేక ఉద్యమానికి అధికార డీఎంకే శ్రీకారం చుట్టేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాదే ఉన్న దరిమిలా అందివచ్చిన అవకాశాన్ని అధికార డీఎంకే సద్వినియోగం చేసుకొంటోంది. మరి తమిళనాట తమ బలం పెంచుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హిందీ వ్యతిరేక ఉద్యమం శరాఘాతంలా తగులుతుందా? తమిళ సంఘాల మద్దతుతో కేంద్రంపై సమరానికి సై అన్న డిఎంకేను బీజేపీ ఎలా ఎదుర్కుంటుంది అన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో హిందీని అనుమతించే ప్రసక్తే లేదని అధికార డీఎంకే తెగేసి చెబుతోంది. తొలినాళ్లలో హిందీ వ్యతిరేక ఉద్యమంతో బలపడిన డీఎంకే ఇప్పుడు మళ్లీ అదే ఉద్యమంతో కొత్త ఊపు తెచ్చుకోవాలని చూస్తోంది. 9 దశాబ్దాల క్రితం తమిళనాడులో రాజకీయ పార్టీగా డీఎంకే గట్టి పునాదులు వేసుకోవడానికి హిందీ వ్యతిరేక ఉద్యమం ఒక కారణం అయ్యింది.
అయితే, తమిళనాడు రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రాంతీయ వాదం వినిపించడానికి అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒక తాటిపై నడుస్తాయి. రాష్ట్ర హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి పోరుకు సిద్ధమవుతాయి. ఆ ఉద్యమాన్ని ఏ పార్టీ అయితే లీడ్ చేస్తుందో దానికి తగిన ప్రయోజనం దక్కుతుంది. ఇప్పుడు డీఎంకే అదే పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని విషయంలో ప్రాంతీయవాదానికి, సంస్కృతికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేనినైనా రుద్దాలని చూసినా, నిర్ణయాలు తీసుకున్నా, భారీ ప్రజా పోరాటాలకు తమిళనాడు సిద్ధమవుతోంది.
జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిషేధాన్ని భేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపై పోరాటం చేసి, విజయం సాధించిన అంశం మన కళ్ల ముందే ఉంది. కొన్ని దశాబ్దాలుగా హిందీ భాషపై వ్యతిరేకత తమిళనాట కొనసాగుతోంది. ప్రజల మనస్సులలోనూ ఆ భావనను పార్టీలు పెంచి పోషించాయి. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం హిందీపై రచ్చకు దారితీసింది. అసలే దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందన్న వాదన ఎలాను ఉంది. అలాంటిది హిందీని మళ్లీ బలవంతంగా తమపై రుద్దుతామంటే తమిళులు చూస్తూ ఊరుకుంటారా? అగ్గిమీద గుగ్గిలమవుతారు, ప్రస్తుతం అదే జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్ విమర్శలు..
అసలేం జరిగింది? తాజా వివాదానికి ఆజ్యం పోస్తున్నది ఎవరు? అన్నది ఒకసారి పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో తమిళనాడులోని కేంద్ర ఆధీనంలో వుండే కార్యాలయాలు, రైల్వే పరిధిలో మెల్లమెల్లగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుచేస్తూ వస్తోంది. ఇంతకుముందు రైల్వేస్టేషన్ బోర్డులలో ఇంగ్లీషు, తమిళ పేర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు హిందీ పేర్లను కూడా జోడించారు.
చెన్నైలోని ఎల్ఐసీ కార్యాలయం వెబ్సైట్లో ఆంగ్లం, తమిళ ఆప్షన్‌ను తొలగించి హిందీని మాత్రం ఉంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఎల్ఐసీ ఖాతాదారులైన లక్షలాది తమిళుల మాటేమిటని ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణం కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. భారతదేశ వైవిధ్యాన్ని కేంద్రం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. ఈ వివాదం నడుస్తుండగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పాఠశాలల్లో హిందీని ఖచ్చితంగా అమలు చేయాలని, హిందీని అమలు చేయకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి విద్యాభివృద్ధి కోసం మంజూరు చేసే నిధులను ఆపేస్తామని కేంద్రమంత్రి హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అంతే, తమిళ భాష సంస్థలతో కలిసి అధికార డీఎంకే కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. నిరసన ర్యాలీలతో రోడ్లపైకి వచ్చిన డీఎంకే శ్రేణులు కేంద్రప్రభుత్వ కార్యాలయాల హిందీ బోర్డులను తొలగించే పని చేపట్టారు. రైల్వేస్టేషన్లలోని హిందీలో రాసిన పేర్లను చెరిపివేస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.
డీఎంకే మీద రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు..
ఈ క్రమంలో గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని, కావాలనే డిఎంకే రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది. తమిళనాట ప్రైవేటు పాఠశాలల్లో హిందీని కూడా అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో 50 శాతం విద్యార్ధులు హిందీని నేర్చుకుంటున్నారన్నది బీజేపీ వాదన. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయే కానీ రాష్ట్ర ప్రజలంతా హిందీకి వ్యతిరేకం కాదని బీజేపీ అంటోంది. డీఎంకే చేస్తున్న హిందీ వ్యతిరేక ఉద్యమానికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమలం శ్రేణులు ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమ చరిత్ర..
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నిన్నమొన్నటిది కాదు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే హిందీపై వ్యతిరేకత మొదలైంది. మద్రాసు ప్రెసిడెన్సీలో రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం 1937లో జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఈవీ రామస్వామి నాయకర్ (పెరియార్), ప్రతిపక్షమైన జస్టిస్ పార్టీ వ్యతిరేకించారు. మూడు సంవత్సరాల పాటు హిందీ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి.
నిరాహారదీక్షలు, సమావేశాలు, పాదయాత్రలు, పికెటింగ్‌లతో ఆందోళన ఉధృతం కాగా ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందగా పిల్లలు, మహిళలతో సహా పదకొండు వందల మంది వరకు అరెస్టయ్యారు. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేశాక 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ నిర్బంధ హిందీ విద్యాభ్యాసాన్ని ఉపసంహరించారు.
విస్తృతమైన వేర్వేరు వాదాలతో కూడిన చర్చల తర్వాత భారతదేశానికి అధికారిక భాషగా హిందీని స్వీకరించి, ఆంగ్లాన్ని అనుబంధ అధికారిక భాషగా తాత్కాలికంగా ఆమోదించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1965 తర్వాత హిందీని ఏకైక అధికారిక భాషగా చేసే ప్రయత్నం చాలా హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆంగ్లం వాడకాన్ని కొనసాగించాలని వాదించాయి. ద్రవిడ కళగం నుంచి విడిపోయి ఏర్పడ్డ రాజకీయ పార్టీ డీఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించింది. వారి ఆందోళన తగ్గించేందుకు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక భాష చట్టంలో మార్పు తెచ్చి 1965 తర్వాత కూడా ఆంగ్లం వినియోగాన్ని కొనసాగించేలా చేశారు. అయినా శాంతించని డీఎంకే హిందీ వ్యతిరేకోద్యమం ఉధృతం చేసింది. రాష్ట్రంలో వివిధ కళాశాల విద్యార్థులు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
1965 జనవరి 25న మధురైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య జరిగిన చిన్న వివాదం రాజుకుని పూర్తిస్థాయి అల్లర్లుగా మారాయి. ఇవి ఆ తర్వాత రెండు నెలల పాటు కొనసాగాయి. వీటిలో అనేక హింసాత్మక చర్యలు, లూటీలు, గృహదహనాలు, పోలీసు కాల్పులు, లాఠీఛార్జీలు చోటుచేసుకున్నాయి. ఆందోళనను అణచివేయడానికి మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలటరీ దళాలను రప్పించింది. ఆ ఆందోళనలలో 70 మంది మరణించారు. పరిస్థితిని శాంతపరచడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హిందీ భాషేతర రాష్ట్రాలు కోరే వరకూ ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీనిచ్చారు.
1965 నాటి ఆందోళనలు సద్దుమణిగినా రాష్ట్రంలో ప్రధాన మార్పులకు కారణమయ్యాయి. డీఎంకే 1967 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌కు అధికారం కరువైంది. ఆ తరువాత ద్రవిడ పార్టీలదే అధికారంగా కొనసాగగా తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే కూడా హిందీ వ్యతిరేక వైఖరినే అవలంబించింది. ఇప్పుడు అధికారంలో ఉన్నా మరోమారు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.
ట్రెండింగ్‌లో ‘గెట్ అవుట్’ స్లోగన్..
తాజాగా హిందీని ప్రధాని నరేంద్రమోదీ తమిళులపై బలవంతంగా రుద్దాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీఎంకే సోషల్ మీడియా వేదికగా ‘గెట్ అవుట్ మోదీ’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోంది. దాంతో తమిళనాట గెట్ అవుట్ అనే పదం వైరల్‌గా మారింది. డీఎంకేకు పోటీగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ‘గెట్ అవుట్ స్టాలిన్’ అనే పదాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు తగ్గేదేలా అంటున్నాయి.
అయితే ఎప్పటి నుంచో గవర్నర్ రవి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. తమిళ సంస్కృతిని గవర్నర్ అవమానిస్తున్నారంటూ ఇప్పటికే అధికార డీఎంకే ప్రజలలోకి తీసుకెళుతోంది. గెట్ అవుట్ రవి అనే స్లోగన్ వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా తోడవడంతో ‘గెట్ అవుట్ మోదీ’ని జోడించింది.
డీఎంకే మైలేజ్‌ను పెంచుతున్న స్టాలిన్..
పనిలో పనిగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశాన్నీ లేవనెత్తుతున్న సీఎం స్టాలిన్ దక్షిణాదికే ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో పార్లమెంట్ సీట్లు తగ్గనున్న అంశాన్నీ ప్రస్తావిస్తున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న స్టాలిన్, ఈ అంశాలలో అన్ని పార్టీలను ఇరుకున పెడుతూ డీఎంకే మైలేజ్‌ను పెంచుకుంటున్నారు.
రాష్ట్రంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో హిందీ వ్యతిరేక ఉద్యమం కీలకపాత్ర పోషించేరీతిలో ముందస్తు వ్యూహం అమలు చేస్తున్న డీఎంకే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపించకుండా చూసుకుంటోంది. డీఎంకే చేస్తున్నది పక్కా రాజకీయమని బీజేపి ఎంత వాదిస్తున్నా హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, బీజేపీకే మైనస్ కానున్నాయి. ప్రజల సెంటిమెంటును క్యాష్ చేసుకునే రీతిలో డీఎంకే సారధి స్టాలిన్ వేస్తున్న ఎత్తులు తమిళ రాజకీయాలనే మార్చేస్తున్నాయి. త్రిభాషా సూత్రమంటూ కేంద్రం చెబుతున్న మాటలు వచ్చే ఎన్నికల్లో గెలుపుకు డీఎంకేకు ఓ ఆయుధంలా ఉపయోగపడతాయంటే అతిశయోక్తి కాదు.
– బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.