51 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న దల్లెవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్యసహాయం పొందేందుకు ఆయన సుముఖంగా లేరు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తాము కూడా దేశవ్యాప్త రైతాంగ ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శిబిరంలో చేరిన రైతులు ప్రకటించారు.
చండీగడ్ : రైతులు పండిరచే పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలంటూ దేశవ్యాప్తంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం మరింత ఉధృతం కానుంది. ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ప్రభుత్వం ఈ విషయంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ 51 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష సాగిస్తున్నారు. దల్లెవాల్కు మద్దతుగా జనవరి 15వ తేదీ నుండి పంజాబ్‌కు చెందిన 111 మంది రైతులు ఆమరణ నిరాహారదీక్షలకు కూర్చున్నారు.
ఈ నిరసన శిబిరం హర్యానా – పంజాబ్ సరిహద్దుల్లోని ఖనౌరిలో ఉంది. ఈ గ్రామం హర్యానా సరిహద్దులకు కూతవేటు దూరంలో ఉండటంతో హర్యానా పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే రైతులు ఎటువంటి రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడకకుండా ప్రశాంతంగా నిరసన శిబిరం చేరటంతో పోలీసు బలగాలు ఊపిరి తీసుకున్నాయి.
తామేమీ ఢిల్లీ వైపు సాగబోమనీ, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు స్వీకరించే వరకూ ఈ శిబిరంలోనే నిరసన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చ నేతలు స్పష్టం చేశారు.
51 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న దల్లెవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్యసహాయం పొందేందుకు ఆయన సుముఖంగా లేరు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తాము కూడా దేశవ్యాప్త రైతాంగ ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శిబిరంలో చేరిన రైతులు ప్రకటించారు.
దల్లెవాల్లాగానే తాము కూడా ఎటువంటి వైద్యసహాయం పొందటానికి సిద్ధంగా లేమని ఈ 111 మంది రైతులు స్పష్టం చేశారు.
దల్లెవాల్ నాయకత్వంలో ఏడాదికి పైగా చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చ ఐక్యవేదికలో తాజాగా సర్వాన్ పాంథర్ నాయకత్వంలోని కిసాన్ మజ్దూర్ మోర్చ కూడా చేరింది.
నిరసనకారుల్లో 25 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వయస్సున్న వారున్నారని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు లఖ్వీందర్ ఔలఖ్ ది వైర్‌కు తెలిపారు.‘‘ మా నేత దల్లెవాల్ ఆరోగ్యం రోజురోజుకూ విషమిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుంది. కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. ఇప్పుడు మరింతమంది రైతులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు’’ అని ఔలఖ్ అన్నారు.
మోర్చాకు చెందిన మరో నేత కాకా సింగ్ శిబిరం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతంలో సెక్షన్ 163 (పాత పీనల కోడ్ ప్రకారం 144 సెక్షన్) విధించామని హర్యానా పోలీసులు చెప్తున్నారు. కానీ మేము ఢిల్లీ పై దండెత్తటం లేదు. ఇక్కడే శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష పాటిస్తున్నాము’’ అన్నారు. ‘‘కావాలంటే ప్రభుత్వం మా పై భాష్పవాయు గోళాలు ప్రయోగించవచ్చు. హింసకు కూడా దిగవచ్చు. కానీ మా శాంతియుత పంథాను వీడేది లేద’’న్నారు.
జనవరి 15న ఉదయాన్నే శిబిరానికి చేరిన రైతులు దీక్ష ప్రారంభించే ముందు ప్రార్ధనలు చేశారు. శిబిరంలో కూర్చోవడానికి వచ్చిన వారందరికీ శిబిరంలో చేరకుండా ఉండదల్చుకుంటే ఉండవచ్చనీ, బలవంతం ఏమీ లేదని చివరి వరకూ అవకాశం ఇచ్చినా 111 మంది రైతులూ దీక్షలకే మొగ్గు చూపారని ఔలఖ్ తెలిపారు.
అందరి దృష్టీ జనవరి 18 మోర్చా సమావేశంపైనే
రైతుల డిమాండ్ల కోసం ఉమ్మడి పోరాట వ్యూహాన్ని రూపొందించటానికి రైతు సంఘాలు సమావేశం కానున్న జనవరి 18వ తేదీ గురించే అందరూ ఎదురు చూస్తున్నారు. జనవరి 13న జరిగిన సమావేశం నిరసన విధి విధానాల పట్ల ఏకాభిప్రాయానికి రాలేకపోయినా 2020 – 21లో వ్యవసాయక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమ్మడి పోరాటాన్ని సాగించినట్లే ఈ సారి కూడా సమైక్య పోరాటాన్ని నిర్మించాలన్న విషయంలో భాగస్వామ్య సంఘాల పట్ల ఏకాభిప్రాయం కుదిరింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఫలితంగా మోడీ ఈ చట్టాలు వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే గత సంవత్సరం ఫిబ్రవరి 13న మొదలైన ప్రసుస్తత ఉద్యమంలో ఈ సంస్థలన్నీ ఇంకా పాలుపంచుకోలేదు.
మోడీని మడమ తిప్పేలా చేసిన విశాల వేదికలో వచ్చిన భిన్నాభిప్రాయాల కారణంగా దల్లెవాల్ 2022 లో సొంతంగా సంయుక్త కిసాన్ మోర్చాను ప్రారంభించారు. అయితే ఈ సారి దల్లెవాల్ ప్రారంభించిన ఆందోళన 2020 – 21 తరహాలో పంజాబ్ ప్రభుత్వం మెడలు వంచటంలో సఫలంకాలేదు. కానీ ప్రస్తుతం విషమిస్తున్న దల్లెవాల్ ఆరోగ్యం, కేంద్ర ప్రభుత్వం మొండితనం కారణంగా ఈ సంఘాలన్నీ మరోమారు ఐక్య సంఘటనగా ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
వివేక్ గుప్త
అనువాదం : కొండూరి వీరయ్య