ప్రతి ఏటా జనవరిలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఓ కీలకమైన ఘట్టంగా ఉంటుంది ప్రభుత్వ దైనందిన చర్యల్లో. ఈ అవార్డులు ప్రదానం చేసినప్పుడు ఏయే రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు వచ్చాయి, ఏయే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది వంటివి మీడియా చర్చల్లో ప్రధానంశాలుగా ఉండేవి. కానీ ఈ సారి పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన ఓ కీలకమైన కోణాన్ని మీడియా విస్మరించిందనే చెప్పాలి. మేము కూడా ఆలస్యంగానే ఈ కోణాన్ని గుర్తించాము. 2025 పద్మ అవార్డుల్లోని కొత్త కోణాన్ని అర్థం చేసుకోవాలంటే భారత రాజకీయ చరిత్రను మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లి గుర్తు చేసుకోవాలి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం పని ధార్మికమైనదైనా జరిగింది మాత్రం రాజకీయ ఉద్యమం అన్నది అందరూ అంగీకరించే వాస్తవం. అయిష్టంగా అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజెపికీ, నేషనల్ ఫ్రంట్ భాగస్వాములకూ ఆదినుండే తంపులు మొదలయ్యాయి. ఓ దశలో విపి సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయానికి కేబినెట్ ముందు ఎజెండా పెట్టారు. కూటమిలో మెజారిటీ భాగస్వామ్య పక్షాలు ఈ ప్రతిపాదన పట్ల హర్షించాయి. ఆహ్వానించాయి. వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఎమర్జెన్సీ తర్వాత ప్రతికపక్ష కూటమితో ఏర్పడిన ప్రభుత్వంలో అప్పటి జనసంఫ్‌ు భాగస్వామి. అప్పుడే తొలిసారి దేశ విద్యారంగంలో మతోన్మాద బీజాలు నాటేందుకు వ్యూహరచన సిద్ధం చేసింది ఆరెస్సెస్. అదేవిధంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా జనసంఫీుయులకే దక్కటంతో మొత్తం మీడియా ల్యాండ్ స్కేప్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలు చేసింది. ఆ తర్వాత ఆ విధనాల నుండి లబ్దిపొందిన ఎంతో మంది వివిధ మీడియా సంస్థల యాజమాన్యంగా మారటం, బిజెపికీ, ఆరెస్సెస్ కూ ప్రత్యక్షంగా దన్నుగా నిలవడం, దేశంలో ప్రజల మెదళ్లల్లో కి వెళ్లే మతోన్మాద కోణాలను కూడా సాధారణ వార్తలుగా మార్చి మల్చి అందించటం తద్వారా జరిగిన పరిణామాలు అన్నీ దేశం ముందున్నాయి.
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కూడా విపి సింగ్‌కూ, అద్వానీ, వాజ్‌పేయిల మధ్య చర్చలు సంప్రదింపులు జరిగాయి. అప్పుడే రాజకీయ రంగంలో జెండా ఎగురవేస్తున్న యువకిశోరాలైన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారి నాయకత్వంలోని పార్టీలు నేషనల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా మారాయి. అధికారంలో మేమూ పాలుపంచుకుంటామన్నది బిజెపి ప్రతిపాదన. ఈ విషయమై అప్పట్లో దూరదర్శన్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్న ప్రణయ్‌రాయ్ ఓ చర్చా వేదికకు బిజెపి నుండి అద్వానీని సిపిఎం నుండి హరికిషన్ సింగ్ సూర్జిత్‌ను ఆహ్వానించారు. ప్రణయ్‌రాయ్ నేషనల్ ఫ్రంట్ మద్దతుదారులుగా ఉన్న బిజెపి, సిపిఎంలు రెండూ వేర్వేరు రాజకీయ దృక్కోణాలకు ప్రాతినిధ్యం వహించేవారు కాబట్టి ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా అని ప్రశ్నించారు. దానికి సూర్జిత్ తడుముకోకుండా బిజెపి, సిపిఎంలు విపి సింగ్ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తాయనీ, ఆ విధంగా సమదూరం పాటిస్తాయని సమాధానమిచ్చారు. దాన్ని బాహాటంగా తిరస్కరించలేకపోయారు అద్వానీ.
అప్పటికే బిజెపి, విహెచ్‌పిలు దేశవ్యాప్తంగా బాబరీ మసీదు వ్యతిరేక ఆందోళన ప్రారంభించాయి. విహెచ్పి వ్యూహాత్మకంగా దేశంలో ఉన్న సాధువులు, పీఠాధిపతులు వంటి వారినందరినీ ఒకేవేదిక మీదకు తెచ్చి వాళ్లంతా బాబరీ మసీదు వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక భాగస్వాములుగా ఉన్నారని చెప్పనారంభించింది. అదే సమయంలో దూరదర్శన్‌లో రామానంద సాగర్ రామాయణ్ సీరియల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పరిస్థితుల్లో విపి సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయటానికి నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే అగ్రకులాధిపత్యాన్ని, మనుధర్మసూత్రాలను పాటించాలని కోరుకుంటున్న బిజెపికి రాజకీయంగా ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాలేదు. దాంతో విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. మండల్ కమిషన్ సిఫార్సుల పట్ల బిజెపి వ్యతిరేకతను ప్రజలు చర్చించుకోకుండా ఉండటానికి వీలుగా రథయాత్ర ప్రారంభించారు అద్వానీ.
ఈ సందర్భంగా రామమంది నిర్మాణానికి ఇంటింటి నుండీ ఓ ఇటుకు అయోధ్యకు చేర్చాలని విహెచ్పి కూడా పిలుపునిచ్చింది. అంతిమంగా ఈ ఉద్యమం తీవ్ర మతోన్మాదపు ఆవేశకావేషాలకు దారితీసింది. వేలాదిమంది చనిపోయారు. చివరకు రథయాత్ర బీహార్‌కు చేరిన వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ అరెస్ట్ చేయటంతో ఆ కారణం చూపించి బిజెపి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. తదనంతర పరిణామాలు, బాబరీ మసీదు కూల్చివేత వరకూ ప్రజాగ్రహాన్ని రెచ్చగొట్టడం, ఆ ప్రజాగ్రహాన్ని నిర్దిష్ట లక్ష్యం వైపు నడిపించటం, దానివెంట నడిచిన వర్తమాన రాజకీయ చరిత్ర. కాదనలేని వాస్తవం.
ఈ బాబరీ కూల్చివేత ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు వేల సంఖ్యలో ఉన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వ్యూహరచన చేసే శీర్షస్థానంలో డజన్ల సంఖ్యలో ఉన్నారు. డిఫరెన్షియల్ కాలిక్యులస్ లాగా ఈ మొత్తం ఉద్యమంలో వేర్వేరు వ్యక్తులు వేర్వురు స్థానాల్లో ఉండి తమవంతు పాత్ర పోషించారు. అటువంటి వారిలో సాధ్వి రితంభర, అడ్వకేట్ వైద్యనాథన్, చంద్రకాంత్ సోంపుర, కిషోర్ కునాల్ వంటివారు ప్రస్తుత సందర్భంలో చర్చించుకోవాల్సిన పేర్లు.
ఈ నలుగురికీ 2025 సంవత్సరానికి గాను పద్మ భూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. పద్మ అవార్డులు అందుకునేంత స్థాయిలో వీరు అందించిన కృషి ఏమిటన్నది ప్రశ్న.
సాధ్వి రితంభర
సాధ్వి రితంభరకు సామాజిక సేవలకు గాను పద్మ భూషన్ అవార్డు ఇచ్చారు. దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా క్రియాశీలక పత్రికా రంగంలో ఉన్న వారందరికీ సాధ్వి రితంభర బాబరీ కూల్చివేత ఉద్యమంలో ఎంతో వివాదాస్పదమైన, హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే పాత్ర పోషించిందన్న సత్యం తెలిసిన విషయమే. ఆ ఉద్యమంలో మహిళా విభాగాన్ని ముందుపీఠిన నుండి నడిపించిన నాయకుల్లో రితంభర, ఉమాభారతిలు ముఖ్యులు. విజయరాజె సింథియా కూడా ఉన్నా ఆయన క్షేత్రస్థాయి ఆందోళనల్లో పాల్గొనలేదు. 2002 గుజరాత్ నరమేథం అనంతరం జరిగిన చర్చల్లోనూ, 2014 తర్వాత మోడీని ప్రధాని అభ్యర్థిగా నిలిపే క్రమంలో సాగిన అంతర్గత, బహిర్గత చర్చల్లో వివాదాస్పద పాత్ర పోషించిన మహిళగా ఆమెకు గుర్తింపు ఉంది. స్వయంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోనే బాబరీకూల్చివేత చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని స్పష్టం చేసింది. కానీ అటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యక్షంగా భాగస్వామిగా ఉన్న మహిళకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వటం అంటే సుదీర్ఘకాలం రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘిస్తూ సాగించిన ఉద్యమానికి, నరమేధానికి ఔన్నత్వాన్ని ఆపాదించటం తప్ప మరోటికాదు.
సిఎస్ వైధ్యనాథన్
ఈయన ఒక న్యాయవాది. దేశంలో న్యాయవ్యవస్థలో ఆరెస్సెస్ శ్రేణులను నింపే క్రమం ఎప్పుడో ప్రారంభమైంది. దీనికి సంబంధించి కారవాన్ పత్రిక ఓ కవర్ పేజీ కథనాన్ని కూడా వెలువరించింది. స్వయంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి బాహాటంగా ఈ దేశం హిందూరాష్ట్రమేనని ప్రకటించిన సంగతి కూడా ఈ మధ్య కలకలం రేపింది. ఇక వైద్యనాథన్ విషయానికి వస్తే ఆయన బాబరీ మసీదు స్థలాన్ని విహెచ్పికి అప్పగించేందుకు దశాబ్దాలపాటు జరిగిన న్యాయ పోరాటంలో బాలరాముని తరఫున వకాల్తా వేసి వాదించిన వ్యక్తి. ఇతర ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లోనూ, రాజ్యాంగ సంరక్షణతో ముడిపడి ఉన్న వ్యాజ్యాల్లోనూ ఈయన పేరు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆయన అటువంటి కేసులేమీ చేయలేదు. బాలరాముని తరఫున న్యాయస్థానంలో వకాల్తా పుచ్చుకున్న వ్యక్తికి దేశం గౌరవించే అత్యున్నత పౌరసేవా పురస్కారం ఇవ్వటం ఈ మొత్తం పురస్కారాల స్పూర్తిని అపహాస్యం చేయటం కాదా?
కిశోర్ కునాల్
ఈయనకు ఉన్నత పౌరసేవా పురస్కారం పొందేందుకు ఉన్న ఏకైక అర్హత అయోధ్య పున:దర్శనం అన్న పుస్తకాన్ని రాయటం. ఆ పుస్తకంలో వందేళ్లకు పైగా జరిగిన వివాదాన్ని హిందూరాష్ట్ర దృక్కోణంలో వివరించి వ్యాఖ్యానించి విశ్లేషించి బాబరీమసీదు కూల్చివేత ఏ ప్రమాణాల ప్రాతిపదికన సరైనదో వివరిస్తారు.
చంద్రకాంత్ సోంపుర
ఇతను ఓ ఆర్కిటెక్ట్. భవన నిర్మాణ శిల్పి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. గుజరాత్ నరమేధం తర్వాత సబర్మతి ఫ్రంట్ మొదలు మోడీ అండదండలతో హైందవ నిర్మాశకౌశలాన్ని ప్రదర్శించినందుకు ఆయన్ను పద్మ భూషణ్ అవార్డు వరించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సారి ఇచ్చిన అత్యున్నత పౌరసేవా పురస్కారాల్లో వివాదరహితులను వెతికిపట్టుకోవటం ఓ పట్టాన కష్టమే. వ్యాసం మొదట్లో చెప్పిన తరహా వివాదాల గురించి ఎప్పుడూ జరుగుతన్న చర్చ కొత్తేమీ కాదు కానీ దేశాన్ని మతం ప్రాతిపదికన చీల్చి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా ఏకమతాధిపత్య రాజ్యంగా తీర్చిదిద్దాలన్న రాజకీయ లక్ష్యంతో పని చేస్తున్న వారికి సార్వత్రిక గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టే పౌరసేవా పురస్కారాలు అందించటం అంటే పాలనా యంత్రాంగం యావత్తూ ఆరెస్సెస్ ప్రేరిత హిందూరాష్ట్ర సిద్ధాంతాన్ని గుర్తించి, గౌరవించి,దానికి సార్వత్రికను తెచ్చిపెట్టడం తప్ప మరోటి కాదు.
ఈ అవార్డుల గురించి ఎందుకు చర్చించుకోవాలి?
2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి చావు తప్ప కన్నులొట్టపోయిందని ప్రజాతంత్ర శక్తులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడుతున్నవారూ, బిజెపి అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారూ, స్థూలంగా గత ఏడు దశాబ్దాల సామాజిక జీవితంలో లౌకిక ప్రజాతంత్ర స్పూర్తికి కట్టుబడి ఉన్న వారూ కాస్తంత ఊరట పొందారు. సంఖ్యాబల లేదు కాబట్టి దేశాన్ని హిందూరాష్ట్ర దిశగా నెట్టే ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే చట్టాలు, చర్యలూ మునపటి స్థాయిలో తీసుకోలేరు అన్న నమ్మకం చిక్కింది. మోడీని, బిజెపిని మతోన్మాద రాజకీయాల పరాకాష్టకు చేరనీయకుండా అడ్డుకోవడానికే స్వతహాగా రాజకీయంగా లౌకికవాదులు అయినా అధికారం కోసం బిజెపి పంచన చేరిన పార్టీలు తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్).
ఈ పార్టీలు మతోన్మాద రాజకీయాల విషయంలో బిజెపిని నిలువరించలేకపోతున్నాయని, అలా నిలువరించే ఉద్దేశ్యం కూఆ ఈ పార్టీలకు లేదని చెప్పే సందర్భం, ఉదాహరణ ఈ పౌరసేవా పురస్కారాలు. ఇవన్నీపరిశీలించినప్పుడు బిజెపికి రాజకీయాల్లో సంఖ్యాబలం కంటే లక్ష్యశుద్ధే ప్రధానమనీ, తమ లక్ష్యాన్ని సాధించేందుకు, గమ్యాన్ని చేరుకునేందుకు, తన విచ్ఛిన్నకర సిద్ధాంతాన్ని సార్వత్రిక సిద్ధాంతమనీ జనాన్ని నమ్మించేందుకు, ఒప్పించేందుకు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదని ఈ ఘటన తెలియచేస్తోంది.
గత దశాబ్దకాలంగా బిజెపితో జట్టుకట్టిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా తన రాజకీయ లక్ష్యాల కోసం బిజెపిని నిలువరించేందుకు ప్రయత్నం చేయలేదనీ, చేయవనీ రుజువు అవుతోంది. తమ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు కనీసం కంటితుడుపుగానైనా ప్రయత్నం చేయటానికి సిద్ధంగా లేవు.
ఈ అవార్డులు ఇచ్చే హెచ్చరిక ఒక్కటే. వీలైతే బిజెపి, ఆరెస్సెస్ సైద్ధాంతిక, రాజకీయ అవగాహనకు లోబడి ఉండాలి. అందలాలు అందుకోవాలి. లేదా మరిన్ని దాడులు, వేధింపులకు గురికావాలి.
కొండూరి వీరయ్య