
Reading Time: 4 minutes
దేశ విభజన దుష్ఫలితాలను కాశ్మీర్ 1947 అక్టోబరు నెలల మధ్య కాలంలో అనుభవించింది వేలాది మంది కబాలీలు, కిరాయి సైనికులు పాకిస్థాన్ సైన్యం దన్నుతో కశ్మీర్‌ను జయించి పాకిస్థాన్‌కు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో లూటీలకు, దహనకాండకు వేలాదిమంది అమాయకపౌరుల ఊచకోతకు పాల్పడ్డారు. కశ్మీర్ ఈ నాటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉండడానికి, ప్రధాన కారణాన్ని తరచూ విస్మరిస్తున్నారు. ఇచహామా, అట్టినా గ్రామాల్లోని సిక్కులు కబాలీలు, పాకిస్థాన్ సైన్యంతో చేసిన యుద్ధాల గురించి ప్రస్థావనే ఉండడం లేదు.
Those Who Stayed: The Sikhs of Kashmir అన్న నా పుస్తకంలో కొన్ని ముఖ్య భాగాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
బుడ్గాం, కాశ్మీర్ అక్టోబర్ నవంబర్ 1947.
కబాలీలు శ్రీనగర్ విమానాశ్రయం వైపుకి పురోగమిస్తున్నారు. కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న వాళ్ళ ప్రణాళికలో విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడం అత్యంత కీలకం. కశ్మీర్‌ను భారతదేశంతో అనుసంధానించడానికి ఉన్నది రెండు రోడ్డు మార్గాలూ, ఈ విమానాశ్రయమే. ప్రతికూల వాతావరణం మూలంగా రెండు రోడ్డు మార్గాలూ మూసివెయ్యబడి ఉన్నాయి. కాబట్టి భారతసైన్యం కశ్మీర్లో అడుగుపెట్టాలంటే విమానాశ్రయం ఒక్కటే మార్గం కాబట్టి కబాలీలు దానిని స్వాధీనం చేసుకోవాలని తహతహలాడారు. కబాలీలు బారాముల్లా నుండి విమానాశ్రయం చేరుకోవడానికి దగ్గరి దారి పట్టారు. బుడ్గాం జిల్లా కింది అంచుల దారి పడితే, శ్రీనగర్ ముఖ్యపట్టణాన్ని తాకకుండా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అయితే ఈ మార్గంలో ` వాళ్ళు దురదృష్టం కొద్దీ ` సిక్కులు అత్యధికంగా నివసించే ఇచహామా, అట్టిలా అనే రెండు గ్రామాలు ఉన్నాయి. బారాముల్లా మీద కబాలీల దాడి నుండి తప్పించుకున్న వాళ్ళు, బతికి ఉన్నవాళ్ళు బుడ్గాం జిల్లాలో తలదాచుకోవడానికి వచ్చారు. బారాముల్లాలో ప్రత్యక్షంగా తమకంటితో చూసిన దుర్మార్గాలను వివరించి చెప్పడంతో పాటు కబాలీలు ఈ ఊళ్ళమీద పడితే ఏం జరగనున్నదో కూడా చెప్పి హెచ్చరించారు. ఇచహామా గ్రామానికి రెండు వేల మందికి పైగా జనం తరలి వచ్చారు. వారిలో కొన్ని వందల మంది పండిట్లు కూడా ఉన్నారు. 200 గడపలు ఉన్న ఆ ఊరికి జనం పోటెత్తడంతో ఆ గ్రామ జనాభా నాలుగువేల పై చిలుక్కి చేరుకున్నది.
శరణార్ధులకు ఆ ఊరి జనం తమ ఇళ్ళలో, వాకిళ్ళలో, గురుద్వారాలో ఆశ్రయం కల్పించారు. ఊరంతా కలిసి గురుద్వారాలో వంటలు చేసి ఆశ్రితుల ఆకలి తీర్చారు.
ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా నేను కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకున్నాను. ఇచహామాలోని స్థానిక గురుద్వారా అధ్యక్షుడిగా ఉన్న కరణ్‌సింగ్‌ను నేను ఇంటర్వ్యూ చేశాను. దాడి జరిగేనాటికి అతను చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కానీ అది నిన్నా మొన్నా జరిగిన సంఘటన అంత స్పష్టంగా జ్ఞప్తికి ఉంచుకున్నాడు. ఊరి మీద దాడి జరగనున్నదని మాకు తెలిసింది. పెద్దవాళ్ళంతా కలిసి ఊరికి మూడు దిక్కులా బ్యారక్‌లు సిద్ధంచేసారు. ఊరికి ఉత్తరం దిక్కు నుండి దాడి మొదలు కావచ్చని భావించారు. ఎందుకంటే బారాముల్లా ఉన్నది ఆ దిశలోనే. సర్దార్ ఉజర్సింగ్ మరి కొందరు సాయంతో పాత చెవర్లెట్ కారు ఇంజన్ షాఫ్ట్‌తో ఫిరంగి తయారు చేసాడు. ఎక్కువలో ఎక్కువ మంది బ్యారక్ నిర్మాణాల్లోను, బారు తుపాకులలో మందు కూరడంలోనూ నిమగ్నమై ఉన్నారు.
తెల్లవారు జామున మేం ఊహించిన దిశగా కాల్పులు వినిపించాయి. బ్యారక్‌లు వాటిని నిలవరించడంలో సఫలం అయ్యాయి. ఇటు నుండి శతృవుల వైపుకి కాల్పులు జరిపారు. ఆ తరువాత ఒక గంట వరకూ చడీచప్పుడు లేకుండా గడిచింది. మేం ఇంకొన్ని కాల్పులు విన్నాం కానీ అవి మా ఊరిని తాకలేదు. ఆ తర్వాత వార్తాపత్రికలలోను, వివిధ చరిత్రకారుల నుండి నేను విని, చదివి తెలుసుకున్నది ఏంటంటే ` ఆరోజు ఊరిని దాదాపు వెయ్యిమంది కబాలీలు చుట్టుముట్టారు. మూడు విభాగాలకు చెందిన దురాక్రమణదారులు ఒక్కుమ్మడిగా ఊరిమీద దాడి చెయ్యడానికి పరివేష్ఠించి ఉన్నారు. కెప్టెన్ షేర్‌ఖాన్ నేతృత్వంలోని దళం దగ్గరి త్రోవన ముందుగా వచ్చి చేరింది. సుమారు నాలుగైదు వందల మంది ఉన్న దళం అది. సుమారు అంతే మంది ఉన్న మరో దళం మేజర్ కుర్షీద్ అన్వర్ నాయకత్వాన బారాముల్లా జిల్లాలోని పఠాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. భారత సైన్యాన్ని తిప్పికొట్టడానికి అది వ్యూహాత్మకమైన అనువైన ప్రాంతం. ఈ దళం కూడా ఊరిమీద దాడికి బయల్దేరింది. లతీఫ్ ఆఫ్ఘానీ నాయకత్వంలో అత్యంత సుశిక్షుతులు అయిన వందమంది నేషనల్ గార్డ్లతో మూడోదళం కూడా వీరితో జతకలిసింది.
దేశ విభజన సమయంలో జాతి హత్యాకాండకు పాల్పడిన క్రూరసైన్యంగా ఈ దళానికి మా చెడ్డ పేరుంది. ఉత్తరం దిక్కు నుండి ఊరి మీద విరుచుకుపడడానికి మూడు దళాలూ మోహరించి ఉన్నాయి. కానీ వాళ్ళ మొదటి లక్ష్యం దల్షాష్ పేరుగల దగ్గరిలోని మరో గ్రామం.ఉదయం పది పదకొండు గంటల మధ్యన ఊరికి ఉత్తర దిక్కున తుపాకి యుద్ధం మొదలయ్యింది. అయితే సిక్కులు నిర్మించిన బలమైన కోట లాంటి బ్యారక్ల మూలంగా ఆ దాడి నిలవరించబడిరది. కరణ్‌సింగ్ కథనాన్ని ఆ నాటి సంఘటనకు ప్రత్యక్షసాక్షులుగా ఉన్న వాళ్ళు నిర్ధారించారు. మరలా అదే దిక్కునుండి కాసేపటి తర్వాత ఒక గంటసేపు కాల్పులు సాగాయి. ఆ తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. వాళ్ళు అన్ని వైపుల నుండి ఊరిని చుట్టుముట్టారు. అన్ని వైపుల నుండి కాల్పులు సాగించారు. బ్యారక్ల నుండి ఎదురు కాల్పులు జరిపారు. శత్రుమూకల కాల్పుల్లో చాలామంది గాయపడ్డారు. కొంతమంది మరణించారు. నేలమీద విగతశరీరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఉజ్గర్సింగ్ ఫిరంగి పేల్చాడు. దాంతో కొద్ది సేపు శత్రుదాడి నిలిచిపోయింది.. ఫిరంగి ఒకసారి పేల్చాక దాని తయారీకి వాడిన షాఫ్ట్ వేడెక్కిపోయి అది చల్లారితే గానీ మరో గుండు పేల్చడానికి వీలులేని పరిస్థితి. లేదంటే ఫిరంగి నుండి వెనక్కి తన్ని ప్రాణనష్టం జరిగేది. ఈ వ్యవధిలో కొంత మంది కబాలీలు ఊర్లో జొరబడగలిగారు గానీ వాళ్ళంతా కత్తులకు, తుపాకులకు బలయిపోయారు. రెండు వైపులా ప్రాణ నష్టం పెరుగుతా ఉన్నది. మరణించిన శత్రు మూకల తుపాకులు స్వాధీనం చేసుకుని వారి ఆయుధాలతోనే వారి మీద దాడికి ఉపక్రమించారు. ఈ యుద్ధం మూడు గంటల పాటు సాగింది. దురాక్రమణ దారులు వెనుతిరిగిపోయారు. ఈ యుద్ధంలో చాలా మంది సిక్కులు మరణించారు. శతృసేనల వైపు కూడా చాలా ప్రాణనష్టం జరిగింది.
దురాక్రమణదారులకు దోచుకోవడం, లూటీలకు పాల్పడ్డం, ఆడవాళ్ళను ఎత్తుకుపోవడం అంటే మహారంధి. వాళ్ళకి జరిగిన నష్టానికి కుతకుతలాడిపోతా ఉన్నారు. వాళ్ళు సాధించింది అల్లా వారిలో కొంతమందిని కోల్పోవడం. కిరాయి సైనికులకు దక్కే మూల్యం దోచుకునే డబ్బు, బంగారం, విలువైన వస్తువులు, పడుచు వయసులో ఉన్న ఆడపిల్లలు. మిగిలిన నమస్తాన్ని వాళ్ళు నిర్దయగా నాశనం చేస్తారు, ఊచకోత కోస్తారు. అలాంటి వీరికి ఇది రెండవసారి ఎదురయిన పరాభవం. మొదటి పరాభవం ముజఫరాబాద్‌లో చవిచూసారు. దాదాపు నాలుగు రోజులపాటు వాళ్ళను అక్కడ అడ్డగించారు. ఇప్పుడు ఇచహామాలో మరొక రోజు నిలవరించబడ్డారు.
మరుసటి రోజు సూర్యోదయం తరువాత దురాక్రమణదారులు మరోసారి ఎదురుదాడికి దిగారు. ఈసారి మెషిన్గన్లు, మోర్టార్లు ఉపయోగించారు. దాదాపు అరగంట పాటు ఊరిమీద బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపించారు. ఇటునుండి ఎటు వంటి ప్రతిఘటనా లేకపోవడంతో ఏం జరుగుతుందో చూసి రమ్మని చిన్న బృందాన్ని ఊళ్ళోకి పంపారు. ఊరు ఊరంతా నిర్జనంగా ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ మరణించిన వారి శరీరాలు, గాయపడిన వాళ్ళ సహచరులు మినహా నరమానవుడు అనేవాళ్ళు లేరు ఊళ్ళో.
ముందురోజు రాత్రి దురాక్రమణదారులు వెనక్కి మరలి వారివారి క్యాంప్‌లకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి ఆ ఊరిజనం శరణార్ధులతో కలసి గాయపడిన వారిని తమ వెంటతీసుకుని ఊరు విడిచి భారతసైన్యం మోహరించి ఉన్న నర్బల్ క్యాంప్ దిశగా పయనమయ్యారు. అక్టోబర్ 27 నుండే భారతసైన్యం కశ్మీర్ చేరుకోవడం ప్రారంభమయ్యింది. శ్రీనగర్‌కు 700 మంది ట్రూపర్లను పంపారు. కబాలీలను ఎదుర్కోవడానికి వీరు వేర్వేరు దిశలకు సాగిపోయారు. పఠాన్ నుండి కబాలీల పురోగమనాన్ని నిలవరించడానికి పెద్ద దళం అటుగా వెళ్ళింది. ఒక యాభైమంది దళాన్ని విమానాశ్రయ రక్షణ కోసం అట్టేపెట్టారు. పఠాన్ దగ్గర సైన్యం కబాలీలను నిలవరించలేకపోతే వాళ్ళు విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తారని ముందు జాగ్రత్త చర్యగా ఈ బృందాన్ని అట్టేపెట్టారు. వీరు నర్బల్లో ‘క్యాంప్’ చేసారు.
ఇచహామా వద్ద భారతసైన్యం సహకారం లేకుండా కేవలం ఊరి జనం ప్రధానంగా సిక్కులు దురాక్రమణదారులతో యుద్ధానికి తలపడ్డారు. కబాలీలు విమానాశ్రయం వైపు సాగకుండా ముప్ఫై ఐదు గంటలపాటు నిలవరించారు. అక్కడ నుండి విమానాశ్రయం కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మహా అయితే కబాలీలు మూడు నాలుగు గంటల్లో విమానాశ్రయాన్ని చేజిక్కించుకునేవారు.ఇక అట్టినా గ్రామం ఇచహామా కన్నా చిన్నది. అంతా చేసి వంద గడపలు ఉన్న ఊరు. దాదాపు ఆరువందల నుండి వెయ్యిమంది వరకు శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. ఊరి జనం శరణార్దుల కోసం తమ ఇళ్ళూ, వాకిళ్ళూ, గురుద్వారాలు తెరిచి పెట్టారు. ఆ ఊరిలో ఒకే ఒక భవంతి ఉన్నది. అందులో నలభై యాభై మంది తలదాచుకున్నారు.
కబాలీలు ఆ ఊరి మీద దాడికి దిగినప్పుడు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి తుపాకులతో ఎదురుదాడికి దిగారు. సూర్యాస్తమయం వరకు దురాక్రమణదారులని నిలవరించారు. ఈలోగా గ్రామస్థులు వేరే మార్గం ద్వారా తప్పించుకు వెళ్ళారు. గురుద్వారా పక్కన ఉన్న రెండంతస్థుల భవనంలో ఆడవాళ్ళు, పిల్లలు తలదాచుకున్నారు. కబాలీల దురాగతాలను గురించి అప్పటికే కథలు కథలుగా విని ఉన్న కారణాన ఆ భవంతికి నిప్పంటించుకుని అగ్నికి ఆహుతయిపోయారు.
ఈ రెండు కీలకమైన యుద్ధాల గురించి గానీ, సిక్కుల త్యాగనిరతిని గురించి గానీ చరిత్రలో ఎక్కడా నమోదు చెయ్యలేదు. కశ్మీర్‌ను భారతదేశం నుండి విముక్తి చెయ్యాలనే లక్ష్యంతో తెగబడి దూసుకువచ్చిన కబాలీలను ఈ రెండు గ్రామాల ప్రజానీకం తమశక్తిమేరకు నిలవరించి ఉండకపోతే భారతసైన్యం, శ్రీగర్లో కాలుమోపే లోపే వాళ్ళు విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుని ఉండేవాళ్ళు. ఇచహామాలో వారిని దాదాపు రెండు రోజుల పాటు నిలవరించడం మూలంగా భారతసైన్యం కశ్మీర్లో మోహరించడం సాధ్యపడిరది. మూడవ రోజున కుమావోన్ సైనికదళం మేజర్ సోమనాధ్ శర్మ సారధ్యంలో అప్పటికే తీవ్రంగా నష్టపోయిన కబాలీలతో యుద్ధానికి తలపడిరది. ఈ పోరాటంలో అసువులు బాపిన మేజర్ సోమనాధ్శర్మకు పరమవీర చక్రపతకం ప్రదానం చేసారు. నవంబరు 1,2 తారీఖులలో సిక్కులు, కబాలీలతో తలపడి వారిని మందుకు సాగనీయకుండా నిలవరించారు. కబాలీలు దొంగదారిన విమానాశ్రయాన్ని చేజిక్కించుకోవడానికి దాడికి బయలుదేరిన విషయం తెలియని భారతసైన్యం పఠాన్ దగ్గర కబాలీలను నిలవరించే ప్రయత్నంలో మునిగిపోయి ఉన్నది. నవంబర్ 3వ తేదీన శరణార్థులు, యుద్ధంలో ప్రాణాలు నిలుపుకున్న వారు నర్బల్ దిశగా రావడం చూసి 200 మంది సైనికుల చొప్పున మూడు దళాలు బుడ్గాం ప్రాంతానికి తరలి వెల్ళారు. మేజర్వర్మ మరో 200 మంది దళంతో బుడ్గాం లో ‘క్యాంప్’ చేసి ఉన్నారు. ఈ దళం మీద కబాలీలు దాడి చేసారు. అప్పటికే సిక్కులతో జరిగిన యుద్ధంలో వారి సంఖ్య 1500 నుండి 700కి పడిపోయింది. గాయాలపాలయి, స్థైర్యం దెబ్బతినిపోయి ఉన్నా ఎట్టకేలకు మేజర్శర్మ దళంమీద పై చెయ్యి సాధించారు. ఈ దాడిలో మేజర్ శర్మ మరణించారు. ఈలోగా భారతసైన్యం తిరిగి ఒనగూడి కబాలీలను వెనక్కితిప్పి కొట్టింది. ఈ యుద్ధంలో వీరోచితంగా కబాలీలను ఎదుర్కొన్న సిక్కులను ‘హీరో’లుగా పరిగణించడానికి బదులుగా స్థానికుల దృష్టిలో ‘విలన్’లుగా తయారయ్యారు. కశ్మీర్‌ను పాకిస్థాన్ ఆక్రమించుకోవడం పట్ల స్థానికులలో సానుకూలత ఉండడమే దానికి కారణం. 1980ల మద్య కాలం వరకు సిక్కుల పట్ల సమాదర భావం లేకుండుంది. సిక్కులపై వేధింపులు, అవహేళనలు, సామాజిక బహిష్కరణలు కొనసాగాయి. వారిని ముద్దాయిల్లా చూసారు.
పుండు మీద కారం చల్లినట్లు ఈ అవమానాలకు తోడు కశ్మీర్‌ను కాపాడడంలో సిక్కుల పాత్రను పరిగణనలోకే తీసుకోలేదు. దీని మూలంగా సిక్కుల అభివృద్ధిని ఆపలేకపోయారు కానీ కశ్మీర్లో జీవిస్తున్న సిక్కులు వాళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళమా, దేశానికి చెందిన వాళ్ళమా, అన్న డోలాయమానంలో ఉండి పోయారు.
— భూపిందర్ సింగ్ బాలి
అనువాదం : సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.