రాజకీయ వేత్త, సామాజిక కార్యకర్త అయిన కృష్ణబోస్ 2019లో రాసిన వ్యాసం ఇది. 89 ఏళ్ళ వయసులో 2020లో కృష్ణబోస్ మరణించారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి గెలుపొందిన నేపథ్యంలో ఆమె కుమారుడు సమంత్ర అప్రచురితంగా ఉన్న వ్యాసాన్ని పచురణార్థం ద వైర్‌కు అందచేసారు.
గత ఆరు దశాబ్దాలలో నేను అనేక సార్లు అమెరికా సందర్శించాను, 1980ల తరువాత మరింత తరచుగా అమెరికా వెళ్ళి వస్తుండేదానిని. అయితే 2018 ఆకురాలు కాలంలో నా అమెరికా సందర్శనకు ఒక ప్రత్యేకత ఉన్నది. నేను అమెరికా గడ్డ మీద తొలిసారిగా కాలుమోపి (1958) అప్పటికి 60 సంవత్సరాలు అయ్యింది. 1958లో నేను ఏ బోస్టన్లోని లోగాన్ విమానాశ్రయంలో కాలు మోపానో 2018లో కూడా అదే విమానాశ్రయంలో కాలిడాను. ఇమ్మిగ్రేషన్ అధికారి ఏ అవసరం రీత్యా అమెరికా వచ్చారు అని ప్రశ్నించాడు. ‘నా మొదటి పర్యటనకు 60 ఏళ్ళు నిండిన సందర్భాన్ని వేడుక చేసుకుందామని వచ్చాను’ అని నే బదులు ఇవ్వడంతో అతను పెద్దగా నవ్వుతూ నా పాస్‌పోర్ట్ మీద ముద్ర వేశాడు.
తొలిసారిగా అమెరికా భూభాగం మీద అడుగుపెట్టిన 1950ల నాటికి నేను ఇరవై ఏళ్ళ ప్రాయంలో ఉన్నాను. భారతీయులకు పూర్తిగా అపరిచితమైన, సుదూర తీరాన ఉన్న ఈ దేశానికి నేను నా భర్త డాక్టర్ శిశిర్‌కుమార్ బోస్ తో కలిసి వచ్చాను. కలకత్తాలో వైద్యవిద్య పూర్తి చేసుకున్నాక లండన్‌లోని షెఫీల్డ్, వియన్నా, బెర్న్లలో ఉన్నత శిక్షణ అభ్యసించిన ఆయన వస్తుతహః పిల్లల డాక్టరు. మా వివాహం అయిన కొద్ది సంవత్సరాలకు శిశిర్‌కు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి అనుబంధంగా ఉన్న బోస్టన్ పిల్లల ఆసుపత్రిలో పిడియాట్రిక్ రేడియాలజీ అధ్యయనం చెయ్యడానికి రాక్ఫెల్లర్ ఫెలోషిప్ వచ్చింది. ఆనాటికి భారతదేశంలో ఈ రంగం గురించి అవగాహన లేదు. ఆ ఫెలోషిప్ ఆధారంగా మేం అమెరికా వచ్చి చేరాం. బోస్టన్‌లో 1959 డిసెంబర్ వరకు, దాదాపు 15 ఏళ్ళపాటు నివసించాం.
నేను పెద్దగా అంచనాలు ఏమీ లేకుండా అమెరికా వచ్చి చేరాను. ఇక్కడి స్నేహపూర్వక వాతావరణం, సమాదరణలకు ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది. బహుశా నేను అన్యదేశస్థురాలిని కావడం కూడా ఇందుకు కొంతకారణం కావచ్చు. నా చీరకట్టు అమెరికన్లను విశేషంగా ఆకర్షించింది. నేను బజారుకి వెళ్ళినప్పుడు చాలామంది నా వస్త్రధారణ గురించి ఆరా తీసేవాళ్ళు. తలమీంచి తొడుక్కుంటావా అనడిగేవాళ్ళు. ఇది ఆరుగజాల చీర. కానీ కట్టుకోవడం తెలిస్తే నిమిషాల్లో ఇలా ముస్తాబు అవ్వచ్చు అని నే బదులు చెప్పినప్పుడు వాళ్ళు నోరు తెరిచేసేవాళ్ళు.
నన్ను సమాదరించడానికి మరో కారణం ` మేం నివసించేది ఒక ప్రత్యేకమైన సామాజికావరణంలో కావడం, మా రోజువారీ కార్యకలాపాలు అదే సామాజిక వాతావరణానికి పరిమితం కావడం కూడా కావచ్చు. బోస్టన్ పిల్లల ఆసుపత్రి నిర్వాహకుడు చార్లెస్ జేన్వే భారత్ సహా నాటి అనేక పేద, వర్థమాన దేశాల్లో సేవలు అందించడం ద్వారా ప్రపంచ పిల్లల డాక్టర్‌గా పేరు గడించారు. పిడియాట్రిక్ రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ నెహ్యాయుజర్ చాలా చలాకీ అయినవాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ భవనాలకు ఎదురుగా ఉన్న హట్టింగ్టన్ అవెన్యూలోని ఒక అపార్ట్మెంట్లో మేం నివసిస్తూ ఉండేవాళ్ళం. లాంగ్వుడ్ అవెన్యూలో ఉన్న పిల్లల ఆసుపత్రికి ఇక్కడ నుండి నడిచి వెళ్ళొచ్చు. శిశిర్ సహచరులు తెలివైనవాళ్ళు. పనిమంతులు, మంచి నడవడిక కలిగినవాళ్ళు. అందరి కుటుంబాలు కలివిడిగా ఉండేవి.
ఇవాళ వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఆనాడు అమెరికన్లు మమ్మల్ని తమతో సమానంగా చూసేవారు. నేను పుట్టి, పెరిగిన దేశానికి బ్రిటిష్ వలసపాలన నుండి స్వాతంత్య్రం వచ్చి అప్పటికి ఒక దశాబ్దకాలం గడిచిందేమో. సరిగ్గా ఆ కాలంలో నేను అమెరికాలో అడుగుపెట్టాను. బ్రిటిష్ పాలనలో ఉండగా మేం తెల్లవాళ్ళ అవహేళనలు, అవమానాల మధ్యన బతికాం.
కానీ అమెరికన్ శ్వేతజాతీయులు మాత్రం మా పట్ల స్నేహభావంతో మెలిగేవారు. మమ్మల్ని వాళ్ళతో సమానంగా చూసేవారు. మేం పట్టిపట్టి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం. అయినా అపరిచితులు మాతో తేడాగా వ్యవహరించిన సందర్భమే లేదు. నేను మా పసిబిడ్డను ‘స్ట్రోలర్’లో ఉంచి బజార్లో తిప్పుతున్నప్పుడు జనాలు పలకరింపుగా నవ్వి ‘ఎంతముద్దొస్తున్నాడో’ అని ప్రశంసా పూర్వకంగా అనేవారు. ఇంగ్లాండ్‌తో పోలిస్తే అమెరికా పిల్లల పట్ల దయగా మెలిగే సమాజం అనే చెప్పుకోవాలి. మొదటిసారి మాకు విందుభోజనానికి ఆహ్వానం అందినప్పుడు ‘పసిపిల్లాడితో రాలేములే’ అని చెప్పా. దానికి ఆ అతిధేయులు ‘మరేం ఫర్లేదు మాకు నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పారు’ భరోసాగా.
మా కుటుంబంలో ఒక అమెరిన్ కూడా ఉండేవారు. మా మాతామహులు లలిత్‌మోహన్ రాయ్ తూర్పు బెంగాల్లో (నేటి బంగ్లాదేశ్) పేరుమోసిన భూస్వామి. జమిందారు అయినప్పటికీ జాతీయభావాలు నిండుగా ఉన్న మనిషి కావడంతో బిడ్డలని పై చదువుల నిమిత్తం ఆక్స్ఫర్డ్కో, కేంబ్రిడ్జ్‌తో పంపడానికి సిద్ధపడలేదు. కానీ నా మేనమామల్లో ఒకరిని హార్వర్డ్‌కి, మరొకరిని యం.ఐ.టి.లో చదువులకి పంపించారు. యం.ఐ.టిలో చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళిన మామయ్య అమెరికన్ మహిళను ` పేరు అన్నా ` వివాహమాడి 1930లో భారతదేశానికి తిరిగివచ్చాడు. అన్నాది పోలిష్ కాథలిక్ నేపథ్యం. నేను అప్పుడు చిన్నపిల్లని. నాకు అత్తవరసయిన ఆమె తను అతిశీతల ప్రాంతమయిన ‘న్యూ ఇంగ్లాండ్’ నుండి వచ్చానని చెప్పింది. ఆమె దగ్గరే నేను అమెరికన్ ఇంగ్లీష్ అంతో ఇంతో నేర్చుకున్నాను. మనం ‘థాంక్యూ’ అని చెబితే అమెరికన్లు ‘యువార్ వెల్కమ్’ అని బదులిస్తారు. అదే బ్రిటిషర్లు అయితే ‘నో మెన్షన్’ అంటారు. పట్టించుకోకూడదు అనుకుంటే ‘ఐ డోంట్ బై దిస్’ అని మన ముఖానే చెప్పేస్తారు. 1958 – 59 సంవత్సరాలలో నేను అన్నాతో కలిసి ‘న్యూ ఇంగ్లాండ్’లో జీవించా. ఇంగ్లాండ్‌తో పాటు ఆ దేశం పట్ల ప్రేమనూ విడిచిపెట్టాను.
1950వ దశకాన్ని అమెరికన్లు ఆదర్శవంతమైన కాలంగా పరిగణిస్తారు. ఇవాళ ట్రంప్ మద్దతుదారులు చాలామంది ఆనాటి కాలాన్ని ‘అమెరికన్ స్వర్ణయుగం’ అనే భ్రమకు లోనయి ఉన్నవారే. 1945 తరువాత ` రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక ` అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశంగా, పశ్చిమదేశాలకు కేంద్ర బిందువుగా ఎదిగింది. ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన అభివృద్ధి చెందింది. సంపద, స్థిరత్వం నిలదొక్కుకున్నట్లు అనిపించింది.
దీనికి ఒక దశాబ్ద కాలం తర్వాత నల్లజాతీయుల పౌరహక్కుల ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. స్త్రీవాదం ఊపందుకున్నది. అమెరికన్ ‘స్వర్ణయుగం’ సంక్షోభాల పాలయ్యింది. తదనంతరం స్పానిష్ భాష మాట్లాడే కాకేషియన్యేతర జనాభా వలసలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అమెరికా శ్వేత జాతీయుల దేశం. మరీ ముఖ్యంగా ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్ శ్వేతజాతీయుల దేశం. అందుకే యూదులు, కాథలిక్ అమెరికన్ వంటి శ్వేతజాతీయులు ప్రధానంగా కార్మిక వృత్తులు, ఉపాధిలకే పరిమితం కావాల్సి వచ్చింది.
ట్రంప్ రాజకీయ వాగ్ధానాలు, విజ్ఞప్తుల వెనుక ` ప్రధానంగా ఆనాటి శక్తివంతమైన అమెరికా కోసం నోస్టాల్జిక్గా అర్రులు చాచేధోరణి ఇమిడి ఉన్నది. ట్రంప్ పుట్టి పెరిగింది అమెరికన్లు ‘స్వర్ణయుగం’గా భావించిన కాలం కూడా కావడం మరొక కారణమై ఉండొచ్చు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరిట ట్రంప్ ఇచ్చిన నినాదం సాకారం కావాలంటే కాలాన్ని వెనక్కి తిప్పాలి.
బోస్టన్‌లో నేను సంపన్న వర్గాల శ్రేణిలో పట్టుపురుగులా బతికినా ఆ దేశపు సామాజిక రాజకీయ వాస్తవాల ప్రభావం నా మీద లేకుండా పోలేదు. హంటింగ్టన్ అవెన్యూ కొసన ఒక ఇంట్లోకి కొత్తగా నల్లజాతీయుల కుటుంబం వచ్చి చేరింది. నా బిడ్డ పసివాడు కావడంతో ఆ వీధిలో ఉండే చాలామంది శ్వేత జాతీయుల పిల్లలు వచ్చి వాడితో ఆడుకునేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు నల్లజాతి పిల్లలు నిర్భయంగా వచ్చి ఈ పిల్లమూకతో ఆటలకి కలిసి వచ్చారు. మర్నాడు తెల్లజాతి పిల్లలో కాస్త పెద్దపిల్ల పేరు హెలెన్, ఎనిమిది, తొమ్మిదేళ్ళ వయసు ఉంటుంది నా దగ్గరికి వచ్చి ‘మిసెస్ బోస్ బూ(నా బిడ్డ)ని వాళ్ళతో కలవనీయకండి’ అని చెప్పింది. ‘ఎందుకని అలాగా’ అనడిగా నేను. ‘వాళ్ళు మంచివాళ్ళు కాదు’ అని బదులు చెప్పింది ఆ పిల్ల.
నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళంతా కలసి ఆడుకోవడం చూసాను ‘ఏం ఆట ఆడుతున్నారూ?’ అని హెలెన్‌ని అడిగా నేను. ‘ఇల్లాట’ అని బదులు చెప్పింది తను. హెలెన్ తల్లిగా, రికీ ` నల్లజాతి పిల్లాడు తండ్రిగా` నా రెండేళ్ళ బిడ్డడు వాళ్ళ బిడ్డగా ఇల్లాట ఆడుకుంటున్నారు.
పిల్లలలో ఉండే ఈ అమాయకత్వం చాలా మంది పెద్దలలో మనకి కానరాదు. మిసెస్ ఛిస్లోమ్ అని బాగా సంపన్నశ్రేణి కుటుంబానికి చెందిన ఆవిడ నాతో దోస్తీ చేసింది.. ‘డాటర్స్ ఆఫ్ ద అమెరికన్ రివల్యూషన్’ అనే సంస్థలో పలుకుబడి కలిగిన సభ్యురాలు ఆమె. ఈ సంస్థలక్ష్యం ‘మహిళలు ప్రభువుకి, ఇంటికి, దేశానికీ కట్టుబడి ఉండేలా చూడడం’. ఈ సంస్థ సమావేశాలకు హాజరయ్యే మహిళల పూర్వీకులు 18వ శతాబ్దం చివరి దశలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి తోడ్పడ్డారు.
కొన్నిసార్లు బోస్టన్లోని ఈ విభాగం సమావేశాలకు హాజరు అవమని నాకు ఆహ్వానం అందింది. అద్దె డ్రైవరు నడిపే పడవల లాంటి కార్లు మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకుని ఆ సమావేశానికి తీసుకువెళ్ళి దిగవిడిచేవి. సమావేశం ముగిసాక అందరూ కలసి కుడిచేతిని కోణంగా మడిచి గుండెకి ఆనించి అమెరికన్ జాతీయగీతాన్ని ఆలపించేవారు చిష్లోమ్ నాతో మాట్లాడే సందర్భాలలో నల్లజాతీయులను ఉద్దేశించి వాడే ‘ని’తో మొదలయ్యే అపభ్రంశపు పదం తెగవాడేది. అమెరికన్ నల్లజాతీయుల పొడ అంటేనే ఆమెకు గిట్టేది కాదు. అమెరికాలో ఉన్న ఆఫ్రికన్`అమెరికన్ల గురించి ఆ అపభ్రంశపు పదం వాడడం ఆమెకు ఏనాడూ తప్పుగా అనిపించలేదు.
21వ శతాబ్దంలో కెన్యా దేశస్థుడైన తండ్రి, అమెరికన్ తల్లి బిడ్డడు రెండుసార్లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినా ఈ సంక్షుభిత గతానికి స్వస్తి చెప్పలేకపోయాడు. పైపెచ్చు, 1960ల నాటి భ్రమాన్విత అమెరికన్ స్వర్గం పునరుజ్జీవించాలని జనం నేడు ఆరాటపడడం మనం చూస్తున్నాం. ఆ స్వర్ణ యుగానికే ఇవాళ కొత్తగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని పేరు పెట్టారు.
(కృష్ణ బోస్ రచయిత, ప్రొఫెసర్, మూడుసార్లు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసారు.)
అనువాదం : సత్యరంజన్