
న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక జరిగిన అనేక భౌగోళిక రాజకీయ విన్యాసాలలో మార్చి 4న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన అమెరికా ఓటింగ్ కూడా ఒకటిగా నిలుస్తుంది.
ఈ సమావేశంలో ‘అంతర్జాతీయ శాంతియుత సహజీవన దినం’ ఏర్పాటును సుస్థిర అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి-2030 పేరుతో పునరుద్ఘాటించిన ఎజెండానూ అమెరికా వ్యతిరేకించింది. నిజానికి ఈ తీర్మానాల తో అమెరికా ఆధిపత్యానికి అగ్రరాజ్య హోదాకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
అటు ప్రపంచం లోనూ ఇటు ఐక్యరాజ్యసమితి లోనూ తనకొక బాధ్యతాయుత స్థానం ఉన్నప్పటికీ అమెరికా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అమెరికా ప్రతినిధి ఎడ్వర్డ్ హార్ట్నీ తమ వైఖరిని వివరిస్తూ సుస్థిర అభివృద్ధి, దాని లక్ష్యాలకు సంబంధించిన 2030 అజెండాను నిరాకరిస్తున్నామని, తోసిపుచ్చుతున్నామని అన్నాడు. ఇక తాము ఎంతమాత్రమూ ఈ తీర్మానాన్ని అంగీకరించమని కుండ బద్దలు కొట్టారు. ‘అర్థమయ్యేలా చెప్పాలంటే 2030 ఎజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు బ్యాలెట్ బాక్స్ వద్ద ఓడిపోయాయి’ అని ఆయన వివరించాడు.
అమెరికా వ్యతిరేకించినప్పటికీ అంతిమంగా ఈ తీర్మానం 162 దేశాల మద్దతుతో ఆమోదించబడింది. రెండు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓట్లు వేశాయి.
మరుసటి రోజు అమెరికా మరింతగా దిగజారి ‘అంతర్జాతీయ ఆశాదినం’, ‘అంతర్జాతీయ న్యాయసంక్షేమ దినం’ ఏర్పాట్లకు సంబంధించిన తీర్మానాలను వ్యతిరేకించింది. ‘యువతులతో పాటుగా యువకులందరికీ సమానావకాశాల ప్రాముఖ్యత’ను నొక్కిచెప్పే, ‘అందరికీ విద్యాహక్కు’ తీర్మానాన్ని ఈ సభలో అంగీకరించకుండా ఉన్న దేశం అమెరికా ఒక్కటే. వైవిధ్యాన్నీ, సమన్యాయాన్నీ, సమగ్రతనూ కూల్చివేయడమనే (DISMATLING DIVERSITY, EQUITY AND INCLUSION- DEI) ట్రంప్ దేశీయ ఎజెండాను ఈ తీర్మానాలు వ్యతిరేకిస్తూ ఉండడమే దీనికి కారణం.
నిష్క్రమణ చర్యలు దేనికి సంకేతం?
ఎలాన్ మస్క్, ఇతర ట్రంప్ మద్దతుదారులు కోరుతున్నట్టుగానే, ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా వైదొలగడానికి ఈ చర్యలు సూచన కావొచ్చు. ట్రంప్ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను వైదొలిగేలా చేశాడు. తన మొదటి పదవీకాలంలో చేసినట్లుగానే, పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని రద్దు చేశాడు. మానవ హక్కుల మండలి(UNHRC), ద రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్టైన్ రెఫ్యుజీస్ ఇన్ ద నియర్ ఈస్ట్(UNRWA) వంటి అనేక ఐక్యరాజ్య సమితి విభాగాల నుండి అమెరికా తప్పుకొన్నది. ఇప్పుడు అమెరికా యునెస్కో(UNESCO)లో కొనసాగాలా లేదా అని ఆలోచిస్తోంది. పునరంచనా వేస్తుంది. ఐక్యరాజ్యసమితి పన్నుల సదస్సు నుంచి కూడా అది నిష్క్రమించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో ఇటీవల వచ్చిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. అమెరికా తీసుకుంటున్న ఇలాంటి అనేక చర్యలు కొన్ని అంతర్జాతీయ సంస్థలపై ట్రంప్ పాలనకు ఉన్న అసంతృప్తిని మాత్రమేకాక, దేశాల మధ్య సమానత్వాన్ని సూచించే బహుపాక్షిక చట్రాన్ని దేనినైనా ప్రాథమికంగానే ట్రంప్ పాలన వ్యతిరేకిస్తుందని తెలియజేస్తున్నాయి.
భద్రతా మండలిలో తనకున్న వీటో హక్కుద్వారా అసమాన అధికారాన్ని చెలామణి లో పెడుతున్నందువల్ల ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా పూర్తిగా వైదొలగడం అసంభవమని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు. కానీ భౌగోళిక రాజకీయాలపై ఆటవిక అధికారాన్ని చెలాయిస్తూ, మొరటు బలం తప్ప సంప్రదింపులకు తావులేని ట్రంప్ పాలనలో వీటో హక్కు వెసలుబాటు కూడా ఇక అవసరం లేదేమోననిపిస్తుంది.
ప్రమాదంలో ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు..
ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా నిష్క్రమిస్తే ఆర్థిక పరిణామాలు తక్షణమే తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ ఐక్యరాజ్యసమితిలో కొనసాగినప్పటికీ, తన విరాళాలను కోతపెట్టాలనే ట్రంప్ ఉద్దేశం రహస్యమేమీకాదు. ఐక్యరాజ్యసమితికి అతిపెద్ద ఆర్థిక మద్దతుదారయిన అమెరికా 2022లో రికార్డు స్థాయిలో 18.1 బిలియన్ డాలర్లను అందించింది. ఇది సంస్థకు వచ్చిన మొత్తం నిధులలో దాదాపు 20శాతం.
అమెరికా విరాళాలలో 70శాతం కంటే ఎక్కువగా మొత్తం కేవలం నాలుగు ఐక్యరాజ్యసమితి సంస్థలకు మాత్రమే వెళ్ళాయి. అందులో ప్రపంచ ఆహార కార్యక్రమానికి 40 శాతం, శరణార్థుల హై కమిషనర్‌కు 12 శాతం, యునిసెఫ్‌కు 10 శాతం, శాంతి కార్యకలాపాల విభాగానికి 10 శాతం లెక్కన నిధులు అందాయి. ఈ నిధులలో ఎక్కువ భాగం USAID ద్వారా ఆయా సంస్థలకు అందజేయబడ్దాయి. అయితే USAIDను ట్రంప్ ఇప్పటికే మూసివేసినందువలన ఆ సంస్థతో పాటుగా ఆయా నిధులు కూడా ఇప్పటికే మాయమైపోయి ఉండవచ్చు.
వ్యవస్థ పతనానికి నాంది..
ఇప్పటికే నిధులు తక్కువగా ఉన్న ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు ఇది మరో దెబ్బ. ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణంలో, వెనువెంటనే మరే ప్రభుత్వమయినా ఈ అంతరాన్ని పూడ్చపూనుకోవడం అద్భుతమే అవుతుంది. అమెరికా చర్యల మూలంగా కీలకమైన, సంజీవినీ సమానమైన అనేక ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.
ఒకవేళ ఐక్యరాజ్యసమితి పూర్తిగా కుప్పకూలిపోతే తప్ప అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఈ మార్పు వల్ల ఐక్యరాజ్యసమితికి ఖచ్చితంగా ఆపద వస్తుందని చెప్పలేము. కానీ, ట్రంప్ పాలన అంతర్జాతీయ సంస్థల ద్వారా పనిచేయడానికి బదులుగా తన అధికారాన్ని ఉపయోగించి దేశాలను బెదిరించడానికి, ఏకపక్షంగా వ్యవహరించడానికి, బలప్రయోగానికి ప్రాధాన్యతను ఇస్తుందనేది మాత్రం స్పష్టమే. ఎనిమిది దశాబ్దాల క్రితం తానుగా సహాయపడి స్థాపించిన భౌగోళిక సహకారమనే బహుపాక్షిక పాలనా వ్యవస్థ నుండి సూపర్ పవర్ అమెరికా వెనుదిరగడమనేది ఆ వ్యవస్థ పతనానికి నాంది.
అస్తిత్వానికి సంబంధించిన ప్రపంచదేశాల సంఫీుభావం..
ట్రంప్ చర్యలు మనం ఊహిస్తున్న దానికి విరుద్ధంగా, గొప్ప అంతర్జాతీయ సహకారానికి ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తాయి. దేశాలు మరింతగా కలిసిమెలిసి పనిచేయడానికి ప్రేరణ కూడా అవుతాయి. దీనికి కారణం చాల సరళమైంది. శ్వేతసౌధం ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమయిన సవాళ్ళు, వాటి స్వభావంలో ప్రపంచానికంతటికీ చెందుతాయి. ట్రంప్ వాటిని గుర్తించడానికి నిరాకరించిన మాత్రాన అవి లేకుండా పోవు.
వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, తీవ్ర అసమానతలు, కొత్తగా పుట్టుకొస్తున్న ఆరోగ్య సమస్యలు, వినాశనకర నూతన సాంకేతిక పరిజ్ఞాన పెరుగుదల, సుస్థిర ఉపాధి క్షీణత వంటివన్నీ ఒక దేశ సరిహద్దుని అంటిపెట్టుకొని ఉండేవి కావు. సామాజిక రాజకీయ వేర్పాటువాదానికి ప్రపంచ వ్యాప్తంగా ఆజ్యం పోసేవారు సామూహిక పరిష్కార సాధనను చిన్నచూపు చూస్తారు.
కాబట్టి, ప్రపంచదేశాల సంఫీుభావం కేవలం నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు, అస్తిత్వానికి సంబంధించినది కూడా. జాన్ మేనార్డ్ కీన్స్ ఒకప్పుడు చెప్పిన ‘అధికారంలో ఉన్న పిచ్చివాళ్ళ’ ప్రభావంలో కొంతమంది ఉన్నప్పటికీ, ప్రోత్సాహకరంగా చాలా మంది రాజకీయ నాయకులు విషయాన్ని అర్థం చేసుకుని, బహుపాక్షికతకు కట్టుబడి ఉన్నట్లుగానే అనిపిస్తుంది. పన్నులు, వాతావరణ చర్యలు, అభివృద్ధి- ఫైనాన్సింగ్ వంటి వాటిపై అంతర్జాతీయ చర్చలు అమెరికా భాగస్వామ్యం లేకుండానే ముందుకు సాగుతున్నాయి. అనేక సందర్భాలలో ఇంకా గత పరిపాలనలలో కూడా పాడు చేసేపాత్ర వహించిన అమెరికా ఈ సందర్భాలలో లేకుండా పోవడం వాస్తవానికి, మరింత ప్రతిష్టాత్మకమైన ప్రభావవంతమైన ప్రపంచ ఒప్పందాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
వింతేంటంటే, ట్రంప్ ఏ బహుపాక్షిక వ్యవస్థనయితే నాశనం చేయాలని చూస్తున్నాడో ఆ వ్యవస్థే ప్రపంచ జనాభాలోని అత్యధికుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఉన్నత వర్గాల ప్రయోజనాలకు, అమెరికా వంటి శక్తివంతమైన దేశాల ప్రయోజనాలకూ ఎక్కువగా ఉపయోగపడింది. ఈ అర్ధంలో ప్రస్తుత అనిశ్చితి, తిరుగుబాటు పరిస్థితులు పురోగామి మార్పు కోసం అంతర్జాతీయ ఉద్యమాన్ని నిర్మించేందుకు గొప్ప అవకాశాన్ని సూచిస్తున్నాయి.
జయతీ ఘోష్
అనువాదం: అవ్వారు నాగరాజు
(వ్యాసకర్త జయతి ఘోష్ మసాచుసెట్స్ ఆమ్హ్రెస్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. క్లబ్ ఆఫ్ రోమ్స్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎకనామిక్స్ కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు. అంతేకాకుండా ఇండిపెండెంట్ కమీషన్ ఫర్ ద రిఫార్మ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్ఫోరేట్ టాక్సేషన్కు కో -చైర్ పర్సన్ కూడా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.