
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్రాని రాష్ట్ర విభజన సందర్భంగా శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ గణాంకాలతో సహా అధికారులు నిరూపించారు. రాష్ట్ర విభజన చట్టం 2014లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీతో పాటు మరికొన్ని మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే అవేవీ సక్రమంగా అమలు కాలేదు. ఫలితంగా ఈ ప్రాంతంలో స్వాతంత్రానంతరం కొనసాగుతున్న వెనుకబాటు ఈ పదేళ్ళ కాలంలో పెరిగిందే కానీ తగ్గలేదు. వలసలు, పేదరికం మరింత పెరిగాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్ లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రభుత్వ రంగం, ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు వంటి అంశాల ప్రస్తావన కూడా లేదు. సరికదా పి4 మోడల్ పేరుతో ప్రైవేటీకరణ వేగాన్ని పెంచే విధానాన్ని ప్రతిపాదించారు.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే కొన్ని నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్డడంతో పాటు, ప్రజలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే సాధ్యమవుతుందన్నది తేటతెల్లమైంది.
నేడు పాలకులకే నచ్చినవి, ప్రజలు కోరుకోనివి, వ్యతిరేకిస్తున్నవి ఏవేవో చేసేస్తూ, ఇదే అభివృద్ధని నమ్మబలుకుతున్నారు. కొంతమంది ప్రజలు ఆ భ్రమల్లో పడిపోతున్నారు కూడా. అందువల్ల అసలైన అభివృద్ధి అంటే ఏమిటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. ప్రముఖ అమెరికన్ ఆర్థిక వేత్త మైకేల్ టోరాడో అభివృద్ధి గురించి ఇలా పేర్కొన్నారు.
“ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం – ఆదాయాలు, వినియోగం పెరగడం. ఆహారం, వైద్యం, విద్య వంటి రంగాలలో నిరంతర పెరుగుదల ఉండడం.
వారికి ఏం కావాలో ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు కల్పించడం.”
నేడు పాలకులు చెబుతున్న అభివృద్ధి ఏ కోణంలో ఉంది, ఈ దిశలో ఉందా లేదా అన్నది పరిశీలించాలి.
సాధారణంగా ప్రకృతి వనరుల కొరత ఉన్న ప్రాంతాలలో వెనుకబాటుతనం ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఉత్తరాంధ్రకు అపారమైన ప్రకృతి వనరులు ఉన్నా వెనుకబాటుతనం కొనసాగుతోంది. 353 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం, రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం, దట్టమైన అడవులు ఉత్తరాంధ్రకు సొంతం. అయినా ఈ అపారమైన వనరుల మధ్యే (Poverty amidst plenty) కూడా ఉండడం గమనార్హం.
స్వాతంత్రానంతరం గత ఏడున్నర దశాబ్దాలుగా పాలకులు పట్టించుకోకపోవడానికి సాధారణ అంశాలతో పాటు కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. చారిత్రకంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఫ్యూడల్ జమీందారీ వ్యవస్థ ఎక్కువ. జమీందారీ వ్యవస్థ రద్దు అయినా ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలు, ప్రభావాలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికీ ఉత్తరాంధ్ర రాజకీయాలను ఈ ఫ్యూడల్ శక్తులు, వారి అనునాయులే నిర్దేశించే స్థితి కొనసాగుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కన్నా ప్రజలను అణిగిమణిగి ఉంచే స్వభావం ఫ్యూడల్ సంస్కృతికి ప్రధాన రాజకీయ లక్షణం. ఫలితంగా విశాఖ నగరంలో కొద్దిమంది మినహా మిగిలిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో అత్యధిక ప్రజాప్రతినిధులు స్థానికులైనప్పటికీ వీరెవరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేయలేదు .
విశాఖపట్నం మహానగరంగా అభివృద్ధి చెందడం ఉత్తరాంధ్ర అభివృద్ధిగా పాలకులు భ్రమలను కల్పిస్తున్నారు. వాస్తవంగా ఈ నగరం నేడు ఉత్తరాంధ్ర జిల్లాల దోపిడీ కేంద్రంగా పాలకులకు ఉపయోగపడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యంతో పాటు, అధికారంలో ఉన్నా తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయని స్థానిక ప్రజాప్రతినిధుల స్వార్థ రాజకీయాలే.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పాలకవర్గాలు భారీ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపాయి తప్ప ఈ ప్రాంత ప్రత్యేకతలకు తగ్గట్టుగా నీటి ప్రాజక్టులకు అభివృద్ధి చేయడంలో కానీ, పారిశ్రామికీకరణ చేయడంలో కానీ శ్రద్ధ పెట్టలేదు. తమ దోపిడీ కొనసాగాలంటే ఇక్కడి ప్రజలు విద్యావంతులు, ఆరోగ్యవంతులు అవడం కూడా పాలకులకు ఇష్టం ఉండదు. దీనివల్లే విద్య, వైద్య రంగాలలో కూడా ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబడే ఉంది. ఇక్కడ సామాజిక పొందికలో బీసీలు, గిరిజనులు అధికంగా ఉండడం వల్ల కూడా పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్రధానంగా గ్రామీణ పేదరికంలో కనబడుతూ ఉంటుంది. వ్యవసాయం అభివృద్ధి చెందేలా నూతన వ్యవసాయ పద్ధతులు ఇక్కడ ప్రోత్సహించబడలేదు. దానితో పాటుగా అనేక నీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్ లోనే ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తోంది. నేడు పాలకులు అభివృద్ధి పేరున చేపడుతున్న చర్యలన్నీ కొంతమంది సంపన్నులకు మేలు చేసేవి గాను, సామాన్య ప్రజలను అభివృద్ధి నుండి బయటకు గెంటి వేసేవిగానూ ఉన్నాయి. ఈ స్థితి మారకుండా సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు. దీనిని మార్చడమే ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన ఎజెండాగా ఉండాలి.
అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉండే అక్షరాస్యత ఉత్తరాంధ్రలో తక్కువగా ఉంది. విద్యాసంస్థల స్థితి చాలా దయనీయంగా ఉంది. మానవ వనరుల అభివృద్ధి సూచికలో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున ఉన్నాయి. జిల్లాల తలసరి ఆదాయం, స్థూల జిల్లా ఉత్పత్తి, మాతా శిశు మరణాలు, అక్షరాస్యత వంటి అనేక అంశాలలో ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది.
ఉత్తరాంధ్రలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. మూడో వంతు మంది రైతులు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగిన వారే. ఈ భూమి కమతాల సైజు కూడా క్రమంగా తగ్గుతోంది. ఉదాహరణకు ఐదేళ్ల కాలంలో శ్రీకాకుళంలో సగటు కమతం 0.66 హెక్టార్ల నుండి 0.51కు తగ్గిపోయింది.
సాగునీటి లభ్యతలో రాష్ట్రంలోనే అట్టడుగున ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కన్నా అత్యధిక వర్షపాతం ఇక్కడ ఉన్నా, సాగు నీరు, త్రాగు నీరు నీటి లభ్యత తక్కువగా ఉండడానికి కారణం నీటి ప్రాజక్టుల నిర్మాణం చేపట్టకపోవడమే. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి, సువర్ణముఖి, వేగావతి, మహేంద్ర తనయ, గోస్తని, చంపావతి, బహుదా, జంఝావతి, గౌతమి, శారద, వరాహ, తాండవ, పంపా వంటి నదులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక చెరువులు ఉండడం ఉత్తరాంధ్ర ప్రత్యేకం. విజయనగరంలో 9,173 చెరువులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, శ్రీకాకుళంలో 8336, విశాఖపట్నంలో 3458 చెరువులున్నాయి. వీటితోపాటు వివిధ చెక్ డ్యాములు, గడ్డల ద్వారా వ్యవసాయం జరుగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం లేకపోవడంతో అత్యధిక వర్షపాతం ఉన్నా వర్షపు నీరు వృధాగా బంగాళాఖాతంలోనికి పోతోంది.
నూతనంగా వస్తున్న పరిశ్రమల ద్వారా వస్తున్న ఉపాధి కంటే నిర్వాసితులవుతున్న రైతులు, ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు, ఇతర వృత్తిదారులు అధికంగా ఉంటున్నారు. పారిశ్రామిక కాలుష్యంతో మత్స్య సంపద నాశనం అవుతూ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. 353 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం ఉత్తరాంధ్రకు వరంగా ఉండేది. కానీ అదే నేడు శాపంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఉపాధి కోల్పోతున్న రైతులు, ముఖ్యంగా వృత్తిదారులు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు, సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. సాంప్రదాయక వ్యవసాయాధారిత జ్యూట్, షుగర్, జీడిపిక్కలు వంటి పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఐటీరంగం, దాని ద్వారా ఉపాధి కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదు. టూరిజం రంగం అభివృద్ధి, ఉపాధి, దాని ద్వారా ఆదాయం గురించి చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు సంబంధమే లేదు.
రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఉంది. రాష్ట్ర గిరిజన జనాభాలో 37.23 శాతం గిరిజనులు ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. దట్టమైన అడవులతో నిండిన ఈ ప్రాంతంలో అపారమైన సంపద ప్రకృతి సిద్ధంగా పోగుపడి ఉంది. అయితే, ఈ సంపద ఫలాలు గిరిజనులు పొందలేకపోతున్నారు. ఈ ప్రాంతంలోని సంపదను కొల్లగొట్టుకుపోవడానికి పాలకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారే తప్ప, ఈ సంపదతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుదలకు ఇసుమంత కూడా ప్రయత్నాలు చేయకపోవడం నేటి దుస్థితికి ప్రధాన కారణం. ఫలితంగా మానవాభివృద్ధి సూచిలో వీరు అట్టడుగున ఉన్నారు. విద్య, వైద్యం , రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు వంటివి చాలా తక్కువగా ఉన్నాయి. తీవ్ర పేదరికం నెలకొనడంతో పౌష్టికాహార లోపం, బాలికలలో రక్తహీనత చాలా అధికం. సంతలలో అటు కొనుగోలులోను, అమ్మకాలలోనూ కూడా జరిగే మోసాలు వీరి పేదరికాన్ని మరింత పెంచుతోంది. దీనికి తోడు ఈ గిరిజన ప్రాంత భూముల నుండి గిరిజనులను నెట్టివేసేలా చట్టాలను అతిక్రమించి హైడ్రో పవర్ వంటి వివిధ ప్రాజక్టులను నేడు పాలకులు చేపడుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ స్థిరమైన అభివృద్ధిలో అత్యంత ప్రధానమైనది. అయితే నేడు కొంతమంది తక్షణ లాభార్జన కోసం, ప్రభుత్వాలు ఉత్తరాంధ్రలో పర్యావరణానికి తీవ్ర హానిని కలగజేస్తున్నాయి. ఖనిజాల తవ్వకం పేరుతో అడవులను ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు. పారిశ్రామికీకరణ పేరున విధ్వంసానికి పాల్పడుతూ, సముద్ర తీరాన్ని కలుషితం చేస్తున్నారు. నేడు మన స్వప్రయోజనాల కోసం పర్యావరణాన్ని పణంగా పెడితే భవిష్యత్తు తరాల మనగుడే ప్రశ్నార్ధకమవుతుంది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలి. కానీ నేడు విశాఖ నగరంతో సహా అన్ని ప్రాంతాలలోనూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలు అమ్మడం ద్వారా అదానీ సంస్థకు 2,852.26 ఎకరాల భూమిని శాశ్వతంగా ఇచ్చేసింది.
1991 నుండి దేశంలో అమలవుతున్న సంస్కరణల ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా తీవ్రంగా పడింది. వివిధ అవసరాల పేరున పెద్ద ఎత్తున భూసేకరణ, సహజ వనరుల పరాయీకరణ, వేల సంఖ్యలో నిర్వాసితులు, శ్రామికులు ముక్కలు ముక్కలుగా చీలికలైపోవడం, వ్యవసాయం నిర్లక్ష్యం చేయబడడం, విశాఖ ప్రభుత్వ రంగ పరిశ్రమలు బలహీనపడడం వంటి రూపాలలో ఇది వ్యక్తమవుతోంది.
అభివృద్ధి పేరున ఉత్తరాంధ్ర వనరులు ఒక పక్కన కొల్లగొట్టుకుపోబడుతుంటే, మరోపక్క ప్రజలు తీవ్ర పేదరికంలోనికి నెట్టబడుతున్నారు. జరుగుతున్న అన్యాయంపై సంఘటితంగా గళమెత్తవలసిన సమయంలో అణగారిన ఈ తరగతుల ప్రజలు ముక్కలు, చెక్కలవడం వీరి కష్టాలను మరింత పెంచుతోంది. ఈ స్థితిని అధిగమించి అభివృద్ధి దిశలో ముందుకు సాగాలి.
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి సాధించాలంటే క్రింది చర్యలను చేపట్టాలి
- రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ 50 వేల కోట్ల రూపాయలు కేటాయించి నీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయాలి. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్ తో కూడిన ప్రత్యేక రైల్వే జోన్ తక్షణం ఏర్పాటు చేయాలి. మెట్రో రైల్ నిర్మాణం పూర్తి చేయాలి. గిరిజన, పెట్రో యూనివర్సిటీల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
- విస్తారమైన గిరిజన ప్రాంతంలో దొరికే అపారమైన అటవీ సంపదలను వినియోగించుకునేలా 1/70 చట్టాన్ని, ఇతర చట్టాల్ని పటిష్టపరుస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టాలి. జిఒ నెం 3 ను చట్టబద్ధం చేయాలి. స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలి. నాన్ షెడ్యూల్ లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాల జాబితాలో చేర్చాలి. జిసిసికి నిధులు కేటాయించి గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. కాఫీ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- సముద్ర తీర ప్రకృతి వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుతూ, మత్స్యకారులకు ఉపాధి రక్షణ, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి. పర్యావరణానికి హాని కలిగించే కొవ్వాడ అణు విద్యుత్ ఏర్పాటును నిలుపుదల చేయాలి.
- నీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పూర్తిస్థాయి నిధులు కేటాయించి, పోలవరంతో నిమిత్తం లేకుండా శీఘ్రగతిన పూర్తి చేయాలి. మైనర్ ఇరిగేషన్ ప్రాజక్టుల నిర్మాణం, చెక్ డ్యాంల మరమ్మత్తులు, చెరువులలో పూడికలు తీయించడం వంటివి నిరంతరం చేస్తూ ఉండాలి. భూ దురాక్రమణలను అరికట్టాలి.
- ప్రభుత్వ రంగ పరిశ్రమలను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించి, ప్రైవేటికరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. సెయిల్ లో విలీనం చేయాలి. ఐటి, టూరిజం వంటి రంగాలను, జీడి పరిశ్రమలను స్థానికులకు మంచి ఉపాధి కలిగేలా అభివృద్ధి చేయాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా , యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- విద్య, వైద్యం రవాణా వంటి మౌలికవసతుల కల్పన మెరుగుపడాలి. రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థలన్నిటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి. ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఐఐఐటి, జెఎన్టియు, ఆంధ్ర, విజయనగరం మెడికల్ కాలేజీల వంటి అన్ని ఉన్నత విద్యాసంస్థలతో సహా అన్ని విద్యా సంస్థలలో శాశ్వత అధ్యాపకులను, టీచర్లను నియమించాలి. గిరిజన ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత విద్యా సంస్థలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలి.
- కెజిహెచ్, రిమ్స్, అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలు, ఏజెన్సీలో శాశ్వత డాక్టర్లను, ఇతర సిబ్బందిని నియమించాలి. పలాసలోని ఉద్దానం కిడ్నీ పరిశోధనా కేంద్రంలో నిపుణులతో పరిశోధన చేయించాలి. ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులోకి తేవాలి. ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేసి, దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి.
- పొందూరు ఖద్దరు , ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, వడ్డాది శిల్పకళలకు సబ్సిడీలు, మార్కెట్ సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాలి. జానపద కళలను కాపాడేలా కళాకారులకు అవకాశాలు కల్పించాలి. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా మైదానాలు, స్టేడియంలు నిర్మించాలి.
- సాంప్రదాయ వృత్తిదారులకు అవసరమైన ఆధునిక శిక్షణా సౌకర్యాలు కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి. పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలి. ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. విశాఖ జిల్లా పంచగ్రామాలలో ఇళ్ల యజమానులను, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూ యాజమాన్య రైతులను హక్కుదారులుగా గుర్తించాలి.
- భద్రతా ప్రమాణాలు పాటించి, పారిశ్రామిక ప్రమాదాలు నివారించాలి. మూతబడ్డ షుగర్, జ్యూట్, జీడి, ఫెర్రో ఎల్లోయీస్ వంటి పరిశ్రమలను తెరిపించాలి. విషతుల్య పరిశ్రమలను అనుమతించరాదు. కో- ఆపరేటివ్ గోవాడ షుగర్ ఫేక్టరీని ఆధునీకరించాలి. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలి.
అపారమైన ప్రకృతి వనరులున్న ఉత్తరాంధ్రలో సరైన చర్యలు చేపడితే గొప్ప అభివృద్ధి తప్పక సాధ్యమవుతుంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ అభివృద్ధి ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలమవుతుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ ద్వారా యువతకు మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అయితే అటువంటి అభివృద్ధి చర్యలు వారికివారే చేపట్టరు అనేది పాలకుల యొక్క విధానాల ద్వారా అవగతమైంది. విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ప్రజల ఐక్యతను కాపాడుకుంటూ పాలకులపై ఒత్తిడి తేవాలి.
ఉత్తరాంధ్రలో అవకాశాలు లేవు కనుక వేరే ప్రాంతాలకు వలసలు పోయి బతుకుదామనే వైపు కాకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే వైపుగా ఉత్తరాంధ్ర యువత ఆలోచించడం అవసరం. అల్లూరి సీతారామరాజు, వీరనారి గున్నమ్మ వంటి వీరుల వారసత్వం, గురజాడ, గిడుగు, గరిమెళ్ళ, శ్రీ శ్రీ వంటి ఉత్తరాంధ్ర సాంస్కృతిక వీరుల దార్శనికత యువత పుణికి పుచ్చుకోవాలి.
స్టీల్ ప్లాంట్ సాధన, పరిరక్షణ, శ్రీకాకుళం గిరిజనోద్యమం, గిరిజన చైతన్యంతో సాగిన బాక్సైట్ ఉద్యమం, సోంపేట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం, ప్రభుత్వ రంగ బిహెచ్పివి పరిరక్షణ వంటి ఉత్తరాంధ్రలో సాగిన ఉద్యమాల స్పూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారా పాలకులపై ఒత్తిడి తేవడమే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏకైక మార్గం.
– ఎ. అజ శర్మ
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.