
అరవింద్ కేజ్రీవాల్ సహా ‘ఆప్’ అగ్రనాయకులు ఓటమిపాలుకావడానికి తగ్గిన ఓట్ల కన్న ఎక్కువ ఓట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకుగాను 48 సీట్లను గెలుచుకొని బిజెపి 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు రెండవ స్థానం దక్కించుకున్న 13 సీట్లలో ‘ఆప్’ అభ్యర్ధులకు తగ్గిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది.
ఎగుడు దిగుళ్లు
కాంగ్రెస్ పార్టీ 2013 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పరిపాలించింది. ఆ తరువాత నుండి వరుస పరాజయాలు చవిచూస్తూ ఆందోళనకర పరిస్థితులలో చిక్కుకు పోయింది. వరుసగా మూడవసారి కూడా ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. అయితే ఈ సారి ఎన్నికల మీద మాత్రం కొంత ప్రభావాన్ని చూపించింది.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి ఆప్ అగ్ర నాయకులు ఆయా నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉన్నారు. వీళ్ల ఓటమికి దారి తీసిన తగ్గిన ఓట్ల కన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ 4,089 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నిలబడిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు వచ్చాయి.
జంగ్‌పురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా కేవలం 675 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మేయర్ ఫిర్హాద్ సూరికి 7,350 ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో భరద్వాజ్ 3,188 ఓట్ల తేడాతో ఓటమి చవిచూస్తే అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గర్విత్ సింఘ్వికి 6,711 ఓట్లు వచ్చాయి.
ఈ 13 సీట్లకు తోడుగా ఆల్ ఇండియా మజ్లిస్- ఎ – ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా ముస్తాఫాబాద్‌లో తన ప్రభావాన్ని చూపింది. 2020 మత ఘర్షణలతో సమస్యాత్మకంగా మారిన ఈశాన్య ఢిల్లీ నియోజకర్గాల్లో ఆప్ విజయావకాశాలను దెబ్బతీసింది. మాజీ ఆప్ నేత, మత ఘర్షణల కేసును ఎదుర్కొంటున్న తాహీర్ హుస్సేన్ ఈ సారి ఎఐఎంఐఎం టికెట్ మీద పోటీ చేసి 33,474 ఓట్లు సాధించాడు. ఈ నియోజకవర్గంలో ‘ఆప్’ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ 17,578 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశాడు.
కాంగ్రెస్ ఓట్ల శాతం కంటే తక్కువ శాతం వోట్ల తేడాతో ఆప్ఓ డిపోయిన ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు
Sangam Vihar |
BJP |
344 |
15863 |
Madipur |
BJP |
10899 |
17958 |
Nangloi Jat |
BJP |
26251 |
32028 |
Rajindernagar |
BJP |
1231 |
4015 |
Badli |
BJP |
15163 |
41071 |
New Delhi |
BJP |
4089 |
4568 |
Trilokpuri |
BJP |
392 |
6147 |
Chattarpur |
BJP |
6239 |
6601 |
Greater Kailash |
BJP |
3188 |
6711 |
Malviya Nagar |
BJP |
2131 |
6770 |
Jangpura |
BJP |
675 |
7350 |
Timarpur |
BJP |
1168 |
8361 |
Mehrauli |
BJP |
1782 |
9338 |
ఆప్- కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలకు చెందిన సంజయ్ రౌత్(శివసేన- యుబివి), జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి(నేషనల్ కాన్ఫరెన్స్) ఒమర్ అబ్దుల్లా ఇద్దరూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కలిసికట్టుగా బిజెపిని ఎదుర్కోవడంలో ‘ఆప్’, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతో తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్, ‘ఆప్’ల మధ్యన పొత్తు కుదిరి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని రౌత్ వ్యాఖ్యానించారు. ఈ రెండు రాజకీయ పార్టీలకు బిజెపి ప్రధాన ప్రత్యర్ధి అయినప్పటికీ దానిని ఎదుర్కోవడానికి రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందిపోయి దురదృష్టవశాత్తు విడివిడిగా పోటికి దిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఎన్నికల ఫలితాల ధోరణులు మొదటి నుండి పోటీ తీవ్రంగా ఉన్నదని సూచిస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి బిజెపి అనే భావించాయి. ఈ రెండు పార్టీలూ బిజెపి పార్టికి అధికారం దక్కనీయకూడదు. అనే లక్ష్యంతోనే పోటీకి దిగాయి. అయితే ఆ పోరాటం విడివిడిగా చేపట్టాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంటలోనే బిజెపి ఓటమి పాలై ఉండేది’ అని సంజయ్ రౌత్ విశ్లేషించారు.
ఒమర్ అబ్దుల్లా అయితే ఈ ధోరణులను ఉదహరిస్తూనే కాసింత కటువైన భాషలో ‘ఇద్దరూ ఎడతెగకుండా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకున్నారు’అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా బ్లాక్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని ‘ద హిందూ’ పత్రిక రిపోర్ట్ చేసింది. సిపిఐ(ఎం) నాయకుడు టిపి రామకృష్ణన్ స్పందించి, కూటమి క్రియాశీలంగా పని చెయ్యకపోవడానికి కాంగ్రెస్ పార్టీ నుండి తగిన సహకారం లేకపోవడమే అని నేరుగా కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు.
ప్రతిపక్ష పార్టీలు మరింత ఐక్యతతో వ్యవహరించి ఉంటే బిజెపి విజయాన్ని నిలువరించి ఉండేవి అని ఇండియా యూనియన్ ముస్లింలీగ్ నాయకుడు పికె కున్హలికుట్టి వ్యాఖ్యానించారు.
‘లౌకిక ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న విభేదాల నుండి బిజెపి లబ్ధి పొందుతుంది. కాబట్టి ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలు రాష్ట్రాల వారిగా వ్యూహాలు రూపొందించుకుని రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలి, కూటమిలో భాగస్వామ్య పార్టీలు ఫలితాలను ఉమ్మడిగా విశ్లేషించి గుణపాఠాలు తీసుకోవాలే తప్ప ఏ ఒక్క పార్టీనో తప్పు పట్టడం సరికాదు’ అని కున్హలికుట్టి సూచించారు.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ‘ఆప్’, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తాయని ‘ఆప్’ ఆనాడే ప్రకటించింది.
‘గతంలో కూడా మేం స్పష్టం చేశాం, కాంగ్రెస్‌తో పొత్తు సార్వత్రిక ఎన్నికల వరకే. ఈ ఎన్నికలలో మేం నిజాయితీగా కలిసి పోటీ చేశాం. అసెంబ్లీ ఎన్నికలకు మాకు ఇండియా బ్లాక్‌తో పొత్తు అవసరపడదు. ఈ ఎన్నికలను మేం ప్రజాబలంతో ఎదుర్కొంటాం, గెలుచుకుంటాం’’ అని ఆప్ ఢిల్లీ రాష్ట్ర కన్వీనర్ గోపాల్‌రాయ్ గతంలోనే ప్రకటించారు.
– పవన్ కోరాడు
అనువాదం : సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.