![Politics in Telugu Film Industry](https://thewiretelugu.in/wp-content/uploads/2025/02/photo-collage.png-1024x1024.png)
రాజకీయ వివాదాల్లో తెలుగు సినిమా రంగం
పుష్ప2తో అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరో అల్లు అర్జున్ తన తరపున మాట్లాడేందుకు అధికార ప్రతినిధిని నియమించుకుంటున్నట్టు ఒక వార్త. మరో అగ్రకథానాయకుడు దేవర జూనియర్ ఎన్టీఆర్ తొక్కిసలాటలు గలాభా ఘటనల తర్వాత తన కోసం ఎవరూ రావద్దు తనే అభిమానులను కలుసుకోడానికి వస్తానని మరో ప్రకటన. అధికారపీఠాన్ని అందిపుచ్చుకున్న అనందానికి తోడు పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ లేదా బాలయ్యబాబుతో సోదరీమణుల ప్రత్యేక షో. పరిశ్రమకే అగ్రజుడుగా అనిపించుకుంటున్న చిరంజీవి రాజ్యసభకు వెళతారనీ మంత్రి అవుతారనీ ఊహాగానాలు. ఈ లోగా దేశ చరిత్రలోనే తొలిసారి ఒక ఉప ముఖ్యమంత్రిగా వున్న పవన్‌కళ్యాణ్ రాత్రి షిప్టులలో నటిస్తూ తన సినిమాలు పూర్తి చేయడం. వ్యక్తిగత స్థాయిలో చూస్తే మంచుకుటుంబంలో కలహాలు మీడియా సమయాన్ని హరించడం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వసూళ్లు లేకపోవడంతో కుటుంబంలోనూ పరిశ్రమలోనూ రకరకాల ఆరోపణలు అనుమానాలు. ఏతా వాతా సినీ వ్యాపార రాజకీయ సామాజిక సమీకరణల వాదోపవాదాలు ప్రచారాలలో మీడియా తలమునకలైంది.
తమిళనాడులో అన్నాదురైతో మొదలుపెట్టి కరుణానిధి ఎంజిఆర్‌ల ద్వారా సినిమా రంగ ప్రముఖులు రాజకీయాలలో చక్రం తిప్పడం కూడా ఒక ప్రాతిపదికపైనే జరిగింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ అగ్రకథానాయకుడైనప్పటికీ నాటి కాంగ్రెస్‌పై ప్రజల అసంతృప్తికి ప్రతిరూపంగానే అధికారంలోకి వచ్చారు. తర్వాత కూడా ఆయన రెంటినీ కలగాపులగం చేసింది తక్కువేనని చెప్పాలి. కానీ ఈ పరిస్థితి క్రమేణా మారిపోతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది సినిమానో ఏది రాజకీయమో ప్రజలకు ఏ ప్రయోజనమో తెలియని గందరగోళం నెలకొంది.పుష్ప 2 విడుదల సందర్భంలో జరిగిన దురదృష్టకర సంఘటనలపై ఎడతెగని చర్చ వాతావరణాన్ని వివాదాస్పదం చేసింది.ఈ లోగా రాజమండ్రి దగ్గర జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనతో ఈ సినీ రాజకీయ చర్చ ఏపికి మారింది.తమ తమ అవసరాల కొద్ది అక్కసుల కొద్ది మాట్లాడటం తప్ప ఒక సామాజిక కోణంలో ఎలా స్పందించాలనే దానికి అవసరమైన సంయమనం గానీ సమతుల్యత గానీ బొత్తిగా లోపించాయి.పాలక పార్టీలు కొన్ని సినిమా వర్గాలు స్వప్రయోజనం నెరవేర్చుకోవడానికి పడే తంటాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి.
పాన్ ఇండియా జ్వరం..
బాహుబలితో మొదలుపెట్టి పాన్ ఇండియా పాన్ వరల్డ్ పాట హిందీలోనూ తెలుగు, తమిళ సినిమాలలోనూ బాగా వినిపిస్తున్నది. చిన్న పరిశ్రమ అయిన కన్నడ కూడా కెజిఎఫ్ తర్వాత ఈ హడావుడిలో భాగస్వామి అయింది. ఈ క్రమంలో ఖర్చులు విపరీతంగా పెంచి అవసరం లేని హంగులతో అతి భారీగా తీస్తేగానీ సినిమాలు నడవబోవనే భావం బలపడింది. భారీగా పెట్టుబడులు కుమ్మరించగలిగిన లేదా భారాలు భరించగలిగిన కొన్ని కుటుంబాలు, సంస్థలే చక్రం తిప్పుతున్నాయనే భావం బలపడింది. చిన్న చిత్రాలు భిన్నచిత్రాలు కొన్ని విజయం సాధించినా ఆ ప్రయత్నాలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వాలు కూడా స్థిరమైన విధానాలతో ముందుకు రావడం లేదు. తారల తళుకులు పైపై మెరుగులకు వచ్చిన ప్రాధాన్యత ప్రతిభకు కొత్త గొంతులకు దక్కడం లేదు. మొత్తం చర్చలో సాంకేతిక నిపుణులు అంతకు మించి పనిచేసే సినీ కార్మికుల గురించి అసలు చర్చ జరగడం లేదు.
ప్లేయింగ్ విత్ ఫియర్,ళషో
ఒకప్పటి అభిమాన సంఘాల పరిస్థితి మారి సోషల్ మీడియాల ద్వారా వీరిని మరింత గట్టిగా ఉపయోగించుకోవడం ఒక వ్యూహంగా మారింది. పదేపదే ఈవెంట్లు, జాతరలు, ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ ఇలా తొక్కిసలాటతో ఒకటి రెండు వేడుకలను రద్దు చేసుకోవలసిన పరిస్థితులు. వేలాది థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి, ఎక్కువ షోలు వేసి తాజా సరుకులా అమ్మేసి సొమ్ములు చుట్టేసుకోకపోతే చల్లబడిపోతుంది. అందుకోసం మల్లీ స్క్రీన్ప్లెక్స్లు, గతంలో లేని విధంగా విడుదల తేదీలు సీజన్లు కూడా కలసి నిర్ణయించుకోవడం నెలల తరబడి వాయిదాలు వేసుకోవడం అంతా మార్కెట్ వ్యూహం.. ఆ మార్కెట్ కూడా తెలుగు రాష్ట్రాలను దాటి హిందీ ప్రేక్షకులకూ విదేశాల్లోని వారికి నచ్చేలా రూపొందించడం ఒక వలయంగా మారింది. ఆదిమభయంతో ఆడుకోవడం(ప్లేయింగ్ విత్ ప్రిమిటివ్ ఫియర్) అనేది హాలివుడ్ ప్రాథమిక ఫార్ములా.తాను ఉద్వేగ భరతమైన అంశాలను తారాస్థాయికి తీసుకుపోయి లార్జర్ దాన్ లైఫ్(అతిశయోక్తి)ఫార్ములాను పాటిస్తానని రాజమౌళి తాజా వెబ్ ఫిలింలో కూడా చెబుతున్నారు.
బిజెపి రాజకీయాలు?
పుష్ఫ2 విడుదల సందర్భంగా తొక్కిసలాట ఎవరూ కోరుకున్నది కాదు గానీ వూహించలేనిది కూడా కాదు. ఇందుకు బాధ్యత గురించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నా ఆకర్షణవున్న హీరో పరివారం జాగ్రత్త తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అయితే, హీరో ఫంక్షన్లో తన పేరు మర్చిపోయారు గనక అల్లు అర్జున్ను అరెస్టు చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కక్షసాధింపుగా కొన్ని పార్టీలు తీవ్రారోపణలు చేశాయి. బిఆర్ఎస్, బిజెపిలు ఈ విషయంలో ముందున్నాయి.ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్ బయిటకు రాగానే పోన్‌చేసి సంఫీుభావం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అరెస్టును ఖండించడం చూస్తే బిజెపి ప్రత్యక్ష పరోక్ష మిత్రులు ఒక విధానం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. అల్లు అర్జున్ అరెస్టు అవకాశంగా తనపై రాజకీయ దాడికి పాల్పడుతుంటే పరిశ్రమ విడగొట్టుకోకపోవడం, బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై రేవంత్ గట్టిగానే విమర్శించారు, అసలు రేవంత్‌తో చర్చలకు పరిశ్రమ పెద్దలు వెళ్లడమే తప్పని ఒక వర్గం వాదన. రేట్లు షోలు పెంచుకోవడానికి ఇకపై అవకాశంవుండదన్న రేవంత్ రెడ్డి తర్వాత దిల్‌రాజు చిత్రాలకూ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేశ్ రెండు వందల కోట్ల వసూళ్ల జాబితాలో చేరారు కూడా,ఈ చిత్రంలో తెలంగాణ గోదావరి పాలిటిక్స్ వాడిన తీరు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు!
పుష్ప ఘటనల తర్వాత చాలా రోజులకు పవన్ కళ్యాణ్ అల్లుఅర్జున్ అరెస్టును సమర్థించారు. జాగ్రత్తలు లోపించాయని, పరామర్శకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. అధికార హోదాలో ఏపిలో గేమ్ చేంజర్ ఈవెంట్లో పాల్గొని చేసిన ప్రసంగంలో ఆయన సినిమాలు రాజకీయాలు అన్నీ కలిపేసి మాట్లాడారు. ఆయన స్వయంగా నటిస్తున్న ఒజి(ఒరిజినల్ గ్యాంగ్ ష్టర్) చిత్రంపేరు ప్రతి అధికార కార్యక్రమంలోనూ వినిపిస్తూనే వుంది.
గేమ్ చేంజర్ ఈవెంట్‌కు హాజరై వెళుతున్న ఇద్దరుయువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలుకావడం విషాద వివాదంగా మారింది. రోడ్లు గత ప్రభుత్వంలో దెబ్బతిన్నాయి గనక ఈ ఘటన జరిగిందని పవన్ వ్యాఖ్యానించడం ఒకటైతే పుష్ప ఘటనలతోపోటీ పెట్టి పవన్‌ను అరెస్టు చేయాలని కొంతమంది వైసీపీ అభిమానులు పోస్టులు పెట్టడం ,మాజీ అంబటి రాంబాబు దీనిపై రాజకీయదాడి చేయడం మరోవైపు చూశాం. ఇవన్నీ రాజకీయీ వ్యూహాల ఫలితమే. జగన్ ముఖ్యమంత్రిగా వుండగా రేట్ల పెంపునకు ఒప్పుకోకపోవడం వచ్చిన హీరోలు దర్శకుల పట్ల అవమానకరంగా వ్యవహరించారనే విమర్శ వుంటూనే వుంది.
వివాదాలు,అనుబంధాలు
బాహుబలి రచయిత ఆ చిత్ర దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేయించింది. ఆయన రజాకార్ రచన చేశారు, ఆరెస్సెస్‌పై చిత్రం తీస్తానని ప్రకటించారు. అందులో నటించడం కోసం ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు కొన్నేళ్ల కిందట స్వయంగా హొంమంత్రి అమిత్ షా ప్రయత్నించడం తెలిసేవుంటుంది. ఇటీవల చిరంజీవి ఢల్లీ వెళ్లి ప్రధాని మోడీతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం కూడా చాలా ప్రచారానికి కారణమైంది. తర్వాత మెగాస్టార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ పొగిడి ఆ కథలకు పగ్గాలు వేశారు కానీ మెగా కుంటుంబం బిజెపి వైపు మొగ్గుతుందనే భావం మాత్రం బలపడిపోయింది. వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని విపరీతంగా ముందుకుతెస్తున్నారు. లౌకికవాదులపైవామపక్షాలపై ధ్వజమెత్తుతున్నారు. ఆయన నటించే హరిహర వీరమల్లు కూడా ఔరంగ్జేబ్ కాలంలోది అంటున్నారంటే కాషాయ కథల శ్రేణిలో కలిసే అవకాశముంది. పవన్ ఇప్పుడు దక్షిణ దేశ తీర్థయాత్ర పెట్టుకోవడంలోనూ రాజకీయం స్పష్టమే.
గత నెలలో బిజెపికి చెందిన మరో చిన్న హీరోయిన్ తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వాటికి ఖండనగా టిడిపి చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి కూడా వికృత వ్యాఖ్యలు చేయడంతో ఓ దుమారం సాగింది. పాటల రచయిత అనంతశ్రీరాం హిందూ వ్యతిరేక చిత్రాలను బహిష్కరించాలంటూ పైత్య ప్రలాపాలకు పాల్పడ్డారు. వాతావరణం కలుషితం చేయడానికి స్వప్రయోజనాలు సాధించుకోవడానికి సాగుతున్న ప్రయత్నాలుగానే ఇలాంటి వాటిని చూడవలసి వుంటుంది.
వైసీపీ హయాంలోనూ ఫైబర్‌నెట్‌ను ఎలా వాడారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యూహం చిత్రానికి రాం గోపాల్ వర్మ బృందానికి డబ్బులు ఎలా అందించారనే దానిపైనా యుద్ధం నడుస్తున్నది. తాను ఇక రాజకీయ చిత్రాలకు దూరంగా వుంటానని అంటూనే వర్మ నిరంతర వ్యాఖ్యానాలు కొనసాగిస్తున్నారు.
అందరూ ఆనందించవలసిన కళలను సంకుచిత కోణాలతో చూడటం, సులభ లాభాల కోసం సామాన్య ప్రేక్షకులపై భారాలు మోపడం సరైంది కాదని ఎవరైనా ఒప్పుకోవాలి. పొడుగు చేతుల పందేరంలా ఇష్టానుసారం అనుమతివ్వడం సరైందేనా?. పరిశ్రమ కూడా మంచి చిత్రాలకు,చిన్న చిత్రాలకు తారలూ దర్శకులకు ప్రోత్సాహం, ప్రేక్షకులకు భద్రత భారం తగ్గించడం గురించి యోచించవద్దా?
– తెలకపల్లి రవి