
గతంలో జరిగిన మిర్యాలగూడలోని ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసుపై నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పుని వెలువరిచింది. ఎక్కువమంది తీర్పును వినగానే సంబరపడిపోయారు. ఇప్పటికైనా ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగిందని తీర్పుని స్వాగతించారు. అయితే ఈ కులహత్యకు సూత్రదరులుగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్య జరిగిన రెండేళ్లకు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కగానొక్క కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది. అమృతకు పుట్టిన బిడ్డ తండ్రి లేని వాడయ్యాడు. చెట్టంత ఎదిగిన కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ఇలా ఒక్కరి అనాలోచితమైన చర్య వల్ల చాలా మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. 2018 సెప్టెంబర్ 14 వరకు ప్రశాంతంగా ఉన్న ఇంతమంది జీవితాల్లో కులం పెట్టిన చిచ్చు కుటుంబాలను అస్తవ్యస్తం చేసింది.
ప్రణయ్ హత్య తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమంతో ప్రతీ ఒక్కరూ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృత్తం కాకుండా ఇదొక గుణపాఠంలా మారుతుంది అనుకున్నారు. కానీ ప్రణయ్ హత్య జరిగిన కొన్నాళ్లకే వరుస ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 128 పరువు హత్యలు, ప్రణయ్ హత్య తరువాత జరిగినట్టుగా పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి సమాజానికి తెలిసి జరిగిన గణాంకాలు మాత్రమే, తెలియకుండా మారుమూల గ్రామాల్లో పోలీసులకు, సామాజికవేత్తలు కూడా పసిగట్టలేనివి లెక్కలేనన్ని జరిగి ఉంటాయనేది అంచనా.
తమిళనాడులో గత ఐదేళ్లలో 195 పరువు హత్యలు జరిగినట్టుగా ఒక ఎన్జీఓ నిర్వహించిన సర్వేలో తేలింది. అంతేకాకుండా 2015లో దేశవ్యాప్తంగా 251 కుల హత్యలు నమోదయినట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెబుతోంది. గతంలో పరువు హత్యలు అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా హర్యానా కాప్ పంచాయితీల్లో మీనాలు, రాజ్ పుత్ లు, జాట్ కులాల మధ్య ఆధిపత్య పోరు విపరీతంగా ఉండేది. తరచుగా ఈ కులాల్లో పరువు హత్యలు జరుగుతూ ఉండేవి. ఇక బీహార్ అయితే కులహత్యలకు పెట్టింది పేరు. ఉత్తర భారతదేశంలో పరువు హత్యలపై అనేక సినిమాలు అప్పట్లో వచ్చాయి. ఇక్కడ ఎన్ని చట్టాలు వచ్చినా ఈ హత్యలు ఆగింది లేదు, పైగా ఈ జాడ్యం దక్షిణ భారత్ కు పాకింది.
అయితే, పరువు హత్యలు ఎందుకు జరుగుతాయని ఒకసారి పరిశీలిస్తే అగ్రకులంగా భావించబడే కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఒక దళిత, లేదా ఒక గిరిజన, లేదా వారికంటే తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు తమ ఇంటి పరువు మంటగలిసిందని అనుకోని, దానికి కారణమైన వ్యక్తిని హత్య చేస్తున్నారు. ఇంకా ఎక్కువ పరువు నిలబడాలి అంటే కన్న కూతురుని కూడా కడతెర్చుతున్నారు. ఇలా పోయింది అనుకున్న పరువు హత్య చేయడంతో మళ్ళీ వచ్చేస్తుందని భావిస్తున్నారు.
పరువు, ప్రతిష్ట, కుల గౌరవం వంటి ఉకినిలోనే లేని భ్రమలను ఊహించుకొని ఉన్మాదుల్లా మారుతున్నారు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న కుటుంబాల్లో చంపుకునే వరకు పోవడంలేదు. కానీ ఆర్థికంగా ఎదుగుతున్న కుటుంబాల్లో పరువు పేరుతో హత్యలకు తెగబడుతున్నారు. కానీ, ఇవన్నీ చేస్తున్నా చట్టం ఉందని, ఆ చట్టం నేరానికి శిక్ష విధిస్తుందని, ఆ శిక్ష వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని మాత్రం ఆలోచించడం లేదు. అంటే కులం విషయం వచ్చేసరికి మనిషి కనీస విచక్షణ కూడా లేకుండా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. ఇదే కాస్త రివర్స్ లో చూస్తే అగ్రకుల అబ్బాయి నిమ్న కుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబం నుంచి కొంతకాలం పాటు వెలివేస్తారు. ఆ తరువాత పండగకో పబ్బానికో వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి పై మాత్రం కంటికి కనిపించని వివక్ష జీవితాంతం కొనసాగుతోంది. ఇక ఇదే అగ్ర కుల అబ్బాయి ఒక దళిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది కుటుంబానికి తెలిసినా పెద్దగా చర్చకు దారి తీయదు. ఎందుకంటే, అతను మగవాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది మాట్లాడే మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.. మగాడన్నక సవాలక్ష ఉంటాయి, చూసీచూడనట్టు పోవాలి అని అంటుంటారు. ఈ సోకాల్డ్ పెద్దమనుషులు.
కులం పేరుతో అయినా, మతం ముసుగులో అయినా బాధితురాలు మాత్రం మహిళనే ఉంటుంది. ఈ సమాజంలో మహిళల పట్ల కనిపించని వివక్ష దినదినాభివృద్ధి చెందుతుంది. రూపం మారుతుంది కానీ అణిచివేత, ద్వితీయ శ్రేణి భావన మాత్రం అలాగే ఉంటున్నాయి. కనీసం మహిళ ఆత్మగౌరవంతో బ్రతకడం కూడా అంగీకరించని పరిస్థితుల్లోకి ఈ వ్యవస్థ వెళ్ళిపోయింది. అమృత ప్రణయ్ లు మేజర్ లు అవగానే పెళ్ళి చేసుకున్నారు. అంటే అప్పటికే ఇద్దరి వయస్సు 20ఏళ్లు దాటింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్న అమృతకి కొన్ని నెలలకే గర్భం దాల్చింది. ఇంతలో కళ్ళెదుట భర్త అతికిరాతకంగా చంపబడ్డాడు. అది కూడా తన తండ్రి పరువు కోసం క్రూరంగా హత్య చేశాడు. ఇవన్నీ చూశాక ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎంత దారుణంగా కృంగిపోయి ఉంటుందో మనసున్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. అయితే, అమృత ఇవన్నీ చాలా ధైర్యంగా ఎదుర్కొగలిగింది. అందుకు అనేక మంది మహిళా మేధావులు, సామాజికవేత్తలు చాలామంది ఆమెకు అండగా నిలిచారు. ఆమె జీవితం నేర్పిన పాఠాలతో తనకి తానుగా మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుకోగలిగింది. మరోవైపు సమాజంలో ఇలాంటి కుల దురహకరంతో ఉండే వారికి ఎదిరించి నిలబడటం అలవాటు చేసుకుంది.
ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రి మారుతీరావుపై ఏ1గా ఛార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. అమృత తండ్రితో పాటు పాత్రధారులు, సూత్రధారులను మొత్తం ఏడుగురిని చార్జిషీట్ లో చేర్చారు. తరువాత రిమాండ్ కి తరలించారు. తండ్రి బెయిల్ పై బయటకు వచ్చిన కొంతకాలానికి అంటే 2020లో అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చాత్తాపమో లేకా సాక్ష్యాధారాలు అన్ని చూస్తుంటే తనకు శిక్ష తప్పదని అర్థమయ్యిందో తెలియదు కానీ తనకుతానుగా మారుతీరావు తనువు చాలించాడు. భర్త చనిపోయిన సరిగ్గా రెండేళ్లకు అమృత తన తండ్రిని కూడా కోల్పోయింది. అప్పుడు కూడా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తన పరువు కోసం హత్య చేసిన మారుతీరావు ఎక్కడ శిక్ష పడుతోందో, మళ్ళీ ఎక్కడ పరువు పోతుందో అని ప్రాణం తీసుకున్నాడు. దీంతో అమృత, తన తల్లి ఇద్దరూ ఒంటరై పోయారు. గత్యంతరం లేక ఒకరికి ఒకరం అనుకుందో ఏమో కానీ తల్లి చెంతకు చేరింది. అప్పుడు కూడా అనేక అవమానాలు ఎదుర్కొంది. తండ్రి ఆస్తి కోసం తల్లి పంచన చేరిందని అనేక ఆరోపణలను, విమర్శలను ఎదుర్కొంది. సమాజం అమృతని వెలివేయబడ్డ మహిళను చూసినట్టు తప్పుడు ఆరోపణలతో ఊపిరి పీల్చుకోకుండా చేసింది ఈ వ్యవస్థ. అమృత ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను భరించింది. అయినా కూడా తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ తన తల్లితో పాటు జీవనం సాగిస్తూ వచ్చింది. కరోనా అనంతరం అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లుగా ఎదుగుతున్న అనేక మంది అడుగుజాడల్లో నడిచింది. తాను సోషల్ మీడియాలో పట్టు సాధించింది, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక కష్టాలు పడింది. కానీ అప్పుడు కూడా ఈ సమాజం అమృతని వదిలిపెట్టలేదు. వెంటాడి వేధిస్తూనే వచ్చింది. అమృత మంచి డ్రెస్ వేసుకున్నా తప్పే, అందంగా తయారైనా తప్పే, ఎవరితోనైనా కొంచం చనువుగా మాట్లాడినా తప్పే, అసలు అమృత ఏం చేయాలో నిర్ణయించడానికి ఎవరికి హక్కు ఉంది. అంటే ఎవ్వరికీ లేదు. ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదు. ఒక వ్యక్తి తనకి నచ్చిన విధంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ మహిళలకు మాత్రం ఇవ్వలేదు అంటుంది నేటి సమాజం. భర్త లేని మహిళా ఎలా బ్రతకాలో సమాజమే నిర్ణయిస్తుంది. ఒక ఒంటరి మహిళా ఎవరితో మాట్లాడితే ఒప్పు, ఎవరితో మాట్లాడితే తప్పు అన్ని ఈ సమాజమే నిర్ణయిస్తుంది. కానీ అదే పురుషుడికి భార్య లేకపోతే ఎలా ఉండాలో నిర్ణయించదు. ఎలాంటి హద్దులు, లక్ష్మణ రేఖలు పురుషులకు వర్తించవు. శతాబ్దాలు గడిచినా అడుగడుగునా మహిళపై వివక్ష కొనసాగుతూనే ఉంది. వ్యవస్తీకృతమైన ఈ వివక్షకు ఎండ్ కార్డు పడేదెప్పుడు? సమాజం మహిళలను చూసే తీరు మారాలంటే వ్యవస్థలో మార్పు రావాలి. స్త్రీల పట్ల చులకన భావన తగ్గాలంటే అసలు మహిళను మనిషిగా చూడటం మొదలవ్వాలి. మహిళ సమానత్వ ఫలాలను అనుభవించడం పక్కన పెడితే అసలు ఒక వ్యక్తిలా కూడా చూడలేని సమాజం ముందు ఎప్పుడూ ఒంటిరిదే. పిల్లల పెంపకంలోనే ఆడ, మగ తేడాలు లేకుండా పెంచుదాం. ఆడవారి పట్ల గౌరవాన్ని నేర్పుదాం. అమ్మాయిలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, ఆత్మగౌరవంతో బ్రతకనిద్దాం.
కే సమైక్య
ఫోన్ నెం: 9390630610
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.