
‘ఫాసిజం అధికారంలోకి వచ్చినప్పుడు, చాలా మంది అందుకు సిద్ధంగా లేరు, సైద్ధాంతికంగానూ లేరు, భౌతికంగానూ లేరు.. బద్దలుకావడానికి ముందు అగ్నిపర్వతంలో కలిగిన ప్రకంపనలను కొందరే గమనించగలిగారు’
– ఎరిచ్ ఫ్రామ్, జర్మన్ సామాజిక మనస్తత్వ నిపుణులు
మాయరోగాలూ, వాటి బాధితులూ చరిత్ర అంతా కనిపిస్తారు. ముఖ్యంగా ఏంటంటే, మనం మాయరోగం వైపు నిలబడకపోవడం.
– అల్బర్ట్ కామూ రాసిన ‘ప్లేగ్’ నవల నుండి
సిద్ధాంతాలూ వేదాంతాలూ వీధుల్లో జనసమ్మర్దంలో చర్చించవలసినవి కావు. వర్గ తూష్ణీభావంతోనో, శిష్ట ఆధిక్యభావంతోనో వీధులను చులకన చేసి ఈ మాట అనడం లేదు. అనేక అంచెల, పాయల, కోవల సమాజాలున్న చోట అందరికీ ఒకే విధంగా అర్థమయ్యే భాష ఉండడం కష్టం. శాస్త్రజ్ఞులు సాంకేతిక భాషలో, పరిభాషలో మాట్లాడుకుంటారు. కిందికి ఇంకిపోయి తమ దాకా వచ్చిన సారాంశాన్నేదో సామాన్య జనం తమకు తెలిసిన భాషలో చెప్పుకుంటారు. ఒక్కోసారి, పెద్దలు మాట్లాడేది ‘మేడ్ డిఫికల్ట్’ గా ఉంటే, చిన్నల మాటలు ‘చదువులలో సారమెల్ల’ చదివినట్టు ఉంటాయి. వ్యక్తీకరణెలా ఉన్నా, జ్ఞానాలన్నీ సాటివారి మధ్య మాటల్లో, మంతనాల్లో, చెప్పుకుని వినుకోవడాల్లో వర్థిల్లుతూ ఉంటాయి.
ఈ మధ్య మీడియా బాగా సామాజికం అయ్యాక, అర్థంతో నిమిత్తం లేని తాత్పర్యాలనీ, సత్యంతో సంబంధంలేని వ్యాఖ్యానాలనీ వింటున్నాం. సృజనాత్మకత జోడించి ఏ విషయం మీద అయినా వాగ్ధాటి చూపించగలిగే విద్వాంసులను చూస్తున్నాం. పరిభాషలూ సాంకేతికాలూ అర్థజ్ఞానుల చేతుల్లో పడి, అసత్యాలుగా, అపభ్రంశాలుగా అనువాదం అవుతుంటే బాధపడుతున్నాం. చరిత్ర, పురాతత్వం వంటి శాస్త్రాలన్నీ అలవోక వాదాలకిందికి మారిపోతే, నిపుణులు నిజాలను దిగమింగి నిట్టూర్చడం చూస్తున్నాం.
అటువంటి కష్టం ఒకటి, ఈ మధ్య భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వారి డాక్యుమెంటు విషయంలోనూ వచ్చింది. అందులో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షిస్తూ, భారత ప్రభుత్వానికి, అధికార పార్టీకి, దాని నేపథ్యశక్తులకు కొన్ని విశేషణాలు జోడించారు. ఆ విశేషణాలు సరిగా అర్థమవుతాయో లేదో అని డాక్యుమెంటుకు ఒక వివరణ వంటి నోట్ జతచేశారు. బిజెపి మీద, భారత ప్రభుత్వం మీద మార్క్సిస్టు పార్టీ అంచనాలో కొంత సమస్యాత్మకత, వివాదాస్పదత కనిపించాయి కాబట్టి, ఆ డాక్యుమెంటును, ఆ నోట్‌ను పత్రికలవాళ్లు టీవీల వాళ్లు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకున్నారు. కలహభోజనం దొరికింది కదా అని సంబరాల థంబ్ నెయిల్స్ పెట్టుకున్నారు. పదచర్చలు, పండితచర్చలు పక్కనబెట్టి, పామర జనం మాత్రం, మార్క్సిస్టుపార్టీ విధానంలో ఏదో తేడా ఉందని మాత్రమే గ్రహించారు. పార్టీ వాడిన పదాలకు, మీడియా అర్థాలకూ పొంతన ఉన్నా లేకపోయినా, మొత్తం మీద ఈ అలజడి వల్ల, మార్క్సిస్టు పార్టీ వారికి అపకారమూ జరిగిందనుకోవచ్చు, ఉపకారమూ జరిగిందనుకోవచ్చు. మొత్తం మీద బాగా ప్రచారం జరిగిందనుకోవచ్చు.
భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని ప్రస్తావించేటప్పుడు ‘నియో ఫాసిస్టు పోకడలు’న్న ప్రభుత్వంగా మార్క్సిస్టు పార్టీ తీర్మానం అభివర్ణించింది. ‘నియా ఫాసిస్టు పోకడల’ వ్యక్తీకరణ పార్టీ సెంట్రల్‌కమిటీ రూపొందించిన ముసాయిదా తీర్మానంలోనిది మాత్రమే. వచ్చే నెలలో మధురైలో జరగనున్న 24 వ పార్టీ మహాసభ ఆమోదించిన తరువాతనే, అది మొత్తం పార్టీ అభిప్రాయంగా మారుతుంది. ఆ ముసాయిదా మీద మార్పులు, చేర్పులు, సవరణలు కోరారు కాబట్టి, చివరకు ఆ భాగం ఆమోదం పొందకపోవచ్చు కూడా. కమ్యూనిస్టు పార్టీల ఆనవాయితీ ప్రకారం అలా జరిగే అవకాశం తక్కువ.
ముసాయిదా తీర్మానానికి అనుబంధంగా మార్క్సిస్టు పార్టీ విడుదల చేసిన వివరణ దేశంలో పదకొండు సంవత్సరాలుగా సాగుతున్న పాలన గురించిన తన అవగాహనను మరింత స్పష్టపరిచే ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు ప్రభుత్వం అని, పాలనను ఫాసిస్టు పాలన అని తాము అనబోమని, నియో ఫాసిస్టు పోకడలున్న ప్రభుత్వం, పాలన అని మాత్రమే అంటామని మార్క్సిస్టు పార్టీ చెప్పింది. ఈ పోకడలను ఎదుర్కొనకపోతే, పూర్తిస్థాయి నియో ఫాసిజంలోకి పరిణమించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు అని అనలేకపోతున్నదని, వైఖరి మార్చుకున్నదని, మోదీ విషయంలో మెత్తబడిందని వ్యాఖ్యానిస్తూ, పత్రికలు రాశాయి. అది ఆ పార్టీ శ్రేణుల్లోనూ, అభిమానుల్లోనూ, వివిధ రాజకీయ వర్గాలలోను సంచలనం కలిగించింది.
నిజానికి, మార్క్సిస్టు పార్టీ మునుపెన్నడూ నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్టుప్రభుత్వమని అనలేదు. అననప్పుడు ఇప్పుడు కొత్తగా వైఖరిని మార్చుకోవడం, మెత్తబడడం ఏమున్నది? హైదరాబాద్‌లో జరిగిన పార్టీ 22 వ మహాసభ తీర్మానంలో సహజంగానే ఫాసిజానికి ఇప్పటి కంటె మరింత దూరాన్ని చూసింది. ఆధిపత్యవాద, హిందూత్వ దాడులు దేశంలో ‘రూపొందుతున్న ఫాసిస్టు దోరణులను’ సూచిస్తున్నాయని అప్పుడు అన్నారు. కేరళ కన్నూరులో 23 వ మహాసభ తీర్మానంలో ‘ఫాసిస్టు లక్షణాలున్న ఆర్ఎస్ఎస్ మతతత్వ కార్యక్రమాన్ని తీవ్రంగా అమలుచేయడం ద్వారా బిజెపి తన బలాన్ని సుస్థిరం చేసుకుంటున్నది’ అని వ్యాఖ్యానించారు. బిజెపిని కానీ, ఆర్ఎస్ఎస్ని కానీ, కేంద్రప్రభుత్వ పాలనని కానీ, ప్రభుత్వాన్నికానీ ఫాసిస్టు అని మార్క్సిస్టు పార్టీ అననే లేదు. ఫాసిస్టిక్ అన్నా, ఫాసిస్టిక్ కేరక్టరిస్టిక్స్ అన్నా ఒకటే, ఫాసిస్టు పోకడలు, లేదా లక్షణాలు. ఏదైనా ఒక గుణం లేదా అవగుణం కలిగి ఉన్నాడని చెప్పడానికి, ఆ గుణ అవగుణాల లక్షణాలు కలిగి ఉన్నారనడానికి తేడా ఉంటుంది. తాము ఫలానా రకంగా అనలేదు, ఫలానా రకంగా మాత్రమే అంటున్నాము అని సిపిఎం తన నోట్లో కూడా చెప్పిందంటే అర్థం, ఆ తేడా విషయంలో వారు చాలా పట్టింపుతో ఉన్నారని.
ఆ వివరణ ప్రకారం సిపిఎం వైఖరిలో కొత్తగా, గుణాత్మకమైన మార్పు ఏమీ జరగలేదు. మునుపటి మహాసభల తీర్మానాలకు కొనసాగింపు అవగాహనే కొత్త ముసాయిదా తీర్మానంలోనూ ఉంది. మొదటి నుంచి ఉన్న ఈ వైఖరినే మోదీ విషయంలో మెతకదనంగా చెబితే వేరు. కానీ, ఇప్పుడు కొత్తగా చేసిన ‘తగ్గింపు’, ‘పెంపు’ ఏమీ లేదు. ఫాసిజం, నియో ఫాసిజం అన్న మాటలకు సుదీర్ఘమైన వివరణను పార్టీ ఇచ్చింది. మీడియా మిత్రులు దాన్నికూడా పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేది. పోకడలు లేదా లక్షణాలు (కేరక్టరస్టిక్స్) అన్న మాటలో సమస్య ఉన్నది కానీ, ‘నియో’ అన్న మాటలో లేదు. నియో ఫాసిజం అంటే హిట్లర్ కాలం నాటి ఫాసిజం కాదు, నేటి తరహా ఫాసిజం అని చెప్పే తగిలింపు.
ఇంత బలమైన కమ్యూనిస్టుపార్టీ కదా, మిలిటెంట్ పోరాటాలు చేస్తుంది కదా, మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్టుగా పరిగణించి ఉండదా, లేక పరిగణించకపోతుందా, ‘నియో’ అన్న కొత్త విశేషణం కనిపిస్తోంది కదా, ఇందులో ఏదన్నా విధాన సడలింపు లేకపోతుందా అన్న పాత్రికేయ కుతూహలపు ఊహల నుంచి మాత్రమే మీడియా ఇందులో పెద్ద వార్తాకథనాన్ని చూసిందనిపిస్తోంది. గత రెండు మహాసభల తీర్మానాలలో కూడా భారత ప్రభుత్వాన్నికానీ, పాలనను కానీ మార్క్సిస్టు పార్టీ రకరకాల ప్రత్యామ్నాయపదాలతో సంబోధిస్తూ వచ్చింది కానీ, మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్టుగా కానీ, నియో ఫాసిస్టుగా కానీ చెప్పలేదు. ప్రతిఘటించకుండా ఉంటే, ప్రస్తుత పరిస్థితి నియోఫాసిజంగా పరిణమిస్తుందన్నది తప్ప, అసలు మోదీ పాలనలో ఫాసిజం లక్షణాలే లేవని కూడా అనలేదు.
అయితే, మార్క్సిస్టు పార్టీ కొత్తగా పాలసీమార్పు తీసుకువచ్చిందనుకుంటే, చర్చించడానికి ఏమీ లేదు కానీ, సిపిఐ, సిపిఐ (ఎంఎల్), ఇంకా అనేక కమ్యూనిస్టు పార్టీలు బిజెపి ప్రభుత్వాన్ని ఫాసిస్టు ప్రభుత్వం అని అంటుండగా, సిపిఎం మాత్రం ఎందుకు భిన్నంగా అంటున్నది అన్న చర్చకు మాత్రం ఈ వివాదంతో ఆస్కారం ఏర్పడింది.
ఒక పరిస్థితిని అంచనా వేయనిదే దానితో వ్యవహరించలేము. తగిన విధంగా స్పందించలేము. అంచనా వేయడంలో, చలనగతులను, క్రమాలను అర్థం చేసుకోవడంలో పూర్వ జ్ఞానం, అనుభవం వంటి అంశాలతో పాటు, స్పందనల విషయంలో ఉండే సంసిద్ధతలు కూడా ప్రభావం వేస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, పరిస్థితులను అర్ధం చేసుకున్న తీరు, దాని ఆచరణ మీద ప్రభావం వేస్తుంది. ఏ పార్టీని అయినా, ఫలానా విధంగా విషయాలను అర్థం చేసుకోండి అని నిర్బంధించలేము. అంచనా వేసేది, అభివర్ణించేది బాహ్య స్థితిగతులనే అయినా, చూసే సంస్థ, వ్యక్తి ఆత్మాశ్రయత కూడా చూపు మీద ప్రభావం వేస్తుంది.
సిపిఎం రాజకీయ తీర్మానం పూర్తి పాఠాన్ని చూస్తే, ఇవాళ దేశంలో ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్న రాజకీయ వైఖరుల వారందరూ ఏకీభవించగలిగే అనేక అంశాలున్నాయి. దేశంలో పదకొండేళ్లుగా నెలకొన్న పరిస్థితులను గుర్తించి, వర్ణించే సందర్భాలన్నిటిలోనూ ప్రగతిశీల శిబిరంలో దాదాపుగా ఏకాభిప్రాయం ఉండే అంశాలే ఉన్నాయి. హిందూత్వ-కార్పొరేట్ రాజ్యం, ప్రతీఘాత వాద హిందూత్వ ఎజెండా, మతతత్వవాద-కార్పొరేట్ విధానాలు, బిజెపి-ఆర్ఎస్ఎస్ నియోలిబరల్ హిందూత్వ ఎజెండా వంటి పదజాలం తీర్మానంలో సమృద్ధిగా ఉంది. అమెరికా అనుకూల విధానాలు, బడాకార్పొరేట్లకు లాభదాయకంగా, ఆదివాసులకు, రైతాంగానికి, కార్మికులకు వ్యతిరేకంగా చర్యలు, ఉద్యమకారులమీద, మీడియా మీద, మైనారిటీల మీద అణచివేతలు వంటి అంశాలన్నింటినీ రాజకీయ తీర్మానంలో పూసగుచ్చారు. ఒక్క అబూఝ్ మాఢ్లో సాగుతున్న భద్రతా ఆపరేషన్ల గురించి మాత్రం ప్రస్తావన లేదు. మావోయిస్టులతో సైద్ధాంతిక దూరాన్ని ప్రస్తావిస్తూనే, అక్కడి ఆదివాసీలపై జరగుతున్న దమనకాండను ఖండించవచ్చు. ఆపరేషన్ కగార్‌ను ఖండిస్తూ దేశంలో అక్కడక్కడా జరుగుతున్న సభలలో మార్క్సిస్టు పార్టీవారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు పోకడల విధానాలలో చత్తీస్‌గఢ్ చర్యలను కూడా వారు పరిగణిస్తున్నారనే అనుకోవచ్చు. మరి దేశంలోని స్థితిగతుల విషయంలో వాస్తవానికి ఇంత దగ్గరగా సిపిఎం అంచనా ఉన్నప్పుడు, ఫాసిజం కొలమానాన్ని మాత్రం గురికి బారెడు దూరంలో ఎందుకు నిలబెట్టినట్టు?
సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు వేశారు. మిత్రసమ్మితంగానే విమర్శలు చేశారు. తమ పార్టీ అగ్రనాయకుడు వినోద్ మిశ్రా, సీతారాం ఏచూరి తమ వ్యాసాల ద్వారా 1990 దశకంలోనే ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు కుతంత్రాల మీద వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను హెచ్చరించిన విషయం భట్టాచార్య గుర్తుచేశారు. భారత రాజ్యం సర్వసంపూర్ణంగా సర్వాంగంగా ఫాసిస్టుగా పరివర్తన చెందిందని ఎవరూ అనడం లేదని, అయితే, రాజ్యాంగ వ్యవస్థల నుంచి ఫాసిస్టు దాడికి ప్రతిఘటన అతి బలహీనంగా ఉన్నసంగతిని, దాన్ని కూడా తొక్కిపారేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను విస్మరించలేమని ఆయన అంటున్నారు. ఇంత జరుగుతున్నా, ఇంకా ఫాసిజం ఎంత వరకు వచ్చింది అని తూకం వేసుకుంటూ కూర్చునే వెసులుబాటు మనకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు ఫాసిజాన్ని గుర్తిస్తారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సొంత మనుగడకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చునని, అయితే, దేశంలోని పరిస్థితిని అంచనా వేయడంలో వెనుకాడకూడదని భట్టాచార్య నర్మగర్భ సూచన ఒకటి చేశారు.
ఒక గడువు పెట్టి, ఆ లోగా మావోయిస్టులను నిర్మూలన చేస్తానని, ఆ తరువాత అర్బన్ నక్సల్స్ పేరుతో వామపక్ష, ప్రజాస్వామ్యవాదులందరి పనిపడతానని బాహాటంగా ప్రకటనలు చేస్తుంటే, ఫాసిజం వచ్చిందా లేదా అన్న ఊగిసలాట ఎందుకని ఒక సిపిఐ ముఖ్యనాయకుడు వ్యక్తిగత సంభాషణల్లో వ్యాఖ్యానించారు. ఆ పార్టీ బహిరంగ చర్చ చేయడం లేదు కానీ, ఫాసిజం రావడానికి ఇంకా సమయం ఉంది అన్నట్టుగా సిపిఎం వ్యవహరించడం మీద పెదవి విరుపుగానే ఉంది.
పార్టీకి పెద్ద సమస్యలు రాకుండా చూడడం కోసమే మార్క్సిస్టు పార్టీ ఫాసిజంపై అంచనాలో తడబడుతోందన్న అభిప్రాయం కూడా విస్తృతంగానే వ్యాప్తిలో ఉంది. ముఖ్యంగా కేరళను దృష్టిలో పెట్టుకుని మార్క్సిస్టు పార్టీ వైఖరిని అర్థం చేసుకోవడానికి విమర్శకులు ప్రయత్నిస్తున్నారు. కేరళకాంగ్రెస్ కానీ, కేరళలో ఉనికిలో ఉన్న సిపిఐ ఎంఎల్ రెడ్‌స్టార్ కానీ అటువంటి విమర్శలే అధికంగా చేశాయి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్రంతో సఖ్యంగా ఉండడాన్ని, కార్పొరేట్ ప్రముఖుడు అదానీతో సత్సంబంధాలు కలిగి ఉండడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమితో మార్క్సిస్టు పార్టీ పూర్తి అవగాహన లేకపోవడానికి కేరళ రాజకీయాలే కారణమన్నది తెలిసిందే. తమకు ప్రధానప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయడానికి ఆ రాష్ట్రంలో మార్క్సిస్టులు, బిజెపితో లోపాయికారీ సంబంధాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ మీద కూడా మార్క్సిస్టుపార్టీ అటువంటి ఆరోపణలే చేస్తుంది. కాంగ్రెస్, సిపిఐఎం గతంలో ప్రత్యర్థులుగా ఉండిన బెంగాల్లో కూడా అటువంటి పరస్పర ఆరోపణలే వినిపించేవి. రెండు సెక్యులర్ కూటముల మధ్య వైరంలో తాను లాభపడాలని సహజంగానే బిజెపి ప్రయత్నిస్తోంది. అలాగని, సిపిఎం, బిజెపి-ఆర్ఎస్ఎస్ బలగాల మధ్య హింసాత్మకఘర్షణలు లేవని కావు. బిజెపి మీద పోరాటంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో కలిసినడుస్తున్న మార్క్సిస్టు పార్టీకి కేరళ నిర్దిష్ట పరిస్థితి సమస్య అయింది. గత పదకొండేళ్ల కాలంలో వామపక్ష శక్తులు మరీ నీరసించిపోయిన స్థితిలో, మనుగడ కోసం ఆచరణాత్మక వైఖరి తీసుకోక తప్పదని సిపిఎం భావిస్తుండడం వల్ల ఫాసిజం వైఖరిలో భిన్నత్వం వచ్చి ఉండవచ్చు.
ఇక ఈ వివాదంలో కమ్యూనిస్టేతర పార్టీల హడావిడి చూస్తుంటే నవ్వొస్తుంది. సిపిఎం వైఖరిని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కేరళ శాఖ విమర్శించడం చూస్తుంటే, బిజెపి ఫాసిస్టు ధోరణుల మీద దేశంలో కాంగ్రెస్ గట్టి పోరాటం చేస్తోందేమోనని భ్రమ కలుగుతుంది. ఫాసిజం లేదని నియోఫాసిజం లక్షణాలే ఉన్నాయని సిపిఎం ముసాయిదా తీర్మానంలో చెబితే, అదేదో గొప్ప ప్రశంసాపత్రం అన్నట్టుగా బిజెపి సంతోషం ప్రకటించడం విశేషం.
హిట్లర్ కాలం నాటిది సంప్రదాయ ఫాసిజం అయితే, ప్రస్తుతం నియోఫాసిజం ప్రమాదదశలో ఉన్నామంటున్నారు. జర్మనీ, ఇటలీ ఫాసిజం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, రాజ్యవిస్తరణ కాంక్షతో కలుపుకుని వర్థిల్లింది. హిట్లర్, ముస్సోలినీ తాము అధికారంలోకి వచ్చాక సర్వ వ్యవస్థలను, ఎన్నికలను కాదని నియంతలుగా కొనసాగారు. ప్రస్తుత నియోఫాసిజం వెనుక నయా ఉదారవిధానాల సంక్షోభం కారణమైనప్పటికీ, ప్రపంచయుద్ధ నేపథ్యం, భౌగోళిక విస్తరణ కాంక్ష లేవు, ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకుని బలపడుతున్నారు తప్ప, వ్యవస్థలను పూర్తిగా పక్కనబెట్టలేదు. కాబట్టి, ఇప్పటి పరిస్థితి భిన్నం. ఎప్పటికీ ఒకే పరిస్థితులు ఉండవని, పదేపదే తిరిగి వచ్చే స్థితులు కూడా ఒకే విధంగా పునరావృత్తం కావని తెలుసుకోవడం మంచిదే. స్పందనలు, ప్రతిక్రియలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకోవాలని గ్రహించడం కూడా అవసరమే. అలాగే, స్వీయాత్మక పరిమితులు, పరిధుల వల్ల పరిస్థితుల అంచనా, మారవలసిన ప్రతివ్యూహాల విషయంలో వేర్వేరు నిర్ధారణలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి చొరబడింది చిన్నపామా, పెద్ద పామా అన్న విచికిత్స సాపేక్షఅంచనాలతో ముడిపడి ఉంటుంది. చిన్నపాము కదా, చిన్నకర్రతోనే కొట్టాలనేవారుంటారు, చిన్నపామైనా పెద్దకర్ర వాడాలనేవారుంటారు. ప్రమాదం తక్షణమా, కాదా అన్న పరిశీలన, సన్నాహాలను కానీ, స్పందనలను కానీ వెంటనే చూపాలా, వాయిదా వేయాలా అన్న తర్జనభర్జన ప్రతిపార్టీలో వేర్వేరుగా ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలే కానక్కరలేదు, అన్ని సాధారణ పార్టీలకు కూడా పరిస్థితులపై అంచనా, ఆచరణ మీద ఒక అవగాహన ఉంటాయి. ఏమీ చేయనక్కరలేదు, ఎప్పుడో కాలం కలసివస్తుంది, నిరీక్షించడమే మన ఆచరణ అనుకునే పార్టీలు కూడా ఉంటాయి.
ఈ కమ్యూనిస్టుపార్టీలు అంచనా వేస్తాయి సరే, దానికి అనుగుణంగా కార్యక్రమాలను నిజంగానే రూపొందించుకుంటున్నాయా? ఈ అంచనాలు కేవలం వైఖరులు ప్రకటించడానికే పరిమితమా? వైఖరుల్లో మెతకదనమో, కాఠిన్యమో ఉంటే దానిని బట్టి, పార్టీల మిలిటెన్సీని, బిజెపి పరివారం సాధుత్వాన్నో కర్కశత్వాన్నో తెలుసుకుంటామా? సిపిఎం వైఖరి నిజంగానే బిజెపికి కొంత రేటింగ్‌ని పెంచిందా?
మార్క్సిస్టు పార్టీ తన ముసాయిదా తీర్మానంలో దేశంలో ఫాసిస్టు ధోరణులకు వ్యక్తమవుతున్న అనేక ప్రతిఘటనలను పేర్కొంది. కార్మికులు, రైతాంగం, మైనారిటీలు మొదలైన శ్రేణుల ఉద్యమాలను పేర్కొన్నారు. కార్మికచట్టాల మీద యూనియన్లు చేసిన ఆందోళన మినహాయిస్తే, తక్కిన ఉద్యమాలలో చొరవ కానీ, నాయకత్వం కానీ పరిమితమే. ఫాసిస్టు కేంద్రీకరణకు, ఉత్తరాది ఆధిపత్యానికి, దళిత వ్యతిరేకతకు, రాష్ట్రాల హక్కుల హరణకు వేర్వేరు స్థాయిలలో మంచి వ్యతిరేకతను బలంగానే ఆయా బాధితులు ఇవ్వగలుగుతున్నారు. ఈ స్పందనలు ఇస్తున్నవారెవరూ, భారత ప్రభుత్వ స్వభావం గురించిన చర్చలో సమయం ఖర్చుపెట్టలేదు. గత పదకొండుసంవత్సరాలలో, ఫాసిస్టు విధానాలు అని చెబుతున్నవాటికి తక్షణ, సహజ స్పందనలు ప్రజల నుంచే వచ్చాయి. వాటిని ఒక సమీకరణలోకి తీసుకువచ్చి, సిద్ధాంత నాయకత్వం వహించవలసిన వామపక్షాలు ఆ బాధ్యతను నిర్వహించలేకపోయాయి.
అడపాదడపా, భారీ జనప్రదర్శనలు మినహా, అణగారిన నిస్సహాయ ప్రజానీకానికి ఆశలు కల్పించే ఆచరణను అందించలేకపోయాయి. పైగా, ప్రజల నుంచి సహజంగా వ్యక్తమయిన ఫాసిస్టు వ్యతిరేక స్పందనలను గుర్తించకపోవడం, నిరాకరించడం కూడా కొన్ని కమ్యూనిస్టు బృందాలు చేశాయి. తమ పక్కన నిలబడి, తమను నడిపించే ప్రధానస్రవంతి నాయకత్వం లేక, ఫాసిస్టు ప్రమాదానికి ప్రతిగా తమంతట తాము రాజ్యాంగ గ్రంథాన్ని ఆలంబన చేసుకుని దళితులు, మైనారిటీలు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తే, దాన్ని రాజ్యాంగవాదమని, అది భ్రమాత్మకమని చెబుతూ, తక్షణమే ప్రజలకు జ్ఞానోదయం కలిగించే బాధ్యతను తీసుకున్నాయి.
ఫాసిస్టు ధోరణుల మీద పోరాటం ఎన్నికల ద్వారానే కాదు, అనేక రంగాల ద్వారా చేయాలన్న అవగాహనను సిపిఎం ప్రకటించింది. ఫాసిజం మీద ప్రధాన పోరాటం భావజాల, బౌద్ధిక రంగాలలో, పౌరసమాజ వేదిక మీద జరగాలని గ్రాంసీ అన్నారు. అన్ని రకాల కమ్యూనిస్టులు శరపరంపరగా పుస్తకాలను ముద్రిస్తున్నారు. వ్యక్తీకరణ పద్ధతుల గురించి ఏ చర్చా లేకుండానే, తమ ఆలోచనలను, నిబద్ధతను అక్షరాలు గుప్పిస్తున్నారు. భావజాలప్రచారంతో లేదా నిరోధం ద్వారా ప్రజాస్వామిక, అభ్యుదయ, విప్లవ భావాలను ఎదిరించాలని మితవాదులు కూడా ప్రయత్నిస్తారు కదా? చాలా సందర్భాలలో, ప్రగతిశీల శిబిరం ప్రతిస్పందనాత్మకంగా వ్యవహరిస్తుంది తప్ప, తానే చర్చలను పురిగొల్పే చొరవను చూపడం లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుస్తక ప్రదర్శనల మీద దాడులు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాలలో కొన్నిరచనల మీద అసభ్య, దౌర్జన్యపూరితమయిన దాడులు జరుగుతున్నాయి. స్వయంగా తమ ప్రచురణ మీద, తమ పుస్తకాల షాప్ మీద దాడులు జరిగితే, పుస్తకాభిమానుల ఊరేగింపులో పాల్గొనడానికి కూడా కమ్యూనిస్టులకు సంకోచం ఉన్నప్పుడు, వారి అంచనాలు ఫాసిజం అయితేనేమిటి, ఫాసిస్టు పోకడలు అయితేనేమిటి? తెలంగాణ సాయుధపోరాట కేంద్రాలన్నిటి చరిత్రను మతతత్వవాదులు తమకు అనుగుణంగా మార్చి, సొంతం చేసుకుంటుంటే, చేష్టలుడిగి కూర్చున్న పార్టీలకు ఫాసిజం మీద అంచనాలు ఏమి ఉంటే మాత్రం ఏమిటి? భారతదేశాన్ని విముక్తం చేసి, నూతన సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి, ప్రాణత్యాగాలు చేస్తున్న విప్లవకారులు బహిరంగ ప్రజాజీవన రంగాలను, భావజాల, సాంస్కృతిక వేదికలను, నామమాత్రం చేసుకుని, తమ శత్రువులకే అన్ని రణరంగాలను అప్పగించినప్పుడు, వారి సైద్ధాంతిక అవగాహనలో ఎంత తీవ్రత ఉంటే మాత్రమేమిటి?
కనీసంగా కోరుకునేది ఏమిటంటే, ఎవరి అంచనా ఎంత ఉంటే వారు అంత చేయగలగాలి. ఫాసిజం వీధి చివరలో మాత్రమే ఉన్నదనుకునేవారు అందుకు తగ్గ ఆచరణను నిర్మించాలి. నట్టింట్లోకి వచ్చిందనుకునేవారు అందుకు తగ్గ స్పందనలను అందించాలి. ఎక్కడో ఒకచోట కనుచూపుమేరలోనో, కళ్లెదుటనో ఫాసిజం ఉందని అందరూ అంగీకరిస్తున్నారు కదా, ఆ మేరకు ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజల్లోనే సహజంగానే నిర్మితమయ్యే ప్రతిఘటనలను గుర్తించి, గౌరవించి, వాటితో కలసి నడవాలి.
కె. శ్రీనివాస్
( రచయిత సీనియర్ జర్నలిస్టు సాహితీవేత్త ఆంధ్ర జ్యోతి మాజీ సంపాదకులు )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.