
విశ్వవిద్యాలయాల విరాళాల కమిషన్ UGC, 1956, చట్టం కాదు, రెగ్యులేటరీ కాదు. అధికారమూ కాదు. ఆదేశం కూడా కాదు. భారత రాజ్యాంగం కింద ‘‘విద్య’’ అనే విషయం పై కేంద్ర రాష్ట్రాలకు సమానమైన అధికారం లభిస్తుంది. అదే ఫెడరల్ లక్షణంలో కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఒక్కోసారి సమాన అధికారాలు ఉంటాయి, మరో సారి విడివిడిగా ఉంటాయి. అంటే రాష్ట్రాలకు స్వతంత్రత ఉంటుంది.
UGC చట్టం చట్టం సెక్షన్ 26 కింద బోధనా సిబ్బంది అర్హతలను నిర్ణయించడం, కనీస విద్యా ప్రమాణాలను స్థాపించడం, విద్యా కార్యక్రమాలను సమన్వయం చేయడం ఉన్నాయి. అయితే, ఈ చట్టం ఉపకులపతుల నియామకాన్ని నియంత్రించడానికి యూజీసీకి అధికారం ఇవ్వదు. ఇవ్వడం లేదు, ఇవ్వడం కుదరదు కూడా. ఉపకులపతులకు విద్యా పరిపాలన మాత్రమే కాకుండా మొత్తం విద్యార్థులకు అధ్యాపకులకు సంబంధించిన పాలనాధికారాలపై నేతృత్వం ఉంటుంది.
ఏ రూల్స్ అయినా చట్టం పరిధి దాటి వెళ్లకూడదు. చట్టాన్ని నీరుగార్చే రూల్స్ రూపొందిస్తే అటువంటి వాటిని సుప్రీం కోర్టు కొట్టేసిన అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ దురదష్టవశాత్తూ యూజీసీ చైర్మన్ ముందుకు తెచ్చిన తాజా ప్రతిపాదనలు ద్వారా యూజీసీ చట్టాన్ని కాదని కొంగొత్త అధికారాలను గుప్పిట్లో పెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. చట్టం శక్తికి అధికారానికి మించిన అధికారం వాడుకోకూడదు. దాన్ని (Ultra vires) అంటారు.
భారత రాజ్యాంగంలోని అధికరణ 254
ఈ ఆర్టికిల్ (అధికరణం) ప్రకారం, ఒక రాష్ట్రం చేసిన శాసనం కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంటే, కేంద్ర చట్టం వర్తిస్తుంది. రాష్ట్ర చట్టం ఆ మేరకు రద్దు అవుతుంది. కేంద్రమైనా రాష్ట్రమైనా చట్టానికి లోబడి నియమాలు నియంత్రణలు ఉంటాయి. విచిత్రమేమంటే ఇది ప్రధానంగా శాసనసభలు రూపొందించిన చట్టాలకు వర్తిస్తుందే కాని రాష్ట్రాల రూపొందించుకునే subordinate legislation వర్తించదు.
అందువల్ల, యూజీసీ చట్టపు నియమ నిబంధనలు రాష్ట్ర చట్టాన్ని అధిగమించలేవు. రాష్ట్ర చట్టం ప్రత్యక్షంగా కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా ఉంటేనే యూజిసి చత్తానిది పై చేయి అవుతుంది.
ఉన్నత విద్య కోసం కొత్త ప్రణాళిక
2025 జనవరి 6న యూజీసీ విడుదల చేసిన “విశ్వవిద్యాలయ మంజూరు కమిషన్ (అధ్యాపకులు, విద్యా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలు, ఉన్నత విద్యా ప్రమాణాల నిర్వహణ కొరకు చర్యలు) నియమావళి, 2025″లో ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను మార్చే ప్రతిపాదన కూడా ఉంది.
ఈ డ్రాఫ్ట్ నియమావళి ప్రకారం, ఉపకులపతులను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీని ఛాన్సెలర్ లేదా విజిటర్ నియమించనున్నారు.
ఈ మార్గదర్శకాలు పాటించని విశ్వవిద్యాలయాలు యూజీసీ పథకాలలో పాల్గొనడం లేదా డిగ్రీ ప్రోగ్రామ్లు అందించడానికి అర్హతను కోల్పోవచ్చు. అంటే లక్షలాది విద్యార్థుల జీవితానికి సంబంధించిన సమస్య అవుతుంది. ఆ నియమాలకు యూజీసీ ఈ ముసాయిదాపై 30 రోజుల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది.
ఉపకులపతి – రాష్ట్ర అధికారానికి ముప్పు
సాధారణంగా రాష్ట్ర గవర్నర్ కు ఉపకులపతిపై పూర్తి అధికారం ఉంటుంది. కానీ గవర్నర్ కేవలం లాంఛన- గౌరవ ఉన్నత పాత్రను కాకుండా కేంద్ర ప్రభుత్వ తరపున కార్యనిర్వహణ అధికారాన్ని చెలాయించి రాష్ట్ర ప్రభుత్వపు విధులను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్వతంత్రతను దెబ్బతీసేలా గవర్నర్ వ్యవహరించకూడదు. అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు:
- ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఉపరాష్ట్రపతి ఛాన్సెలర్ గా ఉంటారు.
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) వంటి సందర్భాలలో విజిటర్ (రాష్ట్రపతి-ప్రెసిడెంట్) ఒక విశిష్ట శాస్త్రవేత్త లేదా విద్యావేత్తను ఛాన్సెలర్గా నియమిస్తారు
- మరో ఉదాహరణ: విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి ఛాన్సెలర్ గా ఉంటారు.
- సాధారణంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఛాన్సెలర్గా ఉంటారు.
గవర్నర్లు – రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం ఈ మధ్య పెరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో గవర్నర్లతో ముఖ్యమంత్రులు నానా తంటాలు పడుతున్నారు.
ఉదాహరణకు:
- గవర్నర్లు తమ స్వంతంగా ఉపకులపతి ఎంపిక కమిటీలకు నామినీలు ఎంపిక చేయడం
- రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసులను పట్టించుకోకపోవడం
- రాష్ట్ర ముఖ్యమంత్రులు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడటం
నూతన విద్యా విధానం 2020 – నష్టకర మార్పులు
యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ గారి ప్రకటన ప్రకారం యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో ఏదైనా అంశంలో ఉత్తీర్ణత సాధించిన వారు, వారి UG లేదా PG డిగ్రీ ఆ విషయం సంబంధంగా లేకపోయినా, అధ్యాపక ఉద్యోగాలకు అర్హులవుతారు. ఈ మార్పు ద్వారా పాఠ్యాంశాల మధ్య ఉన్నప్రత్యేకతలను తొలగిస్తున్నారు. ఇది గణనీయంగా విద్యా ప్రమాణాలను కుదించే దిశగా ఉన్నత విద్యావ్యవస్థను నెడుతోంది.
ముఖ్యమైన మార్పులు ఇవి:
- 3 ఏళ్ల డిగ్రీ స్థానంలో 4 ఏళ్ల UG ప్రోగ్రామ్ ప్రకటించారు.
- NET/SET పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు తమ విద్యార్హతకు సంబంధం లేని అంశంలో కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
- ఎపీఐ విద్యావిషయ ప్రతిభా నిర్వహణ సూచికలు మార్చేస్తున్నారు.
కాని యూజిసి ప్రతిపాదించిన ఈ మార్పులు విద్యా నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆరు రాష్ట్రాల విద్యా మంత్రులు విమర్శిస్తున్నారు.
UGC నియమావళిపై సుప్రీం కోర్టు తీర్పులు
సురేశ్ పఠిఖేడే వర్సెస్ మహారాష్ట్ర యూనివర్సిటీ ఛాన్సెలర్ కేసులో బాంబే హైకోర్టు (2011) కింద “ఉపకులపతి నియామకం అకడమిక్ ప్రమాణాలను ప్రభావితం చేయదు” కాబట్టి, ఇది యూజీసీ పరిధిలోకి రాదు అని తీర్పు చెప్పారు.
సుప్రీంకోర్టు (2015 -కల్యాణి మాధవనన్ కేసు) లో UGC నిబంధనలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కూడా కట్టుబడి ఉండాలని తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పుకు భిన్నమైన తీర్పు ఇది. కనుక UGC నిబంధనలను సిఫారసుగా మాత్రమే భావించాలి, అవి రాష్ట్ర చట్టాలను ఏకపక్షంగా అధిగమించలేవు.
ఆర్టికిల్ 254 – యూజిసి
UGC నిబంధనలు “కేంద్ర చట్టాలు” కింద రానివ్వవు. కేంద్ర చట్టం రాష్ట్ర చట్టాన్ని నిషేధించాలంటే, అది పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లుగా ఉండాలి,
“UGCకి ఉపకులపతుల నియామకంపై నియంత్రణ విధించే అధికారం లేద”ని రాజ్యాంగ నిపుణులు P.D.T. ఆచారి అభిప్రాయం. “UGC చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, ఇది ఉన్నత విద్యా ప్రమాణాల పరంగా మాత్రమే మార్గదర్శకత్వం ఇవ్వగలదు” అనీ “కోర్టులు, పార్లమెంటరీ విధానాలు పాటించకుండా, UGC నిబంధనలను బలవంతంగా అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం” అనీ కూడా ఆచారి వివరించారు.
మొత్తం మీద UGC నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని తాకట్టు పెట్టడం తప్పే. ఉపకులపతి నియామకానికి సంబంధించి, రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తి, అధికార పైన యూజిసి ఆంక్షలు విధించలేదు. ఒకవేళ ఆంక్షలు విధిస్తే అవి విద్యా అవకాశాలను దెబ్బతీస్తాయి.
కేంద్ర-రాష్ట్ర అధికార పరిమితుల తారతమ్యం రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుల కారణంగా మరింత క్లిష్టతరం అవుతుంది. NEP-2020 ప్రతిపాదించిన మార్పులు విద్యా ప్రమాణాలను తగ్గించే ప్రమాదం ఉన్నదని ఆందోళన కలుగుతున్నది.
రాజ్యాంగ నిపుణుల అభ్యంతరాలు
“UGC రెగ్యులైషన్ లు నిబంధనలు రాష్ట్ర విశ్వవిద్యాలయాల నియంత్రణపై ఒత్తిడి తెచ్చేందుకు వీలులేని సబార్డినేట్ నియమాలు చేయకూడదని రాజ్యాంగ నిపుణులు P.D.T. ఆచారి వివరించారు.
ఈ సందర్భంలో సమాచారచట్టం (ఆర్టీఐ) తో పోల్చితే: సమాఖ్య స్వభావాన్ని ఉల్లంఘించడమని అర్థమవుతుంది. ఇది కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాన్ని దెబ్బతీసే మరో ఉదాహరణ.
సమాచార హక్కు (RTI) చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన సమయంలో, రాజ్యాంగ రాజకీయ శాస్త్రవేత్తలు రాష్ట్రాలకే RTI బిల్లును ప్రవేశపెట్టే అధికారం ఉందని వ్యాఖ్యానించారు. అదే విధంగా, అరడజను రాష్ట్రాలు తమ స్వంతంగా RTI చట్టాలను అమలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ జాతీయ చట్టంగా మార్చాలని నిర్ణయించింది. కేంద్ర రాష్ట్రాలు ఒకే విషయంపై చట్టాలు చేయగలిగినప్పుడు, వాటి మధ్య పెద్ద విభేదాలు ఉండకపోవచ్చు. ఉదాహరణకు, 2005 RTI చట్టం అమల్లోకి రాకముందే ఎనిమిది రాష్ట్రాలు తమ స్వంత సమాచార హక్కు చట్టాలను రూపొందించాయి. అమలు చేశాయి. ఈ రాష్ట్ర చట్టాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని 12వ ఎంట్రీ ప్రకారం చట్టబద్ధమైనవనిగుర్తించారు. “ఎంట్రీ 12. సాక్ష్యాలు ప్రమాణపత్రాలు; గుర్తించే చట్టాలు, ప్రభుత్వం చట్టాలు, చర్యలు, రికార్డులు, గుర్తించే న్యాయ వ్యవహారాలు ప్రక్రియలు.” అని ఉంటుంది.
RTI చట్టం ప్రజలకు ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న ‘పబ్లిక్ రికార్డులు (ప్రజా పత్రాలను)’ అందుబాటులోకి తెచ్చే అవకాశం కల్పించేదే కనుక, ఈ ఎనిమిది రాష్ట్ర చట్టాలు ఈ లిస్ట్ 3 ఎంట్రీ క్లాజ్ కింద అనుగుణంగా ఉంటాయి. 2004 RTI బిల్లుకు సంబంధించి పేర్కొన్న లక్ష్య ప్రకటనలో ఈ విధంగా వివరించారు:
“ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న (ఆర్టీఐ) చట్టం భారత రాజ్యాంగంలోని Article 19 ప్రాథమిక హక్కు కింద గుర్తించి వర్తించే సమాచార హక్కును అమలుచేయడానికి సమర్థవంతమైన నిర్వహణ కార్యప్రణాళికను అందిస్తుంది.”
ఆర్టీఐ సవరణ చట్టం : సమాఖ్య స్వభావానికి దెబ్బ:
అంటే రాజ్యాంగం ఆర్టికిల్ 19 కింద ఈ దేశానికి పూర్తిగా వర్తించే ఈ చట్టాన్ని, 2019 RTI సవరణ చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేయడం ద్వారా రాష్ట్రం సమాచార కమిషనర్ల నియామక అధికారాన్ని తీసేవేసి అది కేవలం కేంద్ర ప్రభుత్వానికే అధికారం పరిమితం చేయడం సమాఖ్య వ్యవస్థ కి భారీ గా నష్టం కలిగించే చర్య. ఇది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. ఈ చర్యతో రాష్ట్ర సమాచార కమిషనర్ల హోదా, పదవీకాలం, వేతనం మొదలైన అంశాలను నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్రాల నుంచి హరించుకుంది వాటినీ కేంద్రానికి హస్తగతం చేసుకుంది. ఇది భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆర్టీఐ పార్లమెంట్ సవరణ ప్రాథమిక నేరం, రాజ్యాంగ పరమైన తప్పు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై UGC నియంత్రణ – కొత్త నియంతృత్వ రూపాలు
2019 లో RTI చట్ట సమూలమైన సవరణ వలెనే యూజిసి రెగ్యులేషన్ కూడా అన్యాయంగా ఉంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయంలో కేంద్రం అదే కేంద్రీకృత అన్యాయ విధానాన్ని అనుసరిస్తున్నది. UGC ముసాయిదా (డ్రాఫ్ట్) నియమావళి రాజ్యాంగంలోని ‘సమాఖ్య’ స్వభావాన్ని ఉల్లంఘిస్తూ రూపొందిస్తున్నారు. అది విద్యారంగంలో తీవ్రమైన మార్పులతో రాష్ట్రాల అధికారాలు తగ్గించి వేస్తారు.
విశ్వవిద్యాలయాల స్వయంపాలన దెబ్బతిని అధికార కేంద్రీకరణకు ఉపయోగిస్తాయి. కీలకమైన అంశాలు ఇవి:
- కళాశాల విద్య సమాఖ్య జాబితాలో ఉంది: భారత రాజ్యాంగంలోని సమాఖ్య జాబితాలో విద్యను కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడి జాబితా అని పేర్కొన్నారు. కానీ, UGC ముసాయిదా నియమాలు విద్యను పూర్తిగా కేంద్రం చేతిలో కేంద్రీకృతం చేసేలా రూపుదిద్దుకుంటున్నాయి.
- కేంద్రం ఆధిపత్యం: రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ఈ యూజిసి డ్రాఫ్ట్ (ముసాయిదా) తీవ్రంగా హరించివేస్తుంది. ముఖ్యంగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్స్లర్ల ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు తగ్గిపోతాయి. విసిలు ఏ మీటింగ్ పెట్టినా యూజిసి చైర్మన్ అవునన్నా కాదన్నా తల ఊపవలసిందే. ఈ ప్రకారం వీసీలను డూడూ బసన్నలుగా తయారు చేయాలనుకుంటున్నారా?
- స్వతంత్రత నష్టం: రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ స్వంత విద్యా కార్యక్రమాలను రూపొందించుకునే స్వేచ్ఛ కోల్పోతాయి. మొత్తం దేశానికి ఒకే రకమైన విద్యాబోదన వినడానికి బాగుండవచ్చు కాని వైవిధ్యత, కొత్త ఆలోచనలకు అవకాశం ఉండదు.
- ప్రవేశ పరీక్షలు అడ్డంకిగా మారుతాయి: అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఒకే రకమైన ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడం చాలా పెద్ద ప్రమాదాలు, స్కామ్ లకు దారి తీస్తుంది. ఇప్పటికే నీట్ లాంటి మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ఏమి జరిగిందో చూస్తున్నాము. అందరికీ విద్యను అందుబాటులోకి తేవడంలో ప్రతిబంధమైతుంది.
- UGC అధికారం దాటి వెళుతోంది: (దీన్ని రాజ్యాంగానికి Ultra vires అల్ట్రా వైర్స్ అవుతాయి) 1956 UGC చట్టం ప్రకారం, UGC విద్యా ప్రమాణాలను నిర్ధారించేందుకు, ఉపాధ్యాయుల అర్హతలను నిర్ణయించేందుకు మాత్రమే అధికారాన్ని కలిగి ఉంది. కానీ, వైస్ ఛాన్స్లర్ల నియామకంపై UGC నియంత్రణను కల్పించేందుకు ఇది బలవంతంగా తన హద్దులను దాటి వ్యవహరిస్తోంది.
- రాష్ట్ర చట్టాలకు ప్రాధాన్యతకు దెబ్బ: Article 254 ప్రకారం, కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం మధ్య విరుద్ధత ఉంటే, రాష్ట్ర చట్టం గనుక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదిస్తే, అది ఆ రాష్ట్రంలో అమలులో ఉంటుందనే నిబంధన కొత్తగా తెస్తున్నారు. అయితే, ఒక కేంద్ర చట్టం అనే UGC నియమావళి ముసాయిదా రెగ్యలేషన్ లు రాష్ట్ర చట్టాలను అదిగమిస్తాయి, అది అల్ట్రా వైర్ అవుతుంది.
6 గురు రాష్ట్ర మంత్రుల నిరసన:
- 2025 ఫిబ్రవరి 6న, ఆరు రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖ మంత్రులు UGC ముసాయిదాను వ్యతిరేకిస్తూ ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించారు. ఈ రాష్ట్రాలు ప్రధానంగా ఈ యూజిసి రెగ్యులేషన్ అంశాలను విమర్శించాయి:
- అర్హతల సమస్య: ఉపాధ్యాయుల ఎంపికలో కొత్త విధానం కారణంగా, సరైన విద్యార్హతలున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాశనం అవుతుంది.
- విద్యా ప్రమాణాల నష్టం: కొత్త నియమావళిలో మౌలికంగా అవసరమైన అర్హతలను సడలించడం, విద్యా ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
- సమాఖ్య హక్కుల ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధం.
అయితే ఈ ఆరోపణలు ఖండిస్తూ
UGC చైర్మన్ ఈ ముసాయిదాను సమర్థిస్తూ, ఇది విద్యా ప్రమాణాలను పెంచేందుకు, జాతీయ స్థాయిలో మెరుగైన ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించినదని అంటున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని విద్యను పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ, రాష్ట్రాల పరిపాలన తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితులు కల్పించటమే అని భావిస్తున్నాయి. చేస్తారు.
ఇది ఫెడరల్ (రాజ్యాంగ సమాఖ్య) స్వభావానికి విరుద్ధంగా మారుతున్న ఈ మార్పులను సమర్థించడానికి, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం (NEP) – 2020 నిబంధనలను ఆధారంగా అమలు చేయబోతున్నామని వాదిస్తున్నారు. అయితే, భారత రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, ఈ మార్పులను సమర్థించదగిన ప్రామాణికతను కేంద్ర ప్రభుత్వం నిరూపించాల్సి ఉంది. ఆ పని చేస్తారనే నమ్మకం లేదు.
కేంద్ర పెత్తనం ఎందుకు?
విద్య అనేది రాజ్యాంగ పరంగా సమాఖ్య స్వభావం కలిగిన అంశం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అంశంలో సమాన హక్కులు ఉన్నాయి. UGC తన శాసన పరిమితులను దాటి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై పెత్తనం చేసేందుకు, వాటిపైన నియంత్రణ సాధించడానికి యత్నిస్తే, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ ముసాయిదా రెగ్యులేషన్ నియమాలను అమలు చేయడానికి ముందు, కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, సమాఖ్య సహకారాన్ని కలిసి నిర్ణయిస్తే బాగుంటుంది. లేకపోతే దాన్ని నియంత్రుత్వం అంటారు. ఉన్నత విద్యా వ్యవస్థ లో నియంతృత్వ విధానాలకు యూజీసీ పావులు కదపటం ఆందోళనకరం.
– మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.