
అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహమూదాబాద్ మీద దాఖలైన ఎఫ్ఐఆర్ చార్జిషీట్‌ను విచారణకు తీసుకోకుండా ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో పాటు మరో ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది.
న్యూఢిల్లీ: అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్లోని చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు విచారణకు తీసుకోకుండా సుప్రీం కోర్టు నిరోధించింది.
ఈ కేసులో అభియోగాలు మోపకుండా ట్రయల్ కోర్టును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం నిలిపివేసింది.
దీనికంటే ముందు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మహమూదాబాద్పై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లలో ఒకదానిలో, క్లోజర్ నివేదికను దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే కొన్ని నేరాలు కనుగొనబడిన తర్వాత ఆగస్టు 22న రెండవ ఎఫ్ఐఆర్లో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.
సిట్ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం..
మహమూదాబాద్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, చార్జిషీట్ దాఖలు చేయడం “చాలా దురదృష్టకరం” అని అభివర్ణించారు. మహమూదాబాద్పై భారత న్యాయసంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 152 (రాజద్రోహం) కింద కేసు నమోదు చేశారని, దీని చెల్లుబాటు ఇప్పటికే కోర్టులో సవాలులో ఉందని పేర్కొన్నారు.
చార్జిషీట్‌ను అధ్యయనం చేసి, ఆరోపించిన నేరాల చార్ట్‌ను సిద్ధం చేయాలని కోర్టు సిబల్‌ను కోరింది. తదుపరి విచారణలో ఈ వాదనలను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ సమాచారం పీటీఐ నివేదికలో వెలుగు చూసింది.
అసలు విషయం ఏంటి?
మే 18న అలీ ఖాన్ మహమూదాబాద్‌ను అరెస్టు చేశారు. ఆయనపై దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలను మోపారు. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్, ఒక బీజేపీ కార్యకర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఫిర్యాదులకు ఆధారం, ఆపరేషన్ సిందూర్ గురించి మహ్మదాబాద్ సోషల్ మీడియాలో పోస్టులు. ఈ పోస్టులలో, మహమూదాబాద్ శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, రెండు మతాలకు చెందిన మహిళా సైనికులు భారతదేశ సైనిక కార్యకలాపాలను నివేదించడం ద్వారా మతపరమైన ఐక్యతను ప్రతిబింబించినట్లే, ఈ ఐక్యతను క్షేత్రస్థాయిలో కూడా చూడాలని కోరుకున్నారు.
మే 21న సుప్రీంకోర్టు మహ్మదాబాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సిట్ “తన దృష్టిని ఎందుకు మళ్లిస్తోంది?”అని జూలై 16న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహమూదాబాద్ ఎలక్ట్రానిక్ పరికరాలను సిట్ స్వాధీనం చేసుకుందని, గత 10 సంవత్సరాలుగా ఆయన చేసిన విదేశీ పర్యటనల గురించి విచారిస్తున్నారని సిబల్ కోర్టుకు చెప్పినప్పుడు ఈ ప్రశ్నను సుప్రీంకోర్టు లేవనెత్తింది.
ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును జస్టిస్ సూర్యకాంత్, “వారు ఏ ప్రయోజనం కోసం పరికరాలను స్వాధీనం చేసుకున్నారో, మేము సిట్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. మేము వారిని కోర్టుకు పిలుస్తాము” అని అన్నారు.
మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, మహ్మదాబాద్‌కు ధర్మాసనం షరతులను విధించింది. ఈ షరతులు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై వ్యాఖ్యానించకుండా మాత్రమే నిషేధిస్తాయని తెలియజేసింది. అయితే ఇతర అంశాలపై తన అభిప్రాయాన్ని వ్రాయడానికి, వ్యక్తీకరించడానికి అతనికి స్వేచ్ఛ ఉందని కూడా స్పష్టం చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.