
నేడు నా దేశపు సూర్యోదయం
ఉగ్రవాదపు అమానవీయ
రక్తపుటేరులను ఖండిస్తూ
కన్నీటి భావోద్వేగాల జలపాతాల
వెన్నెలను కురిపిస్తూనే ఉంది
పర్యాటక ప్రదేశాల
అందమైన జ్ఞాపకాల అక్షరాలు
బైసరన్ లోయ సాక్షిగా ప్రాణాలై
అనాగరికపు తూటాల దాడికి
కుటుంబసభ్యుల చూపుల ముందే
మౌనపు గాల్లో కలిసిపోతుంటే
విశ్వ మానవత్వం గుండె పగిలి
అంబరాన్ని తాకేలా గట్టిగానే రోదిస్తుంది
ఆధునిక నాగరికత
అంతరిక్ష యానాల విజయకథ
ఎటెళ్తుంది కాలపు నడక
మత విద్వేషపు
కాల్పుల శబ్దం
పహల్గం దారులపై
ఆర్తనాదాల కుంభవర్షం
ఇలాంటి ఘటనల
శ్వాస నిశ్శబ్దాలను గమనిస్తే
ప్రతి భారతీయుడి
గుండె పొరల్లో వందే “మాతరం”
భూకంపం పుట్టుకొస్తుంది
శాంతి సహనాలు
నా దేశపు పాఠాల పాదాలు
అర నిమిషం అవి మరిచిపోతే
ఉగ్రవాదపు మహమ్మారి
ఊపిరి దీపాన్ని
అరసెకనులో ఆర్పేస్తాం
గాంధీ, బుద్ధుడు నడిచిన గడ్డ ఇది
అహింస మా మతం
విశ్వశాంతి మా తత్వం
మా ఆదర్శాలకు అడ్డొస్తే
మా ఉనికే ప్రశ్నార్థకమైతే
ప్రతి భారతీయుడు అడుగే
ఓ భయంకర అణుబాంబు
ఇది ఓ సూచన
నా దేశ హెచ్చరిక కాదు
శతాబ్దాలుగా మేం పంచే
ప్రేమనే చూసింది ప్రపంచం
విధ్వంసాన్ని ఇంకా చూడలేదు
ఆ ఊహే
విశ్వ పరిణామానికే
ఓ ప్రమాదపు సంకేతం..
ఫిజిక్స్ అరుణ్ కుమార్
9394749536
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.